జుల్ఫికర్ అలీ భుట్టో: ఏరికోరి ఎంచుకున్న ఆర్మీ ఛీఫ్‌ జనరల్ జియా ఉల్ హక్ అధ్యక్ష పదవి నుంచి దించి, ఉరికొయ్యకు వేలాడదీశారు

జుల్ఫికల్ అలీ భుట్టో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ అధ్యక్షుడు కాగానే, ఆ పదవిలో ఉన్న యాహ్యా ఖాన్‌ను గృహనిర్బంధం చేశారు. సైన్యానికి నేతృత్వం వహించాలని జనరల్ గుల్ హసన్‌కు చెప్పారు.

ఆయన తర్వాత లావైపోయారని, బొజ్జ బయటికొస్తోందని ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్సులో ఉన్న 44 మంది సీనియర్ అధికారులను కూడా తొలగించారు.

తూర్పు పాకిస్తాన్‌లో ఓటమి రుచిచూసిన తర్వాత పాకిస్తాన్ సైన్యం బాక్‌ ఫుట్‌లో పడిపోయింది. జుల్ఫికర్ అలీ భుట్టో దానిని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత ఆయనకు జనరల్ గుల్ హసన్ కూడా నచ్చకుండా పోయారు. ఆయనకు ఆ సమయంలో కళ్లు మూసుకుని తన ఆదేశాలు అమలు చేసే ఒక ఆర్మీ చీఫ్ అవసరమయ్యారు.

ఒవెన్ బెనెట్ జోన్స్ తన "ద భుట్టో డైనెస్టీ స్ట్రగుల్ ఫర్ పవర్ ఇన్ పాకిస్తాన్" అనే పుస్తకంలో ఆనాటి వివరాలన్నీ రాశారు.

"గుల్ హసన్‌ను తొలగించే ఆదేశాలను భుట్టో స్టెనోగ్రాఫర్‌తో కాకుండా తన సీనియర్ సహచరుడితో టైప్ చేయించారు. ఆ ఆదేశాలు జారీ అయిన తర్వాత, ఆయన తనకు నమ్మకస్తుడు గులామ్ ముస్తఫా ఖాన్‌ను జనరల్ గుల్ హసన్‌తో కలిసి లాహోర్ వెళ్లాలని చెప్పారు. ఆర్మీ చీఫ్‌గా వేరేవారిని నియమించేవరకూ గుల్‌ను ఎవరూ కలవకుండా జాగ్రత్తపడ్డారు" అని రాశారు.

గుల్‌ను తొలగించాలనే తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని అనుమానించిన అధికారులందరితో ఒక నకిలీ సమావేశం ఏర్పాటుచేశారు. గుల్ హసన్ తన రాజీనామా ఇచ్చేవరకూ ఆయన వారితోనే ఉన్నారు. రేడియో, టీవీ స్టేషన్‌లలో పోలీసులను మోహరించారు. ఆ నిర్ణయంలో అధ్యక్షుడు భుట్టోకు ప్రజల మద్దతు అవసరం రావచ్చని రావల్పిండిలో పీపుల్స్ పార్టీ ఒక బహిరంగసభ కూడా ఏర్పాటుచేసింది.

గుల్ హసన్ తర్వాత భుట్టో తన నమ్మకస్తుడైన జనరల్ టిక్కా ఖాన్‌ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా నియమించారు.

పాకిస్తాన్ సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

జలాలుద్దీన్ రహీమ్‌ను చితకబాదారు

అధ్యక్షుడు అయిన కొన్ని నెలలకే భుట్టోకు అహంకారం బాగా పెరిగింది. చివరకు ఆయన తన పార్టీలోని సీనియర్ సహచరులను కూడా అవమానించడం మొదలెట్టారు.

1974 జులై 2న అధ్యక్షుడి వ్యవహారాల మంత్రి జలాలుద్దీన్ అబ్దుల్ రహీమ్, మరికొంతమంది సీనియర్లను ఆయన భోజనానికి పిలిచారు. కానీ భోజనం సమయం దాటిపోతున్నా విందుకు ఆతిథ్యం ఇస్తున్న భుట్టో అక్కడకు రాలేదు.

