డోనల్డ్ ట్రంప్ అకౌంట్లను రెండేళ్ల పాటు రద్దు చేసిన ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images
మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను రెండేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి, నిరసనల నేపథ్యంలో జనవరిలో ట్రంప్ అకౌంట్లను ఫేస్‌బుక్ నిరవధికంగా రద్దు చేసింది.
అయితే, గత నెల ఈ సంస్థ పర్యవేక్షణ బృందం నిరవధిక రద్దును విమర్శించింది.
"ట్రంప్ చర్యలు ఫేస్‌బుక్ నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించాయని" ఆ సంస్థ తెలిపింది.
ఫేస్‌బుక్ ఈ నిర్ణయంతో గత ఎన్నికల్లో తనకు ఓటు వేసిన లక్షలాది మంది ప్రజలను "అవమానించిందని" ట్రంప్ అన్నారు.
కంటెంట్ మోడరేషన్ నిబంధనల నుంచి రాజకీయ నాయకులను మినహాయించే విధానానికి ఫేస్‌బుక్ స్వస్తి పలికింది. ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా దిగ్గజం ట్రంప్ ఖాతాలను రద్దు చేసే నిర్ణయం తీసుకుంది.
రాజకీయ నాయకులు తప్పుదారి పట్టించే కామెంట్లు పెట్టినా, దూషణలకు దిగినా మినహాయింపు ఉండదని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది.
ట్రంప్ ఖాతాల రద్దు జనవరి 7 నుంచి అమలులో ఉందని ఫేస్‌బుక్ గ్లోబల్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ తెలిపారు.
"ట్రంప్ చర్యలు మా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించాయి. ఇప్పుడు కూడా ఆయన చర్యలు ప్రజా భద్రతకు భంగం కలిగిస్తాయని అనిపిస్తే ఖాతాల రద్దును పొడిగించడానికి వెనుకాడం. ఏ రకమైన ప్రమాదం లేదని తేలేవరకూ రద్దును కొనసాగిస్తాం. వెనక్కు వచ్చిన తరువాత కూడా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిస్తే, కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఏమన్నారు?
ట్రంప్, తన 'సేవ్ అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ' తరపున విడుదల చేసిన ఒక ప్రకటనలో.. "ఫేస్‌బుక్ తన నిర్ణయంతో మాకు ఓటు వేసిన 7.5 కోట్ల మంది ప్రజలను, ఇతరులను కూడా అవమానించింది. ఈ రకమైన నియంత్రణ, గొంతు మూయించడాన్ని అనుమతించకూడదు. చివరిగా, మేమే గెలుస్తాం. మా దేశం ఈ అవమానాన్ని ఇంక ఎంత మాత్రం సహించదు" అని అన్నారు.
రెండేళ్ల పాటు తన ఖాతాలను రద్దు చేయండంపై ట్రంప్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిని దుయ్యబట్టారు.
"మళ్లీ నేను వైట్ హౌస్‌లో అడుగు పెట్టిన తరువాత మార్క్ జుకర్బర్గ్ కోరినా సరే, ఆయనతో, ఆయన సహచరితో స్నేహపూర్వకమైన డిన్నర్లు ఉండబోవు. వ్యాపార పరమైన సమావేశాలు మాత్రమే ఉంటాయి" అని ట్రంప్ అన్నారు.
ప్రస్తుతానికి రద్దు రెండేళ్లే కాబట్టి 2024లో వచ్చే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు ముందే ట్రంప్ మళ్లీ ఫేస్‌బుక్ ఖాతాను ఉపయోగించవచ్చు.
తన సోషల్ మీడియా ఖాతాలు రద్దు అయిన నేపథ్యంలో ట్రంప్ ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ ఫ్రం ది డెస్క్ ఆఫ్ డోనాల్డ్ జే ట్రంప్‌ను శాశ్వతంగా మూసివేసారన్న విషయం ఈ వారం ప్రారంభంలో వెలుగులోకి వచ్చింది.
జనవరిలో జరిగిన హింసాత్మక ఘటనల తరువాత ఫేస్‌బుక్ మాత్రమే కాకుండా ట్విట్టర్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ట్విత్చ్‌తో సహా ఇతర సోషల మీడియా వేదికలు కూడా ట్రంప్ అకౌంట్లను నిషేధించాయి.
కాగా, గత నెల, రాజకీయ నాయకుల ఖాతాలపై నిషేధం విధించే టెక్ కంపెనీలను శిక్షించే మొట్టమొదటి చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి:
- డోనల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలో ఎలా గుర్తుండిపోతారు?
- కాళీపట్నం రామారావు: కథా రచయిత కారా మాస్టారు ఇక లేరు
- కన్నడ: "భారతదేశంలో వికారమైన భాష" అనే సెర్చ్ రిజల్ట్స్ పట్ల క్షమాపణ చెప్పిన గూగుల్
- వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ఆంథోనీ ఫౌచి రాసిన ఈ-మెయిళ్లలో ఏముంది?
- డోనల్డ్ ట్రంప్ ఓడిపోయారు... కానీ, ఆయనకు నల్లజాతీయులు, లాటినోల్లో ఆదరణ పెరిగిందా?
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








