గంటకు నలుగురు చిన్నారులపై అత్యాచారం.. రోజుకి కనీసం ఆరుగురు పిల్లలకు అబార్షన్ జరుగుతున్న దేశం

పొట్టపై చేతులు పెట్టుకున్న గర్భవతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 10-14 ఏళ్ల బాలికలకు ప్రతి రోజూ కనీసం ఆరు అబార్షన్లు చేస్తున్నాయి బ్రెజిల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులు

అత్యాచారానికి గురైన పదేళ్ల పాపకు ఈ వారంలో అబార్షన్ జరగడంతో బ్రెజిల్‌లో ఈ విషయం వివాదాస్పదంగా మారింది. ఆ దేశంలో అబార్షన్ చేయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ డాక్టర్ మిలేనియా అమోరిం ఈ వయసు పిల్లలు గర్భం దాల్చి పిల్లల్ని కనడం కన్నా అబార్షన్ చేయించుకోవడమే మేలని అంటున్నారు.

30 యేళ్లుగా లైంగిక హింస బాధితులకు వైద్యసహకారాలు అందిస్తున్న డాక్టర్ అమోరిం బీబీసీతో మాట్లాడుతూ బ్రెజిల్‌లో ఇదేం కొత్తకాదని అన్నారు.

డాక్టర్ మిలేనియా అమోరిం ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఒక 13 ఏళ్ల అమ్మాయికి అబార్షన్ చెయ్యాలంటూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పక్షవాతంతో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయిన ఆ అమ్మాయి తన ఇంటి వెనకాలే అత్యాచారానికి గురయ్యింది. బట్టలు ఉతికే పని జీవనాధారమైన ఆమె తల్లి.. కూతురిని బయట ఎండ తగిలేలా కూర్చోబెట్టి ఇంటిలోపల పని చేసుకుంటూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. రేప్‌వల్ల ఆమె గర్భవతి అయ్యింది. అబార్షన్ పాపమంటూ ఆ ఆస్పత్రిలో డాక్టర్లెవ్వరూ ముందుకు రాలేదు. కానీ డాక్టర్ అమోరిం ఆ బాధ్యత నిర్వహించారు.

"అక్కడ డాక్టర్లందరూ అబార్షన్‌కు వ్యతిరేకం అన్నారు."

"అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. కానీ ఆ అమ్మాయికి అబార్షన్ చెయ్యాలని నిశ్చయించుకున్నాను. అది అమె హక్కు. చాలా చిన్నపిల్ల. ఆ వయసులో, ఆ స్థితిలో తల్లి అయితే ఆమె తన జీవితాన్ని కోల్పోతుంది" అని డాక్టర్ అమోరిం అన్నారు.

డాక్టర్ అమోరిం ముప్పై యేళ్లకుపైగా రేప్ బాధితులకు, చిన్నపిల్లలకు, టీనేజ్‌లో గర్భం దాల్చినవాళ్లకు వైద్యం సహాయం అందిస్తున్నారు.

డాక్టర్ అమోరిం ముప్పై యేళ్లకుపైగా రేప్ బాధితులకు, చిన్నపిల్లలకు, టీనేజ్‌లో గర్భం దాల్చినవాళ్లకు వైద్యం సహాయం అందిస్తున్నారు

ఫొటో సోర్స్, Reprodução

ఫొటో క్యాప్షన్, డాక్టర్ అమోరిం ముప్పై యేళ్లకుపైగా రేప్ బాధితులకు, చిన్నపిల్లలకు, టీనేజ్‌లో గర్భం దాల్చినవాళ్లకు వైద్యం సహాయం అందిస్తున్నారు

గంటకు నాలుగు రేప్ కేసులు

10 యేళ్ల పసిపిల్ల అత్యాచారానికి గురై, గర్భవతి అయిన వార్త బ్రెజిల్‌ను కుదిపివేసింది. ఆమెను తన మావయ్య పదే పదే రేప్ చేయడంతో అంత చిన్న వయసులో గర్భం దాల్చిన దుర్ఘటన ఎస్పిరిటో సాంటో రాష్ట్రంలోని సావో మాటెయుస్ నగరంలో జరిగింది.

ఈ వార్త జాతీయ స్థాయిలో చర్చలకు తెరలేపింది.

