దక్షిణ చైనా సముద్రం: ఈ ప్రాంతంపై పట్టు కోసం చైనా ప్రపంచంతో పోరాడేందుకైనా రెడీ అంటోందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మానసీ దాస్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతాన్ని తనదని చెబుతోంది. ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మిస్తోంది.
ఇందులో చైనా ఒక్క దానికే భాగం ఉంటే సమస్య లేదు. కానీ, తమకు కూడా భాగం ఉందంటూ దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాలు వాదిస్తున్నాయి. అటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, నాటో కూటమి ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టులపై చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ వివాదం చాలా పెద్దదని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ పెరుగుతున్న చైనా జోక్యం రాబోయే సంఘర్షణలకు, ప్రపంచ పటంలో కొత్త మార్పులకు కారణం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
అసలు ఎందుకు దక్షిణ చైనా సముద్రం అంత వివాదాస్పదమైంది? అది తన నియంత్రణలోనే ఉండాలని చైనా ఎందుకు కోరుకుంటోంది?

ఫొటో సోర్స్, REUTERS/ROLEX DELA PENA
చైనా నిర్మాణాలు
2018 సంవత్సరంలో అమెరికాకు చెందిన వైమానిక దళ విమానం ఒకటి దక్షిణ చైనా సముద్రానికి చాలా దగ్గరగా వచ్చింది. ఇది గమనించిన చైనా, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ విమానానికి హెచ్చరికలు పంపింది.
ఆ విమానంలో బీబీసీ బృందం కూడా ఉంది. అందుకు కొన్నేళ్ల ముందు బీబీసీ బృందం దక్షిణ చైనా సముద్రానికి వెళ్లింది. అక్కడ చైనా అనేక నిర్మాణాలు చేపడుతున్నట్లు గమనించింది.
దక్షిణ చైనా సముద్రంలో చిన్నా, పెద్ద కలిపి సుమారు 250 వరకు దీవులు ఉన్నాయి. అయితే, ఇందులో అన్ని దీవులలో జనం నివసించరు. ఆటు పోట్ల కారణంగా కొన్ని దీవులు కొన్ని నెలల పాటు నీటిలో మునిగి ఉంటాయి. కొన్ని పూర్తిగా మునిగే ఉంటాయి.
ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్య ఉంటుంది.
దీని చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలు ఉంటాయి. దాదాపు అన్ని దేశాలు ఈ భూభాగంలో తమకూ వాటా ఉందని ప్రకటించుకున్నాయి.
2 వేల ఏళ్ల కిందట చైనా నావికులు, మత్స్యకారులు ఈ ప్రాంతాన్ని మొదట గుర్తించారని, పేరు కూడా వారే పెట్టారని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో చైనా అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు ఫెంగ్ జంగ్ అన్నారు.
''రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం 1939 నుండి 1945 వరకు జపాన్ ఆక్రమణలో ఉంది. యుద్ధంలో జపాన్ ఓటమి తరువాత దానిని స్వాధీనం చేసుకోవడానికి చైనా తన నౌకలను పంపింది'' అన్నారు ఫెంగ్
యుద్ధం తర్వాత చైనా ప్రభుత్వం 30 లక్షల చదరపు కి.మీ.లో ఎక్కువ భాగం తనదిగా, అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ ఓ మ్యాప్‌ను విడుదల చేసిందని ఫెంగ్ జంగ్ తెలిపారు.
ఈ రేఖను నైన్ డాష్ లైన్ అంటారు. అయితే, ఈ లైన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ, ఈ ప్రాంతం తనదని చెప్పుకునేందుకు చైనా ఇప్పటికీ ఇదే మ్యాప్‌ను ఉపయోగిస్తోందని ఫెంగ్ చెప్పారు.
ఈ ప్రాంతంలో చమురు నిల్వలపై అన్వేషణ మొదలైన తర్వాతే మిగిలిన దేశాలు దక్షిణ చైనా సముద్రంపై ఆసక్తి పెరిగిందని చైనా వాదిస్తోంది.
1970 కి ముందు చైనా వాదనను ఎవరూ సవాలు చేయనందున ఈ వాదన కొంత వరకు నిజమని అనిపిస్తుందని డాక్టర్ ఫెంగ్ జంగ్ చెప్పారు.
