వ్లాదిమిర్ పుతిన్: రష్యా అధ్యక్షుడిగా జీవితాంతం ఉండిపోతారా? ఈ వారం జరిగే రిఫరెండం ఉద్దేశం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇవా ఒంటివెరోస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
“పుతిన్ లేనిదే రష్యా లేదు.” ఇది క్రైమ్లిన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాప్ అభిప్రాయం. కేవలం వారిదే కాదు, దశాబ్దాలుగా వ్లాదిమిర్ పుతిన్‌నే మళ్లీ మళ్లీ ఎన్నుకుంటూ ప్రధానిగా లేదా అధ్యక్షునిగా ఆయనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నకోట్లాది మంది రష్యన్లది కూడా.
బహశా జూలై 1న జరిగే జాతీయ అభిప్రాయ సేకరణలో వాళ్లు మళ్లీ పుతిన్ మాటకే జై కొట్టవచ్చు. ప్రస్తుతం నాలుగోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన మరో రెండు విడతలు (ఒక్కో విడతలో ఆరేళ్లు) కూడా అధ్యక్షపదవి చేపట్టే విధంగా రాజ్యాంగాన్ని సవరించేందుకు దేశ వ్యాప్తంగా రిఫరెండంను నిర్వహిస్తున్నారు.
నిజానికి రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిని ఒకే వ్యక్తి వరుసగా రెండు సార్లుకు మించి చేపట్టకూడదు.
67 ఏళ్ల పుతిన్ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత కూడా ఆయనే ఆ పదవిలో కొనసాగే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరో పన్నెండేళ్లు అంటే 2036 వరకు ఆయనే రష్యా అధ్యక్షునిగా ఉంటారు.
ఈ నెల 24న జరిగే విక్టరీ డే వేడుకల మర్నాడు అంటే జూన్ 25 నుంచి ఈ రిఫరెండం ప్రారంభం అవుతుంది. నాజీ జర్మనీ లొంగుబాటు ఆపై యూరోప్‌లో రెండో ప్రపంచయుద్ధం ముగియడానికి గుర్తుగా ఏటా మే9న రష్యాలో విక్టరీ డే వేడుకలు జరుగుతాయి. అయితే ఈ సారి కరోనావైరస్ కారణంగా ఆ వేడుకలు జూన్ 24కి వాయిదా పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు?
ఈ ఏడాది జనవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజ్యాంగాన్ని సవరించేందుకు పాపులర్ ఓట్ నిర్వహించాలని ప్రతిపాదించారు.
రష్యా అధ్యక్షునిగా మరో రెండు విడతలు తానే ఉండేలా అవకాశం కల్పించాలని ప్రజల్ని కోరడమే ఈ ప్రజాభిప్రాయసేకరణ ప్రధాన ఉద్ధేశం.
నిజానికి ఏప్రిల్ 22న ఈ రిఫరెండం నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనావైరస్ కారణంగా అది జూలై 1కి వాయిదా పడింది.
ప్రస్తుతానికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో కరోనావైరస్ తీవ్రంగానే ఉంది. అయినా సరే భౌతిక దూరం నియమాలను ప్రజలు పాటించేలా చూస్తూ దేశ వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఈ ప్రజాభిప్రాయసేకరణను నిర్వహించనున్నారు.
ప్రస్తుతం నిర్ణీత సమయంలో ఎంత మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్లకి రావచ్చన్న విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే మాస్కోలో ఎలక్ట్రానింగ్ ఓటింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
పుతిన్ ప్లాన్ ఏంటి?
21వ శతాబ్దంలో రష్యాకు దేశాధ్యక్షుడంటే కేవలం వ్లాదిమిర్ పుతిన్ మాత్రమే. రష్యన్లు ఇప్పటికే ఆయన్ను ప్రధానిగా, 2000-2008 మధ్య కాలంలో అధ్యక్షునిగా, మళ్లీ 2008 నుంచి 2012 వరకు ప్రధానిగా ఆ తర్వాత 2012 నుంచి అధ్యక్షునిగా చూస్తూ వస్తున్నారు.
మరోసారి అధ్యక్షపదవిని చేపట్టాలని ఉన్నట్లు పుతిన్ ఎప్పుడూ చెప్పలేదు. అలాగని దాన్ని కొట్టిపారేయలేదు కూడా. దీంతో ఈ రిఫరెండం ద్వారా 2036 వరకు అంటే పుతిన్ తన జీవితకాలం రష్యాకు అధ్యక్షునిగా ఉండాలనుకుంటున్నారన్న విమర్శలకు తావిచ్చారు.
పుతిన్‌కు విశేష మద్దతు ప్రకటించే ఎంపీ, ఒకప్పటి వ్యోమగామి వాలెంటీనా టెరిష్కోవా అధ్యక్ష పీఠంపై పుతిన్ కొనసాగాలని కోరుతున్నారు.
