అమెరికాలో పెరిగిన మాంసం ధరలు, వ్యూహం సిద్ధం చేసిన జో బైడెన్

- రచయిత, డేనియల్ థామస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
న్యూయార్క్ సిటీ క్వీన్స్ ప్రాంతంలోని లిటిల్ ఇండియాలో ఎక్కువగా దక్షిణాసియాకు చెందిన ప్రవాసులు నివసిస్తుంటారు. ఎప్పటిలాగే ఈ రోజు కూడా బిజీగా ఉంది. కానీ, అల్ నూర్ మీట్ మార్కెట్‌లో మాత్రం సందడి కనిపించడం లేదు.
అక్కడ వినియోగదారులు కనిపించకపోవడానికి కారణం కోవిడ్ కాదు. మాంసం ధరలు విపరీతంగా పెరగడం. అమెరికాలో గత కొన్ని నెలలుగా మాంసం ధర పెరుగుతోంది.
"హోల్‌సేల్ మార్కెట్లో ఒక పౌండ్(453 గ్రాములు) మేక మాంసం ధర 8 నుంచి 10 డాలర్లకు(రూ.594 - రూ.743) పెరిగింది. ఇక బీఫ్(పశు మాంసం) ధర ఒక పౌండ్‌కు 5 నుంచి 6 డాలర్లకు(రూ.372-రూ.446) పెరిగింది" అని షాపులో పనిచేసే 36 ఏళ్ల షకీల్ అంజుమ్ చెప్పారు.
"ధరలు పెరిగినప్పుడు జనం తక్కువ తింటారు. కస్టమర్లు రావాలనే ఉద్దేశంతో షాపులో రేట్లు కూడా తగ్గించి పెట్టాం. అయినా కూడా వ్యాపారం మందకొడిగా సాగుతోంది" అని అన్నారు.
ఈ పరిస్థితికి పెద్ద మాంసం సరఫరాదారులే కారణమని అదే షాపులో పనిచేసే 50 ఏళ్ల రజా జావేద్ చెప్పారు.
"వాళ్లంతా కుమ్మక్కై ధరలు పెంచేశారు. మేం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా దగ్గర అంత బలం లేదు" అన్నారాయన.
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత అమెరికాలో మార్కెట్లు తెరుచుకున్నాయి. కార్ల నుంచి బట్టల వరకు అన్నింటి ధరలు పెరిగాయి. కానీ మాంసం ధరలు మాత్రం ఇంకా ఎక్కువగా పెరిగాయి.
2020 డిసెంబర్ తర్వాత నుంచి బీఫ్ ధరలు 14 శాతం పెరిగితే, పోర్క్ 12.1 శాతం, చికెన్ ధర 6.6 శాతం పెరిగింది.

నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు సతమతం అవుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ చెప్పింది.
మాంసం సరఫరాను కొన్ని పెద్ద ప్రాసెసింగ్ సంస్థలు నియంత్రిస్తుండడమే దీనికి కారణం. అందుకే కంపెనీలు ఇష్టమొచ్చిన ధరలు వసూలు చేస్తున్నాయని వైట్‌హౌస్ చెబుతోంది.
"మాంసం ప్రాసెసింగ్ రంగంలో ఉన్న పెద్ద సంస్థలకు పోటీ ఇవ్వడానికి, ధరలు కాస్త తగ్గించడానికి వీలుగా కొత్త సంస్థలకు అవకాశం ఇవ్వడానికి 50 కోట్ల డాలర్ల ఫెడరల్ రుణాలు అందిస్తాం" అని జులైలో అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు.
ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మాంసం ప్రాసెసింగ్ చేసే పెద్ద కంపెనీలు వాటి నుంచి తప్పించుకుంటున్నాయని అధికారులు అంటున్నారు.
బీఫ్ ధరలపై ఆందోళన ఎందుకు?
అమెరికాలో మాంసం ధర పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తం కావడం కొత్తేం కాదు. 1921లో అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 'పాకర్స్ అండ్ స్టాక్‌యార్డ్స్ చట్టం' తీసుకొచ్చారు. అది ఇప్పటికీ అమలులో ఉంది. ధరలను నియంత్రించే పెద్ద సంస్థలకు అట్టుకట్ట వేయడమే ఈ చట్టం లక్ష్యం.
1973లో మాంసం ధరలు ఆకాశాన్నంటడంతో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బీఫ్, మేక మాంసం ధరలకు కొన్ని పరిమితులు పెట్టారు.
ఈ ఆంక్షల ద్వారా ఒక విధంగా ధరల నియంత్రణలో సఫలం కాగలిగారు. కానీ 1980వ దశకం తర్వాత నుంచి ప్రాసెసింగ్ పరిశ్రమ బలోపేతం అవుతూ వచ్చింది. దాంతో, వేగంగా మారుతున్న ఆ పరిశ్రమను నియంత్రించడానికి అధికారులు నానా తంటాలుపడ్డారు.
