చైనాలో భారత్ కొత్త రాయబారి ప్రదీప్ కుమార్ ఎవరు, ఆయన గురించి చైనా మీడియాలో ఎందుకంత చర్చ జరుగుతోంది?

చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్

ఫొటో సోర్స్, @MEA

ఫొటో క్యాప్షన్, చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్

చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించి సోమవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ప్రదీప్ కుమార్ రావత్ మాండరిన్ అంటే చైనా అధికార భాషను మాట్లాడగలరు, అర్ధం చేసుకోగలరు.

రావత్ నియామకంతోపాటు, మాండరిన్‌పై ఆయనకున్న పరిజ్ఞానం కూడా హైలైట్ అవుతోంది. ఆయన గతంలో నెదర్లాండ్స్‌లో భారత రాయబారిగా పని చేశారు. చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ స్థానంలో ప్రదీప్ కుమార్ నియమితులయ్యారు. విక్రమ్ మిస్రీ మూడేళ్ల పదవీకాలం ఈ నెలతో ముగిసింది.

వీడియో క్యాప్షన్, సరిహద్దుల్లో భారత సైనికులకు సాయం చేస్తున్న యాక్‌లు

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత బలహీనంగా ఉన్న తరుణంలో రావత్ నియమితులయ్యారు. తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ) వద్ద 2020 ఏప్రిల్‌లో ఇరుదేశాల సైనికులు ముఖాముఖి తలపడ్డారు. ఇప్పటి వరకు ఆ ప్రతిష్టంభనలో మార్పు లేదు.

నియంత్రణ రేఖ దగ్గర చైనా అనేక నిర్మాణ పనులు కొనసాగిస్తోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి వివాదాలకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. రెండు దేశాల సైనికులు వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి ఉన్నారు.

అయితే, ప్రదీప్ కుమార్ రావత్‌కు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల విషయం తెలియని విషయం కాదు. చైనా వ్యవహారాల్లో ఆయన చాలాసార్లు పని చేశారు. 2014 నుండి 2017 వరకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో తూర్పు ఆసియా వ్యవహారాలకు ప్రదీప్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. చైనాకు సంబంధించిన విధానాల రూపకల్పనలో ఆయన పాలుపంచుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఎవరీ ప్రదీప్ కుమార్ రావత్?

1990లో ఫారిన్ సర్వీస్‌లో చేరిన రావత్ మాండరిన్‌ని విదేశీ భాషగా ఎంచుకున్నారు. మొదట హాంకాంగ్‌లో, తర్వాత బీజింగ్‌లో 1992-1997 మధ్య పనిచేశారు. 2003లో రావత్ రెండోసారి నాలుగేళ్లపాటు చైనాలో పని చేశారు.

మొదట కాన్సుల్‌గా నియమితులైన ఆయన, తర్వాత డిప్లొమాటిక్ మిషన్‌కు డిప్యూటీ చీఫ్‌గా పని చేశారు. ఈ సమయంలో కూడా చైనాతో సరిహద్దు వివాదాల చర్చల్లో రావత్ పాల్గొన్నారు. ఇండోనేషియాలో భారత రాయబారిగా కూడా కొన్నాళ్లు పని చేశారు రావత్.

తాజగా చైనాలో భారత రాయబారిగా ఆయన నియామకంపై చైనా మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ గా భావించే ఆంగ్ల దినపత్రిక గ్లోబల్ టైమ్స్ రావత్ నియామకంపై ఒక కథనాన్ని ప్రచురించింది.

రావత్ చైనీస్ అనర్గళంగా మాట్లాడతారని, దౌత్య చర్చల్లో అనుభవం కూడా ఉందని ఈ కథనంలో పేర్కొన్నారు. బహుశా ఇది చైనా-భారత సంబంధాలకు సానుకూల సంకేతం అని గ్లోబల్ టైమ్స్ రాసింది.

అయితే, చైనా గురించి బాగా తెలిసుండటం అంటే చైనాతో స్నేహపూర్వకంగా ఉండటం కాదని, భారతీయ దౌత్యవేత్తల ప్రవర్తన భారతదేశ అంతర్గత రాజకీయాల ఆధారంగా ఉంటుందని కూడా ఆ పత్రికతో మాట్లాడిన కొందరు విదేశాంగ నిపుణులు వ్యాఖ్యానించారు.

