ఈ దేశ ప్రజలు ఎప్పుడూ నిజమే చెబుతారు, అబద్ధాలు చెప్పరు.. ఇంత నిజాయితీ ఎలా సాధ్యం?

ఫొటో సోర్స్, Shalamov/Getty Images
- రచయిత, సృష్టి చౌధరి
- హోదా, బీబీసీ ట్రావెల్
మంచు గజగజ వణికిస్తున్న డిసెంబరులో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో అడుగుపెట్టాను. రోడ్డుకు రెండు వైపులా అప్పుడే పడిన మంచు కనిపిస్తోంది. ఈ చలిని తట్టుకొనేందుకు గ్లవ్స్, స్కార్ఫ్‌తోపాటు టోపీ కూడా వేసుకున్నాను. కొత్త సిమ్ కార్డ్ కోసం రైల్వే స్టేషన్ వైపుగా వెళ్లాను. మంచి నంబరు కోసం చాలా షాప్‌లు కాళ్లు అరిగేలా తిరిగాను. అప్పుడే తెలిసింది మధ్యలో ఎక్కడో టోపీ మరచిపోయానని. మళ్లీ దాన్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాను. నా టోపీ ఎవరైనా చూసారా? అని చాలా షాపుల్లో అడిగాను. అయితే ఓ ఇంటర్నెట్ సెంటర్‌లోని క్రిస్మస్ చెట్టుపై అది వేళాడుతూ కనిపించింది. వెంటనే చిరునవ్వుతో దాన్ని తీసుకున్నాను.
ఫిన్లాండ్‌లో నా తొలి అనుభవాల్లో ఇదొకటి. ఇక్కడివారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరు నిజాయితీకి చాలా విలువిస్తారని, ఇక్కడ అన్నింటికీ నిజాయితీనే మూలమని నెమ్మదిగా అర్థంచేసుకున్నాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిన్లాండ్ వాసులు నిజాయితీకే కట్టుబడి ఉంటారని బోధపడింది.
"నిజాయితీగా ఉండటమనేది ఫిన్లాండ్ సంస్కృతిలో భాగం. మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఇది స్పష్టంగా అర్థమవుతుంది." అని హెల్సింకి యూనివర్సిటీలోని స్వీడిష్ స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ జోహన్నెస్ కననెన్ వ్యాఖ్యానించారు.
"నిజం చాలా విలువైనది. దాన్ని చాలా అరుదుగా వాడాలి అని ఇంగ్లిష్‌లో ఒక సామెత ఉంది. కానీ ఫిన్లాండ్‌లో ఎప్పుడూ నిజమే చెబుతారు."
నా టోపీ దొరకడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఫిన్లాండ్‌లో పోగొట్టుకున్న వస్తువులు మళ్లీ యజమానుల దగ్గరకి వచ్చేయడమనేది సర్వ సాధారణం.
"ఇక్కడి ప్రజల్లో ఇదొక మంచి సుగుణం. పిల్లలు మరచిపోయిన హ్యాండ్ గ్లవ్స్ మనకు ఎక్కడపడితే అక్కడ చెట్లపై కనిపిస్తుంటాయి" అని ఆల్టో యూనివర్సిటీ అధ్యాపకురాలు న్యాటలీ గాడెట్ వివరించారు. చెట్లపై కనిపించే తమ గ్లవ్స్‌ను పిల్లలు దూరం నుంచే గుర్తుపడుతుంటారు.
"పిల్లలు తరచుగా హ్యాండ్ గ్లవ్స్ మరిచిపోతుంటారు. ఇవి మళ్లీ పిల్లలకు చేరేలా చూసేందుకు వీటిని చెట్లపై వేళ్లాడదీస్తుంటారు. ఎవరివి వారే తీసుకుంటారని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం."
కొన్ని సంవత్సరాల క్రితం రీడర్స్ డైజెస్ట్ ఒక అధ్యయనం నిర్వహించింది. దీని పేరు 'లాస్ట్ వాలెట్ టెస్ట్'. దీనిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 192 నగరాల్లో తమ రిపోర్టర్లు తమ వాలెట్లను ఏదో ఒకచోట విడిచిపెట్టారు. ఒక్కోదానిలో 50 డాలర్ల నగదుతోపాటు తమ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, బిజినెస్ కార్డులు పెట్టారు. హెల్సింకిలోని 12 వాలెట్లలో 11 వాలెట్లు తిరిగి తమ రిపోర్టర్ల దగ్గరకు వచ్చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నిజాయితీ నగరమని సంస్థ కితాబిచ్చింది.

