‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్

ఫొటో సోర్స్, AFP
చైనా ప్రభుత్వం నుంచి అమెరికాకు అతిపెద్ద దీర్ఘకాలిక ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా ఏజెన్సీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ రే అన్నారు.
“చైనా ప్రభుత్వ గూఢచర్యం, డేటా చోరీ వల్ల అమెరికా భవిష్యత్తుకు ఎప్పుడూ లేనంత దీర్ఘకాలిక ముప్పు ఉంది” అని వాషింగ్టన్‌లోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో మాట్లాడిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ రే అన్నారు.
“చైనా చాలా స్థాయిల్లో ఆపరేషన్లు నిర్వహిస్తోంది. విదేశాల్లోని చైనా పౌరులను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దేశానికి తిరిగిరావాలని వారిని బలవంతం చేస్తోంది. కరోనావైరస్‌పై అమెరికా చేస్తున్న పరిశోధనలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది” అని చెప్పారు.
“చైనా ఎలాగైనా ప్రపంచంలోని ఏకైక సూపర్ పవర్ కావాలని ప్రయత్నిస్తోంది” అని క్రిస్టఫర్ రే అన్నారు.
చైనా నుంచి ఎదురయ్యే ఈ ప్రమాదాలపై రాబోవు వారాల్లో అమెరికా అటార్నీ జనరల్, విదేశాంగ మంత్రి దృష్టి పెడతారని కూడా ఎఫ్‌బీఐ డైరెక్టర్ చెప్పారు.
కరోనా మహమ్మారి, చైనా యాప్స్ గురించి అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో చేరిన దశలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ చేసిన ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి గురించి వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైరస్ ప్రపంచమంతా వ్యాపించేందుకు చైనానే కారణం అని ఆయన నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.
అంతేకాదు, చైనాలో తయారైన యాప్స్ నిషేధించడం గురించి కూడా అమెరికా ఆలోచిస్తోందని విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో కూడా ఈ మధ్య అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి 10 గంటలకు చైనాకు సంబంధించిన కేసు నమోదు
మంగళవారం దాదాపు గంటపాటు ప్రసంగించిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ రే, చైనా ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తోందో వివరంగా చెప్పారు.
చైనా ఆర్థిక గూఢచర్యం చేస్తోందని, డేటా, డబ్బు దొంగిలిస్తోందని, అక్రమ రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. లంచాలు, బ్లాక్‌మెయిల్ ద్వారా అమెరికా విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.
“ప్రస్తుతం మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, ఇక్కడ ఎఫ్‌బీఐ ప్రతి పది గంటలకూ చైనాకు సంబంధించి ఏదో ఒక నిఘా కేసు నమోదు చేస్తోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5వేల కేసులు నమోదైతే, వాటిలో దాదాపు సగం చైనాకు సంబంధించినవే” అన్నారు.
“చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒక కార్యక్రమం ప్రారంభించారు. దాని పేరు ‘ఫాక్స్ హంట్’. దీని కింద చైనా ప్రభుత్వానికి ప్రమాదంగా భావిస్తున్న విదేశాల్లోని చైనా పౌరులను వారు టార్గెట్ చేసుకుంటున్నారు” అన్నారు..
అలా టార్గెట్ అయినవారిలో చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనను బయటపెట్టాలని చూసే రాజకీయ ప్రత్యర్థులు, అసంతృప్తులు, విమర్శకులు కూడా ఉన్నారు అని రే చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
'తిరిగి రండి లేదా ఆత్మహత్య చేసుకోండి'
“చైనా ప్రభుత్వం వారిపై ఒత్తిడి తీసుకొస్తోంది, వారిని వెనక్కు పిలిపించాలని చూస్తోంది. దానికోసం వారు అనుసరిస్తున్న వ్యూహాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి” అని రే అన్నారు.
“ఒక కేసులో వాళ్లకు ఒక ఫాక్స్ హంట్ టార్గెట్ ఆచూకీ దొరకలేదు. దాంతో చైనా ప్రభుత్వం అమెరికాలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యుల దగ్గరికి తమ రాయబారిని పంపించారు. వారికి రెండు ప్రత్యామ్నాయాలే ఉన్నాయనే సందేశం అందించారు. అవి “వెంటనే చైనా తిరిగిరావడం, లేదా ఆత్మహత్య చేసుకోవడం” అన్నారు.
ఎప్పటిలా కాకుండా ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈసారి కాస్త భిన్నంగా ప్రసంగించారు.
అమెరికాలో ఉంటున్న చైనీయులను తిరిగి స్వదేశానికి రావాలని చైనా అధికారులు ఎవరైనా ఒత్తిడి తెస్తే, వారు వెంటనే ఎఫ్‌బీఐని సంప్రదించాలని ఆయన సూచించారు.
తమ అవినీతి వ్యతిరేక ప్రయత్నాల్లో ఇలాంటి చర్యలు భాగమని గతంలో చైనా ప్రభుత్వం చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామాబాద్ హిందూ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