అనేక విధాలుగా చైనాకు ఈ సముద్రం చాలా ముఖ్యమైనది. చరిత్రాత్మకంగా ఇది తన సొంతమని చెబుతోంది చైనా. కానీ దాని వెనుక ఇంకేదైనా బలమైన ఆర్థిక కారణం ఉందా ?

ఫొటో సోర్స్, Getty Images
వనరులు ఉన్నాయా?
ఈ ప్రాంతం ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అర్ధం కావడంతో చైనాతోపాటు ఇతర దేశాలు దీని కోసం పోటీ పడుతున్నాయని ఆస్ట్రేలియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ రిసోర్సెస్ అండ్ సెక్యూరిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ క్లైవ్ స్కోఫీల్డ్ అన్నారు.
''ఈ ప్రాంతంలో ముడి చమురు పుష్కలంగా ఉందన్న అనుమానంతో ఈ ప్రాంతంపై చాలా దేశాలకు ఆసక్తి పెరిగింది. అయితే, ఇక్కడ నిజంగా అంత పెద్ద స్థాయిలో వనరులు ఉన్నాయా అన్నది నా అనుమానం'' అని స్కోఫీల్డ్ చెప్పారు.
ఈ ప్రాంతంలో ఎంత చమురు దొరుకుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే, ప్రొఫెసర్ క్లైవ్ మాత్రం ఇక్కడ వేరే రకమైన సంపద ఉందని, ఇది చైనాకు ముఖ్యమైనదని అంటున్నారు.
ఈ ప్రాంతంలో ఇక్కడ ముప్పై వేల రకాల చేపలు ఉన్నాయట. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం దక్షిణ చైనా సముద్రంలోనే జరుగుతుంది.
''దక్షిణ చైనా సముద్రంలో సముద్ర వనరుల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. అయితే, ఈ వనరుల విషయంలో మిగిలిన దేశాలన్నీ చైనాతో పోరాడగలగడం అసాధ్యం'' అని ఆయన అన్నారు.
ఈ ప్రాంతంలో ఈ ఉద్రిక్తత పెరిగినందున, దానిని ఎదుర్కోవటానికి చైనా ఇక్కడ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
2012లో స్కాబరో షోల్ ప్రాంతంలోని ఫిలిప్పీన్స్ మత్స్యకారులను చేపలు పట్టకుండా చైనా అడ్డుకుంది. అయితే, ఈ ప్రాంతం తన స్పెషల్ ఎకనమిక్ జోన్ లోనిదని స్పష్టం చేస్తూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ కేసు విచారణ కోసం ఐక్య రాజ్య సమితి లా ఆఫ్ ది సీ సమావేశం ఏర్పాటు చేసి ఒక ట్రిబ్యునల్‌ను నియమించింది. ఇందులో ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
'' ఈ ప్రాంతంలోని సముద్రపు వనరులు తనవి అని చెప్పుకోవడానికి చైనాకు చట్టపరమైన ఆధారం లేదు'' అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ విషయంలో చైనా స్పందన భిన్నంగా ఉందని ప్రొఫెసర్ క్లైవ్ అన్నారు. కోర్టు తీర్పులు పనికి రావని, చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని చైనా స్పష్టం చేసింది.
''చైనా విచారణకు హాజరు కాలేదు, ట్రిబ్యునల్ అధికార పరిధిని నిరాకరించింది. దీనితో, దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాలలో చైనా ఉద్దేశం తెరపైకి వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది.
ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషియాతో చైనాకు వివాదం ఏర్పడింది.
అయితే, దక్షిణ చైనా సముద్రం వివాదం కేవలం ఫిషింగ్, ఇతర వనరుల విషయంలోనే కాదు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో దక్షిణ చైనా సముద్రం ఒకటి.
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలో 80శాతం వాణిజ్యం ఈ సముద్రం ద్వారా జరిగితే, ఈ వాణిజ్యంలో మూడవ వంతు దక్షిణ చైనా సముద్రం మీదుగా సాగుతుంది.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా ప్రకారం ఈ మార్గం ద్వారా 373.37 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో దేశాలు ఈ ప్రాంతం కోసం పోటీ పడటం సహజమే.
ఈ ప్రాంతాన్ని ఏ ఒక్క దేశం కూడా ఆక్రమించక పోవడం అమెరికాకు కూడా ఆసక్తి కలిగించింది. సరుకు రవాణా ఓడలతోపాటు యుద్ధ నౌకలు కూడా ఈ ప్రాంతం గుండా వెళుతున్నాయి.