ఫొటో సోర్స్, Scanrail/Getty Images
ఇంత నిజాయితీ ఎలా సాధ్యం?
ఫిన్లాండ్ శతాబ్దాలపాటు స్వీడన్ ఆధీనంలో గడిపింది. ఇక్కడి ధనవంతులు స్వీడిష్.. మాట్లాడితే.. రైతులు, చర్చి సిబ్బంది ఫిన్నిష్ భాషలో మాట్లాడుకునేవారు. 1809లో ఫిన్నిష్ యుద్ధం అనంతరం రష్యాకు చెందిన అలెగ్జాండర్-1 ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించారు. దీంతో గ్రాండ్ డచీ ఆఫ్ ఫిన్లాండ్‌గా అవతరించింది. ఇదే ఇప్పుడు ఫిన్లాండ్‌గా మారింది. నేడు ఫిన్నిష్ భాష పరిఢవిల్లడంతోపాటు ఫిన్లాండ్ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపూ ఉంది.
"ఫిన్లాండ్ వాసులు కష్టపడి పనిచేస్తారని, నిక్కచ్చిగా ఉంటారని, కష్ట సమయాల్లో దేవుడిపై భారంవేసి తమ విధి తాము పూర్తి చేస్తారనే పేరుంది. ఈ లక్షణాలన్నీ నిజాయితీకి దగ్గర బంధువులే" అని భాషా నిపుణుడు ఉర్పు స్ట్రెల్‌మ్యాన్ వివరించారు.
ఇక్కడి విస్తారమైన గ్రామీణ ప్రాంతాలకు గజగజ వణికించే శీతాకాలాలు తోడవుతుంటాయి. దీంతో మంచి దేశంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలంటే మంచి లక్షణాలు తప్పనిసరని ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఫిన్లాండ్‌లో "సిసు" అనే ఒక పదం ఉంది. ధైర్యం, కఠిన పరిస్థితులకు ఎదురు నిలవడం, తీవ్రంగా శ్రమించడం లాంటి అంశాలే తమ దేశానికి, సంస్కృతికి గుర్తింపు తెచ్చిపెడతాయని దీని అర్థం.
స్వీడన్ నుంచి విడిపోయిన అనంతరం ఫిన్లాండ్ సొంతంగా ఎవాంజెలికల్ లూథెరెన్ చర్చ్‌ను ఏర్పాటుచేసింది. ప్రొటెస్టెంట్ విలువలను రూపొందించుకుంది. లూథెరనిజంపై క్లౌస్ హెల్కామా, అనేలీ పోర్ట్‌మ్యాన్ ఓ పుస్తకం రాశారు. నిజాయితీకి సంబంధించి ప్రొటెస్టెంట్ మూలాలను వారు అన్వేషించారు. అందరికీ విద్య, విరివిగా పుస్తకాల ప్రచురణ లాంటి ప్రొటెస్టెంట్ చర్యలతో ప్రజలకు నిజాయితీ అలవడిందని వారు విశ్లేషించారు. ఫిన్లాండ్‌లోని లూథెరెన్ చర్చ్.. ప్రపంచంలోని అతిపెద్ద చర్చ్‌లలో ఒకటి.
"నిక్కచ్చిగా ఉండటం, నిజాయితీ లాంటి విలువలను నేడు ఫిన్లాండ్‌లో చాలా గౌరవిస్తారు. ఇవి ఫిన్లాండ్ నరనరాన వేళ్లూనుకున్నాయి" అని కననెన్ వివరించారు.
2001లో ఎఫ్ఐఎస్ నోర్డిక్ స్కీ ఛాంపియన్‌షిప్‌కు అతిథ్యం వహించినపపుడు ఫిన్లాండ్‌లో వెలుగుచూసిన కుంభకోణాన్ని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. ఛాంపియన్‌షిప్‌లో ఆరు ఫిన్లాండ్ క్రీడాకారులు డోపింగ్ కేసుల్లో పట్టుబడ్డారు. ఇది దేశానికి సిగ్గుచేటని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. దేశం మొత్తానికి వీరు తలవంపులు తెచ్చారని పేర్కొంది.
"ఫిన్లాండ్ వాసులకు ఈ కుంభకోణంలో దురదృష్టకర అంశం కుంభకోణమే కాదు.." అని ద ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ స్పోర్ట్‌లో ఒక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. "ఈ వార్తలు తమ క్రీడల్లో నిజాయితీని శంకించేలా చేస్తాయని, తమ కష్టపడే తత్వాన్ని తక్కువగా అంచనా వేస్తాయని వారు భావించారు."
