భారత్, చైనా: ఆసియాలోని రెండు అతిపెద్ద వ్యవస్థలు పోట్లాడుకుంటే ఏం జరుగుతుంది?

షీ జింగ్ పిన్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images/REUTERS

ఫొటో క్యాప్షన్, ‘రెండు దేశాల మధ్య ఒత్తిళ్లు మరింత పెరగాలన్నా లేదా తగ్గాలన్నా అది చైనా పట్ల భారత్ వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది’
    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ చైనా, ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సైనికపరంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ తెగదెంపులు చేసుకోవాలని కొందరు భారతీయ విశ్లేషకులు పిలుపునిస్తున్నారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలంటూ కొందరు జనాలు రోడ్ల మీదకు వచ్చి టీవీలు పగులగొడుతున్నారు.

పాకిస్తాన్‌ను చైనా దాటేసి భారత్‌కు ‘నెం.1 శత్రు దేశం’ స్థానంలో వచ్చి చేరిందా అన్నట్లు ఉంది పరిస్థితి.

గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ... భారత్, చైనా సంబంధాల్లో పెద్ద మలుపు కావొచ్చని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, చైనాలో భారత రాయబారిగా పనిచేసిన నిరుపమ రావ్ ట్వీట్ చేశారు.

గల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికుల మరణించడంతో, చైనాకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలన్న ఒత్తిడి భారత్‌పై ఉంది.

ప్రభుత్వ, ప్రభుత్వేతర స్థాయిల్లో తీసుకుంటున్న చర్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరుగుతోంది.

300 వస్తువులపై సుంకాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా రూపొందించిందని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం రాసింది. అయితే, చైనా పేరును ఇందులో ప్రస్తావించలేదు. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నట్లు దీన్ని చూడాల్సి ఉంటుంది.

500కుపైగా చైనా వస్తువులను బహిష్కరించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఓ జాబితా ప్రకటించింది. 2021 డిసెంబర్ వరకు చైనా దిగుమతులను రూ. లక్ష కోట్ల మేర తగ్గించుకునే ఉద్దేశంతో ఉన్నామని తెలిపింది.

చైనా ఉత్పత్తుల బహిష్కరణ వదంతుల నేపథ్యంలో చైనాకు చెందిన ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత్‌లో 5జీ స్మార్ ఫోన్ లాంచింగ్‌ను రద్దు చేసుకుంది.

భారత్, చైనా సంయుక్త ఆర్థిక శక్తి 270 కోట్ల జనాభా ఆకలి తీర్చడానికి, సంతోషంగా ఉంచడానికే కాదు, అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు, వాణిజ్యాభివృద్ధికి కూడా అవసరమే.
ఫొటో క్యాప్షన్, భారత్, చైనా సంయుక్త ఆర్థిక శక్తి 270 కోట్ల జనాభా ఆకలి తీర్చడానికి, సంతోషంగా ఉంచడానికే కాదు, అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు, వాణిజ్యాభివృద్ధికి కూడా అవసరమే

బంధాలు తెగితే రెండు దేశాలకూ నష్టమే

‘‘చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో తీసుకునే చర్యల వల్ల భారత్‌లోని ఫార్మా, మొబైల్ ఫోన్లు, సౌర విద్యుత్ తదితర రంగాల్లో ఆందోళన తలెత్తవచ్చని ముంబయికి చెందిన ఆర్థిక వ్యవహారల నిపుణుడు రఘువీర్ ముఖర్జీ అన్నారు.

శుత్రుత్వం, ఘర్షణ వల్ల భారత్, చైనాలు రెండింటికీ లాభాల కన్నా, నష్టాలే ఎక్కువగా జరుగుతాయని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత సమస్య తీవ్రమైనేదనని... కానీ, పరిష్కరించడం కష్టం కాదని చైనాలోని సిచువాన్ వర్సిటీలోని చైనా సెంటర్ ఫర్ సౌత్ ఏసియన్ స్టడీస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ హ్వాంగ్ యుగ్సాంగ్ అన్నారు.

