హార్ట్ బ్రేక్ గైడ్: లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ బాధ నుంచి బయటపడండి ఇలా..

- రచయిత, ఎడ్వినా లాంగ్లే
- హోదా, బీబీసీ కోసం
కొన్ని బాధలు అనుభవిస్తే గానీ అర్థం కావు. ప్రేమలో విఫలమవ్వడం కూడా అలాంటిదే.
నేనూ దీన్ని అనుభవించా. శాశ్వతమనుకున్న ప్రేమ బంధం... ఒకరోజు హఠాత్తుగా తెగిపోయింది.
అతడితో కలిసి ఒకే చోట జీవించేందుకు నేను సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. అతడి మనసు మారింది.
నాకది పెద్ద షాక్. ఇక నేను జీవితంలో నాలా ఉండలేనోమో అనుకున్నా.


అప్పుడు నాకు 32 ఏళ్లు. 27 ఏళ్లుగా నేను ఉంటున్న లండన్ నగరం విడిచిపెట్టి... గ్రామీణ ప్రాంతానికి మారిపోయా.
అతడు ఎక్కడ మళ్లీ ఎదురుపడతాడో అన్న ఆలోచనను అలాగే మనసులో పెట్టుకుంటూ ఈ బాధ నుంచి బయటపడటం కష్టమైంది. చోటు మారితే గానీ, నా మనసు మారదని అనిపించింది.
నా దగ్గర పెద్దగా డబ్బులు లేకపోవచ్చు. కానీ, నేను చేయాల్సిన ప్రాజెక్టు ఒకటి ఉంది. నేను బడ్జెట్‌ను బాగా అమలు చేస్తా. కాబట్టి, వీలైనంత సమయం దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా.
అప్పటి నుంచి ఎనిమిది నెలలు.. నేను 'హార్ట్ థెరపీ'లో మునిగిపోయా.

ఫొటో సోర్స్, Getty Images
మైళ్లకు మైళ్లు నడిచా. సముద్రంలో ఈదా. కన్నీళ్లు పెట్టుకున్నా. కష్టపడ్డా. ముందుకన్నా కష్టపడ్డా. అయినా, ఆ బాధ పోలేదు.
నగర జీవితానికి అలవాటుపడ్డ నాకు గ్రామీణ ప్రాంతానికి మారడం మరింత ఒంటరి భావనలను కలిగించింది.
నాకు కుటుంబం మద్దతు ఉంది. అది నా అదృష్టం. స్నేహితులు కూడా నాకు అవసరం.
కొన్ని రోజుల తర్వాత వాళ్ల నుంచి ఫోన్లు ఆగిపోయాయి. ఎందుకంటే, ఎవరి జీవితాలు వాళ్లవి. వస్తామన్న వాళ్లు రావడం లేదు. అంతకంతకూ ఒంటరిని అయిపోతున్నానని అనిపించింది.
మంచి బ్రేకప్ అని ఏదైనా ఉందా అని నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. అంటే, మనసు విరిగిపోవడాన్ని కూడా ఓ సానుకూల పద్ధతిలో తీసుకోవచ్చా? ఈ విషయంలో నాకు గైడ్ అంటూ ఏదీ లేదు. కానీ, ఓ ఏడాది తర్వాత దాన్ని కనిపెట్టేందుకే ఇది రాస్తున్నా.

మనసు విరగడం అంటే..
సైకాలజిస్ట్ జో హెమ్మింగ్స్ మాటల్లో చెప్పాలంటే.. అది భావోద్వేగపరంగా మనల్ని తీవ్రంగా కలిచివేసేలా జరిగిన నష్టం.
''ఒక్కొక్కరికి ఇది ఒక్కోలా ఉండొచ్చు. బాధ తీవ్రత, దుఃఖం, అందులో నుంచి బయటపడమేమోనన్న భావన.. ఇవన్నీ సాధారణం. శారీరక బాధ కలిగినప్పుడు మెదడులో ఏ ప్రాంతాలు క్రియాశీలమవుతాయో, మానసిక వేదనకు కూడా అవే క్రియాశీలమవుతాయి. డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వాళ్లు, మానేసే సమయంలో అనుభవించే బాధలానే ఇదీ ఉంటుంది'' అని ఆమె చెప్పారు.
నాకైతే శరీరం లోపల ఏదో మండుతున్నట్లు అనిపించింది.
నిజంగా మానేసేటప్పుడు చేసేదే అసలు పోరాటం.
అతడికి ఫోన్ చేయాలనో, బతిమిలాడాలనో అన్న ఆలోచనను అణచుకోవడం కష్టం. ముందు పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటుంటే.. మనసంతా బాధతో నిండిపోతుంది.