ఆ అమ్మాయికి అబార్షన్ చేయించుకోవడానికి చట్టపరమైన అనుమతి లభించినప్పటికీ 22 వారాల గడువు దాటిపోవడంతో అబార్షన్ చెయ్యలేమని రాజధాని విక్టోరియాలోని ఆస్పత్రిలో వైద్యులు నిరాకరించడంతో ఈ వార్త మరింత వివాదాస్పదమయ్యింది.

తనకు ఆరేళ్ల వయసు వచ్చినదగ్గరనుంచీ తనపై మావయ్య అత్యాచారం చేస్తున్నాడని తెలిసింది.

ఆగస్టు 8న ఆ పాపను వైద్యం కోసం పక్క రాష్ట్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. ఆమె పేరు, ఊరుకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఒక రైట్ వింగ్ కార్యకర్త ఆన్‌లైన్‌లో బయటపెట్టారు.

సంప్రదాయవాదులు, మతవాదులు ఈ అబార్షన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కొంతమంది ఆమెకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రిలోకి చొరబడి యాగీ చెయ్యడానికి ప్రయత్నించారు.

రేప్ బాధితులు గర్భం దాల్చినప్పుడు లేదా ప్రాణహాని ఉన్న కేసుల్లో మాత్రమే అబార్షన్‌కు బ్రెజిల్ చట్టాలు అనుమతిస్తాయి.

ఈ పదేళ్ల పాప విషయంలో అబార్షన్‌కు కోర్టు అనుమతిచ్చింది.

అయితే, ఇలాంటి సంఘటనలు అరుదు కాదని, తన వృత్తిగత జీవితంలోనూ, బయటా కూడా ఇలాంటివి అనేక కేసులు చూసానని డాక్టర్ అమోరిం అంటున్నారు.

బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థ ఎస్‌యూఎస్‌లో 10 నుంచీ 14 లోపు వయసువారిలో రోజుకు కనీసం ఆరు అబార్షన్లు నమోదవుతున్నాయి.

ఇదే రీతిలో లైంగిక హింస గణాంకాలు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. బ్రెజిలియన్ పబ్లిక్ సేఫ్టీ ఫోరం అనే ప్రభుత్వేతర సంస్థ గణాంకాల ప్రకారం బ్రెజిల్‌లో గంటకు కనీసం నలుగురు 13 యేళ్ల వయసు లోపలి చిన్నారులు అత్యాచారానికి గురవుతున్నారు.

బ్రెజిల్‌లో ఒక గర్భవతి

ఫొటో సోర్స్, Marcello Casal Jr./ABr

చిన్నవయసు ఆడపిల్లలకు ప్రమాదంగా మారుతున్న గర్భాలు

"వాళ్లు దుర్ఘటన తాలూకా నొప్పి, బాధ, భయంతో ఆస్పత్రికి వస్తారు."

"పదేళ్ల పిల్లను ఆ అవస్థలో చూడాలంటే కోపం, బాధ, అయోమయం, అసహ్యం, ఆశ్చర్యం అన్నీ కలుగుతాయి" అని డాక్టర్ అమోరిం అన్నారు.

ఆ వయసులో గర్భం దాల్చడం అత్యంత ప్రమాదకరం. 15 ఏళ్ల లోపు వయసులో గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చేవాళ్లు, 20 యేళ్ల వయసువారికంటే 5 రెట్లు ఎక్కువగా ప్రసవం సమయంలో చనిపోతారాని ఒక యునిసెఫ్ అధ్యయనం తెలిపింది.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం లాటిన్ అమెరికాలో చిన్నవయసులో గర్భం దాల్చిన పిల్లల మీద జరిపిన పరిశోధనలో 15 లేదా అంతకన్నా తక్కువ వయసులో బిడ్డలకు జన్మనిచ్చేవారికి తీవ్రమైన రక్తహీనత, ప్రసవానంతర రక్తస్రావం అధికంగా ఉంటాయని తేలింది.

పుట్టే బిడ్డలకూ ప్రమాదమే

చిన్న వయసు ఆడపిల్లలకు పుట్టే బిడ్డలు ఎక్కువకాలం బతికే అవకాశం తక్కువ.