అమెరికా మీట్ మార్కెట్‌లో జేబీఎస్, కార్గిల్ మీట్ సొల్యూషన్, టైసన్ ఫుడ్స్, నేషనల్ బీఫ్ పాకింగ్ అనే నాలుగు కంపెనీలదే పెత్తనం. వివిధ మాంసం మార్కెట్లను అవి 55 నుంచి 85 శాతం వరకు నియంత్రిస్తుంటాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
1970-80వ దశకంలో ఈ నాలుగు పెద్ద కంపెనీల భాగస్వామ్యం మీట్ మార్కెట్లో 25-35 శాతమే ఉండేది.
విస్తృత భాగస్వామ్యాలు ఈ పెద్ద కంపెనీలకు బలంగా మారుతున్నాయని, దుకాణదారులు, రెస్టారెంట్లు ఎంత వసూలు చేయాలనేది మాత్రమే కాదు.. చిన్న రైతులకు ఎంత ధర ఇవ్వాలో కూడా ఇవే నిర్ణయిస్తున్నాయని వైట్‌హౌస్ చెప్పింది.
కరోనా సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఎందుకంటే, మాంసం డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. దానికి మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి జనం మాంసం నిల్వ చేసి పెట్టుకున్నారు. రెండోది ఎక్కువగా తింటున్నారు.
దాంతో టోకు మార్కెట్లో మాంసం ధరలు పెరిగాయి. కానీ పౌల్ట్రీ, పశువుల రేట్లు తగ్గాయి. రైతులకు లాభాలు లేకుండా పోయాయి.
కానీ మాంసం ప్రాసెసింగ్ చేసే పెద్ద కంపెనీలు మాత్రం రికార్డు లాభాలు ఆర్జిస్తూ వచ్చాయి. మహమ్మారి సమయంలో ఈ కంపెనీలు లాభపడ్డాయని ప్రభుత్వం చెబుతోంది.

"1980 తర్వాత నుంచి ప్రాసెసింగ్ పరిశ్రమపై ఎలాంటి పర్యవేక్షణ లేకుండా పోయింది. అదే సమస్యగా మారింది. మాంసం ప్యాక్ చేసే కంపెనీలు అమెరికా ఫుడ్ మార్కెట్‌లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి" అని ఇండియానాలోని నోట్రడామ్ యూనివర్సిటీ పర్యావరణ చరిత్ర ప్రొఫెసర్ జోషువా స్పెక్ట్ అన్నారు.
అటు మాంసం ప్రాసెసింగ్ సంస్థలు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశాయి. ధరలు పెరగడానికి మాంసం నిల్వ చేయడం కారణం కాదని చెప్పాయి. మహమ్మారితో కార్మికులు దొరకక ప్లాంట్లు మూతపడ్డాయని, అందుకే ధరలు పెరుగుతున్నాయని తెలిపాయి.
కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మాంద్యం, ఇతర పరిస్థితుల వల్ల మార్కెట్‌కు అనూహ్య కుదుపులు ఎదురయ్యాయని, దాంతో మీట్ ప్రాసెసింగ్ పరిశ్రమ పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోయిందని టైసన్ ఫుడ్స్ చెప్పింది.
"అందుకే మేం బతికున్న జంతువులను భారీ ఎత్తున దిగుమతి చేసుకున్నాం. బీఫ్ ఉత్పత్తుల డిమాండ్ అత్యధిక స్థాయికి చేరడంతో, దాని సరఫరాపై ప్రభావం పడింది. అందుకే జంతువుల ధరల్లో పతనం, మాంసం ధరలు పెరిగాయి. ఇప్పుడు పశు పోషకులకు ఇచ్చే ధరలు కూడా పెంచుతున్నాం" అంటూ ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
కానీ బ్రాట్ కెంచీ లాంటి పశువుల ఫామ్ నిర్వాహకులు ఆ మాటను ఒప్పుకోవడం లేదు. పశువుల కొనుగోళ్లలో పోటీ ఉండేలా మార్కెట్‌లో తగినన్ని ప్రాసెసింగ్ కంపెనీలు లేవని, అందుకే చాలాసార్లు తమ పశువులను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే ప్రాసెసింగ్ కంపెనీలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి.
మీట్ ప్రాసెసింగ్ రంగంలో అధిక పోటీ ఉండేలా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సౌత్ డకోటాలో 3 వేల పశువులున్న బ్రాట్ కెంచీ స్వాగతించారు.
పశువుల ధర తగ్గడం, మాంసం ధర పెరగడం వల్ల తమకు 2015 నుంచి నష్టాలు వస్తున్నాయని పశువులను పెంచేవారు చెబుతున్నారు.
"మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఇటీవల కాలంలో కొన్నిసార్లు మినహా ఎక్కువగా నష్టాలే వచ్చాయి. కష్టపడుతున్నా మాకేం ప్రయోజనం ఉండటం లేదు" అన్నారు బ్రాట్.
49 ఏళ్ల బ్రాట్ చాలాసార్లు తన పశువుల వ్యాపారాన్ని అమ్మేయాలని అనుకున్నారు. కానీ, అదంటే ఉన్న ఇష్టం ఆయన్ను అలా చేయకుండా ఆపింది. బ్రాట్ కుటుంబం నాలుగు తరాల నుంచి ఆ వ్యాపారంలో ఉంది. దానిని ఆయన తన వారసులకు కూడా అందించాలనుకున్నారు.