"వారు దీన్ని దేశ కీర్తి ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా చూశారు. నార్వేలో దీనికి విరుద్ధమైన పరిస్థితులు కనిపించాయి. నార్వేకు చెందిన మహిళా క్రీడాకారిణి డోపింగ్‌లో పట్టుబడినప్పుడు.. దేశం మొత్తం ఆమెకు అండగా నిలిచింది. శిక్షను వీలైనంత తగ్గించాలని డిమాండ్ చేసింది" అని కననెన్ వ్యాఖ్యనించారు.

ఫొటో సోర్స్, Sitikka/Getty Images
సమాజంలో ఒకరిపై మరొకరికున్న విశ్వాసంపై ఫిన్లాండ్ వాసులు గర్వ పడుతుంటారు. ఇది కూడా అందరూ నిజాయితీ ఉంటారని చెప్పడానికి ఒక సంకేతం.
"ఫిన్లాండ్‌లో ప్రభుత్వాన్ని మిత్రుడిగా చూస్తారు. శత్రువుగా కాదు" అని కననెన్ వివరించారు. "అందరి మంచి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఇక్కడి ప్రజలు భావిస్తారు. అధికారులు కూడా అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారు. తోటి పౌరులు, ప్రభుత్వాధికారులు, పోలీసులు.. ఇలా అందరిపైనా ఇక్కడి ప్రజలకు నమ్మకముంటుంది. ఇక్కడి వారు సంతోషంగా పన్నులు చెల్లిస్తారు. ఈ డబ్బు అందరి కోసం ఉపయోగిస్తారని, ఎవరూ తమను మోసం చేయరని వారు భావిస్తారు."
ఒకసారి అబద్ధం చెబుతూ పట్టుబడితే ఇక్కడి ప్రజలు ఇక వారిని నమ్మరని హెల్సింకిలో రోబోటిక్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గోకుల్ శ్రీనివాసన్ వివరించారు. ఫిన్లాండ్ ఇంగ్లండ్ కంటే పది రెట్లు పెద్దదైనా.. జనాభా విషయానికి వస్తే.. ఇంగ్లండ్లో పది శాతం మంది మాత్రమే ఇక్కడ ఉంటారు. 55 లక్షల మంది జనాభాలో ఎక్కువ మంది దక్షిణాన ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. జనాభా తక్కువగా ఉండటంతో ప్రజల మధ్య పరిచయాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.
"నిన్ను నమ్మకూడదని ఒకసారి ఫిన్లాండ్ వాసులు భావిస్తే.. అన్ని తలుపులూ మూసుకుపోయినట్లే" అని శ్రీనివాసన్ వివరించారు. "మన వెనక వారు మాట్లాడుకోరు. ఎవరైనా మన గురించి వారిని అడిగితే అప్పుడు మాత్రమే స్పందిస్తారు."
వరుసగా మూడోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ రికార్డు సాధించింది. అసలు ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలని నాకు ఇక్కడకు వచ్చినప్పుడు చాలా కుతూహలంగా ఉండేది. "సంతోషం అనేది నిజాయితీతో ముడిపడి ఉంది" అని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. నిజం చెబితే మానసిక, శారీరక ఆరోగ్యాలు మెరుగు పడతాయని, ఈ రెండింటి మధ్యా సంబంధముందని వెలుగులోకి వచ్చింది.
నిజాయితీని పక్కన పెడితే, దేశంలో ఎక్కువ అని చెప్పుకొనే సంతోషం బయట అంత సులువుగా కనిపించదు. నా కళ్ళకు మాత్రం ఇలా అనిపించింది. ఫిన్లాండ్ వాసులు సాయం చేస్తారు. కానీ అనవసర విషయాల్లో తలదూర్చరు. చాలా కలసిమెలిసి ఉంటారు. కానీ అతిగా జోక్యంచేసుకోరు. అన్ని విషయాల్లో వారికి స్పష్టత ఉంటుంది. అనవసర ఖర్చులూ చేయరు. అన్ని విషయాలనూ వారు సూటిగా చెప్పడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్ట్రెల్ మ్యాన్ ప్రకారం ఇవన్నీ నిజాయితీ, నిక్కచ్చిగా ఉండటానికి లక్షణాలు.