10-15 వయసు పిల్లలు గర్భం దాల్చినప్పుడు ఎక్లంప్సియా, ప్రీ ఎక్లంప్సియాకు గురయ్యే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్ అమోరిం అన్నారు. అంటే రక్తపోటు స్థాయిలు పెరిగి కోమాలోకి వెళిపోయే అవకాశం ఉంటుంది.

"పుట్టే బిడ్డలు బరువు పెరిగే అవకాశాలు తక్కువ. ఈ వయసు అమ్మాయిల శరీర నిర్మాణం కారణంగా బిడ్దలు అకాలంలో పుట్టడం, పుట్టిన బిడ్డల ఎదుగుదల సరిగా ఉండకపోవడం జరుగుతుంది."

"13 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంటారు. శరీరం, లోపలి భాగాలు సంపూర్ణంగా ఎదగవు. శరీరంలోపల ప్రసవానికి తగ్గ ఏర్పాటు పూర్తిగా ఉండదు. ఈ వయసువారు బిడ్డలు కనడం అత్యంత ప్రమాదకరం" అని డాక్టర్ అమోరిం చెప్పారు.

గర్భవతి

ఫొటో సోర్స్, Getty Images

ఈ వయసులో బిడ్డకు జన్మనివ్వడం కన్నా అబార్షన్ చేయించుకోవడమే మేలు

చిన్నవయసులో అబార్షన్లకు కోర్టు అనుమతిస్తుంది కాబట్టి ఈ వయసులో బిడ్డలకు జన్మనివ్వడం కన్నా అబార్షన్ చేయించుకోవడమే మేలని డాక్టర్ అమోరిం అన్నారు.

డాక్టర్ అమోరిం క్యాంపినా గ్రాండే ఫెడరల్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా కూడా పనిచేస్తున్నారు.

"సాధారణంగానే ఏ వయసు ఆడవారికైనా బిడ్డకు జన్మనివ్వడం రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది చిన్న పిల్లలకు ఇంకా ప్రమాదం."

"కోర్టు అనుమతితో, వైద్యుల పరిరక్షణలో అబార్షను చేయించుకోవడమే ఉత్తమం."

"వైద్య సహాయం లేకుండా సురక్షితం కాని పద్ధతుల్లో గర్భస్రావానికి పాల్పడడం అన్నిటికన్నా ప్రమాదకరం" అని డాక్టర్ అమోరిం అన్నారు.

బాల్యవివాహాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో చిన్నవయసులోనే బిడ్డలకు జన్మనివ్వడం వల్ల యోని, మూత్రాశయం మధ్య గాయాలయ్యే కేసులు అధికంగా నమోదవుతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చిన్న వయసులో గర్భవతులయి, సీ సెక్షన్ సహాయం లేకుండా బిడ్డలను కంటే వారి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది అని డా. అమోరిం తెలిపారు.

మిలేనియా అమోరిం లైంగిక వేధింపులకు గురైనవారికి కూడా వైద్యసహకారాలు అందిస్తారు. ఒక గైనకాలజిస్ట్‌గా 6 ఏళ్ల వయసునుంచీ 92 యేళ్ల వయసువారి కేసులను ఆమె పరిశీలించారు.

"అత్యాచారం జరగని వయసంటూ లేదు. ఏ వయసువారైనా సరే రేప్‌కు గురవుతున్నారు."

"మరీ చిన్న వయసువారిపై అత్యాచారం జరిగితే వారు గర్భం దాల్చరు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆ వయసులో మొదలైన లైంగిక హింస వారు అండాలను ఉత్పత్తి చేసే వయసుకు వచ్చేవరకూ జరుగుతుంటుంది. అప్పుడు గర్భం దాలుస్తారు" అని డాక్టర్ అమోరిం అన్నారు.

చిన్నవయసువారికి లేదా రేప్ బాధితులకు అబార్షన్ చేసుకోవడానికి కోర్టు అనుమతిస్తుందని వారికి తెలీదు.

చిన్న వయసులో గర్భం దాల్చినవారందరూ అబార్షన్ కోసం రారు. చాలామంది ప్రసవానికి కొన్ని రోజుల ముందు ఆస్పత్రికి వస్తారు.

చాలామందికి చట్టప్రకారం అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలీదు.

డాక్టర్ అమోరిం 17 యేళ్ల వయసులో వైద్య విద్య అభ్యసిస్తున్నప్పుడు చూసిన ఒక సంఘటనను వివరించారు.