‘‘పరిస్థితులు దిగజారకుండా రెండు దేశాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిపివేయాలనడం బాధ్యతరాహిత్యమే. సరిహద్దుల్లో జరిగిన ఆ ఘర్షణ ఎవరూ ఊహించనిది. దీని వల్ల రెండు దేశాల ఆర్థికవ్యవస్థలను నష్టపోనివ్వకూడదు. లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుంది. ఈ గండం నుంచి గట్టెక్కడానికి అవసరమైన తెలివితేటలు, సంకల్పం భారత్, చైనాలకు ఉన్నాయి’’ అని చెప్పారు.

శుత్రుత్వం, ఘర్షణ వల్ల భారత్, చైనాలు రెండింటికీ లాభాల కన్నా, నష్టాలే ఎక్కువగా జరుగుతాయని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, శుత్రుత్వం, ఘర్షణ వల్ల భారత్, చైనాలు రెండింటికీ లాభాల కన్నా, నష్టాలే ఎక్కువగా జరుగుతాయని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

మూడో పక్షానికి లాభం

చైనాపై ప్రస్తుతం భారత మీడియా, పౌరుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా... అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల కన్నా, చైనానే భారత్‌కు బలమైన మిత్ర దేశమని స్విట్జర్లాండ్‌లో ఉన్న జెనీవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోపొలిటికల్ స్టడీస్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అలెగ్జాండర్ ల్యాంబర్ట్ అభిప్రాయపడ్డారు.

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నుంచి ఇతర దేశాలు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నం చేయొచ్చని అన్నారు.

‘‘భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బ తింటే... వేరే దేశాలు లాభపడవచ్చు. భౌగోళిక పరిస్థితులపరంగా చైనాకు భారత్ దూరవవడం అమెరికాకు, దాని మిత్ర దేశాలకు సంతోషం కలిగించవచ్చు. ఆర్థికపరంగా ఆసియాన్ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల తయారీదారుల ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌లోకి రావొచ్చు. కానీ, వాటి సామర్థ్యం తక్కువ, ధర ఎక్కువ ఉండొచ్చు’’ అని అన్నారు.

‘‘చైనా ‘శాంతియుతంగా ముందుకు సాగుతున్న’ శక్తి. ఆ దేశం క్రియాశీలంగా రాజకీయ, ఆర్థిక సహకారం అందిస్తోంది. దాన్ని నిరాకరించడం భారత్‌లోని భావి తరాలను శిక్షించడమే’’ అని అన్నారు.

భారత్ చైనా జాతీయ పతాకాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్, చైనా సంయుక్త శక్తి

ఆసియాలో భారత్, చైనా రెండు దిగ్గజాలు. ఈ రెండింటి సంయుక్త ఆర్థిక శక్తి 270 కోట్ల జనాభా (మొత్తం జనాభాలో 37 శాతం) ఆకలి తీర్చడానికి, సంతోషంగా ఉంచడానికే కాదు... అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకు, వాణిజ్యాభివృద్ధికి కూడా అవసరమే.

చైనా, భారత్... పరస్పరం ఒక దేశ ఎగుమతిదారులకు ఇంకో దేశం పెద్ద మార్కెట్. ఇవి రెండూ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలను ఆకర్షించే రెండు అతిపెద్ద మార్కెట్‌లు కూడా.

ప్రపంచపు తయారీ కేంద్రంగా ఉన్న చైనా స్థితికి ప్రమాదం ఏర్పడితే... అమెరికా, ఇతర ఆర్థికవ్యవస్థలు కూడా కంపించిపోతాయి.

చైనాలా శాసించే స్థితిలో భారత్ లేదు. కానీ, ఒకవేళ ఇక్కడి ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగం ఒక్కసారిగా విఫలమైతే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల వ్యవస్థలు స్తంభించిపోతాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) 2019 గణాంకాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 90 ట్రిలియన్ డాలర్లు. ఇందులో చైనా భాగస్వామ్యం 15 శాతం కాగా, భారత్ భాగస్వామ్యం 7.5 శాతం. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 22 నుంచి 23 శాతం భాగస్వామ్యం ఉన్న భూభాగంపై 37 శాతం జనాభాను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.

ఆసియాలోని రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన చైనా, భారత్‌ల వల్ల ప్రపంచ వాణిజ్య అభివృద్ధికి తోడ్పాటు అందుతోంది. ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులకు, సంస్థలకు బిలియన్ల డాలర్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ రెండు దేశాలు ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు తక్కువ వడ్డీపై రుణాలు ఇస్తున్నాయి.

