పాకిస్తాన్ ఐఎస్ఐకి కొత్త చీఫ్, ఎలాంటి మార్పులు రానున్నాయి

ఫొటో సోర్స్, ISPR
- రచయిత, పర్హత్ జావేద్
- హోదా, బీబీసీ ఉర్ధూ
పాకిస్తాన్ ప్రభుత్వ ప్రజా సంబంధాల విభాగం చేసిన ప్రకటన ప్రకారం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి కొత్త అధిపతి వచ్చారు. ఆయన పేరు లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్.
ఈ పదవిలోకి రావడానికి ముందు ఆయన కరాచీ కార్ప్స్ కమాండర్‌గా పని చేశారు.
లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్‌కి ముందు ఫయాజ్ హమీద్ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నారు. ఆయన రెండున్నరేళ్లు ఆ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఆయన పెషావర్‌లోని 11వ కార్ప్స్‌కు కమాండర్‌గా నియమితులయ్యారు.
ఐఎస్ఐకి కొత్త చీఫ్ నియామకంతో పాటు సైన్యంలోని కీలక పదవుల్లో కూడా పాకిస్తాన్ మార్పులు చేర్పులు చేసింది.

ఫొటో సోర్స్, AFP
ఎవరీ అంజుమ్?
28వ పంజాబ్ రెజిమెంట్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ సైన్యంలో కఠినమైన, ప్రశాంత స్వభావం గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 77 లాంగ్ కోర్స్ నుంచి వచ్చిన ఆయన, బ్రిగేడియర్‌గా సైనిక కార్యకలాపాల్లో లాండి కోటల్ వద్ద సైన్యానికి నాయకత్వం వహించారు.
కరాచీ కార్ప్స్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా నియమితులయ్యారు.
రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు అంజూమ్. జనరల్ పర్వేజ్ ముషారఫ్, జనరల్ రహీల్ షరీఫ్‌లు కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారు.
డిఫెన్స్ కాలేజీ తర్వాత ఆయన ఉత్తర బలూచిస్తాన్‌కు జనరల్ ఎఫ్‌సీగా నియమితులయ్యారు. ఇక్కడే కొంతకాలం కమాండెంట్ స్టాఫ్ కాలేజ్ లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు.

ఫొటో సోర్స్, ISPR
ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ అంత పవర్‌ఫుల్లా?
సైనిక, రాజకీయ వ్యవహారాల నిఘాలో ఐఎస్ఐ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ రెండు వర్గాలకు ఇన్‌పుట్ ఇచ్చే బాధ్యత దానిదే. ఐఎస్ఐలో దాని అధిపతే అత్యంత శక్తివంతమైన వాడని, నిర్ణయాలన్నీ సొంతంగానే తీసుకోవచ్చని ఆ సంస్థ మాజీ అధికారులు చెబుతున్నారు.
"ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ తన సంస్థలో ఎవరినైనా నియమించవచ్చు. తొలగించవచ్చు. వారిని తిరిగి సైన్యానికి పంపవచ్చు. పోస్టులను మార్చవచ్చు. కానీ ఏజెన్సీ వెలుపల ఆయన ప్రభావం ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్‌లతో ఉన్న సంబంధాలపై ఆధారపడి ఉంటుంది'' అని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జావేద్ అష్రఫ్ ఖాజీ అన్నారు.
''ప్రధానమంత్రి కోరుకుంటే ఆయన్ను తొలగించగలరు. అలాగే సైన్యానికి సంబంధించినంత వరకు చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ అత్యంత శక్తివంతుడు'' అన్నారాయన.

ఫొటో సోర్స్, TWITTER
మాజీ ఐఎస్ఐ చీఫ్ చుట్టూ వివాదాలు
కొత్త చీఫ్‌కు ముందున్న ఫయాజ్ హమీద్ గతంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఫయాజ్ హమీద్ గత నెల 5న అకస్మాత్తుగా కాబూల్ సందర్శించారు. ఆయన ఫొటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి.
ఒక టీ కప్పు చేతిలో పట్టుకుని, ఓ హోటల్ లాబీల్లో విలేఖరులతో మాట్లాడుతూ కనిపించిన ఆయన "భయపడకండి, అంతా సవ్యంగా జరుగుతుంది" అని ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.
దీని తర్వాత అంతర్జాతీయ మీడియాలో, ముఖ్యంగా భారతీయ మీడియాలో ఆయన పర్యటన గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టుల్లో జోక్యం
ఫయాజ్ హమీద్ కోర్టులను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలను ఎదుర్కొన్నారు.
పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) ఉపాధ్యక్షులు మరియం నవాజ్ బుధవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ఫయాజ్ హమీద్‌పై ఆరోపణలు చేశారు.
ఎన్నిలకు ముందు నవాజ్ షరీఫ్, మరియం నవాజ్‌లు జైలు నుంచి బైటికి వస్తే తన రెండు సంవత్సరాల శ్రమ వృథా అవుతుందని 2018లో హమీద్ వ్యాఖ్యానించారని మరియం ఆరోపించారు.
2019లో సెనేట్ ప్రెసిడెంట్ సాదిక్ సంజ్రానీపై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూడు ఓట్లతో వీగిపోయింది. ఈ వైఫల్యానికి ఐఎస్ఐ డైరెక్టర్, లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ కారణమని అప్పటి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి మీర్ హైల్ బిజెంజో ఆరోపణలు చేశారు.
దీనిపై ఫయాజ్‌కు కోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి.
2017 నవంబర్‌లో ఇస్లామాబాద్‌లోని ఫైజాబాద్‌కు చెందిన మత సంస్థ తెహ్రీక్-ఇ-లబ్బయిక్ నిరసనల్లో ఫయాజ్ హమీద్ పేరు కూడా వినిపించింది. అప్పుడాయన కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
- కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇది కరోనా సైడ్ ఎఫెక్టేనా
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
- పాకిస్తాన్లో భూకంపం - 20 మంది మృతి
- మా ఊరు ఎవరిది
- ఫేస్‌బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ‘మాజీ గర్ల్ ఫ్రెండ్ శాపాన్ని తొలగించలేకపోయిన’ భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