"మేం చాలా తక్కువగా మాట్లాడతాం. అనవసరంగా మాట్లాడేకంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని భావిస్తాం" అని ఆమె చెప్పారు. "ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలని మాకు చెబుతారు. అనవసర వాగ్దానాలు ఇవ్వొద్దని, అనవసర మెరుగులు దిద్దొద్దని చెబుతారు. వాక్ చాతుర్యంతో మాట్లాడే కంటే సూటిగా చెప్పడం మేలని ఫిన్లాండ్ వాసులు భావిస్తారు."
ప్రతి పదాన్ని ఫిన్లాండ్ వాసులు సీరియస్‌గా తీసుకుంటారు. విపరీతమైన మాటలు, వ్యాఖ్యలను ఫిన్లాండ్ వాసులు ఎలా చూస్తారో వివరిస్తూ ఎథనోగ్రాఫర్ డోనల్ కార్బా ఒక అధ్యయనం చేపట్టారు. వారు చెప్పినదే చేస్తారని, దానిపైనే సమయం కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Wmaster890/Getty Images
"ఫిన్లాండ్ వాసులు అన్నింటినీ ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు. నేను తిన్న బర్గర్లన్నింటిలో ఇదే మేలైనదని మీరు చెబితే... మీరు ఇప్పటివరకు తిన్న అన్ని బర్గర్ల వైపుగా సంభాషణ వెళ్లొచ్చు. దీని ప్రకారం ఏది మేలైనదో వారు గుర్తిస్తారు. మీరు మామూలుగా అన్నానని అంగీకరించేవరకూ ఈ విషయాన్ని వారు అనుమానాస్పదంగానే చూస్తారు" అని కననెన్ వివరించారు.
ఈ నిజాయితీకి మరో కోణం కూడా ఉంది. "ఒక సమయంలో ఒక నిజానికి మాత్రమే ఫిన్లాండ్ వాసులు విలువనిస్తారు. అది ఆర్థిక వ్యవస్థ కావొచ్చు. లేదా ఆరోగ్యం కావొచ్చు. లేదా సాంకేతికత కావొచ్చు. రంగం ఏదైనా కావొచ్చు.. నిజం మాత్రం ఒకటే ఉంటుంది. ఇది నిజమని పత్రికల్లో కనిపిస్తుంటుంది. భిన్నాభిప్రాయాలను వీరు పెద్దగా సహించరు. ఎందుకంటే నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుందని వీరు గట్టిగా నమ్ముతారు" అని ఆయన వివరించారు.
అన్ని వేళలా నిజాయితీతో వ్యవహరించడం మేలైన మార్గమని ఫిన్లాండ్ వాసులు చెబుతుంటారు. అయితే దీన్ని అలవాటు చేసుకోడానికి కొంచెం సమయం పడుతుంది.
గతవారం ఓ ఫిన్లాండ్ స్నేహితుడితో కలిసి దక్షిణ ఫిన్లాండ్‌లోని టుక్రు నగారానికి వెళ్లాం. మంచి బీర్ దొరికే రెస్టారెంట్ కోసం చాలా చోట్ల వెతికాం. ప్రతిసారి లోపలకు వెళ్లేటప్పుడు బయట ఉండే హ్యాంగర్లకు మా కోట్లు తగిలించేశాం. నేను లోపల కూర్చుని తాగేటప్పుడు అప్పుడప్పుడు వాటివైపు చూసేదాన్ని. ఎందుకంటే వాటికి రక్షణగా ఎవరూ లేరు. లాక్ కూడా వేయలేదు.
"అయితే ఏం ఫర్వాలేదు" అని నా స్నేహితుడు నాతో చెప్పాడు. "ఎవరూ దాన్ని తీసుకుపోరు" అని అతడు చెప్పడం బహుశా ఇది వందోసారి.
చివరగా దాన్ని అంగీకరించడం నేను కూడా మొదలుపెట్టాను.
ఇవి కూడా చదవండి
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- సంతోషంలో భారత్ కంటే బంగ్లా, పాకిస్తాన్‌లే మెరుగు. అసలేమిటీ హ్యాపీనెస్ ఇండెక్స్?
- హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- గల్వాన్ లోయలో భారత్-చైనా ఘర్షణపై ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవీ...
- యూరప్‌లో వందల సంఖ్యలో ఆడవాళ్లను చంపేస్తున్నారు.. ఎందుకు?
- చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా
- తన లైంగిక ఆనందం కోసం మహిళలను కరెంటు షాక్ పెట్టుకొనేలా చేసిన నకిలీ వైద్యుడు
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- నగదురహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న స్వీడన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