ప్రజాభిప్రాయం కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 76శాతానికి పైగా జనం ఆయనకే ఓటేశారు.
ఈ సారి ఈ ప్రతిపాదన తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, కింది స్థాయి నుంచి డిమాండ్ రావడం వల్లే తాను ఈ రిఫరెండానికి ఒప్పుకున్నట్టు చెప్పడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నించారని బీబీసీ మాస్కో ప్రతినిధి సారా రియిన్స్‌ఫోర్డ్ అభిప్రాయపడ్డారు.
“నిజానికి చాలా మందికి ఈ ప్రతిపాదన వల్ల సమస్యేం లేదు. వాళ్లు పుతిన్‌ను నిజంగా ఇష్టబడకపోతే ఆయన్ను పెద్దగా పట్టించుకునేవారు కాదు కూడా. కానీ చాలా మంది ప్రజలు ఆయన్ను ఓ బలమైన నాయకునిగా చూస్తారు. పశ్చిమ దేశాలు ఎదురొడ్డే సత్తా ఆయనకే ఉందని భావిస్తారు. దీంతో ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్న వాదన కూడా ఉంది” అని రియన్స్‌ఫోర్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, Rex Features
‘పుతిన్’ ఆయనే సర్వస్వం ఎలా అయ్యారు?
కమ్యూనిజానికి, పాశ్చాత్య దేశాలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోతున్న దశలో వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ జీవితం మొదలయ్యింది.
ప్రస్తుతం తూర్పు జర్మనీలో ఉన్న డ్రెస్డెన్లో జాతీయ భద్రతా సంఘం (KGB) ఏజెంట్‌గా ఉన్న సమయంలో అంటే 1989లో తలెత్తిన విప్లవం ఆయపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఆయన డ్రెస్డెన్‌లోని కేజీబీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సమయంలో అంటే 1989లో ఆందోళనకారులు ఆ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో తాను ఏ విధంగా సాయం కోరిందీ పుతిన్ స్వయంగా వివరించారు. కానీ ఆ సమయంలోఅధికారంలో ఉన్న మిఛైల్ గోర్బఛేవ్ మౌనం వహించారని ఆయన అన్నారు.
నేరారోపిత నివేదికల్ని నాశనం చేయడంలో ఆయనే చొరవ తీసుకున్నారు. “ఓ కొలిమి పేలిన స్థాయిలో మేం చాలా వస్తువుల్ని తగులబెట్టేశాం” అంటు తర్వాత ఫస్ట్ పర్సన్ పేరుతో తాను ఇచ్చిన ఇంటర్వ్యూలలో పుతిన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారం దిశగా అడుగులు
తన సొంత పట్టణం లెనిన్ గ్రాడ్ (ఆ తర్వాత ఈ పట్టణాన్ని సెయింట్ పీటర్స్ బర్గ్‌గా మార్చారు) వచ్చిన తర్వాత పట్టణ మేయర్ అనటోలి సోబ్జక్‌కు రాత్రికి రాత్రే కుడి భుజంగా మారారు.
అయితే సోబ్జక్ రాజకీయ జీవితం పతనం అవుతున్నప్పటికీ పుతిన్ కెరియర్‌కి మాత్రం ఢోకా లేకుండా పోయింది. రష్యాలోని ఉన్నత వర్గాలతో ఆయన తనకున్న పరిచయాలను విజయవంతంగా కొనసాగించారు.
అక్కడ నుంచి ఆయన మాస్కో వచ్చారు. ఆపై జాతీయ భద్రతా సంఘం(KGB) వారసునిగా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(FSB)లో అడుగుపెట్టారు. అక్కడ కూడా తన విజయవంతమయ్యారు. అలా క్రెమ్లిన్‌లో తన పనిని ముగించారు.
ఆ సమయంలో రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షునిగా బోరిస్ యెల్ట్సెన్ ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఓల్డ్ కమ్యూనిస్టు పార్టీని పక్కన పెట్టడమే కాకుండా, సంధికాలంలో విశేష అధికారాన్ని, ఆస్తుల్ని సంపాదించిన ఒలిగర్చెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.
ప్రముఖ వ్యాపారవేత్త బోరిస్ బెరిజోవ్‌స్కై యెల్స్టెన్‌కు కీలక మద్దతుదారునిగా ఎదిగారు. అంతేకాదు రష్యాలో ఎన్నికలు వచ్చే నాటికి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల శక్తిమంతమైన వ్యక్తిగా మారారు.
1999లో రష్యా ప్రధానిగా వ్లాదిమిర్ పుతిన్‌ను రష్యా ప్రధానిగా నియమించారు అధ్యక్షుడు యెల్ట్సెన్.

