కోవిడ్ ద్వేషానికి ట్రంప్ బీజాలు వేశారా... అమెరికాలో ఆసియా వారిపై దాడులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలే ఒక థాయ్‌లాండ్ సంతతికి చెందిన మహిళను కొందరు వ్యక్తులు కింద పడేయడంతో ఆమె చనిపోయారు. ఒక ఫిలిప్పీన్స్ సంతతి మహిళపై బాక్స్ కట్టర్‌తో దాడి జరగ్గా, ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఓ చైనీయురాలినైతే కొందరు తీవ్రంగా కొట్టి నిప్పు కూడా అంటించారు.
ఇటీవలి కాలంలో అమెరికాలోని ఆసియా సంతతి వారిపై జరుగుతున్న దాడులకు ఈ సంఘటనలు నిదర్శనం.
ఏషియన్ అమెరికన్‌లతో గొడవ పడటం, దూషించడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఘటనలపై వేలకొద్దీ ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి.
కోవిడ్-19 వ్యాప్తికి వారే కారణమన్న ఆరోపణలతో వీరిపై దాడులు జరుగుతున్నాయని బాధితుల తరఫు న్యాయవాదులు, ఉద్యమాకారులు ఆరోపిస్తున్నారు.
అమెరికాలో అసలేం జరుగుతోంది?
ఆసియా సంతతి ప్రజలపై దాడులు జరిగే అవకాశం ఉందని కోవిడ్ వ్యాప్తి మొదలైన రోజుల్లోనే ఎఫ్‌బీఐ హెచ్చరించింది.
2020 సంవత్సరానికి సంబంధించిన హేట్ క్రైమ్ డేటా ఇంకా విడుదల కాలేదు. కానీ, 2019 సంవత్సరపు గణాంకాలను పరిశీలిస్తే, గత దశాబ్ధకాలంలో ఎన్నడూ లేనంతగా ఆ సంవత్సరంలో దాడులు జరిగినట్లు తేలింది.
అమెరికాలో నివసిస్తున్న ఏషియన్ అమెరికన్లపై దాడులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో పేర్కొంది.
అయితే, కచ్చితంగా ఎన్నిదాడులు జరిగాయి అన్నది మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. పైగా నేరాలను రికార్డు చేసే విధానం అమెరికాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంది.
స్టాప్ ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ఐలాండర్స్ హేట్ (Stop AAPI Hate) అనే స్వచ్ఛంద సంస్థకు అందిన ఫిర్యాదుల ప్రకారం గత ఏడాది సుమారు 2800 పైగా ఘటనలు జరిగినట్లుగా తేలింది.
ఈ గ్రూప్ ఏషియన్లపై జరిగే దాడులకు సంబంధించి ఒక సెల్ఫ్ రిపోర్టింగ్ టూల్‌ను మెయింటెన్ చేస్తోంది.
2020 సంవత్సరంలో 27 సంఘటనలు తమ దృష్టికి వచ్చినట్లు న్యూయార్క్ సిటీ హేట్ క్రైమ్స్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు పెరిగినట్లు తేలింది.
ఓక్‌లాండ్, కాలిఫోర్నియా ప్రాంతాలలోని చైనా టౌన్లలో కమండ్ పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, TRACY WEN LIU
సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇటీవలి కాలంలో జరిగిన దాడులకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అందులో కొన్ని దాడుల వివరాలు ఇవి:
- ఈ ఏడాది ఫిబ్రవరిలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో మార్నింగ్ వాక్‌కు వెళుతున్న ఓ 84 ఏళ్ల థాయ్ సంతతి మహిళపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
- ఓక్‌లాండ్ నగరంలో 91 సంవత్సరాల వృద్ధురాలిని తోసేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు.
- న్యూయార్క్ లోని బ్రూక్లిన్ ప్రాంతంలో 89 ఏళ్ల చైనా సంతతి మహిళపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు.
- శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ బస్టాప్‌లో నిలబడిన ఏషియన్ అమెరికన్ మహిళపై కొందరు దాడి చేశారు. తర్వాత వారు ఏ మాత్రం భయం లేకుండా తాపీగా నడుచుకుంటూ వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
- అదే శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏడాది చిన్నారిని స్ట్రోలర్‌లో కూర్చోబెట్టుకుని వెళుతున్న ఒక ఏషియన్ సంతతి వ్యక్తిపై కొందరు అగంతుకులు దాడి చేశారు.
- న్యూయార్క్ సబ్‌వేలో వెళుతున్న 61 సంవత్సరాల ఫిలిప్పీన్ సంతతికి చెందిన మహిళ ముఖంపై బాక్స్ కట్టర్ తో ఓ వ్యక్తి దాడి చేశాడు.
- ముఖం మీద ముసుగు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఓ ఏషియన్ మహిళపై న్యూయార్క్ సిటీలో ఓ వ్యక్తి సుత్తితో దాడి చేశాడు.
