అఫ్గానిస్తాన్: వైద్యం కోసం ఇండియా వచ్చి తిరిగి వెళ్లలేక అవస్థలు పడుతున్న అఫ్గాన్ పౌరులు

- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలోని లాజపత్ నగర్ ప్రాంతం మళ్లీ కళకళలాడుతోంది. కరోనా దెబ్బకు కాంతివిహీనం అయిపోయిన ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. దిల్లీలోని పెద్ద మార్కెట్లలో లాజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్ కూడా ఒకటి.
ఈ మార్కెట్‌లో రెండు మూడు అఫ్గాన్ రెస్టారెంట్లు ఉన్నాయి. అఫ్గాన్ వంటకాలను రుచి చూడాలనుకునేవారు ఇక్కడకు వెళ్తుంటారు. ఇక్కడ ఆహారం అందించే పద్ధతి, రుచులు అన్నీ అఫ్గాన్ శైలిలోనే ఉంటాయి.
ముఖ్యంగా జే-బ్లాక్‌లో ఉన్న అఫ్గాన్ రెస్టారెంట్ చాలా ఫేమస్. దిల్లీలోని సంపన్నులకు అఫ్గాన్ హోటల్‌కు వెళ్లి తినడం 'ఫ్యాషన్ సింబల్' లాంటిది. పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఇక్కడ తిని వెళ్తుంటారు.
ఈ అఫ్గాన్ రెస్టారెంట్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో 50 ఏళ్ల రహమతుల్లా నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు, ఆయన కుమారుడికి పూట గడవడమే కష్టంగా ఉంది.
రెండు నెలల క్రితం తన కొడుకు వైద్యం కోసం భారతదేశం వచ్చారు రహమతుల్లా. ఈ రెండు నెలల్లో తనతో పాటు తెచ్చుకున్న డబ్బు మొత్తం అయిపోయింది.
చికిత్స తరువాత అఫ్గానిస్తాన్‌కు తిరుగు ప్రయాణం కావలసి ఉంది. ఇంతలో తాలిబాన్ కాబూల్‌ను స్వాధీనం చేసుకుంది. తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత, అఫ్గనిస్తాన్‌ల మధ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

డబ్బుల్లేవు, వెనక్కి వెళ్లే మార్గం లేదు
రహమతుల్లా లాగానే రెండు మూడు నెలల క్రితం వైద్య అవసరాల కోసం భారత్ వచ్చిన వారందరి పరిస్థితీ ఇదే. చేతిలో డబ్బుల్లేవు. తిరిగి స్వదేశం చేరుకోవడానికి వేరే మార్గం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇరుగుపొరుగు వారిని సహాయం కోరుతూ జీవనం కొనసాగిస్తున్నారు.
"వైద్య చికిత్సల నిమిత్తం ఇక్కడకు వచ్చిన అఫ్గాన్ పౌరుల సమస్యలు పరిష్కరించేందుకు మార్గమేమీ కనిపించడం లేదు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆహారం, మందులు సమకూర్తుస్తున్నాఇలా ఎంత కాలం?" అని దిల్లీ అఫ్గాన్ సొసైటీ హెడ్ అహ్మద్ జియా ఘనీ అన్నారు.
రహమతుల్లా అఫ్గానిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రాంతంలోని సాపార్ గ్రామ నివాసి. వృత్తిరీత్యా రైతు. అయితే, ఆయనకు సొంత భూమి లేదు. ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని జొన్నలు, గోధుమలు పండిస్తారు.
రహమతుల్లా కుమారుడు అమానుల్లా 18 నెలల కిందట జీవనోపాధి కోసం ఇరాన్ వెళ్లారు. అక్కడ ఆయనకు ప్రమాదం జరిగింది. అందులో రెండు చేతులు, కుడి కాలు కోల్పోయారు.
అలాగే, కుడి కన్ను పోయింది. ఎడమ కాలి వేళ్లను కత్తిరించి తీసేయాల్సి వచ్చింది. దాంతో వాళ్ల జీవితాలు తలకిందులైపోయాయి.
గాయాలు కాస్త నయం కాగానే మెడికల్ వీసాపై తన కుమారుడిని దిల్లీ తీసుకొచ్చారు రహమతుల్లా.
దిల్లీలో అమానుల్లా కాళ్లకు కృత్రిమ అవయవాలు అమర్చారు. ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తనకు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆనందంతో తండ్రీకొడుకులిద్దరూ తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతుండగా అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి మారింది.
లాజపత్ నగర్‌లోని ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న రహమతుల్లా దగ్గర ఇంటి అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేవు.
వీరికి హిందీ రాదు. గ్రామంలోనే ఉండిపోవడంతో చదువుకోలేదు.
"మా అబ్బాయి ఇరాన్ వెళ్తే చాలా సంతోషించాం. తను అక్కడ బాగా సంపాదించి మాకు కొంత పంపిస్తాడని, తన వివాహానికి కొంత డబ్బు సమకూర్చుకుంటాడని ఆశించాం. అమానుల్లాకు ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు, ప్రమాదవశాత్తు కాలుజారి ఓ పెద్ద యంత్రంలో పడిపోయాడు. ప్రాణాలు దక్కుతాయని అనుకోలేదు. దేవుడి దయవల్ల బతికి బయటపడ్డాడు" అని రహమతుల్లా బీబీసీతో చెప్పారు.
ప్రమాదంలో అమానుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. పదిహేను నెలలపాటు ఇరాన్‌లో చికిత్స పొందారు.