"13 యేళ్ల అమ్మాయి రహస్యంగా అబార్షన్ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు లీగల్‌గా అబార్షన్ చేయించుకోవచ్చన్న విషయం తెలీదు."

"10 యేళ్ల అమ్మాయిలు రహస్యంగా సురక్షితం కాని పద్ధతుల్లో అబార్షన్‌కు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న కేసులు ఎన్నో చూసాను."

"అదృష్టంగా వారిలో చాలామంది బతికి బయటపడ్దారు. కానీ సురక్షితం కాని పద్ధతుల్లో అబార్షన్ చేసుకోవడం ప్రాణాలకే ప్రమాదం" అని డాక్టర్ అమోరిం అన్నారు.

అబార్షన్‌ను చట్టబద్ధం చేయాలంటూ నిరసనల్లో పాల్గొన్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అబార్షన్‌ను చట్టబద్ధం చేయాలంటూ నిరసనల్లో పాల్గొన్న యువతి

ఇది భిన్నమైన కేసు

సావో మాటెయుస్‌లో వెలుగుచూసిన పదేళ్ల బాలిక అబార్షన్ కేసు తన కెరీర్లోనే భిన్నమైనదని డాక్టర్ అమోరిం అన్నారు.

ఇలాంటి అబార్షన్లు చట్టప్రకారమే జరుగుతాయి. బాధితురాలి పేరు వివరాలు గోప్యంగా ఉంచాలి. వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకూడదు.

"ఆ అమ్మాయి వ్యక్తిగత వివరాలన్నీ బయటకు రావడం అమానుషం. అవెలా బయటికొచ్చాయి? వాటిని బయటపెట్టిన వ్యక్తికి అవన్నీ ఎలా తెలిశాయి?" అని డాక్టర్ అమోరిం ప్రశ్తిస్తున్నారు.

పోర్చుగీసులో అబార్షన్‌‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న నన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోర్చుగీసులో అబార్షన్‌‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న నన్స్

బాధితురాలు కోలుకోవడం, నేరస్తుడికి శిక్ష పడడం

విక్టోరియా ఆస్పత్రిలో అబార్షన్ జరిపేందుకు చట్టపరమైన అనుమతి కోసం ఎదురుచూసారు. అది లభించేటప్పటికి 22 వారాల గడువు ముగిసింది. ఏ ఆస్పత్రిలోనైనా చట్టప్రకారమైన అనుమతి లేకుండా అబార్షన్లు చెయ్యలేరు అని డాక్టర్ అమోరిం వివరించారు.

అయితే, ఇది జరిగిన మూడు రోజుల తరువాత రెసిఫే పట్టణంలో ఒక ఆస్పత్రిలో ఆ అమ్మాయికి అబార్షన్ జరిగింది.

ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, కోలుకుంటోందని తెలిసింది.

ఆ పాపపై అత్యాచారం జరిపిన ఆమె మావయ్యను ఆగస్టు 18న అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి బాధితులందరికీ వైద్య సహాయంతో పాటు మానసిక నిపుణుల సహాయం కూడా అవసరమని డాక్టర్ అమోరిం అభిప్రాయపడ్డారు.

"రేప్ మిగిల్చిన గాయాలు మానసికమైనవి. అంత త్వరగా మానిపోవు. వాళ్లు అమ్మాయిలు, అమ్మలు కారు. వాళ్లకు సరైన సహాయం అందిస్తే జీవితంలో మళ్లీ నిలదొక్కుకోగలుగుతారు" అని డాక్టర్ అమోరిం అన్నారు.

ముప్పై యేళ్లకు పైగా ఇలాంటి కేసులను అనేకం చూసినప్పటికీ ప్రతీసారి అంతే కోపం, బాధ కలుగుతాయని డాక్టర్ అమోరిం అన్నారు.

సాయో మాటెయుస్ కేసులో అత్యాచారం కొన్నేళ్లుగా జరిగింది. ఆ పాప ఎంతో వేదన అనుభవించింది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత వివరాలన్ని బయటికొచ్చేసాయి. ఆ పాప అబార్షన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. ఆమె హక్కును కాలరాయడానికి ప్రయత్నించారు. ఇది చాలా దురదృష్టకరం అని డాక్టర్ అమోరిం అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)