- దాడులు జరుగుతాయన్న భయంతో తాము త్వరగా ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఒక ఏషియన్ అమెరికన్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు న్యూయార్క్ టైమ్ పత్రికకు చెప్పారు.
- ఇటీవల ఏషియా సంతతికి చెందిన ఓ మాంసం కొట్టు యజమాని పార్కింగ్ స్లాట్ లో ఓ చనిపోయిన పిల్లి శరీరాన్ని పడేశారు. ఇది కూడా ఏషియన్ హేట్ క్రైమ్‌లో భాగమేనని పోలీసులు భావిస్తున్నారు.
- ఏషియన్ అమెరికన్ కుటుంబం బర్త్ డే పార్టీ జరుపుకుంటున్న ఓ రెస్టారెంట్ ఎదుట ట్రంప్ మద్దతిచ్చిన ఓ టెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరు జాతి వ్యతిరేక నినాదాలు చేశాడు.
- తమపై దాడులు జరిగాయని, తమ ఇళ్లపై రాళ్లు కూడా విసిరారని అనేకమంది ఏషియన్ సంతతి వారు ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం నువ్వేనంటూ ఓ వ్యక్తి తనపై దాడి చేయబోయాడని కన్సాస్‌కు చెందిన ఏషియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి ఒకరు వెల్లడించారు.
- యాంటి ఏషియన్ దాడులకు నిరసన ఆందోళన చేస్తున్న వారిపై దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఓ ఏషియన్ కుటుంబంలో ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతుండగా ''ఇక బ్యాగులు సర్దుకుని మీ దేశం వెళ్లిపోండి'' అంటూ ఓ లేఖ ఆ కుటుంబానికి చేరింది.
- పోర్ట్‌లాండ్‌లో నివసించే వియాత్నాం దేశానికి చెందిన ఓ టీచర్ ఇంటి ముందు 'కుంగ్ ఫ్లూ' అని రాసిన నోట్ పెట్టి వెళ్లిపోయారు.
- 'చైనాకు వెళ్లిపో' అని పెద్దగా అరుస్తూ ఓ ఫిలిప్పీన్ సంతతి వ్యక్తిపై వెనక నుంచి వచ్చి కొందరు దాడి చేసిన ఘటన కాలిఫోర్నియాలో జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
కాలిఫోర్నియాలో పరిస్థితి ఎలా ఉంది?
తాజా గణాంకాల ప్రకారం కాలిఫోర్నియా రాష్ట్రంలో 60 లక్షలమంది ఏషియన్ అమెరికన్లు నివసిస్తున్నారు. ఆ రాష్ట్ర జనాభాలో 15శాతానికి పైగా వీరే ఉంటారు.
అమెరికాలో ముందుగా కరోనా వైరస్ బయటపడిన ప్రాంతాలలో కాలిఫోర్నియా ఒకటి. వైరస్ కారణంగా ఇక్కడి బిజినెస్‌లన్నీ నిలిచి పోయాయి. సుమారు 50,000 మంది మరణించారు.
2020 మార్చి నుంచి మే నెల మధ్య కాలంలో ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే 800 పైగా కోవిడ్ సంబంధించిన విద్వేష దాడులు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

చర్యలు ఎలా ఉన్నాయి?
ఆరెంజ్ కౌంటీలో యాంటీ ఏషియన్ దాడులు ఎక్కువయ్యాయని, గతంతో పోలిస్తే ఇక్కడ 1200 శాతం దాడులు పెరిగాయని ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ హేట్ అండ్ ఎక్స్‌ట్రీమిజం‘ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.
అమెరికాలో పెరిగిపోతున్న యాంటీ ఏషియన్ సెంటిమెంట్ కు ఈ దాడులు నిదర్శనమని ఏషియన్ అమెరికన్ న్యాయవాదులు అంటున్నారు.
ఈ ద్వేషం ట్రంప్ కారణంగానే పెరిగిందని, అప్పట్లో చైనా వైరస్ అని, కుంగ్ ఫ్లూ అని ట్రంప్ కామెంట్లు చేసేవారని మరి కొందరు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం అధికార మార్పిడి జరగడంతో ఏషియన్లపై దాడులకు సంబంధించిన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తరహా దాడులకు వ్యతిరేకంగా అమెరికా సెనేట్ ఒక చట్టాన్ని చేసింది.
ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక అధికారిని నియమిస్తారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా
- అయిదు రాష్ట్రాల ఎన్నికలు: ఏ పార్టీకి ఎంత లాభం, ఎంత నష్టం?
- కరోనావైరస్: విజయవాడలో ఒకే ఇంట్లో నలుగురు ఎలా చనిపోయారు... కొత్త మ్యుటేషన్ కాటేస్తోందా?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కోవిడ్ టెస్ట్‌లకు వాడిన కిట్లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