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, టెలికాం సాధ‌నాలు, కంప్యూట‌ర్ విడిభాగాలు, ఫార్మా ఉత్ప‌త్తులు, ప్లాస్టిక్ బొమ్మ‌లు.. భార‌త్‌కు చైనా నుంచి ఎక్కువగా దిగుమ‌తి అవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

30-35 ఏళ్లుగా భారత్, చైనా ఆర్థికవ్యవస్థల ప్రదర్శన బాగుంది. చాలా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చాయి. కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగాయి.

చైనా, భారత్‌ల్లో వివిధ స్థాయిల్లో మౌలిక వసతులు బాగా అభివృద్ధి చెందాయి. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారాయి. తయారీరంగ సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. డిజిటల్, ఇ-కామర్స్ రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. మొబైల్, ఇంటర్నెట్‌లతో గ్రామీణ ప్రాంతాల్లోనూ జీవితాలు మారిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.

అయితే పేదిరకం, సమాజంలో అసమానతలు మాత్రం ఇంకా ఈ దేశాల్లో పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి.

భారత్, చైనాల్లో ఆర్థిక వృద్ధి ప్రశంసనీయమని, కానీ అందులో అసమానతలు కూడా ఉన్నాయని ప్రముఖ ఆర్థికవేత్త డేవిడ్ మార్గెంథలర్ ఇటీవల ఓ లేఖలో అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగాల్లో మిగతా దేశాలతో పోల్చితే చాలా వేగంగా అభివృద్ధి జరిగిందని, కొన్ని రంగాల్లో మాత్రం ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని అన్నారు.

ప్రపంచంలోని పేదల్లో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారత్‌లో ఉన్నారు. దేశంలోని 39 శాతం గ్రామీణులకు పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో లేవని, దేశంలో దాదాపు సగం జనాభా ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఐరాస అంటోంది.

కరోనావైరస్ సంక్షోభ సమయంలో చైనాతో పోల్చితే భారత్‌లో ఆర్థిక అసమానతలు అధికంగా బయటపడ్డాయి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో లోపాలున్నాయి. ఈ సంక్షోభంతో రెండు దేశాల్లోనూ కోట్ల మంది మళ్లీ పేదరికంలోకి వెళ్లారు.

అయినా, రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ధోరణులు మార్చగలిగే శక్తి భారత్, చైనాలకు ఉంది.

‘‘భారత్, చైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలే. అంటే రెండు దేశాల్లో అభివృద్ధికి ఇంకా చాలా అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనాతో పోల్చితే భారత్ భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచుకునే సామర్థ్యం భారత్‌కు ఇంకా ఉంది’’ అని పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌కు చెందిన నికోలస్ లార్డీ ఓ లేఖలో రాశారు.

కంటైనర్లు

ఫొటో సోర్స్, Getty Images

ద్వైపాక్షిక వాణిజ్యంలో వేగంగా వృద్ధి

2001లో భారత్, చైనా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3.6 కోట్ల బిలియన్ డాలర్లు. కానీ, 2019లో దాని విలువ ఏకంగా 90 కోట్ల బిలియన్ డాలర్లకు పెరిగింది.

భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే, ఇది ఏకపక్షమైన బంధం కాదు.

ప్రస్తుతం సాధారణ ఔషధాలకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారు. ఇందులో చైనా భాగస్వామ్యం ఉంది. ఈ ఔషధాలకు ముడి సరకు చైనా నుంచి వస్తుంది. రెండు దేశాలు ఒక దేశంలో ఒకటి పెట్టుబడులు కూడా పెట్టాయి.

1962 యుద్ధం, వాస్తవాధీన రేఖ వద్ద ఏళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూ వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న ఈ ఆరేళ్లలో రెండు దేశాలూ మరింత దగ్గరయ్యాయి. మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య స్నేహం చిగురించడం కూడా చూశాం.

ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఎగుమతులే మూడింట రెండొంతలు ఉంటున్నాయన్నది భారత్‌కున్న ఫిర్యాదు.

కానీ, దీన్ని నష్టంగా చూడాల్సిన అవసరం లేదని ఆర్థికవేత్త వివేక్ కాల్ అంటున్నారు.