అమెరికాలో స్వతంత్ర పశు పోషకుల గ్రూప్ 'ఆర్-కాఫ్ యూఎస్ఏ' ఇప్పుడు నాలుగు పెద్ద మాంసం ప్రాసెసింగ్ కంపెనీలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లబోతోంది. పశువుల ధరలు తగ్గించేలా ఈ కంపెనీలు కుట్ర చేశాయని, లాభాలు పెంచుకుంటున్నాయని ఈ గ్రూప్ ఆరోపణలు చేస్తోంది.
ఆర్-కాఫ్ వాదనలో అర్థం లేదని టైసన్ కంపెనీ, అది నిజం కాదని మరో మీట్ ప్రాసెసింగ్ సంస్థ కార్గిల్ అంటోంది.
తక్కువ ధరల వల్ల అమెరికాలో పశువుల ఫామ్‌లు మూసేస్తున్నారని, లాభాలు లేకపోవడంతో ప్రతి ఏటా దాదాపు 17 వేల మంది పశు పోషకులు తమ వ్యాపారం వదిలేస్తున్నారని ఆర్-కాఫ్ యూఎస్ఏ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ పథకం ఫలిస్తుందా?
బైడెన్ ప్రభుత్వం ఫుడ్ సప్లై చెయిన్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. చిన్న ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, రైతు మార్కెట్లు, సీఫుడ్ ప్రాసెసర్లకు 1.4 బిలియన్ డాలర్ల అదనపు సాయం అందించనుంది.
అంతేకాదు కాంగ్రెస్‌తో కలిసి పశువుల ధరల్లో మరింత పారదర్శకత తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది.
ఇన్ని జరుగుతున్నా అసలు బైడెన్ పథకం ఫలిస్తుందా అని చాలామంది విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెద్ద కంపెనీలతో అసలు పోటీపడలేవని వాళ్లు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే 50 కోట్ల డాలర్ల నిధులతో చిన్న కంపెనీలు సుదీర్ఘ కాలంపాటు కొనసాగలేవని అంటున్నారు.
కేవలం నిల్వ చేయడమే కాదు, ఇతర అంశాలు కూడా మాంసం ధరలను ప్రభావితం చేస్తున్నాయని కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ వ్యవసాయ ఆర్థికవేత్త గ్లెన్ టోన్సర్ అంటున్నారు.
పెరుగుతున్న ధరలు కాలంతోపాటూ వాటంతట అవే తగ్గిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జోష్ స్పెక్ట్ మాత్రం ప్రభుత్వం ఒక పాత సమస్యకు కొత్త పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తోందని, ఇది స్వాగతించాల్సిన చర్యేనని అంటున్నారు.
"పశువుల ఫామ్స్ నిర్వాహకులు వందల ఏళ్ల నుంచి దీనిపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధిక ధరలు వినియోగదారులను ప్రభావితం చేయడంతో ఇది రాజకీయ అంశంగా మారింది" అని ఆయన అన్నారు.
"ప్రభుత్వం చాలా బలమైన ఒక పరిశ్రమలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక భాగం. అందులో సవరణలు తీసుకురావడానికి కచ్చితంగా సమయం పడుతుంది" అన్నారు.
ప్రభుత్వం సరైన దిశగా చర్యలు తీసుకుందని, దానిపై ఇక ముందు కూడా దృష్టి పెడుతుందని బ్రాట్ కెంజీ భావిస్తున్నారు.
"మనం మీట్ ప్యాక్ చేసే కంపెనీల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయకపోతే, వేరే ఎవరూ వాటికి పోటీ ఇవ్వలేరు. మనమే కనీస స్థాయిలో పోటీ ఇవ్వాల్సి ఉంటుంది" అని కేజీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సమంత పెళ్లి: సోషల్ టాపిక్
- పవన్ కళ్యాణ్: ‘పవర్ వచ్చాకే పవర్ స్టార్ అని పిలవండి.. అప్పటి వరకూ అలా పిలవొద్దు’
- కోట్ల సంపదను వదులుకుని సామాన్యుడిని పెళ్లి చేసుకుంటున్న జపాన్ రాకుమారి, అక్టోబరు 26న వివాహం
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
- భారత్ ప్రతిచర్య: బ్రిటిష్ ప్రయాణికులకు 10 రోజుల క్వారంటీన్
- మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
- గర్భస్రావం చేయించుకునే హక్కు విషయంలో అమెరికా కంటే భారత్ మెరుగ్గా ఉందా?
- ఈ ముస్లిం యువతి బాలకృష్ణుడి పెయింటింగ్స్ వేసి హిందూ ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారికి 'టూ ఫింగర్ టెస్ట్’
- హిమాలయాలలో పర్వతారోహణకు వెళ్లిన అయిదుగురు నేవీ సిబ్బంది గల్లంతు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