అధిగమించడం ఎలా..
మనసు విరగడాన్ని తట్టుకోవడం ఓ కళ.
అలా అని... సైన్స్ నుంచి మనం నేర్చుకోనేది ఏం లేదని కాదు. ఈ విషయంపై చాలా అధ్యయనాలు జరిగాయి.
బ్రేకప్‌ను ఎలా తట్టుకోవాలనే విషయంలో ఓ అధ్యయనం మూడు వ్యూహాలను సూచించింది. అవి... మీ పాత ప్రేమికుడి గురించి చెడ్డ విషయాల గురించి ఆలోచించడం, అతడి గురించి మనసులో ఫీలింగ్స్‌ను అలాగే అంగీకరించుకోవడం, అతడితో సంబంధం లేని మంచి విషయాలపై దృష్టపెట్టడం.
ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. మొదలుపెట్టడానికి ఈ మూడు వ్యూహాలు కొంత ఉపయోగపడేలాగే అనిపిస్తున్నాయి.
''మీకు మీరే సంతోషంగా గడిపే తీరిక చేసుకోండి. ఉద్యోగానికి సెలవు పెట్టడం తప్పేమీ కాదు. స్నేహితులతో మాట్లాడండి. మీ ఫీలింగ్స్‌ను డైరీలో రాసుకోండి. అలా అని, అది మీపై ఆధిపత్యం చెలాయించకూడదు. క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్ని రోజులూ ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఇంట్లో, ఇక ఉండలేనని అనిపించవచ్చు. కానీ, కొన్ని మార్పులు చేసుకుంటే, మీకు ఆ భావన పోతుంది'' అని రిలేషన్‌షిప్ నిపుణురాలు డీ హోమ్స్ అంటున్నారు.

