'అఫ్గాన్ డ్రీమర్స్': తాలిబాన్ నుంచి తప్పించుకున్న మహిళా రోబోటిక్స్ టీమ్ కథ సుఖాంతం అవుతుందా?

ఫొటో సోర్స్, AFP
తాము సాధించిన ఎన్నో విజయాలతో "అఫ్గాన్ డ్రీమర్స్" దేశంలోని ఎందరో మహిళలకు స్పూర్తిగా నిలిచారు.
13 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న 20 మంది యువతుల సమూహమే ఈ "అఫ్గాన్ డ్రీమర్స్" గ్రూప్. సైన్స్ అభివృద్ధికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని అఫ్గానిస్తాన్ లాంటి దేశంలో మొట్టమొదటి మహిళా రోబోటిక్స్ బృందంగా ఏర్పడి వీరు ఎన్నో విజయాలను అందుకున్నారు.
అయితే ఆగస్టు 15న తాలిబాన్ల ఏలుబడిలోకి అఫ్గాన్ వెళ్లడంతో "అఫ్గాన్ డ్రీమర్స్" ఆశలు అడియాశలయ్యాయి.
తాలిబాన్లు చివరిసారిగా 90వ దశకంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకునే, పనిచేసే మహిళల హక్కులను హరించారు.
తాలిబాన్లు మళ్లీ అఫ్గాన్‌ను చేజిక్కించుకోవడంతో "అఫ్గాన్ డ్రీమర్స్" వంటి వేలాది మంది తమ దేశాన్ని విడిచిపెట్టి, విదేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. తాలిబాన్ల అణచివేతకు, దాడులకు భయపడి ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు.
మెక్సికోలో "అఫ్గాన్ డ్రీమర్స్" తాత్కాలిక ఆశ్రయం పొందారు. ఆరు దేశాలను దాటి రోబోటిక్స్ బృందాన్ని ప్రారంభించిన ఐదుగురు యువతులు (ఫతేమా ఖాదెరియన్, లిడా అజీజీ, కౌసర్ రోషన్, మరియం రోషన్, సాగర్ సలేహి) మెక్సికో చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'లింగ సమానత్వం ఉన్న ప్రపంచం' మీకు స్వాగతం పలుకుతోంది
రాబోయే రోజుల్లో మెక్సికో, ఇతర లాటిన్ అమెరికన్ దేశాలకు వచ్చే అఫ్గాన్ శరణార్థుల్లో అమ్మాయిలే ఎక్కువ భాగం ఉండే అవకాశం ఉంది.
"వీరు అఫ్గానిస్తాన్‌లో రోబోటిక్స్ బృందంలో సభ్యులు. 'అఫ్గాన్ డ్రీమర్స్' ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నారు. లింగ సమానత్వం కలిగిన ప్రపంచం మీకు స్వాగతం పలుకుతోంది" అని మెక్సికన్ విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రాడ్ ట్వీట్ చేశారు.
మెక్సికన్ ప్రభుత్వం వీళ్లందరికి 6 నెలలు చెల్లుబాటయ్యే హ్యూమనిటేరియన్ వీసాలు మంజూరు చేసింది. తర్వాత వీరు రెన్యూవల్ కూడా చేసుకోవొచ్చు. అంతేకాకుండా వీరికి ఉచిత వసతి, ఆహారాన్ని అందించడానికి వివిధ సంస్థలు ముందుకొచ్చాయి.
ప్రభుత్వ చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే మానవ హక్కుల సంఘాలు మాత్రం మెక్సికన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా, అఫ్గాన్ అమ్మాయిలకు ఎలా స్వాగతం పలుకుతారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఈ అమ్మాయిలు ఎవరు?
"అఫ్గాన్ డ్రీమర్స్" బృందాన్ని నాలుగు సంవత్సరాల కిందట ప్రముఖ వాణిజ్య వేత్త, డిజిటల్ సిటిజన్ ఫండ్ నడుపుతున్న రొయ మెహబూబ్ నెలకొల్పారు.
ఇది అమెరికా ఆధారిత స్వచ్ఛంద సంస్థ. అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలు, మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిచడంలో సహాయపడుతుంది. సైన్స్, ఇంజినీరింగ్, మేథమెటిక్స్, రోబోటిక్స్ వంటి పాఠ్యాంశాలను అందిస్తుంది.
సైన్స్‌ని ప్రోత్సహిస్తూ, దేశంలో అఫ్గాన్ బాలికలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా హెరాత్ కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ పనులు జరిగేవి.
తాలిబాన్ గతంలో అధికారంలో ఉన్న సమయంలో (1996-2001) మహిళల పాత్ర కేవలం ఇంటికే పరిమితంగా ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
అడ్డంకులను దాటుకుని, అంతర్జాతీయ అవార్డు వరకు..
"అఫ్గాన్ డ్రీమర్స్" గ్రూపు ఏర్పాటైన కొద్దికాలానికే అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. 2017లో, వాషింగ్టన్ డీసీలో జరిగిన అంతర్జాతీయ రోబోటిక్స్ చాంపియన్‌షిప్‌లో ప్రత్యేక అవార్డును గెలుచుకున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 'అఫ్గాన్ డ్రీమర్స్'పేరు పతాక శీర్షికల్లో చేరింది.
బాలికలకు కనీసం ప్రాథమిక హక్కులు లేని దేశం నుంచి వచ్చిన ఈ టీనేజర్స్, అమెరికా చేరుకోవడానికి అనేక అడ్డంకులను అధిగమించి, అవార్డు అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
పోటీలకి వెళ్లడానికి ఒప్పుకున్న తరువాత ఈ టీనేజర్లు హెరాత్‌లోని వారి ఇళ్ల నుంచి కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి రోడ్డు మార్గం ద్వారా 800 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.