ఫొటో సోర్స్, SALMAN RAVI/BBC
స్వదేశంలో కుటుంబం వేచి చూస్తోంది..
"18 నెలలుగా నేను ఏ పనీ చేయలేదు. మా అబ్బాయి సంపాదించిన డబ్బు, మరికొంత అప్పు తీసుకుని తనకు చికిత్స చేయించాం. మిగిలిన కొద్దిపాటి సొమ్ముతో దిల్లీ చేరాం. మా అబ్బాయికి కృత్రిమ అవయవాలు అమర్చారు. వచ్చిన పని అయింది. కానీ, మేం ఇక్కడ చిక్కుకుపోయాం" అని రహమతుల్లా చెప్పారు.
అమానుల్లా ఏ పనీ చేసే స్థితిలో లేరు. ఆయనకు డ్రెస్సింగ్ చేయడం, అన్నం పెట్టడం, స్నానం చేయించడం మొదలైన పనులన్నీ రహమతుల్లా చూసుకుంటారు.
అఫ్గానిస్తాన్‌లో స్వగ్రామంలో ఉన్న మిగతా కుటుంబం వీరి రాక కోసం ఎదురుచూస్తోంది.
"ఇంట్లో నా భార్య, మిగతా పిల్లల దగ్గర కూడా ఇప్పుడు పైసలు లేవు. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. ఇంతలోనే అఫ్గానిస్తాన్‌లో మొత్తం పరిస్థితి తారుమారైపోయింది. రెండు దేశాల మధ్య వీలైనంత త్వరగా విమానాల రాకపోకలు ప్రారంభం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం" అంటూ రహమతుల్లా వాపోయారు.
విమానాలను తిరిగి ప్రారంభించాలని తాలిబాన్ ప్రభుత్వం భారతదేశాన్ని కోరింది.
కానీ, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని, రెండు దేశాల మధ్య విమానాలను వెంటనే పునరుద్ధరించడం సాధ్యం కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒక విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.
ఇప్పటికీ పలు దేశాలు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. అక్కడి పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది.
తాలిబాన్ ప్రభుత్వంలోని పౌర విమానయాన, రవాణా మంత్రి హమీదుల్లా అఖుంద్‌జాదా, భారత సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్‌కు గత నెలలో లేఖ రాస్తూ కాబుల్ నుంచి భారతదేశానికి విమానాలను పునరుద్ధరించాలని కోరారు.
అయితే, ఇది విధానపరమైన నిర్ణయం అని, ఇందులో అనేక కోణాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
మొహియుద్దీన్ కథ కూడా ఇదే
మొహియుద్దీన్ కూడా తన భార్యతో కలిసి అఫ్గానిస్తాన్ నుంచి చికిత్స కోసం దిల్లీ వచ్చారు.
బాంబు పేలుళ్లలో మొహియుద్దీన్ కుడి కాలును పోగొట్టుకున్నారు. చేతి కర్రల సహాయంతో నడుస్తారు. తన భార్య గుండె ఆపరేషన్ నిమిత్తం దిల్లీ వచ్చారు.
ఆపరేషన్ బాగా జరిగిందని, తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా స్వదేశంలో పరిస్థితులు మారిపోయాయని మొహియుద్దీన్ చెప్పారు.
"నా పిల్లలు అక్కడ ఉండిపోయారు. వాళ్లు చాలా కంగారు పడుతున్నారు. అమ్మీ, అబ్బూ మీరెప్పుడు మా దగ్గరకు వస్తారు అని అడుగుతుంటారు. మేం ఇక్కడ నిస్సహాయులమైపోయాం. ఎలా మా ఇంటికి తిరిగి వెళ్లాలో అర్థం కావట్లేదు."
వీరంతా అఫ్గాన్ రాయబార కార్యలాయంలో సహాయం కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అక్కడి జాబితాను పరిశీలిస్తే, సుమారు 675 మంది అఫ్గాన్ పౌరులు వైద్య చికిత్సల కోసం దిల్లీ వచ్చారని తెలిసింది.
వీరిలో చాలామంది రోజూ అఫ్గాన్ రాయబార కార్యలాయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ, అక్కడి నుంచి కచ్చితమైన హామీలు ఏమీ రావట్లేదని వారు చెబుతున్నారు.

విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ఇబ్బందులు
జలాల్ ఖాన్ సినుజాదా కూడా భారత్ విదేశాంగ కార్యాలయం, అఫ్గాన్ రాయబార కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
"చికిత్సకు సంబంధించిన పత్రాలు కావాలని రాయబార కార్యాలయంలో అడిగారు. నెల క్రితమే అవన్నీ వారికి ఇచ్చాను. కానీ, ఇప్పటివరకూ వాళ్లేం చేయలేదు. భారతదేశం నుంచి కాబూల్‌కు విమానాలు రద్దయితే, ఇరాన్ లేదా పాకిస్తాన్ మీదుగా మా దేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం చేయాలి. మేం రెండు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. మా రాయబారి చొరవ తీసుకోవాలి. వారు భారత విదేశాంగ శాఖతో మాట్లాడి, మమ్మల్ని ఇరాన్ పంపించాలి లేదా రోడ్డు మార్గంలో పాకిస్తాన్ పంపించాలి. అక్కడి నుంచి మేం మా దేశానికి వెళ్లిపోతాం" అని జలాల్ ఖాన్ బీబీసీతో అన్నారు.
కైస్ యూసఫ్‌జాయ్‌కు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. చికిత్స కోసం ఒంటరిగా దిల్లీ వచ్చారు. కీమోథెరపీ చేయించుకున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లి, తన కుటుంబాన్ని కలుసుకొనేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం అఫ్గాన్ పరిస్థితులు చూస్తుంటే, కుటుంబం గురించి తనకు బెంగ ఎక్కువైపోతోందని ఆయన అన్నారు.
గత రెండు మూడు నెలల్లో అఫ్గాన్ నుంచి దిల్లీ వచ్చిన వారందరి పరిస్థితీ ఇలాగే ఉంది. చేతిలో డబ్బులు లేవు. కుటుంబానికి దూరంగా, తినడానికి, ఉండడానికి కూడా ఇబ్బందులు పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
సహాయం కోసం దిల్లీలోని అఫ్గాన్ సమాజం ఇంటి తలుపులు తడుతున్నారు.

ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఎలాంటి సాయం అందట్లేదు
"ఎప్పటి నుంచో ఇక్కడ నివసిస్తున్న అఫ్గాన్ పౌరుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఎందుకంటే, శరణార్థుల కోసం ఏర్పాటుచేసిన 'యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యుజీస్' కార్యాలయం నుంచి ఎవరికీ సహాయం అందడం లేదు" అని అహ్మద్ జియా ఘనీ చెప్పారు.
భారతదేశంలో అఫ్గాన్ పౌరులు చిక్కుకున్నట్లే, అక్కడ కూడా భారత పౌరులు చిక్కుకున్నారు. ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాలు ప్రారంభం కావాలని వీరంతా ఎదురుచూస్తున్నారు.
భారత్‌లో ఉన్న అఫ్గాన్ పౌరులకు పాకిస్తాన్ ద్వారా వెళ్లే మార్గమైనా ఉంది. కానీ, అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారత పౌరులకు పాకిస్తాన్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశమే లేదు.
ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ కూడా భారత పౌరులకు వీసాలు ఇవ్వట్లేదు.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్ల ప్రభుత్వాన్ని పాకిస్తాన్, చైనా, రష్యా ఎందుకు గుర్తించట్లేదు? 7 కీలక ప్రశ్నలు, సమాధానాలు..
- ఆరుగురు పిల్లల తల్లిని మిలిటెంట్లు సెక్స్ బానిసగా తీసుకెళ్లారు, సైన్యం రక్షించింది
- అఫ్గానిస్తాన్: తమకు శిక్షలు విధించిన మహిళా జడ్జిలను వెంటాడుతున్న తాలిబాన్లు
- కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇది కరోనా సైడ్ ఎఫెక్టేనా
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్‌లో ఆయన పేరు ఎందుకు ఉంది
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- గడ్డం గీయడాన్ని నిషేధించిన తాలిబాన్.. ఇస్లామిక్ చట్టానికి విరుద్ధమని ప్రకటన
- ఇస్లామిక్ స్టేట్ మాజీ ‘జిహాదీ పెళ్లికూతురు’ షమీమా బేగం: 'మరో అవకాశం ఇస్తే... తీవ్రవాదంపై పోరాడడంలో సాయపడతాను'
- పాకిస్తాన్ పేరెత్తకుండా, ఆ దేశానికి నరేంద్ర మోదీ ఏమని వార్నింగ్ ఇచ్చారు?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ పాలనలో బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎలా ఉంటుంది..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












