Ana de Armas: రూ.300 పెట్టి సినిమా చూశారు.. రూ.37 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని నిర్మాతపై కేసు పెట్టారు

అన డి అర్మాస్

ఫొటో సోర్స్, Reuters

అనా డి అర్మాస్ అనే హాలీవుడ్ నటిని ఒక సినిమా ట్రైలర్‌లో చూపించి, సినిమాలో తప్పించారంటూ యూనివర్సల్ పిక్చర్స్‌ స్టూడియోపై ఇద్దరు అమెరికన్ ఫ్యాన్స్ కేసు వేశారు.

క్యూబన్-స్పానిష్ నటీమణి అయిన 33 ఏళ్ల అర్మాస్‌ నటించారన్న కారణంగానే తాము సినిమా చూశామని, అయితే.. ట్రైలర్‌లో కనిపించిన ఆమె.. సినిమాలో లేరని కానర్ వోల్ఫ్, పీటర్ రోస్జా అనే అభిమానులు తెలిపారు.

ఎస్టర్‌డే అనే ఈ కామెడీ సినిమాలో ఒక సింగర్, సాంగ్ రైటర్ తలకు దెబ్బతగులుతుంది. అతనికి మెలకువ వచ్చే సరికి భూమి మీద బీటెల్స్‌ను గుర్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి అతనే అవుతాడు.

ఈ సినిమాలో అర్మాస్.. ఆ సింగర్ లవర్‌గా నటించారు.

తాము ఒక్కొక్కరం ఈ సినిమాకు 3.99 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.300) ఖర్చు పెట్టామని, భంగపడిన అభిమానులందరి తరపునా తమకు 5 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ. 37 కోట్లు పైనే) పరిహారంగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ అంశంపై ఇంకా యూనివర్సల్ పిక్చర్స్ స్పందించలేదు.

వీడియో క్యాప్షన్, కరోనాతో నష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమకు జేమ్స్‌ బాండ్‌ కొత్త సినిమా ఉత్తేజాన్నిస్తుందా?

యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ మోసపూరిత మార్కెటింగ్ చేసిందని, సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు అర్మాస్ కీర్తి ప్రతిష్టలను వాడుకుందని ఫ్యాన్స్ ఆరోపించారు.

సినిమా సేల్స్ పెంచుకునేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అర్మాస్‌ను సినిమా ట్రైలర్స్‌లో చూపించారని, సినిమాలో మాత్రం ఆమె లేరని శుక్రవారం కాలిఫోర్నియాలో నమోదు చేసిన ఫిర్యాదులో ఫ్యాన్స్ పేర్కొన్నారని హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది.

అనా డి అర్మాస్ ఈ మధ్యనే రిలీజైన జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టు డైలో కూడా నటించారు.

కాగా, ఎస్టర్‌డే సినిమా కథానుగుణంగా ఆమె నటించిన సన్నివేశాలను ఫైనల్ కట్ లో తొలగించారని తెలుస్తోంది.

అర్మాస్ ఈ పాత్రలో చాలాబాగా నటించారని, అయినప్పటికీ ఆ పాత్రను కట్ చేయక తప్పలేదని స్క్రీన్ రైటర్ రిచర్డ్ కర్టిస్ 2019లో చెప్పారు.

వీడియో క్యాప్షన్, కొత్త జేమ్స్ బాండ్ ఎవరు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)