అలాస్కా: ఇక్కడ డబ్బులు చెట్లకు కాస్తాయ్

చెట్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాస్‌ కెన్నెత్‌ ఉర్కెన్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

అలాస్కాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం క్లాండైక్‌కు గేట్‌వేగా భావించే స్కాగ్‌వేలో స్పర్స్‌ చెట్ల చిగుర్లు ఆ ప్రాంతపు ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తాయి. స్థానికులు, వ్యాపారులు ఆ చిగుర్లను డబ్బులు, వస్తువుల కోసం వాడుతుంటారు.

క్లాండైక్‌ టూర్స్‌లో గైడ్‌గా పని చేస్తున్న జాన్‌ సాస్ఫాయి స్కాగ్‌వేకు వెళ్లిన ఏడాది తర్వాత స్కాగ్‌వే బ్రూయింగ్‌ కంపెనీ (ఒక రెస్టారెంట్‌ పేరు)కి వెళ్లారు.

ఈ ప్రాంతపు స్పెషల్‌ బ్రాండ్‌ అయిన స్పర్స్‌ టిప్‌ బ్లాండ్‌ ఏల్‌( ఒక బ్రాండ్‌ పేరు) బీర్‌ను ఆర్డర్‌ చేశారు. అయితే బిల్లు కట్టడానికి జేబు నుంచి డబ్బులకు బదులు ఒక సంచి నిండా స్పర్స్‌ చెట్టు చిగుళ్లను వెయిటర్‌కు అందించారు.

ఎందుకంటే క్లాండైక్‌ గోల్డ్‌రష్‌ నేషనల్‌ హిస్టారికల్‌ పార్క్‌ సమీపంలోని ఈ పట్టణంలో కరెన్సీకి బదులుగా స్పర్స్‌ చెట్ల చిగుళ్లను వాడతారు.

ఈ పట్టణంలో జనాభా వెయ్యికి మించి ఉండరు. పైగా ఎక్కడో మూలకు విసిరేసినట్లు ఉంటుంది ఈ పట్టణం. జెనీ పట్టణానికి 100మైళ్లు, యాంకరేజ్‌ టౌన్‌కు 800 మైళ్ల దూరంలో ఈ స్కాగ్‌వే టౌన్‌ ఉంటుంది.

గోల్డ్‌రష్‌ సందర్భంగా 19వ శతాబ్దంలో జనం ఇక్కడికి పోటెత్తి వచ్చారు. అయితే ఈ రోజుల్లో కూడా అక్కడ బంగారపు రవ్వలు దొరుకుతున్నాయి. కానీ అవి మైనింగ్‌ నుంచో, ఇసుక రాళ్ల నుంచో కాక, చెట్ల నుంచి లభిస్తున్నాయి.

స్కాగ్‌వే బ్రూయింగ్‌ కంపెనీకి రెస్టారెంట్‌కు స్పర్స్‌ చెట్ల నుంచి వచ్చే చిగుర్లే కరెన్సీ నోట్లు. తినడానికి, తాగడానికి డబ్బులకు బదులు స్పర్స్‌ చెట్ల చిగుర్లను మార్పిడి చేసుకోవడం ఇక్కడా చాలా మామూలు విషయం.

చెట్టు

ఫొటో సోర్స్, Getty Images

కరెన్సీగా స్పర్స్‌ చిగుళ్లు

ఒక శుక్రవారం ఉదయం 7 గంటలకు నేను స్కాగ్‌వే వెళ్లేందుకు లీ కాంటేలో షిప్‌ ఎక్కాను. అదే సమయంలో అక్కడ పని చేసే లోకల్‌ వర్కర్లు తమ మొదటి షిఫ్ట్‌కు హాజరయ్యేందు పెద్ద సంఖ్యలో షిప్‌ ఎక్కారు.

