అంగారకుడిపై ల్యాండయిన ‘పెర్సీవరెన్స్‌’ రోవర్‌.. శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహం

వీడియో క్యాప్షన్, అంగారకుడిపై ల్యాండయిన ‘పెర్సీవరెన్స్‌’ రోవర్‌.. శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహం

అంగారక గ్రహం మీద మరో రోబో నడక కొనసాగుతోంది. అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా పంపిన పెర్సీవరెన్స్‌ రోవర్‌ అంగారకుడి మీద క్షేమంగా దిగడమే కాక, సైంటిస్టులు నిర్దేశించినట్లు జెజెరో అనే సరస్సు ప్రాంతంవైపు కదులుతోంది.

“గుడ్‌ న్యూస్‌, స్పేస్‌క్రాఫ్ట్‌ తాను చేరాల్సిన ప్రదేశానికి చక్కగా చేరింది’’ అని ఈ మిషన్‌ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్‌ మాట్‌ వాలేస్‌ ప్రకటించగానే, నాసాలోని ఇంజినీర్లు హర్షధ్వానాలు చేశారు.

ఈ గ్రహం మీద గతంలో జీవం ఉందా అని పరిశోధించేందుకు పెర్సీవరెన్స్‌ అనే ఆరు చక్రాల రోవర్‌ను నాసా అంగారకుడి మీదకు పంపింది. ఈ రోవర్‌ రెండేళ్లపాటు అక్కడే ఉండి, రాళ్లను, నేలను డ్రిల్‌ చేస్తూ జీవం ఆనవాళ్ల కోసం పరిశోధన కొనసాగిస్తుంది.

కోట్ల సంవత్సరాల కిందట మార్స్‌పై ఈ సరస్సు ఏర్పడిందని సైంటిస్టులు భావిస్తున్నారు. నీరు ఉంది కాబట్టి అక్కడ జీవం కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా.

రాత్రి 8.55 గం.ల ప్రాంతంలో పెర్సీవరెన్స్‌ అంగారక గ్రహం మీద అడుగు పెట్టినట్లు సిగ్నల్‌ అలర్టింగ్‌ కంట్రోలర్‌కు సమాచారం వచ్చింది. మామూలు పరిస్థితుల్లో సైంటింస్టులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అభినందనలు చెప్పుకునే వారు.

కానీ కరోనా కారణంగా శాస్త్రవేత్తలు దూరదూరంగా ఉండాల్సి వచ్చింది. మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని వారు ఆనందాతిరేకాలు వ్యక్తం చేశారు.