బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది

షేక్ హసీనాను బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని కొందరు విదేశాంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనాను బలహీనపరిచేందుకు కుట్ర జరుగుతోందని కొందరు విదేశాంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
    • రచయిత, శుభజ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ బంగ్లా కరస్పాండెంట్

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ మండపాలపై దాడి తరువాత అనేక దేవాలయాలు, హిందువుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. ఈ హింసలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులపై దృష్టి సారించింది.

అయితే, ఈ సమయంలో భారతదేశ వైఖరి ఆశ్చర్యకరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పొరుగు దేశంలోని ఆలయాలపై, ఇళ్లపై దాడులు జరుగుతుంటే ఇండియా నామమాత్రంగా స్పందించిందని చెబుతున్నారు.

గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హిందువులు, మైనారిటీలకు సంఘీభావం తెలపడానికి భారతదేశం బంగ్లాదేశ్‌లోని తమ రాయబార కార్యాలయ ప్రతినిధులను పంపేది. కానీ ఈసారి అలాంటిదేమీ జరగలేదు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న చర్యలపై తమకు విశ్వాసం ఉందని భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ఇబ్బంది పెట్టడం సముచితం కాదని ఇండియా భావిస్తున్నట్లు భారతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు.

అల్లర్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అల్లర్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవద్దని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది

షేక్ హసీనాపై భారత్ విశ్వాసం

భారత్ అనుసరిస్తున్న వైఖరి గతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. ఇంతకుముందు, నసినగర్, సిల్హెట్, మురాద్ నగర్‌లలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం వాటిపై తీవ్రంగా స్పందించింది.

బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఆ దేశంలో హిందువుల హక్కుల గురించి వారు బహిరంగ ప్రకటనలు చేశారు.

కానీ, గతవారం కుమిల్లా, చాంద్‌పూర్, ఫేని, చిట్టగాంగ్‌లోని హిందూ పుణ్యక్షేత్రాలు, ఇళ్లపై జరిగిన హింసాకాండలో పలువురు మరణించినా, భారతదేశ స్పందన మాత్రం చాలా ‘నామినల్’గా ఉంది.

ఇప్పటి వరకు, భారతదేశం ఈ హింసాత్మక సంఘటనలపై ఒక దేశంగా ఒకే ఒక్క వ్యాఖ్య చేసింది. అయిదు రోజుల కిందట, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వారం వారం జరిగే మీడియా సమావేశంలో దీనిపై క్లుప్తంగా మాట్లాడారు.

"బంగ్లాదేశ్‌లో ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలను మేం గమనిస్తున్నాము'' అని ఆయన పేర్కొన్నారు.

''హింస, అనంతర పరిస్థితులను నియంత్రించడానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భద్రతా దళాలను మోహరించారు’’ అని అరిందమ్ బాగ్చి గుర్తు చేశారు. "ప్రభుత్వం, పౌర సమాజాల సంపూర్ణ సహకారంతో దుర్గా పూజ పూర్తయింది" అని బాగ్చి వెల్లడించారు.

మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా అధికార భారతీయ జనతా పార్టీ ఎంపీలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా వారు దీని గురించి ప్రకటనలు, కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ స్థాయిలో మాత్రం దాని గురించి స్పందన నామమాత్రంగా ఉంది.

బంగ్లాదేశ్‌లో భారత్‌ను వ్యతిరేకించే ఇస్లామిక్ ఫండమెంటల్ గ్రూపులు పని చేస్తున్నాయని మాజీ దౌత్యవేత్త ఒకరు అన్నారు.

ఫొటో సోర్స్, AMAL KS/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

భారత్‌కు ఆందోళన ఉంది... కానీ...

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో భారతదేశం ఆందోళన చెందకుండా ఉండే అవకాశం లేదని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సంస్థ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో ఫెలో శ్రీరాధ దత్ అన్నారు.

బహిరంగంగా ప్రకటనలు చేయడం ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం భారత్‌కు లేదని దత్ అభిప్రాయపడ్డారు.

ఈ కేసులో దోషులకు క్షమాభిక్ష ఉండదని షేక్ హసీనా ఇప్పటికే చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోగలిగేది షేక్ హసీనా మాత్రమేనని ఇండియా బలంగా నమ్ముతోందని అన్నారామె.