ఓ 20-30మంది వర్కర్లు షిప్‌లోని కెఫెటేరియాలో కూర్చుని పోకర్స్‌ ఆడుతున్నారు. మొదట కాసేపు చాక్లెట్లు, క్రీమ్‌బిస్కెట్‌లు పందెంగా పెట్టినా తర్వాత క్యాష్‌కు మారారు.

అయితే ఎవరికైనా అదనపు డబ్బు కావాల్సి వస్తే వారు నోట్లకు బదులు స్పర్స్‌ చిగుళ్లు మార్పిడి చేసుకునే అవకాశం ఉందని నేను వాళ్లకు గుర్తు చేశాను.

“స్పర్స్‌ చిగుళ్లను కరెన్సీలాగా ఇవ్వొచ్చని నేను కూడా విన్నాను’’ అని ఒరెగాన్‌ నుంచి టూర్‌ గైడ్‌గా వచ్చిన కెవిన్‌ కౌర్టెయిన్‌ అన్నారు. “గతానికి ఇప్పటికీ తేడాలేదు. అప్పట్లో బంగారం ఇచ్చి ఏ అవసరాన్నైనా తీర్చుకునే వారు’’ అన్నారాయన.

స్పర్స్‌ చెట్టు చిగుర్లలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. బ్రిటీష్‌వాళ్లు ఇక్కడకు రాకముందే ఇక్కడి ట్లింగిట్‌ అనే గిరిజన తెగ ప్రజలకు ఈ చిగుళ్లను టీలో వాడుకోవడం తెలుసు.

1770లలో ఈ ప్రాంతానికి వచ్చిన కెప్టెన్ జేమ్స్ కుక్‌ తన ఓడలో పని చేసేవారు స్కర్వి వ్యాధికి గురవ్వకుండా నిరోధించే ఔషధంగా ఈ చిగుళ్లతో చేసిన బీరును వాడినట్లు చరిత్ర చెబుతోంది.

చలికాలంలో ఏడాదిలో ఒకటి రెండు వారాలు మాత్రమే కనిపించే ఈ స్పర్స్‌ చెట్టు చిగుళ్లను వివిధ రూపాలలో తినే పదార్ధాల్లో వాడతారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణం ఆయింట్‌మెంట్లు,క్రీముల తయారీకి పనికొచ్చేలా చేసింది.

స్కాగ్‌వే నుంచి బయలుదేరే ముందు స్పర్స్‌ చిగుళ్లతో తయారు చేసిన బియర్డ్ ఆయిల్‌ (గడ్డానికి వాడే నూనె) కొనుక్కుని వెళ్లాను.

మార్కెట్

ఫొటో సోర్స్, Ross Kenneth Urken

ఫొటో క్యాప్షన్, స్పర్స్ చిగుళ్లలో సి విటమిన్‌, యాంటి బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉంటాయి

స్పర్స్‌ చెట్ల ప్రాముఖ్యత

అలాస్కాలో వాణిజ్య పంటలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. స్పర్స్ చిగుళ్ల నుంచి వచ్చిన ఆదాయమే వీరికి సంపాదన. ఎండాకాలంలో ఇక్కడికి సుమారు 10వేలమంది క్రూయిజ్‌ పాసింజర్లు వచ్చి వెళుతుంటారు.

అలా వచ్చినవారు స్పర్స్ చిగుళ్లతో చేసిన బీరు నుంచి ఐస్క్రీమ్‌ వరకు వివిధ పదార్ధాలను రుచి చూడకుండా వెళ్లలేరు.

“నాకు ఈ స్పర్స్‌ చిగుళ్లే కరెన్సీ’’ అన్నారు అక్కడ ఓ సెలూన్‌లో ప్రొప్రయిటర్‌ అయిన హాస్‌కాంప్‌. “అలా బయటకు వెళ్లి చెట్ల మీద ఉచితంగా దొరికే నాలుగు చిగుళ్లను తెంపుకుని, వాటిని శుద్ధి చేసిన ఆహార పదార్ధంగా మారుస్తున్నాను. అవే నాకు డబ్బు’’ అన్నారు హాస్‌కాంప్‌.

