మియన్మార్ సైనిక కుట్రకు వ్యతిరేకంగా ధైర్యంతో, పట్టుదలతో పోరాడుతున్న యువతరం

ఫొటో సోర్స్, Reuters
మియన్మార్‌లో సైనిక పాలన అంతమొందాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారుల్లో ఇప్పటివరకూ 55 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది యువతీ యువకులే. యాంగాన్ నుంచీ బీబీసీ బర్మీస్ ప్రతినిధి నైయిన్ చాన్ అయే అందిస్తున్న కథనం.
మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెల పైన గడిచింది. దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ప్రజలు ఎన్నో రకాల దాడులను ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్ కోత, రాత్రి పూట దాడులు, చట్టవిరుద్ధమైన అరెస్ట్‌లు, వీధుల్లో వెంబడించి కొట్టడం, నుదుటి మీద గురి పెట్టి తుపాకీతో కాల్చి చంపడం లేదా దూరం నుంచీ తలలోకి, గుండెల్లోకి గురి పెట్టి కాల్చి చంపడం.. ఇలా ఎన్నో దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు.
ఒక్క వారంలో డజన్లకొద్దీ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. తలపై గురి పెట్టి కాల్చడంతో ఒక టీనేజ్ అమ్మాయి మరణించింది. ఆమె వేసుకున్న టీ షర్ట్‌పై "అంతా సర్దుకుంటుంది" (ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే) అని రాసి ఉంది.
ఇప్పుడు పగటిపూట యాంగాన్ చుట్టుపక్కలకు వెళితే ముందు మనకు తగిలేది పొగ వాసనే. చిన్నపిల్లలు తమ తమ ఇళ్లల్లోనే ఉండి కూడా టియర్ గ్యాస్, పొగ బాంబులే రుచి చూస్తున్నారు. శాపనార్థాలు పెట్టడం తప్ప మరేమీ చేయలేని దుస్థితి తల్లులది.
లైవ్ రౌండ్స్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, పొగ బాంబులు.. ఇలా ఒకటి కాదు.. ఒక్క నెలలోపు మియన్మార్ ఇవన్నీ రుచి చూసింది.
అయినప్పటికీ, నిరసనకారులు వెనక్కు తగ్గట్లేదు. సైనిక పాలనలో జరుగుతున్న దురాగతాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయినా సరే, శాంతియుతంగానే నిరసనలు చేపడుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
సృజనాత్మక రూపాలతో ధిక్కరణ
సైనిక పాలన వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులు, సన్యాసులు (మాంక్స్), మహిళలు, ప్రభుత్వోద్యోగులు, కొందరు పోలీసు అధికారులు కూడా పాల్గొంటున్నారు. సైనిక పాలనకు మద్దతు ఇచ్చేది లేదని, ఈ ఉద్యమంలో ప్రజల పక్షాన నిలుస్తామని కొందరు పోలీస్ అధికారులు బహిరంగంగా ప్రకటించారు కూడా.
ఉద్యమంలో పాల్గొంటున్నవారంతా ఒక్క తాటిపై నిలిచి, ఒకే సంకల్పంతో ముందుకు కదులుతున్నారు.
తమ ధిక్కారాన్ని కొత్తగా, సృజనాత్మకంగా చూపెడుతున్నారు.
చప్పట్లు కొట్టడం లేదా పాటలు పాడడం, ఎత్తైన భవనాల నుంచీ సరోంగులు వేలాడదీయడం.. ఇలా ఎన్నో రకాలుగా తమ ధిక్కారాన్ని తెలియజేస్తున్నారు.
సరోంగులు అంటే ఆగ్నేయ ఆసియాలో నడుముకు చుట్టుకునే బట్ట.. లుంగీ. చైనా, మియన్మార్ ప్రాంతాల్లో వీటిని గుండెల పైకి కూడా చుట్టుకుంటారు. పూర్వం మగవాళ్లు మాత్రమే వీటిని చుట్టుకునేవారు. ఇప్పుడు ఆడవాళ్లు కూడా రకరకాల డిజైన్లతో వస్తున్న సరోంగులను ధరిస్తున్నారు.
అయితే, నిరసనలకు సూచనగా సరోంగులే ఎందుకు వేలాడదీస్తున్నారు?
సరోంగుల పట్ల సైనికులకు మూఢ నమ్మకాలు ఉన్నాయని, అవి చూసి వారు భయపడతారని ఇక్కడివారి నమ్మకం. ఇలా భవనాల పైనుంచీ వేలాడుతున్న సరోంగులను చూస్తే వారి బలం సన్నగిల్లుతుందని, వారి ఆధ్యాత్మిక శక్తి బలహీనపడుతుందని భావిస్తున్నారు.
ప్రధాన రహదారులపై నిరసన ప్రదర్శనలను సైనిక అధికారులు సులువుగా ధ్వంసం చేసేస్తున్నారు కాబట్టి ఉద్యమకారులు చుట్టు పక్కల పరిసరాల్లో తమ నిరసన ప్రదర్శనలకు చోటు కల్పించుకుంటున్నారు.
ఇసుక సంచులన్నీ వరుసగా పేర్చి దుర్గంలా ఏర్పాటు చేసుకోవడం, చెత్త బుట్టలలో నీళ్లు నింపి అడ్డం పెట్టుకోవడం లేదా ఒక చోటు నుంచీ మరొక చోటుకు సులువుగా తరలించగలిగే బ్యారికేడ్లు.. ఇలా తమకు రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో ఎటు చూసినా ఇవన్నీ కనిపిస్తాయి.
చుట్టుపక్కల ప్రాంతాలవాళ్లు కూడా ఉద్యమకారులకు ఎంతో మద్దతు ఇస్తున్నారు. ఉచితంగా భోజన పంపిణీ, రక్షణ కవచాలను అందించడంలాంటివన్నీ చేస్తున్నారు.
సైనిక పాలనను అంతమొందించి భవిష్యత్తు తరాలకు ప్రజాస్వామ్య విలువలను అందించడమే వారందరి లక్ష్యం.
దానితో పాటుగా, అందరూ ప్రాణాలతో ఉండి, పోరాటాన్ని ముందుకు సాగించడం ముఖ్యమని ఒకరినొకరి హెచ్చరించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటున్నారు.

దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి ఇళ్లల్లో రాత్రి పూట గిన్నెలు, కంచాలు నేల మీద పడేసి చప్పుళ్లు చేసేవారు. ఇప్పుడు అదే పద్ధతిలో రాత్రి పూట తమ తమ బాల్కనీల్లోంచి లేదా ఇంటి లోపలే కుర్చుని ప్రజాస్వామ్యం గెలవాలంటూ గొంతెత్తి నినాదాలు చేస్తున్నారు.
అన్ని రకాల దాడులు, దౌర్జన్యాలకు ఎదురు నిలుస్తూ, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగేందుకు మూకుమ్మడి ప్రయత్నాలు చేస్తున్నారు.
"ప్రపంచం అంతమైపోయినా సరే, మేము మర్చిపోం" అనో, "రక్త ప్రమాణం" అనో పాటలతో నగరమంతా మార్మోగిస్తున్నారు.
కొత్త తరం సృష్టించిన పాటలు.. "తిరస్కరించండి (సైనిక పాలనను), "చివరి వరకూ మా పోరాటం సాగుతుంది"లాంటి గేయాలు పదే పదే వినిపిస్తున్నాయి.
రోడ్ల మీదకు వెళ్లడం ప్రాణాంతకంగా మారింది. అందుకే ఇళ్లల్లోంచే తమ నినాదాలను వినిపిస్తున్నారు. కొందరు కొవ్వొత్తులు వెలిగించి, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పిస్తున్నారు. వారిని ఆప్యాయంగా "నేలకొరిగిన వీరులు" (ఫాలెన్ హీరోస్) అని పిలుస్తున్నారు.

'నియంతృత్వం అంతం కావాల్సిందే'
సాయంత్రాల్లో, యువత సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా విప్లవ ధోరణిలో మూడు వేళ్ల వందనం చేయడం కనిపిస్తుంటుంది.
యాంగాన్‌లోనే కాకుండా, ఇతర ప్రధాన నగరాల్లో కూడా యువత అనేక రకాల కుడ్య చిత్రాలను రూపొందిస్తున్నారు.
సైనిక పాలనకు మద్దతిస్తున్న పోలీస్ అధికారులకు రాత్రుళ్లు.. యువత గోడలపై, రోడ్లపై రాస్తున్న నినాదాలను చెరిపి వేసే పనిలో పడుతున్నారు.
ఎంత చెరిపినా, ఏం చేసినా పొద్దున్న లేచి యువకులు మళ్లీ నినాదాలతో నగరాన్ని నింపేస్తున్నారు.
అలాగే, అంతర్జాతీయ సమాజం కూడా మియన్మార్‌లోని సైనిల పాలనపై స్పందించాలని కోరుకుంటున్నారు.
ఐక్యరాజ్య సమితి లేదా సౌత్-ఈస్ట్ ఆసియా ప్రాంతీయ సంస్థ 'ఆసియాన్'గానీ మియన్మార్‌లో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవట్లేదని వారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలు, పశ్చిమ దేశాల నుంచీ వస్తున్న ఆంక్షలు సరిపోవని భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం పట్ల అహంకారంతో ప్రవర్తించే సైనిక అధికారులకు ఈ చర్యలు సరిపోవని వారు అభిప్రాయపడుతున్నారు.
"ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడానికి ఇంకెంతమంది నేలకొరగాలి?" అని రాసిన ప్లకార్డ్స్ కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి.
అయితే, దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, వారు చేస్తున్న పోరాటమే దేశానికి ప్రజాస్వామ్యాన్ని తెచ్చి పెడుతుందని అనేకమంది భావిస్తున్నారు.
"మా తరంలో సైనిక నియంతృత్వం అంతమొందాల్సిందే" అని ఒక యువకుడు అన్నాడు. తన బంధువులకు సమాచారం వెళ్లడం కోసం తన బ్లడ్ గ్రూపు, కాంటాక్ట్ నంబర్ తన హెల్మెట్ మీద రాసి పెట్టుకున్నాడు.
ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నవతరానికి రక్తం విలువ తెలుసు. ఇదే మొదటిసారి ఉద్యమంలో పాల్గొంటున్నా ప్రాణాలు కోల్పోవడం ఎంత పెద్ద మూల్యమో వారికి బాగా తెలుసు.
మియన్మార్‌లో హింస, అరాచకాలు పూర్తిగా నశిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది. ఆ దేశంలో సైనిల పాలన పూర్తిగా అంతమొందడమనేది ఎప్పుడూ లేదు.
అయినప్పటికీ, మియన్మార్ యువత తమ పట్టుదలను, సంకల్పాన్ని వీడకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది.
"మా తరంలో సైనిక నియంతృత్వం అంతమొందాల్సిందే".. అంటూ పక్కనే మరో యువకుడు నినదిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
- ఆహారం వృథా: ఏటా 90 కోట్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారు... దీన్ని నివారించి పేదలను ఆదుకోలేమా?
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