''వీటన్నింటిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, భారత్ లక్ష్యం బంగ్లాదేశ్‌ను ఇబ్బంది పెట్టడం కాదు. ఇది స్వల్ప వ్యవధిలో హిందువులపై పెద్ద ఎత్తున జరిగిన దాడి. ఇది అనూహ్యం కూడా'' అని అన్నారు శ్రీరాధ.

బంగ్లాదేశ్‌లో ఈసారి హిందువులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో ఈసారి హిందువులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి.

ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందా?

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని శ్రీరాధ దత్ చెప్పారు. కానీ ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగిందంటే ఇందులో ప్రణాళిక ఉండే ఉంటుందని ఆమె అన్నారు.

"దుర్గా పూజ మంటపాలు లేదా దేవాలయాల విధ్వంసం బంగ్లాదేశ్‌లో కొత్తేమీ కాదు. కానీ, ఈసారి ఇంతకు ముందెన్నడూ జరగని స్థాయిలో జరిగింది" అని ఆమె చెప్పారు.

ఢాకాలో భారత హై కమిషనర్‌‌గా పని చేసిన పినాక రంజన్ చక్రవర్తి కూడా ఈ దాడుల విషయంలో భారతదేశానికి ఉన్న భయాన్నే పునరుద్ఘాటించారు.

బంగ్లాదేశ్‌లో జరిగినది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రలో భాగమేనని, భారతదేశం ఇప్పటికీ బంగ్లాదేశ్‌తో నిలబడటం సహజమని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

ఫొటో సోర్స్, VIPIN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా

హసీనాపై కుట్ర?

షేక్ హసీనాపై జరుగుతున్న ఈ పెద్ద కుట్ర గురించి భారత దేశానికి బాగా తెలుసని పినాక రంజన్ చక్రవర్తి బీబీసీతో అన్నారు.

"ఈ కుట్ర ఉద్దేశం షేక్ హసీనాను ఒక మతపరమైన కార్డు ద్వారా బలహీనపరచడమే. కానీ, అది జరగలేదు'' అన్నారాయన.

అయితే, ఈ పరిస్థితులను కంట్రోల్ చేయాలని భారత్ షేక్ హసీనాకు ఒక మెసేజ్ పంపడం మంచిదని పినాక రంజన్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

తాలిబాన్లు తిరిగి రావడం కూడా ప్రభావం చూపిందా?

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారం చేపట్టడం, అందులో పాకిస్తాన్ పాత్ర లాంటివి కూడా బంగ్లాదేశ్ ఘటనలపై ప్రభావం చూపాయని పినాక రంజన్ అభిప్రాయపడ్డారు.

"అఫ్గానిస్తాన్‌లో జరిగిన సంఘటనలు బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ ఫండమెంటలిస్టులను ఉత్తేజపరిచాయి. పాకిస్తాన్ కూడా ఇక్కడి ఇస్లామిక్ నెట్‌వర్క్‌లతో సంబంధాలు కొనసాగిస్తోంది" అని ఆయన అన్నారు.

"ఒకవైపు వారు (ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు) భారత వ్యతిరేక ప్రచారం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు షేక్ హసీనాను భారత దేశానికి దగ్గరి వ్యక్తిగా చిత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో ఇలాంటి గ్రూపులు మళ్లీ పుట్టుకొస్తున్నాయి" అన్నారు చక్రవర్తి.

హిందూ దేవాలయాలు, ఇళ్లపై దాడుల తర్వాత బంగ్లాదేశ్‌లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనలలో పాల్గొన్నవారు షేక్ హసీనా భారత దేశానికి 'చాలా దగ్గరి వ్యక్తి' అని చెప్పే ప్లకార్డులు పట్టుకుని ఉన్నారు.

బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల నిర్మూలన భారతదేశ లక్ష్యం అని విదేశాంగ విధాన నిపుణులు భావిస్తున్నారు.షేక్ హసీనా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ లక్ష్యాలను సాధించడం అసాధ్యమని వారు అంటున్నారు.

గత 10 రోజులలో బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పలువురు హిందువులపై దాడి జరగడానికి ఇదే కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)