‘‘చైనా వస్తువుల ధర, నాణ్యత సరైనవి అనిపించే మనం వాటిని కొంటున్నాం. అమెరికాతో మనకు ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటు ఎక్కువ. కానీ, ఆ దేశం దీనిపై ఫిర్యాదు చేయడం మనం ఎప్పుడూ చూడం’’ అని ఆయన అన్నారు.

కానీ, భారత్‌లో కొందరు ఆర్థికవేత్తలు చైనాతో ఉన్న ద్రవ్య లోటును పూడ్చుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. వస్తువులు భారత్‌లోనే తయారయ్యేలా చూడాలని అంటున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

కరోనావైరస్ సంక్షోభం కారణంగా భారత్ లాంటి దేశాలు డీగ్లోబలైజేషన్ వైపు వెళ్తున్నాయని, రెండు-మూడేళ్ల తర్వాత అమెరికా, యూరప్, భారత్ లాంటి దేశాలు మళ్లీ గ్లోబలైజేషన్ వైపు వస్తాయని ఐఎండీ వరల్డ్ కమెటెటివ్‌నెస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్థరో బ్రిస్ అభిప్రాయపడ్డారు.

భారత్ చైనా జాతీయ పతాకాలు

ఫొటో సోర్స్, Getty Images

వాణిజ్య యుద్ధం

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల రెండు దేశాలకూ నష్టం జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అమెరికా సంస్థలు చైనాలోని తమ ఫ్యాక్టరీలను మూసేయలేదు. కొన్ని సంస్థలు ‘చైనా ప్లస్ వన్’ సూత్రాన్ని పాటిస్తున్నాయి. అంటే, ఆ సంస్థలు తమ ఫ్యాక్టరీలోను చైనాతో పాటు వియత్నాం వంటి దేశాల్లో ఏర్పాటు చేస్తున్నాయి.

భారత్, చైనా కలిసి నడిస్తేనే, రెండు దేశాల జనాభా ఆర్థిక సమృద్ధి సాధిస్తుందని ప్రొఫెసర్ హ్వాంగ్ యుగ్సాంగ్ అంటున్నారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగంలోనూ రెండు దేశాలు ముందుకు సాగుతాయని అన్నారు.

‘‘రాబోయే ఏళ్లలో 5జీ సాంకేతికతతో ఆర్థికవ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. దక్షిణ కొరియా సంస్థలు శామ్‌సంగ్, ఎల్జీ, ఫిన్లాండ్ సంస్థ నోకియా అతిపెద్ద 5జీ సంస్థల్లో ఉన్నాయి. అమెరికాలో క్వాల్‌కామ్, ఇంటెల్ 5జీ పేటెంట్ పొందిన అతిపెద్ద సంస్థలు. శార్ప్, ఎన్‌టీటీ డొకొమో అతిపెద్ద జపాన్ సంస్థలు. కానీ, చైనా సంస్థ హువావే వద్ద 5జీ అతిపెద్ద పోర్ట్‌ఫోలియో ఉంది. భారత్ దీని నుంచి ప్రయోజనం పొందొచ్చు’’ అని అన్నారు.

అమెరికాకు దీటుగా చైనా ప్రపంచశక్తి కావాలనుకుంటోంది. ఇందుకోసం పొరుగుదేశమైన భారత్‌తో శాంతి ఆ దేశానికి అవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

భారత్‌ కూడా ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో స్థానం కోరుకుంటోంది. పొరుగుదేశాలతో, ఇతర దేశాలతో మంచి సంబంధాలు ఉండటం భారత్‌కు కూడా అవసరమే.

ఐరాస భద్రతా మండలిలో చైనా శాశ్వత సభ్య దేశం. తాత్కాలిక సభ్య దేశంగా భారత్ కూడా రెండేళ్లు ఇందులో ఉంటుంది.

ప్రపంచంలో శాంతి నెలకొల్పడం భద్రతా మండలి సభ్య దేశాల బాధ్యత.

భారత్, చైనా సంయుక్త ఆర్థిక శక్తితోపాటు రాజకీయ శక్తిని కూడా చాటేందుకు ఇది సందర్భం కావొచ్చు. దీని ఫలితంగా ప్రయోజనం పొందేది ఈ రెండు దేశాల ప్రజలు మాత్రమే కాదు. కరోనావైరస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచానికి తోడ్పాటు దొరకవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)