అయితే, వారు అక్కడికి చేరుకున్నాక, వారికి వీసా నిరాకరించారు. మళ్లీ ప్రయత్నించినా, వీసా తిరస్కరణకు గురయ్యారు. అయినా మొక్కవోని దీక్షతో వారి ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. దీంతో నాటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జోక్యంతో వారి యాత్రకు అనుమతి లభించింది.
వాషింగ్టన్ పర్యటనకు కొద్దిరోజుల ముందు, అఫ్గాన్ ప్రభుత్వం వారు పోటీలో ఉపయోగించాలనుకున్న వస్తువులను జప్తు చేసింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు అమ్మాయిలు వాషింగ్టన్ చేరుకుని, అమెరికన్ మీడియా దృష్టిని ఆకర్షించగలిగారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19తో అలుపెరగని పోరాటం
అనంతరం, యువతులు అఫ్గానిస్తాన్‌లో కూడా ప్రజాదరణ పొందారు.
గత ఏడాది కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభ సమయంలో, వారు వైద్యులు, ఇంజనీర్లు, విద్యావేత్తలతో సమావేశమై శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతున్న రోగులకు ఓ చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు.
హెరాత్ లో కృత్రిమ రెస్పిరేటర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఇంజనీర్ల సహకారంతో కార్ల నుంచి విడిభాగాలను ఉపయోగించి రెస్పిరేటర్లను తయారు చేసే ప్రాజెక్ట్‌కు "అఫ్గాన్ డ్రీమర్స్" అంకురార్పన చేశారు.
ప్రోటో టైప్ నమూనాను ఉపయోగించడానికి అమెరికన్ నిపుణుల నుంచి అనుమతులను కూడా పొందారు. అనంతరం వారి పనుల్లో వేగం పెంచారు. ముఖ్యంగా రంజాన్ మాసం కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్న చాలా మంది అమ్మాయిలు ఉపవాసం సమయంలో కూడా అహర్నిశలు కృషి చేశారు.
భౌతిక దూరం నిబంధనలతో ఎవరికి వారే వ్యక్తిగతంగా పని చేయాల్సి వచ్చేది. ఒక్కొక్కరి పని ముగిసిన తర్వాత మాత్రమే చివర్లో అందరూ కలిసి పనిచేశారు. ఈ క్రమంలో "అఫ్గాన్ డ్రీమర్స్"లోని సభ్యుల్లో చాలా మంది కరోనా బారిన కూడా పడ్డారు.

ఫొటో సోర్స్, The Digital Citizen Fund
ఆశ్రయ అభ్యర్థనను ఆమోదించిన మెక్సికో
స్వదేశంలోనూ, అంతర్జాతీయంగా పేరు సంపాదించిన "అఫ్గాన్ డ్రీమర్స్" కు చెందిన సభ్యుల్లో చాలా మంది యువతులు తాలిబాన్లు అధికారం కోల్పోయిన 2001 తర్వాతే జన్మించడం విశేషం. 9/11 ఘటన తరువాత అమెరికా దాడులతో 2001లో తాలిబాన్లు అధికారాన్ని కోల్పోయిన విషయంతెలిసిందే.
తిరిగి తాలిబాన్లు అధికారంలోకి రావడంతో యువతుల్లో భయం మొదలైంది. దీంతో దేశం విడిచి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తరువాత, తొమ్మిది మంది సభ్యులు డిజిటల్ సిటిజన్ ఫండ్ సహాయంతో ఖతార్ వెళ్లారు.
''కాబూల్ ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని విన్నప్పుడు, మేము ఖతార్ విదేశీ మంత్రిత్వ శాఖను సంప్రదించగలిగాము. వారు వెంటనే వీసాలను వేగవంతం చేయడం ప్రారంభించారు'' అని డిజిటల్ సిటిజన్ ఫండ్ బోర్డు సభ్యుడు ఎలిజబెత్ స్కాఫర్ బ్రౌన్ బీబీసీకి చెప్పారు. మెక్సికో తమ ఆశ్రయ అభ్యర్థనను ఆమోదించినట్లు అక్కడే వారు తెలుసుకున్నారని చెప్పారు.
''వారు మా ప్రాణాలను మాత్రమే కాకుండా, మా కలలను కూడా కాపాడారు. మేము మా కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము'' అని మెక్సికో నగరానికి వచ్చిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆ అమ్మాయిలు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
'మా కథకు విచారకరమైన ముగింపు ఉండదు'
తాలిబాన్లు తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి పరిస్థితి తమకు అనుకూలంగా లేదు అని వారు వివరించారు.
"తాలిబాన్ల పాలనలో, అమ్మాయిలకు ఇబ్బందులే. అందుకే మేము ఇక్కడ ఉన్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నాము. ఇస్లామిక్ చట్టాలను అనుసరించి తాలిబాన్ల ప్రకారం, సైన్స్‌కి తమను తాము అంకితం చేసుకోవడం చాలా కష్టం అని "అఫ్గాన్ డ్రీమర్స్" గ్రూపు పేర్కొంది.
"తాలిబాన్ల కారణంగా మా కథకు విచారకరమైన ముగింపు ఉండదు" అని అమ్మాయిలు చెప్పారు.
వీరికి ఇప్పటికే అనేక అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి స్కాలర్‌షిప్ ఆఫర్‌లు వస్తున్నట్టు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- ‘పంజ్‌షీర్ పూర్తిగా గెలిచాం, అఫ్గానిస్తాన్‌లో యుద్ధం ముగిసినట్టే’: తాలిబాన్
- ‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- టోక్యో పారాలింపిక్స్: 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత్
- INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