దూరంగా వెళ్లి, చిగుళ్లను వెతికి తెంపుకు రావడం కాస్త సమయం, శ్రమతో కూడుకున్నదే అయినా, ఆమె తెంపే ప్రతి చిగురూ ఒక కరెన్సీ నోటుతో సమానం. ఆర్గానిక్‌ పేరుతో స్కాగ్‌వే ప్రాంతంలోని అడవిలో దొరికే ఈ స్పర్స్‌ చిగుళ్లకు హాస్‌కాంప్‌ మరింత పాపులారిటీ తెచ్చి పెట్టారు.

“కొంతమంది నా దగ్గరకు వచ్చిన మా ఫ్రిజ్‌లో ఇంకా స్పర్స్‌ ఉంది. మీకు కావాలా అని అడుగుతుంటారు’’ అన్నారు హాస్‌కాంప్‌. “మీరు ఒకటి ఇచ్చి, ఏమీ తీసుకోకుండా వెళ్లడం అనేది ఇక్కడ ఉండదు’’ అన్నారామె.

హాస్‌కాంప్‌ నేచురల్ ఆయిల్ షాప్‌ పక్కనే గ్రేస్‌ విల్లీస్‌ అనే మహిళ అలాస్కా హెర్బల్‌ ప్రోడక్ట్స్‌ అమ్ముతున్నారు. పిల్లలకు దగ్గు, జలుబులాంటివి తగ్గడానికి ఉపయోగపడే కొన్ని ఔషధాలు స్పర్స్‌ చిగుళ్ల నుంచి తయారు చేస్తారామె.

“మనషులకు చెట్లకు మధ్య అనుబంధం దైవీకమైంది’’అంటారామె.“ బైట ఎవరికీ చెందని మొక్కల చిగుళ్లను మీరు సంపాదించగలిగారంటే, దాన్ని మీరు డబ్బులు కాసే చెట్టు అనుకోవడంలో తప్పులేదు’’ అన్నారు ఎమిలీ గ్రేస్‌.

దుకాణం

ఫొటో సోర్స్, Ross Kenneth Urken

ట్రెండ్‌గా మారిన వస్తు మార్పిడి

ఈ మధ్య కాలంలో స్పర్స్‌ చిగుళ్లతో వస్తు మార్పిడి ట్రెండ్‌ బాగా పెరిగిందని, ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూప్‌లు ప్రత్యేకంగా వీటి కోసం పని చేస్తున్నాయని, ఫేస్‌బుక్‌ ఒక పెద్ద మార్కెట్ ప్లేస్‌గా మారిందని మైండీ మిల్లర్‌ అనే స్థానికురాలు అన్నారు.

వస్తు మార్పిడి ఇక్కడి వివిధ తెగల మధ్య అనుబంధాన్ని ఏర్పరిచిందని స్థానిక చట్ట సభ సభ్యుడొకరు అన్నారు. “ఇక్కడికి వచ్చిన వలసదారులు కూడా స్థానికులతో మమేకం అయ్యారు. ఆ అనుబంధం నేటికీ కొనసాగుతోంది’’ అన్నారాయన.

నేను స్కాగ్‌వే బ్రూయింగ్‌ కంపెనీ కొత్త రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టేసరికి వచ్చే ఏడాది మేలో జరిగే బీర్‌ ఫెస్టివల్‌ కోసం రుచికరమైన బీర్‌ను తయారు చేసేందుకు బ్రూ మాస్టర్‌ ట్రెవర్‌ క్లిఫోర్డ్ ప్రయోగాలు చేస్తూ కనిపించారు.

మిన్నెసోటాలో ఎక్విప్‌మెంట్‌ మెయింటెన్స్‌ వర్కర్‌గా పని చేసే ట్రెవర్‌ క్లిఫోర్డ్‌ను స్కాగ్‌వే బ్రూయింగ్‌ కంపెనీ ఓనర్ మైక్‌ హేలీ 2007సంవత్సరంలో తన కంపెనీలో చేర్చుకున్నారు.