రాత్రి 12 గంటలు అయ్యింది. రహీమ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి "మీరంతా ఎప్పటివరకూ ఉండాలనుకంటే, అప్పటివరకూ లర్కానా మహారాజు కోసం వేచిచూడండి. నేను నా ఇంటికెళ్తున్నా" అన్నారు. భుట్టో టేబుల్ దగ్గరకు చేరుకోగానే ఆ విషయం తెలిసింది.

దాంతో, అర్థరాత్రి రహీమ్ ఇంటికి వెళ్లిన ప్రధాని సెక్యూరిటీ చీఫ్ ఆయన్ను స్పృహతప్పేవరకూ కొట్టారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రహీమ్ కొడుకును కూడా చితకబాదారు.

టిక్కా ఖాన్ ఎంపికను పట్టించుకోలేదు

ఆర్మీ చీఫ్‌గా టిక్కా ఖాన్ పదవీకాలం ముగిసేసరికి ఆయన తన తర్వాత నియమించడానికి అర్హులైన ఏడుగురి పేర్లతో భుట్టో దగ్గరికి వెళ్లారు.

ఆ పేర్లలో ఆయన జనరల్ జియా ఉల్ హక్ పేరు పెట్టలేదు. ఎందుకంటే, ఆయనకు లెఫ్టినెంట్ జనరల్‌గా ప్రమోషన్ వచ్చి కొన్నిరోజులే అయ్యింది. కానీ జుల్ఫికర్ భుట్టో ఆయననే ఆర్మీ చీఫ్‌గా ఎంచుకున్నారు. దాంతో, భుట్టోకు చెంచాగిరీ చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ జియా వదులుకోలేదు.

ఒవెన్ బెనెట్ జోన్స్ ఆయన అలా ఏమేం చేశారో రాశారు. "అధ్యక్షుడు భుట్టో దేశానికి, సైన్యానికి అందిస్తున్న సేవలకు ఆయన చాలాసార్లు కత్తిని బహూకరించారు. ఒకసారి ఆయన భుట్టోను ఆర్మడ్ కోర్ అన్‌పెయిడ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా ప్రకటించడంతోపాటూ, ఆయన కోసం ఆర్మీ యూనిఫాం కూడా కుట్టించేశారు"

"జియా తను సైనిక తిరుగుబాటు చేస్తాడేమోననే ఆలోచన భుట్టోకు రాకుండా చేశాడు. భుట్టో ఆయన్ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన అప్పుడప్పుడూ జియా పళ్లను ఎగతాళి చేస్తుండేవార"ని భుట్టో జీవితచరిత్రను రాసిన స్టాన్లీ వోల్పర్ట్ చెప్పారు.

భుట్టోపై రాసిన పుస్తకం ముఖచిత్రం

ఫొటో సోర్స్, Book cover

ప్రజలపై కాల్పులు జరిపించారు

"భుట్టో, జియాల గురించి ఒక విషయం కూడా చెప్పుకునేవారు. ఒకసారి జియా సిగరెట్ తాగుతున్నారు. అప్పుడే భుట్టో ఆ గదిలోకి వచ్చారు. తను సిగరెట్ తాగుతానని ఆయనకు తెలుస్తుందని భయపడ్డ జియా ఆ సిగరెట్‌ను తన జేబులో వేసుకున్నారు. కాసేపటికే ఆయన యూనిఫాం కాలిపోయి, ఆ వాసన గదంతా నిండింది. తనంటే అంత భయపడే వ్యక్తి, తనకు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు ఎందుకు చేస్తాడులే అని భుట్టో ఆయన్ను పట్టించుకోలేదని అంటారు."

మరోవైపు భుట్టో పాలనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు మొదలయ్యాయి. వాటిని అణచివేసేందుకు భుట్టో అన్ని ప్రయత్నాలూ చేశారు. నిరసనకారులపై కాల్పులు జరిపించేందుకు కూడా సిద్ధమయ్యారు.

కానీ, లాహోర్‌లో ముగ్గురు బ్రిగేడియర్లు నిరసనకారులపై కాల్పులు జరపడానికి ఒప్పుకోలేదు. ఒక చోట సైనికులు జనాలను భయపెట్టడానికి వారి తలలపై నుంచి కాల్పులు జరపడానికి ఒప్పుకున్నారు.

జుల్ఫికర్ అలీ భుట్టో తన ప్రత్యర్థులతో జరిపే చర్చల్లో ఆర్మీ కోర్ కమాండర్లను కూడా పక్కన ఉంచుకుని చాలా పెద్ద తప్పు చేశారని ఒవెన్ బెనెట్ రాశారు.