అమెరికా దీనిని ''ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్'' అని అంటుంది. కానీ, చైనా మాత్రం దీనిని దుందుడుకు చర్యలుగా అభివర్ణిస్తుంది.
మైక్ పాంపెయో విదేశాంగ కార్యదర్శిగా ఉన్న కాలంలో కూడా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ''దక్షిణ చైనా సముద్రం అంటే చైనా రాజ్యానికి కొనసాగింపు కాదు. మేం ఆసియా దేశాలకు మద్ధతిస్తున్నాం. ఈ ప్రాంతంలో వివాదాలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరించాలి'' అని అన్నారు.
కానీ, ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే చైనా పరిమితం కాలేదు. ఇక్కడ చైనా తన సైనిక కార్యకలాపాలను గణనీయంగా పెంచిందని, దీని కారణంగా పొరుగు దేశాలలో కూడా ఆందోళన పెరిగిందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ జెన్నింగ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, DIGITALGLOBE/SCAPEWARE3D
'చైనా దుశ్చర్యలు'
''దక్షిణ చైనా సముద్రంలో మునిగి పోయిన రాళ్ల పై చైనా మిలియన్ల కిలోల కాంక్రీటును, రాయిని పోస్తోంది. సముద్రం కింద బలమైన పునాది సాయంతో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తోంది'' అని పీటర్ జెన్నింగ్ అన్నారు.
దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్, స్పార్టాలి, ఫాయరీ, మిస్చిఫ్, సుబి, వుడీ ద్వీపాలను విస్తరించడానికి, అక్కడ సైనిక స్థావరాలు, ఓడరేవులను నిర్మించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది.
చైనా ఇప్పటి వరకు సముద్రం కింద మూడు వేల హెక్టార్ల కొత్త భూమిని సిద్ధం చేసిందని పీటర్ జెన్నింగ్ అన్నారు.
"చైనా ఇక్కడ 3వేల మీటర్ల పొడవుతో మూడు రన్‌వేలను నిర్మించింది. ఇవి ఆర్మీ రన్‌వేలు. ఇక్కడ యుద్ధ విమానాలను ల్యాండ్ చేయవచ్చు. ఇక అక్కడ భారీగా చమురు నిల్వలు ఉన్నాయి. కేవలం 36 నెలల రికార్డు సమయంలో ఈ ద్వీపంలో భద్రత, క్షిపణి వ్యవస్థలను చైనా నిర్మించింది'' అని జెన్నింగ్ చెప్పారు.
ఆధునిక చరిత్రలో ఇది పర్యావరణపరంగా అత్యంత విధ్వంసకరమైన చర్య అని, దీని ప్రభావం ఇక్కడ సముద్ర జీవులపై పడుతుందని జెన్నింగ్ అన్నారు.
2013లో చైనా తూర్పు చైనా సముద్రంలో ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌ను సృష్టించింది. దక్షిణ చైనా సముద్రంలో అలాంటి జోన్‌ను ఏర్పాటు చేసి నో ఫ్లై జోన్‌గా మార్చాలన్నది చైనా ప్రయత్నం.
కానీ, ఇప్పటి వరకు దీన్ని సాధించలేక పోయింది. కానీ ఈ ప్రాంతం గుండా ప్రయాణించే యుద్ధ విమానాలను మాత్రం నిషేధించింది.
ఆగస్టు 2020లో దక్షిణ చైనా సముద్రంలో చైనా రెండు క్షిపణులను ప్రయోగించడం ద్వారా అమెరికాను హెచ్చరించింది.
''చైనా తన సైనిక ప్రయోజనాలను కాపాడుకోవాలని, ఆగ్నేయాసియాలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని కోరుకుంటోంది'' అని పీటర్ జెన్నింగ్ అన్నారు.
మరి చైనా దూకుడు పై ఇతర దేశాలు ఎలా స్పందిస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
వివాదానికి కేంద్రం
దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు కనిపించడం ప్రారంభమయ్యే వరకు చైనా ఉద్దేశాల గురించి అమెరికాకు తెలియదని, దీనిని ధృవీకరించే ఉపగ్రహ చిత్రాలు బయటపడలేదని బోనీ గ్లేజర్ అన్నారు.
బోనీ గ్లేజర్ 'ది జర్మన్ మార్షల్ ఫండ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్'లో ఆసియా ప్రోగ్రాం డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో చైనా పవర్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా ఆమె పనిచేశారు.
''దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మాణ పనులను వేగంగా సాగిస్తోందని అమెరికాకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. కానీ, వాటితో చైనా ఏం చేయాలనుకుంటున్నది మాత్రం అమెరికాకు తెలియదు'' అని బోనీ గ్లేజర్ అన్నారు.
ప్రారంభంలో ఈ నిర్మాణ పనులను అమెరికా పెద్దగా పట్టించుకోలేదని గ్లేజర్ అంగీకరించారు.
అమెరికా ఏమీ పట్టనట్లు ఉండటంతో , ఈ ప్రాంతంలోని చిన్న దేశాలు ఈ సమస్యను పరిష్కరించడానికి సొంత పద్ధతులను అనుసరిస్తున్నాయి. చైనాను వ్యతిరేకించడానికి బదులు దానితో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
'' ఏ దేశమైనా చైనాతో నేరుగా పోరాడటానికి ఇష్టపడదు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి అమెరికా ఎంత వరకు కట్టుబడి ఉంటుందన్న దానిపై వారికి అనుమానాలు ఉన్నాయి. అందుకే చాలా దేశాలు చైనాతో చేతులు కలపడానికి సిద్ధపడ్డాయి'' అని గ్లేజర్ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS/ERIK DE CASTRO
దక్షిణ చైనా సముద్రంలో తన హక్కుల కోసం అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్లిన ఫిలిప్పీన్స్ కూడా చైనా ఇక్కడ సైనిక స్థావరాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకించలేదు.
ఫిలిప్పీన్స్‌లో నీటిపారుదల, రైలు ప్రాజెక్టులలో కూడా చైనా భారీగా పెట్టుబడులు పెడుతోందని బోనీ గ్లేజర్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో, ఈ దేశాలకు ఆర్థికంగా చాలా ప్రమాదం ఉంది. చైనాతో సైనిక ఘర్షణ భయం కూడా ఉంది.
''ఈ ప్రాంతం విషయంలో అమెరికా, చైనాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మిలిటరీ కార్యకలాపాలను నిర్వహించ వద్దని అమెరికా హెచ్చరిస్తే చైనాతో ఆ దేశానికి సైనిక ఘర్షణ జరిగే అవకాశం ఉంది'' అన్నారు గ్లేజర్.
అమెరికా దక్షిణ చైనా సముద్రానికి ప్రాముఖ్యత ఇవ్వని విధంగా చైనా విధానాలను మార్చుకుంటే దీని నుంచి ఆ దేశం మరింత ప్రయోజనాలు పొందుతుందని గ్లేజర్ అన్నారు.
అమెరికా ఇక్కడ చురుకుగా జోక్యం చేసుకోకపోతే, ఈ చదరంగంలో చైనా పెద్ద ఆటగాడిగా ఉద్భవించి ఈ ప్రాంతంలోని ద్వీపాలను, సముద్రం, గగన తలాలను ఆక్రమించుకోవడానికి మార్గం సుగమం అవుతుందని గ్లేజర్ అన్నారు.
దక్షిణ చైనా సముద్రం చైనాకు వ్యూహాత్మక ప్రాంతమని, ఇక్కడ అడుగు పెట్టడం ద్వారా అమెరికాను దక్షిణాసియా నుంచి బయటకు నెట్టడానికి, ఈ ప్రాంతంలో అమెరికాకు బలమైన ప్రత్యర్ధిగా మారేందుకు చైనాకు అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలోని భారీ మత్స్యవనరులు, అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గంపై తన అధికారాన్ని నిలబెట్టుకుని ఈ ప్రాంతంలో తానే ఏకైక ప్రధాన శక్తిగా నిరూపించుకోవాలని చైనా భావిస్తోంది.
అదే సమయంలో, ఇక్కడ సాగిస్తున్న భారీ సైనిక కార్యకలాపాల ద్వారా అమెరికాను ఈ ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా, ఏక ధృవ ప్రపంచం నుంచే పక్కకు నెట్టాలన్నది చైనా ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- రాయలసీమ ఎత్తిపోతల పథకం: ఏపీ, తెలంగాణ మధ్య వివాదానికి కారణమేంటి
- మోదీ ఏడేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ ఏడు చార్టులు చెప్పేస్తాయి
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు: ఒవైసీ పార్టీ ముస్లింల ఓట్లను చీలుస్తుందా? దీంతో బీజేపీకే లాభమా?
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