విక్రమ్ మిస్రీ స్థానంలో ప్రదీప్ కుమార్ రావత్ నియమితులయ్యారు

ఫొటో సోర్స్, EOIBEIJING

ఫొటో క్యాప్షన్, విక్రమ్ మిస్రీ స్థానంలో ప్రదీప్ కుమార్ రావత్ నియమితులయ్యారు

‘గ్లోబల్‌ టైమ్స్’ కథనంలో ఏముంది?

ఇరు దేశాల మధ్య సంబంధాలలో ప్రతిష్టంభనను తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కేవలం రాయబారిని మార్చినంత మాత్రాన ఏమీ జరగదన్న చైనా విదేశాంగ విశ్లేషకుల మాటలను ‘గ్లోబల్ టైమ్స్’ తన కథనంలో ప్రస్తావించింది. గ్లోబల్ టైమ్స్ ప్రకారం, ప్రదీప్ కుమార్ రావత్ చైనీస్ పేరు లువో గుండాంగ్.

''ప్రదీప్ కుమార్ రావత్‌కు భారత్-చైనా సంబంధాల గురించి విస్తృతమైన జ్ఞానం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఉన్న అడ్డంకులను పరిష్కరించిన అనుభవం కూడా ఆయనకు ఉంది'' అని జిన్‌హువా యూనివర్సిటీ నేషనల్ స్ట్రాటజీ ఇన్‌స్టిట్యూట్‌లోని రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కియాన్ ఫెంగ్ 'గ్లోబల్ టైమ్స్‌'తో అన్నారు.

"చైనా గురించి బాగా తెలిసి ఉండటమంటే చైనా పట్ల స్నేహపూర్వకంగా ఉంటారని కాదు. గతంలో చాలామంది భారతీయ రాయబారులు తమ రాకకు ముందు సానుకూల సంకేతాలను ఇచ్చారు. కానీ, భారత్-చైనాల మధ్య సంబంధాలను గాడిన పెట్టడంలో వారు పెద్దగా ఉపయోగపడలేదు'' అని ఫుడాన్ యూనివర్శిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ లిన్ మిన్‌వాంగ్ ‘గ్లోబల్ టైమ్స్‌’తో అన్నారు.

వీడియో క్యాప్షన్, లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఇప్పుడు ఎలా ఉంది?

ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా చైనాలో భారత రాయబారిగా పని చేశారు. ఆయనకు కూడా మాండరిన్ తెలుసు.

"ఎవరు రాయబారిగా నియమితులయ్యారన్నది ముఖ్యం కాదు. భారత ప్రభుత్వం చైనా పట్ల శత్రుత్వ విధానాన్ని విడనాడకపోయినా, సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి సిద్ధంగా లేకున్నా, తన దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్‌ను అరికట్టకపోయినా, కొత్త రాయబారి నియమించినంత మాత్రాన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవు'' అని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో రీసెర్చ్ ఫెలోగా ఉన్న హు చియాంగ్ 'గ్లోబల్ టైమ్స్‌'తో అన్నారు.

''ప్రదీప్ రావత్‌కు చైనా గురించి బాగా తెలుసు. కానీ, ఆయన ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారు అన్నది అసలు ప్రశ్న. ఆయన చర్యలు తార్కికంగా ఉంటాయని, ప్రస్తుత వాతావరణంలో ఆయన చొరవ చాలా అవసరమని మేము భావిస్తున్నాం'' అని లిన్ మిన్‌వాంగ్ వ్యాఖ్యానించారు.

భారత్‌తో సరిహద్దు వివాదానికి సంబంధించి సైన్యంతో దౌత్యస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం వెల్లడించారు.

ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గతంలో చైనాలో రాయబారిగా కూడా పని చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుత భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గతంలో చైనాలో రాయబారిగా కూడా పని చేశారు

భారత్-చైనా సంబంధాలలో ప్రదీప్ రావత్ నుంచి ఏం కోరుతున్నారు?

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చర్చలు జరుగుతున్నాయని, యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తకూడదని చైనా నిపుణులు భావిస్తున్నారు. ప్రదీప్ కుమార్ రావత్ ఇరుదేశాల మధ్య వారధిగా మారాలని, అప్పుడే సంబంధాలు కొనసాగుతాయని కియాన్ ఫెంగ్ చెప్పారు.

రెండు దేశాల మధ్య వివాదాలున్నప్పుడు, రాయబారి ఎవరు అన్నది పెద్ద సమస్య కాదని మరికొందరు చైనా నిపుణులు వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, భారత సైన్యం మీద చైనా మైక్రోవేవ్‌ ఆయుధాలను ప్రయోగించిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)