ఆ సంవత్సరం హేలీ, క్లిఫోర్డ్‌ బృందం తమ మొట్టమొదటి బ్రాండ్‌ ‘టిప్‌ బ్లాండ్‌ ఏల్‌’ బీర్‌ను తయారు చేసేందుకు అవసరమైన స్పర్స్‌ చిగుళ్ల కోసం అడవులబాట పట్టాల్సి వచ్చింది.

అప్పటి నుంచి స్కాగ్‌వే బ్రూయింగ్ కంపెనీ స్పర్స్‌ చిగుళ్లను కరెన్సీలాగా స్వీకరించడం మొదలు పెట్టింది. 2016నాటికి ఒక పౌండ్‌ స్పర్స్‌ చిగుళ్ల ఖరీదు 4 డాలర్లు లేదంటే అరలీటర్‌ బీరు విలువ చేసేది.

స్థానిక చట్టాల కారణంగా స్పర్స్‌ చిగుళ్లకు బదులుగా బీర్‌ను ఇవ్వడం మానేయాల్సి వచ్చింది. 2017 నుంచి ఒక పౌండ్‌ స్పర్స్ చిగుళ్లకు 5 డాలర్లు కరెన్సీనే ఇవ్వడం మొదలు పెట్టారు.

పెరుగుతున్న ఆదరణ

అయితే ఇలా సంపాదించిన డబ్బును చాలామంది బీర్‌ కొనుక్కోవడానికే ఉపయోగించుకుంటారన్నది వేరే విషయం. ‘టిప్‌ బ్లాండ్‌ ఏల్‌’ బీర్‌కు ఆదరణ పెరుగుతున్న కొద్దీ వీటికి స్పర్స్‌ చిగుళ్లకు డిమాండ్‌ కూడా పెరిగిందని క్లిఫోర్డ్‌ చెప్పారు.

స్పర్స్‌ను సేకరించడం కమ్యూనిటీ వ్యాపకంగా మారడం సీజనల్‌ వర్కర్స్‌కు మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. అయితే దీని మీద సంపాదించిన డబ్బు స్కాగ్‌వేకు చేరుకునేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులకే సరిపోతోంది.

“చిగుళ్లు రావడం మొదలుపెట్టి వారికి, చేతికి నాలుగు చెక్కులు వచ్చే సరికి ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంటి అద్దె, సరుకులు, క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులకే అవి సరిపోతాయి. కాబట్టి వారు చెట్ల నుంచి అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తుంటారు’’ అన్నారు క్లిఫోర్డ్‌ .

చెట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలాస్కాలోని స్కాగ్‌వే ప్రాంతంలో స్పర్స్‌ అనే చెట్ల చిగుర్లు అక్కడి ఆర్ధిక వ్యవస్థలో కీలకం

ఆర్ధిక వనరు

అడవిలో వెతికి తెచ్చిన ఈ చిగుళ్లను స్పర్స్‌ ట్రీ డివిడెండ్‌ అంటూ సరదాగా అభివర్ణిస్తారు క్లిఫోర్డ్‌. ఎందుకంటే ఈ చిగుళ్ల ద్వారా వచ్చిన ఆదాయంతో అలాస్కా శాశ్వత నిధి (అలాస్కా పర్మనెంట్ ఫండ్‌)ని ఏర్పాటు చేశారు.

ఈ ఫండ్‌లో ఎక్కువ భాగం స్పర్స్‌ నుంచి ఆయిల్ తీసే కంపెనీల దగ్గరే వసూలవుతుంది. ఇందులో 65 బిలియన్‌ డాలర్ల నిధి రిజర్వుగా ఉంటుంది.

