అమెరికాలో నిరసనలు: సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేక్ హార్టన్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్ ప్రతినిధి
అమెరికాలో నిరసనలను అదుపు చేయడానికి సైన్యాన్ని దింపుతానని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో సైన్యాన్ని దించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?
తెల్లజాతి పోలీసు అధికారి మోకాలి కింద నలిగి నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత చెలరేగిన ఆందోళనలు అమెరికా మొత్తానికి వ్యాపించాయి. అనేక ప్రదేశాల్లో ఆస్తుల విధ్వంసాలు, లూటీలు జరిగాయి. ప్రభుత్వ, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దింపుతానని ట్రంప్ హెచ్చరించారు. రాష్ట్రాలు ఈ నిరసనలను అదుపుచేయడంలో విఫలమైతే తాను సైన్యాన్ని ఆ ప్రాంతాలకు పంపుతానని ట్రంప్ చెప్పారు. రాష్ట్ర అధికార యంత్రాంగం అనుమతి లేకుండా ఆయా రాష్ట్రాలకు సైన్యాన్ని పంపించే అధికారం ప్రభుత్వానికి లేదని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు అంటున్నారు.
ఆ అధికారం అధ్యక్షుడికి ఉందా, లేదా?
అధ్యక్షుడికి సైన్యాన్ని పంపించే అధికారం ఉంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీనికి అనుమతి ఉంటుంది. అమెరికా సైన్యంలోని రిజర్వ్ ఫోర్స్... నేషనల్ గార్డ్ నుంచి ఇప్పటికే ఇరవైకి పైగా రాష్ట్రాల్లో వేల మంది బలగాలను మోహరించారు.
అయితే ఈ దళాలు కావాలని ఆయా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి అయితే, రాష్ట్రాల అనుమతి లేకుండానే ఫెడరల్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చని 19వ శతాబ్దంలో తెచ్చిన ఓ చట్టం స్పష్టంగా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ చట్టం ఏది?
అమెరికా చట్టాలను అమలు చేయడం రాష్ట్రాలకు అసాధ్యంగా మారిందని, లేదా ప్రజల హక్కులకు భంగం కలిగిందని అధ్యక్షుడు భావిస్తే ఆయన జోక్యానికి ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదని 'ఇన్‌సరెక్షన్ యాక్ట్' చెబుతోంది.
ఈ చట్టం 1807లో అమల్లోకొచ్చింది. అప్పట్లో అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే 'నేటివ్ అమెరికన్ల'దాడుల నుంచి రక్షణ కోసం తమ సేనలను వినియోగించేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు.
దేశంలో తలెత్తే అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి, పౌర హక్కులను రక్షించడానికి అమెరికా సైన్యాన్ని వినియోగించేందుకు వీలు కల్పించేలా తర్వాత దీనికి సవరణ చేశారు.
1878లో అమల్లోకొచ్చిన మరో చట్టం ప్రకారం సైన్యాన్ని వినియోగించాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం కావాలి. కానీ అధ్యక్షుడు సైన్యాన్ని మోహరించాలని నిర్ణయం తీసుకోవడానికి 'ఇన్‌సరెక్షన్ యాక్ట్' ఒక్కటి చాలని ఒక లీగల్ ఎక్స్‌పర్ట్ బీబీసీకి వివరించారు.
రాష్ట్రాల అనుమతితో పని లేకుండానే సైన్యాన్ని వినియోగించడానికి అధ్యక్షుడికి అధికారముందనేది సుస్పష్టం. రాష్ట్రాల గవర్నర్లు తన సాయం కోరాల్సిన అవసరం లేదని అధ్యక్షుడు నిర్ణయానికి వస్తే చాలన్నది ఇక్కడ ముఖ్యమైన విషయమని.. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్.. లా ప్రొఫెసర్ రాబర్ట్ చెస్నీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ అధ్యక్షుడైనా సైన్యాన్ని వినియోగించారా?
ఇన్‌సరెక్షన్ యాక్ట్‌ను గతంలో ఎన్నోసార్లు ఉపయోగించారని కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్ వివరాల ద్వారా తెలుస్తోంది.
అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ దీన్ని వినియోగించలేదు.
1992లో చివరిసారిగా అప్పటి అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ దీన్ని అమలుచేశారు. లాస్ ఏంజెలిస్‌లో జరిగిన వర్ణవివక్ష ఘర్షణలను అదుపుచేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించారు.
1950ల్లో, 60ల్లో ముగ్గురు అధ్యక్షుల పరిపాలనా కాలంలోనూ ఈ చట్టాన్ని ఉపయోగించారు. అప్పట్లో కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి.
1957లో ఐసెన్ హోవర్ అధ్యక్షుడిగా ఉండగా అర్కాన్సాస్‌లో ఓ స్కూల్లో నిరసనలను అదుపుచేయడానికి ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. 1960ల చివరకు వచ్చేసరికి ఈ చట్టం వినియోగం తగ్గింది.
హరికేన్ కత్రినా విధ్వంసం సమయంలో మిలిటరీ వినియోగాన్ని మరింత ముమ్మరం చేయడానికి 2006లో అమెరికా కాంగ్రెస్ దీనికి సవరణలు చేసింది. రాష్ట్రాల గవర్నర్లు వ్యతిరేకించడంతో సవరణలను వెనక్కు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- పోలీస్ కాళ్ల కింద నల్లజాతి వ్యక్తి మృతి: భగ్గుమన్న జనం.. పోలీసులతో ఘర్షణ
- బంకర్లో దాక్కున్న ట్రంప్.. వైట్‌హౌస్ సమీపంలో హింసాత్మక ఘటనలతో జాగ్రత్తపడిన భద్రతా సిబ్బంది
- గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపేశారు
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- కరోనా లాక్డౌన్: కష్టకాలంలో డిజిటల్ వైపు మళ్లి, లాభాలు పొందిన రైతులు, మత్స్యకారులు
- వీడియో: లాక్డౌన్లో సాలీళ్లతో సహజీవనం
- అన్‌లాక్: భక్తుల కోసం సిద్ధమైన ఆలయాలు.. కొత్తగా వచ్చే మార్పులు ఇవే..
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