ఫొటో సోర్స్, iStock
''సోషల్ మీడియాలో మీ అతడిని అన్‌ఫ్రెండ్ లేదా అన్‌ఫాలో చేయండి. ఫొటోలు, మెసేజ్‌లు డిలీట్ చేయండి. బాధ కలిగించే గుర్తులేవీ లేకుండా చేసుకోండి. ఇది కాస్త క్రూరంగా అనిపించవచ్చు. కానీ, పనిచేస్తుంది'' అని ఆమె చెబుతున్నారు.
''మెసేజ్ గానీ, కాల్ గానీ చేయొద్దు. అందుకు బదులుగా మెసేజ్‌లు రాయండి కానీ, పంపకుండానే డిలీట్ చేయండి. మీ భావనలను మీకు మాత్రమే తెలిసేలా గోప్యంగా ఏదో ఒక చోట రాసుకోండి. ఇక వాళ్ల వెంట పడొద్దు'' అని ఆమె సూచించారు.
బాధ దశలను బట్టి కోపం కూడా ఓ పాత్ర పోషించవచ్చు.
ఒక్కసారి నాకు విపరీతంగా కోపం వచ్చేది.
కోపం వల్ల కొన్ని లాభాలున్నాయి. మీకు నచ్చని వ్యక్తిని, మీరు కోల్పోతున్నట్లుగా భావించలేరు కదా.
అయితే ఇది మంచి పద్ధతి కాదని ఓ లైఫ్ కోచ్ వీడియోలో చెప్పారు. ''వాళ్లలోని మంచి లక్షణాలు ఏంటనేవి విశ్లేషించండి. భవిష్యత్తులో అవి వేరే వ్యక్తుల్లో దొరకడం కష్టమా అన్నది ఆలోచించండి'' అని అందులో సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
నా విషయానికి వస్తే, అతడు చాలా వరకూ మంచివాడే.
ఈ ప్రపంచంలో వేరే మంచివాళ్లు లేరా? బోలెడు మంది ఉన్నారు.
ఈ పద్ధతి నాకు ఉపయోగకరంగా అనిపించింది.
బ్రేకప్ మొదట్లో... 'సముద్రంలో ఇంకా బోలెడు చేపలున్నాయి' అన్న సిద్ధాంతం గుర్తు చేస్తూ ఎవరైనా ఓదార్పుగా మాటలు చెబితే నచ్చేది కాదు. వాళ్లు మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారన్న భావనే కలిగేది.
కానీ పోనుపోనూ... అతడు పర్‌ఫెక్ట్ కాదని, అతడిలో నేను చూసిన మంచి లక్షణాలు వేరేవారిలోనూ ఉంటాయని నాకు నేను అంగీకరించడం చాలా మంచి చేసింది.
ఇవన్నీ కలగలిపితే బ్రేకప్‌ను ఎలా జయించాలో అర్థమవుతుంది.
బాధను అంగీకరించండి. దాన్ని అనుభవించేందుకు మీకు మీరు సమయం ఇచ్చుకోండి. కుటుంబసభ్యులతో, స్నేహితులతో మాట్లాడండి. అవసరమైతే కౌన్సిలర్‌లను కూడా కలవండి. డైరీ రాయండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. బాధాకరమైన గుర్తులను చెరిపేసుకోండి. దృష్టిని వేరే విషయాలవైపు మళ్లించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మళ్లీ పాత భాగస్వామితో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు.
ఇందులో ప్రతికూల విషయాలు ఉండొచ్చు. సానుకూల విషయాలపైనే దృష్టి పెట్టొచ్చు. మంచి లక్షణాలున్న మరో వ్యక్తి దొరుకుతారేమో... వేచి చూస్తే కదా తెలిసేది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్ని రోజులు పడుతుంది
ప్రేమలో పడటానికి, విఫలమయ్యాక దాని నుంచి బయటపడటానికి తొందరపడలేం.
బ్రేకప్ నుంచి బయటపడి, ఓ వ్యక్తి సానుకూల ఆలోచనలతో ముందడుగు వేసేందుకు 11 వారాల సమయం పడుతుందని ఓ అధ్యయనం లెక్కగట్టింది.
కానీ, ఇది సైన్స్ కాదని చెప్పాను కదా! నాకైతే ఆరు నెలల సమయం పట్టింది.
అప్పటికి నేను పూర్తిగా సిద్ధమయ్యా. నేను ఆశ్చర్యపోయేలా అన్నీ మంచి విషయాలే జరిగాయి. బంధాలపై నా నమ్మకాన్ని మరింత పెంచేలా మంచి భాగస్వామి దొరికాడు. ఇక అప్పటి నుంచి నేను ఆ పాత భాగస్వామి కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు.
ఇక నేను నా సొంత సిద్ధాంతంతో ముగిస్తా!
మనసు విరిగిన బాధ నుంచి బయటపడటం పెను సవాలు. ఇది చాలా సింపుల్, కాబట్టే ఇది ఇంత క్లిష్టమైన సవాలుగా అనిపిస్తుంది.
మీరు ప్రేమకు అర్హులని, మరింత విలువైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వస్తారని విశ్వసించడమే దాన్ని అధిగమించేందుకు చిట్కా!

ఇవి కూడా చదవండి.
- 'చంద్రుని వద్దకు నాతో నా జీవిత భాగస్వామిగా వస్తారా... అయితే దరఖాస్తు చేసుకోండి' - జపాన్ కోటీశ్వరుడు
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- భారీ తాబేలు.. ఏకంగా పెద్ద కారంత ఉంది
- ‘ప్రేమలో పడ్డందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు’
- ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగం ఇతనికి ఎలా సాధ్యమైంది?
- నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
- మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- పుల్వామా దాడి: అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం చేసిన హామీలు నెరవేరాయా?
- స్టాకర్వేర్: భార్యాభర్తల పరస్పర నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- కరోనావైరస్ సోకిందన్న భయంతో ఆత్మహత్య... అసలేం జరిగింది?
- మీ ఎక్స్ మీ 'టైప్' కాదని బ్రేకప్ చెప్పారా... మరి కొత్త లవర్ సంగతేమిటి...
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