ఫొటో సోర్స్, Getty Images
అనుకోకుండా అధ్యక్ష పదవి
యెల్ట్సెన్ వ్యవహారశైలి రోజు రోజుకీ అస్తవ్యస్తంగా మారుతూ వచ్చింది. చివరకు డిసెంబర్ 31, 1999న ఎవ్వరూ ఊహించని విధంగా పుతిన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
బెరిజోవ్‌స్కై, సహా కీలక ఒలిగర్చెస్ మద్దుతుతో పుతిన్ తాత్కాలిక అధ్యక్షునిగా తనను తాను విజయవంతంగా కొనసాగారు. ఆ పై 2000వ సంవత్సరం మార్చి నెలలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారికంగా అధ్యక్ష పదవిని చేపట్టారు.
యెల్ట్సెన్ రాజకీయ కుటుంబంలో భాగమైన ఒలిగర్చెస్, సంస్కరణ వాదులు, కొత్త అధ్యక్షుని పట్ల సంతోషంగా ఉన్నారు.
అయితే పుతిన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మీడియా మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకున్నారు. ఇండిపెండెంట్ టీవీ, ఎన్‌టీవీ రెండూ మూతపడ్డాయి. ఇతర మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ప్రతి వార్తను ప్రభుత్వం పరీక్షించడం మొదలుపెట్టింది. పుతిన్ పాలనా శైలి ఎలా ఉండనుందో ఇది చెప్పకనే చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
శక్తిమంతమైన నాయుకునిగా ఇమేజ్
మీడియాను పూర్తిగా తన అదుపు ఆజ్ఞల్లోకి తెచ్చుకోవడం వల్ల కొత్త అధ్యక్షునికి అనేక రకాలుగా లాభం కల్గింది. అంతే కాదు అధ్యక్షుని పేరు ప్రఖ్యాతలు పెరగడానికి కూడా కారణమయ్యింది. సరికొత్త రష్యాకు తాను ఒ శక్తిమంతమైన నాయుకునిగా ఇమేజ్ సంపాదించుకున్నారు.
అప్పటి నుంచి పుతిన్ తన ప్రజలు ఏది చూడాలని కోరుకుంటే రష్యన్లు అదే చూసేవారు. రష్యాలో సుమారు 3వేల టీవీ ఛానెళ్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు వార్తల్ని అందించడం నిలిపేశాయి. ఒక వేళ ఏవైనా రాజకీయ వార్తలు ఇవ్వాల్సి వచ్చినా వారిచ్చే ప్రతి వాక్యాన్ని ప్రభుత్వం అన్ని విధాలా పరిశీలించిన తర్వాతే ప్రసారం చేయాలి.
తనకు నమ్మకస్తులైన రాజకీయ నేతల్ని గవర్నర్లుగా నియమించుకొన్న పుతిన్ రష్యాలోని 83 ప్రాంతాలను క్రమంగా తన అధీనంలోకి తెచ్చుకున్నారు.
2004లో జరగాల్సిన స్థానిక ఎన్నికల్ని రద్దు చేసిన ఆయన వాటికి బదులుగా తదుపతి గవర్నర్‌ను ఎన్నుకునేందుకు స్థానిక శాసన సభ్యులు ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను రూపొందిస్తారు.
ప్రజాస్వామ్య విరుద్ధమంటూ విమర్శకులు గోల చేసినా ముఖ్యంగా చెచెన్యాలాంటి ప్రాంతాల్లో ఆయన వ్యూహం తగిన ఫలితాన్నిచ్చింది.
ప్రజాస్వామ్య అనుకూల వాదుల నిరసనల కారణంగా 2012లో ప్రాంతీయ ఎన్నికల మాట కొద్ది కాలం పాటు వినిపించినప్పటికీ, 2013లో పుతిన్ తీసుకొచ్చిన కొత్త నిర్బంధ చట్టం కారణంగా తిరిగి పరిస్థితి మొదటికొచ్చింది. ఉదారవాదం అన్నది పేరుకు మాత్రమే పరిమితమయ్యింది.
స్వచ్ఛమైన ఎన్నికలు, ప్రజాస్వామ్య సంస్కరణలను డిమాండ్ చేస్తూ 2011నుంచి 2013వరకు మాస్కోలోని బొలొట్నాయ స్క్వేర్ వద్ద సహా రష్యాలోని ఇతర ప్రాంతాల్లో వరుస పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. 90వ దశకం తర్వాత రష్యాలో జరిగిన భారీ నిరనసలు ఇవి.
