భీమా కోరెగావ్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ - BBC Newsreel

భీమాకోరేగావ్

ఫొటో సోర్స్, Getty Images

2018 నాటి భీమా కోరెగావ్ హింస కేసుకు సంబంధించి పుణెకు చెందిన మరో ముగ్గురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్, జ్యోతి జగ్తాప్ ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టైన వారితో కలిసి కుట్రలో భాగమయ్యారని ఎన్ఐఏ ఆరోపించింది.

యూఏపీఏ చట్టం ఐపీసీ 13,16,17, 18, 18(B), 20, 38, 39, 40 సెక్షన్ల కింద ముగ్గురినీ అరెస్ట్ చేశామని తెలిపింది.

అరెస్ట్ అయిన ముగ్గురూ 'కబీర్ కాలా మంచ్' అనే సాంస్కృతిక సంస్థలో సభ్యులు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు పుణె పోలీసులు వీరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. అయితే, అప్పుడు పుణె పోలీసులు వీరిని అరెస్ట్ చేయలేదు.

అరెస్ట్ చేసిన ముగ్గురినీ ముంబయిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు వీరిని సెప్టెంబర్ 11 వరకూ పోలీసు కస్టడీకి పంపించింది.

భీమా కరెగావ్ కేసులో ఇప్పటికే విరసం నేత వరవరరావు సహా పలువురు ఉద్యమకారులను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.

డేవిడ్ ఎటెన్‌బరో

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటిష్ నటుడు, చరిత్రకారుడు డేవిడ్ ఎటెన్‌బరోకు సోమవారం జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్.. ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. ఈ ఆన్‌లైన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు.

''ప్రకృతి సహజ సౌందర్యం గురించి తన సినిమాలు, పుస్తకాల ద్వారా తన డేవిడ్ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. నేడు పర్యావరణ పరిరక్షణ తప్పనిసరైంది. వాతావరణ మార్పులు జీవుల మనుగడకు పెనుముప్పుగా మారాయి. ఈ సమయంలో ఈ అవార్డును డేవిడ్ ఎటెన్‌బరోకు ఇవ్వాలని నిర్ణయించడం చాలా మంచి పరిణామం''అని సోనియా గాంధీ అన్నారు.

2019గాను ఈ అవార్డును ఎటెన్‌బరో అందుకున్నారు. జాతీయవాదం నుంచి అంతర్జాతీయ వాదం వైపు మనం అడుగులు వేయాలని ఆయన అన్నారు.

అంతర్జాతీయ శాంతి పరిరక్షణ, శాస్త్రీయ ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశేష కృషిచేసిన వారికి ఓ ట్రస్టు ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.

ద ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ డెవలప్‌మెంట్ పేరుతో ఈ అవార్డును 1986 నుంచి భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్మారకార్థం ఇస్తున్నారు. దీనిలో భాగంగా 25 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తున్నారు.

94ఏళ్ల డేవిడ్.. బీబీసీలోనూ పనిచేశారు. లైఫ్ సిరీస్‌ పేరుతో ప్రకృతిపై ఆయన రూపొందిచిన టీవీ సిరీస్ విశేష ప్రజాదరణ పొందింది. చరిత్రకారుడిగానూ ఆయనకు మంచి పేరుంది.

అలెక్సీ నావల్నీ

ఫొటో సోర్స్, Reuters

కోమా నుంచి బయటపడిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ విష ప్రయోగం అనంతరం కోమా నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

మాటలకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు. ఆగస్టులో విమానంలో ప్రయాణిస్తుండగా అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను వెంటనే రష్యాలోనే చికిత్స అందించారు.. అనంతరం జర్మనీకి తరలించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలతోనే నావల్నీ మీద విష ప్రయోగం జరిగిందని నావల్నీ సన్నిహితులు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో తన ప్రమేయం లేదని పుతిన్ చెబుతున్నారు.

పుతిన్‌ను తరచూ విమర్శించే ఆయనపై నొవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ (నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపే పదార్థం)తో విషప్రయోగం జరిగినట్లు జర్మనీ వైద్యులు తెలిపారు.

''ప్రస్తుతం ఆయన స్పందిస్తున్నారు. అయితే విష ప్రయోగ ప్రభావాలు మొత్తం తొలగిపోయాయని అప్పుడే చెప్పలేం''అని ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి తెలిపింది. నావల్నీ సతీమణితో వైద్యులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు పేర్కొంది.

''ఈ రోజు ఆయన కోమా నుంచి బయటకు వచ్చారు. నెమ్మదిగా వెంటలేటర్ నుంచి సాధారణం శ్వాస తీసుకొనే స్థితికి వస్తున్నారు''అని నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్ తెలిపారు.

పుతిన్‌కు వ్యతిరేకంగా అవినీతిపై ప్రచారం చేపట్టిన ప్రముఖుల్లో నావల్నీ కూడా ఒకరు.

జర్నలిస్టులు

దౌత్య వివాదాల నడుమ ఆస్ట్రేలియా జర్నలిస్టులను వెనక్కి పంపించిన చైనా

దౌత్య వివాదాల నడుమ రెండు ఆస్ట్రేలియా వార్తా సంస్థలను తమ దేశంలో చైనా మూసివేయించింది.

ద ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు చెందిన బిల్ బిర్టెల్స్, ద ఆస్ట్రేలియన్ ఫినాన్షియల్ రివ్యూకు చెందిన మైక్ స్మిత్‌లను మంగళవారం చైనా ప్రతినిధులు వెనక్కి పంపించారు.

వెనక్కి పంపే ముందు, వీరిద్దరిపై చైనా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే బిర్టెల్స్‌ను వార్తలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలూ అడగలేదని ఏబీసీ వార్తా సంస్థ తెలిపింది.

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

గత నెలలో చైనా ప్రభుత్వ మీడియా సంస్థ కోసం పనిచేస్తున్న ఆస్ట్రేలియా జర్నలిస్టు చెంగ్ లీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈయనతో సంబంధాలపై బిర్టెల్స్, స్మిత్‌లను ప్రశ్నించినట్లు ఏఎఫ్‌ఆర్ నివేదిక చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)