"భుట్టో వైపు నుంచి చూస్తే సైన్యాన్ని ఆయన తనతోపాటూ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు ఉండేది. కానీ ఆర్మీ అధికారులు ఆయన్ను మరోలా చూశారు. భుట్టో బలహీనుడుగా, తాము లేకుంటే ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నట్లు వారికి కనిపించింది" అని చెప్పారు.

పాకిస్తాన్ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల్లో ప్రత్యర్థుల కిడ్నాప్

తనపై తీవ్ర వ్యతిరేకతలు ఉన్నప్పటికీ 1977 మార్చి 7న భుట్టో సాధారణ ఎన్నికలు జరిపించారు. ఆ ఎన్నికల ఫలితాలను పాకిస్తాన్ ప్రజలకు నమ్మలేకపోయారు.

జాతీయ అసెంబ్లీలో 200 స్థానాలకు భుట్టో పీపుల్స్ పార్టీకి 155 సీట్లు వచ్చాయి. అయితే ప్రతిపక్ష పీపుల్స్ నేషనల్ అలయన్స్ జోరుగా ప్రచారం చేసినా 36 సీట్లే వచ్చాయి.

కౌసర్ నియాజీ తన 'లాస్ట్ డేస్ ఆఫ్ ప్రీమియర్ భుట్టో' పుస్తకంలో ఎన్నికల తర్వాత పరిస్థితిని వర్ణించారు.

"భుట్టో లర్‌కానా నుంచి ఎలాగైనా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలనుకున్నారు. ఆయన సలహాదారు రఫీ రజాతో తనపై పోటీ చేసే పీఎన్ఏ అభ్యర్థులకు వేరే దగ్గర్నుంచి పోటీచేయించాలని, వారిని ఏకగ్రీవంగా గెలిపించాలని కూడా చెప్పారు. కానీ, రజా దానికి ఒప్పుకోలేదు".

"దాంతో, నామినేషన్లు కూడా వేయకుండా ఆ అభ్యర్థులు అందరినీ కిడ్నాప్ చేయించారు. ఈ కిడ్నాప్‌తో ఎన్నికల్లో గందరగోళం మొదలైంది. భుట్టో పర్యవేక్షణలో 18 మంది పీపుల్స్ పార్టీ అభ్యర్థులు తమకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడకుండా చూసుకున్నట్లు హఫీద్ పీర్జాదా చెప్పార"ని ఒవెన్ బనెట్ జోన్స్ రాశారు.

జనరల్ జియా

ఫొటో సోర్స్, Getty Images

జియా గురించి చివరి వరకూ తెలీలేదు

సైనిక తిరుగుబాటు జరగడానికి ముందు భుట్టో, జనరల్ టిక్కా ఖాన్ మధ్య ఒక సంభాషణ జరగడం భుట్టో సలహాదారుల్లో ఒకరైన రజా విన్నారని పాకిస్తాన్ జర్నలిస్ట్ ఖాలిద్ హసన్ తన 'రియర్‌వ్యూ మిర్రర్-ఫర్ మెమొయిర్స్'లో రాశారు.

ఆరోజు భుట్టో టిక్కా ఖాన్‌తో "జనరల్ మీకు గుర్తుందా, నేను జియాను ఆర్మీ చీఫ్ చేయడాన్ని మీరు వ్యతిరేకించారు. ఇప్పుడు నా నిర్ణయం సరైనదేనని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆర్మీ చీఫ్‌గా అతడి స్థానంలో వేరే ఎవరైనా ఉంటే, దేశంలో శాంతిభద్రతలు సరిగా లేవనే సాకుతో ఇప్పటికే అధికారం చేజిక్కించుకునేవారు అన్నారు. ఏడు గంటల తర్వాత జియా సరిగ్గా అదే చేశారు" అని చెప్పారు.

పాత లెక్కలు సరిచేసిన న్యాయమూర్తి

భుట్టోను అరెస్ట్ చేసిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కసూరీని హత్య చేయించారని ఆయనపై ఆరోపణలు మోపారు.

కసూరీని హత్య చేయాలని భుట్టో తనను ఆదేశించారని మహమూద్ మసూద్ జుల్ఫికర్ అలీ సాక్ష్యం ఇచ్చారు.