ఈ నిధి నుంచి అక్కడ శాశ్వతంగా నివసించే వారికి ఏటా 2000 డాలర్లను డివిడెండ్‌గా చెల్లిస్తారు. స్థానికులు ఎక్కడికీ వెళ్లకుండా ఉండేందుకు ప్రోత్సాహకంగా ఈ డివిడెండ్‌ను చెల్లిస్తారు.

ఇక్కడి వాళ్లంతా స్థిరంగా ఉన్నప్పుడే సహజ వనరులకు రక్షణ ఉంటుంది. అంటే ఈ స్పర్స్‌ చిగుళ్ల నుంచి వచ్చిన లాభాలను ఇక్కడి వారంతా సమానంగా పంచుకుంటారన్నమాట.

ప్రతి సీజన్‌లో స్కాగ్‌వే బ్రూయింగ్‌ కంపెనీ ఉద్యోగులు, స్థానికులు కలిపి సుమారు 180 కేజీల స్పర్స్ చిగుళ్లను సేకరిస్తారు. ఇక్కడికి వచ్చిన వారెవరైనా ఈ పని చేయవచ్చు. అయితే దీన్ని వ్యక్తిగతంగా ఉపయోగించాలి. అది కూడా క్లాండైక్‌ గోల్డ్‌రష్‌ నేషనల్‌ హిస్టారికల్ పార్క్‌ ప్రాంతంలోనే సేకరించి అక్కడే అమ్ముకోవాలి.

ప్రకృతిని కాపాడాలి

నేను కూడా ఈ పని చేయడం ఎలా ఉంటుందో ప్రాక్టీస్‌ చేద్దామని ప్రయత్నించాను. ఒక టోపీ కొనుక్కోడానికి సరిపోయే స్పర్స్‌ చిగుళ్ల సేకరణ పని మొదలు పెట్టాను.

ఆ సమయంలో నేనెలా ఉన్నానంటే, చెట్ల వెంట తిరుగుతూ బంగారం కోసం వెతుకుతున్నవాడిలా కనిపించాను. ఒక్కోక్క చిగురు దొరుకుతున్న కొద్దీ బంగారం దొరుకుతున్నట్లు సంబరపడిపోయాను.

నేను అక్కడి నుంచి బయలుదేరుతూ ఫెర్రీ ఎక్కాను. అందులో నాకు 71 ఏళ్ల సై-డెనిస్‌ అనే పెద్దాయన తారసపడ్డారు. 35 సంవత్సరాలుగా ఆయన నేషనల్‌ పార్క్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

తన చిన్నతనంలో తాత, నాన్నమ్మతో కలిసి తాను స్పర్స్‌ చిగుళ్లను ఏరుకొచ్చేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. “స్కాగ్‌వే ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఈ చెట్లే నాకు అన్నం పెట్టాయి’’ అన్నారు డెనిస్‌.

స్పర్స్ ఏరుకు రావడానికి చాలా ఓపిక ఉంటాలంటారు డెనిస్‌. గంటల తరబడి అడవిలో తిరగాల్సి ఉంటుందని అన్నారు. సరిగా ఎదగని చిగుళ్లతో ప్రయోజనం ఉండదని, వీటి సేకరణకు ఒక వ్యూహం ఉండాలని అంటారు డెనిస్‌.

స్పర్స్‌ చిగుళ్లను మార్పిడి చేసుకునే ప్రక్రియను ఒక సంస్కృతిగా గుర్తించాల్సిన అవసరం ఉందంటారు డెనిస్‌. ఈ సంస్కృతి పది కాలాలపాటు కొనసాగడం కూడా ముఖ్యమంటారాయన.

“ప్రకృతిని, స్పర్స్‌ చిగుళ్లకున్న శక్తిని మనమంతా గుర్తించాల్సిందే’’ అన్నారాయన. “నువ్వు ఈ భూమిని నాశనం చేస్తున్నావంటే భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తున్నట్లే అని మా నాయనమ్మ, తాతయ్య చెప్పేవారు’’ అన్నారు డెన్నిస్‌.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)