ఈ ప్రజా ఉద్యమాలను పాశ్చాత్య దేశాలు రష్యా సరిహద్దుల్లోని ప్రాంతాల్ని ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చూశారు పుతిన్

ఫొటో సోర్స్, Getty Images
అప్పటి వరకు ఉన్న ఆయన శైలి ఒక్కసారిగా మారింది. కొంత కాలం పాటు పుతిన్ ఉదార వాద ప్రయోగం చేశారు. రాజకీయ వికేంద్రీకరణకు పిలుపునిచ్చిన ఆయన వారి ఆర్థికంగా అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్రాలకు హామీ ఇచ్చారు.
తన ప్రతి ప్రసంగంలోనూ సంస్కరణలనే పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చిన ఆయన దాన్ని కొద్ది కాలం మాత్రమే కొనసాగించారు. అప్పటి వరకు ఉన్న భయం పోగానే.. ఒక్కసారిగా ఆ వ్యూహాన్ని పక్కనపెట్టేశారు.
యుక్రెయిన్ విప్లవం తర్వాత ఏర్పడిన అధికార శూన్యత పుతిన్‌కు వ్యూహాత్మక అవకాశాన్ని ఇచ్చింది.
2014ఫిబ్రవరిలో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం ఆయన సాధించిన గొప్ప విజయం. అంతేకాదు పశ్చిమ దేశాలకు గట్టి దెబ్బ కూడా
రష్యా తన పక్క దేశంలోని భూభాగాన్ని విజయవంతంగా ఆక్రమించుకోవడం, ప్రపంచ దేశాలన్నీ చూస్తూ కూడా ఏమీ చేయలేకపోవడం ద్వారా రష్యా తన సత్తా ఏంటో చూపించగల్గింది.
విదేశీ వ్యవహారాల విషయంలో పశ్చిమ దేశాల మధ్య ఉన్న అనైక్యతను, బలహీనతల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు పుతిన్.
సిరియా విషయంలో జోక్యం చేసుకోవడం, అసద్ బలగాలకు మద్దతివ్వడం ఆయనకు అనేక విధాలుగా కలిసొచ్చింది.
ఓ వైపు మధ్య ప్రాశ్చంలో స్థిరత్వం పేరుతో మొత్తం భూభాగంపై ఏ ఆధిపత్యం చెలాయించలేరన్న విషయాన్ని ఇది నిర్ధరిస్తుంది. మరోవైపు కొత్త ఆయుధాలను, మిలటరీ వ్యూహాలను పరీక్షించేందుకు ఆయనకు ఓ అవకాశాన్ని ఇచ్చింది.
రష్యా తన పాత స్నేహితుల్ని విడిచి పెట్టదన్న ఓ బలమైన సందేశాన్ని ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న తన మిత్రులకు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యాకు ఆధునిక జార్ చక్రవర్తి?
పుతిన్ అధికారంలో ఉన్న సమయంలో రష్యా విస్తరణ విధానాన్ని సమర్థించే భూస్వామ్య భావన ‘కలెక్టర్ ఆఫ్ రష్యన్ లాండ్స్’ అన్న పాత ఆలోచన నుంచి బయటకు రావడంలో విజయం సాధించారు.
ఫలితంగా క్రైమియా, సహా సరిహద్దు దేశాలు తనకు ఎంత ముఖ్యమైనవో ఆయన గుర్తించగల్గారు.
అదే ఆయన్ను ఆధునిక జార్‌గా రూపుదిద్దుకునేందుకు మార్గం సుగమం చేయగలదని ఆర్కెడె ఓస్ట్రోవ్‌స్కై వంటి రష్యన్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల్లో పుతిన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం రష్యాలో పుతిన్ స్థాయి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అయితే అధ్యక్షునిగా నాల్గో విడత కూడా పూర్తయిన తర్వాత అంటే 2024నాటికి ఏం జరగనుంది?
నిజానికి భవిష్యత్తును ఎవ్వరూ ముందుగా ఊహించలేరు. కానీ వ్లాదిమిర్ పుతిన్ మాత్రం అందుకు తగ్గట్టు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేయగలరు.
ఇవి కూడా చదవండి:
- రెండు దేశాలు తప్ప ఏ దేశ జాతీయ జెండాలోనూ కనిపించని రంగు ఏంటి? అది ఎందుకు కనిపించదు?
- మైక్రోసాఫ్ట్: ‘రష్యా పొలిటికల్ హ్యాక్’ను విజయవంతంగా అడ్డుకున్నాం
- అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం: ఫేస్‌బుక్ నుంచి పేపాల్ వరకు అన్నిటినీ వాడేసిన రష్యా
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందంటే..
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- ట్రంప్ - రష్యా: మొత్తం సీరియల్ 250 పదాల్లో
- రష్యా విప్లవ చరిత్రను కళ్లకు గట్టే పోస్టర్లు
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