విక్టోరియా స్కోఫీడ్ తన 'భుట్టో-ట్రయల్ అండ్ ఎగ్జిక్యూషన్‌'లో ఆ విచారణ వివరాలు రాశారు.

"ఆ విచారణలో ఐదుగురు జడ్జిల ధర్మాసనానికి మౌల్వీ ముస్తాక్ హుస్సేన్ నేతృత్వం వహించారు. ఆయనకు భుట్టోతో పాత శత్రుత్వం ఉంది. భుట్టో తను అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు మౌల్వీ కంటే జూనియర్లను ఆయన కంటే పై స్థానాలకు ప్రమోట్ చేశార"ని చెప్పారు.

"విచారణ సమయంలో కోర్టులో ప్రత్యేకంగా చేయించిన బోనులో కూర్చోవాలని చెప్పడంతో భుట్టో చిరాకు పడ్డారు. దాంతో జడ్జి ముస్తాక్ హుస్సేన్ ఆయనతో వ్యంగ్యంగా 'మీరు సుఖజీవనానికి అలవాటు పడ్డారని మాకు తెలుసు. అందుకే బోనులో మీకోసం కుర్చీని వేయించాం. లేదంటే మీరు మిగతా నేరస్థుల్లాగే బెంచీపై కూర్చునేవారు అన్నార"ని రాశారు.

జనరల్ జియా

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచం మాట వినని జియా

భుట్టోకు హైకోర్టు మరణశిక్ష విధించింది. ఆయన దానిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ, 1979 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు బెంచ్ 4-3 తేడాతో హైకోర్టు తీర్పును సమర్థించింది.

"అప్పటివరకూ హత్య కేసులో మరణశిక్ష వేయడం, శిక్షపై సుప్రీంకోర్టు జడ్జిలు ఏకాభిప్రాయానికి రావడం ఎప్పుడూ జరగలేదు. నిందితుడు ఘటనాస్థలంలో లేనప్పటికీ ఆయన్ను ఆ కేసులో దోషిగా ఖరారు చేయడంపై ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తాయ"ని ఒవెన్ బెనెట్ జోన్స్ రాశారు.

భుట్టో ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశారు. కానీ, దానిపై వాదించలేమని న్యాయస్థానం తిరస్కరించింది.

రష్యా అధ్యక్షుడు బ్రెజ్నోవ్, చైనా నేత హువా గ్యోఫెంగ్, సౌదీ అరేబియా నేత షా ఖాలేద్, ఇలా ఎంతోమంది ప్రపంచ నేతలు భుట్టోకు క్షమాభిక్ష పెట్టాలని జియాను కోరారు.

బ్రిటన్ ప్రధాని జేమ్స్ కలఘన్ జనరల్ జియాకు మూడు లేఖలు రాశారు. వాటిలో ఒక లేఖ చివర్లో ఆయన "ఒక సైనికుడుగా మీకు ఒక పాత మాట గుర్తుండే ఉంటుంది. యుద్ధమైదానంలో గడ్డి త్వరగా మొలుస్తుంది. కానీ ఉరికొయ్యకు ఎప్పటికీ మొలవదు" అన్నారు.( పాకిస్తాన్- ద కేస్ ఆఫ్ మిస్టర్ భుట్టో, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ యూకే ఎఫ్‌సీఓ 37/2195)

కానీ, భుట్టోను ఉరి తీయాలని జియా నిర్ణయించుకున్నారు. చివరికి అది క్షమాభిక్ష పిటిషన్ వరకూ వెళ్లింది.

పాకిస్తాన్‌లో దోషి లేదా అతడి కుటుంబ సభ్యులు అధ్యక్షుడికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ, భుట్టోకు ఉరి వేయకుండా ఏం చేయలేదని అంటారని ఆయన కుటుంబ సభ్యులు భావించారు. భుట్టో చెల్లెళ్లలో ఒకరైన షహర్‌బానో ఇంతియాజ్ భుట్టో క్షమాభిక్షకు అపీల్ చేశారు.

1979 ఏప్రిల్ 1న సాయంత్రం జనరల్ జియా ఆమె క్షమాభిక్ష అపీల్ మీద ఎర్ర ఇంకు పెన్నుతో మూడు పదాలు రాశారు. "పిటిషన్ ఈజ్ రిజెక్టెడ్"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)