సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఆర్టికల్ 370 రద్దుపై యురోపియన్ యూనియన్ పార్లమెంటులో చర్చలు.. భారత్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదనలు

ఫొటో సోర్స్, EU
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అంశాలపై యురోపియన్ యూనియన్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై యురోపియన్ యూనియన్ పార్లమెంటులో భారత్‌కు వ్యతిరేకంగా ఆరు ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. దీంతో భారత్ - యురోపియన్ యూనియన్ మధ్య దౌత్యపరమైన ఒత్తిడి నెలకొంది.
ఈ ఆరు ప్రతిపాదనలపై బుధవారంనాడు పార్లమెంటులో చర్చ జరుగుతుంది. జనవరి 30న వాటిపై ఓటింగ్ జరుగుతుంది.
అయితే ఈ అంశంపై అటు భారత ప్రభుత్వం కానీ, ఇటు విదేశాంగ శాఖగానీ ఎలాంటి అధికారిక ప్రకటనలూ విడుదల చేయలేదు.
కానీ, ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రతిపాదనలు వామపక్ష ధోరణి ఉన్న కొన్ని సంస్థల కుట్రలో భాగమని పేర్కొన్నారు.
భారత్‌ను విమర్శిస్తూ చేసిన ప్రతిపాదనలను పున: సమీక్షించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఈయూ పార్లమెంటు స్పీకర్ దావోద్ సాసోలీకి లేఖ కూడా రాశారు.
ఒక చట్ట సభ తీసుకున్న నిర్ణయాలపై మరో చట్ట సభ అలాంటి ప్రతిపాదనలు చేయడం అనేది ఒక అనారోగ్యకర సంప్రదాయానికి తెరతీస్తుందని ఓం బిర్లా తన లేఖలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EU
పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం అనేది భారత అంతర్గత వ్యవహారం అని, అది ప్రజాస్వామ్య విధానంలోనే జరిగిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు.
751 మంది సభ్యులున్న ఈయూ పార్లమెంటులో భారత పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఆర్టికల్ 370 రద్దు, ఎన్‌ఆర్‌సీల పైనా కొన్ని ప్రతిపాదనలు చేశారు.
ఈయూ పార్లమెంటులో ఈ ప్రతిపాదనలు చేసిన బృందాల్లో సెంటర్ - రైట్ యురోపియన్ పీపుల్స్ పార్టీ (క్రిస్టియన్ డెమొక్రాట్స్), సెంట్రిస్ట్స్ - ప్రోగ్రెసివ్ ఎలయిన్స్ ఆఫ్ సోషలిస్ట్స్ అండ్ డెమొక్రాట్స్‌తో పాటు యురోపియన్ యునైటెడ్ లెఫ్ట్ నార్డిక్ గ్రీన్ లెఫ్ట్ ('GUE / NGL)కు చెందిన ఎంపీలు కూడా ఉన్నారు.
ఈయూ పార్లమెంటులో చేసిన ఆరు ప్రతిపాదనలపై 626 మంది ఎంపీలు సంతకం చేశారు. వాళ్లలో భారత ప్రభుత్వం గత అక్టోబర్‌లో కశ్మీర్ పర్యటనకు తీసుకెళ్లిన ఏడుగురు ఎంపీలు కూడా ఉన్నారు.


కొందరు ఈయూ ఎంపీలను కశ్మీర్ పర్యటనకు తీసుకు వెళ్లినప్పటికీ ఈయూ పార్లమెంటులో ఇలాంటి ప్రతిపాదనలు రావడానికి భారత్ వైపు నుంచి ఉన్న దౌత్యపరమైన లోపాలే కారణమా అన్న చర్చ కూడా జరుగుతోంది.
అయితే యురోపియన్ యూనియన్ మాత్రం ఈ ప్రతిపాదనలు తమ పరిధిలోకి రావని చెబుతోంది. ఈయూ పార్లమెంట్ లోపల జరిగే ప్రతి అంశాన్ని యురోపియన్ యూనియన్ కూడా ఆమోదించినట్లు కాదని, అది పార్లమెంటరీ ప్రాసెస్‌లో భాగమని ఈయూ ఫారిన్ ఎఫైర్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
భారత్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఈయూ పార్లమెంటులో చర్చ జరపడాన్ని భారత్ సీరియస్‌గా తీసుకోవాలని, ఆ చట్టంపై మోదీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని భారత్‌తో సన్నిహితంగా ఉండే దేశాలు ఆశిస్తున్నాయని లేబర్ పార్టీ నేత, ఈయూ పార్లమెంట్ సభ్యుడైన రిచర్డ్ గ్రాహమ్ కార్బెట్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఓం బిర్లా మాత్రం పార్లమెంటులోని రెండు సభల ఆమోదంతోనే ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.
మరోపక్క భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మానవ హక్కులకు సంబంధించిన ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయని, అలాంటి అణచివేత ధోరణి సరికాదని భారత్‌ను ఉద్దేశిస్తూ యురోపియన్ యునైటెడ్ లెఫ్ట్ ఎంపీ ఇడోయా విలెన్యువా అన్నారు.
''ఈ అంశాల్లో యురోపియన్ యూనియన్ ఏం చేయగలదు అని మేం ఆలోచిస్తున్నాం. దేశాల స్వతంత్రాధికారాలను ఈయూ గౌరవిస్తుంది. కానీ, మానవ హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకు యురోపియన్ యూనియన్ చర్యలు తీసుకోవాలి'' అని ఆమె అన్నారు.
ఈయూ పార్లమెంటులో తీసుకొచ్చిన ప్రతిపాదనలపై ఆమె మాట్లాడుతూ, ''మోదీ అధికారంలోకి రావడం, ఆ తరువాత తీవ్రమైన హిందూ జాతీయవాదం పెరగడం అనేవి ఆందోళనకర పరిణామాలు. ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. జమ్ము కశ్మీర్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థను మూసేయడం. రెండు.. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం. ఈ పరిణామాలు దేశంలోని భిన్నత్వం, శాంతిపైన నేరుగా దాడి చేశాయి. భారత్‌తో వ్యూహాత్మక ఒప్పందాల కోసం ఈయూ ఎదురు చూస్తోంది. కానీ, మానవ హక్కుల పరిస్థితిని మేం విస్మరించలేం'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, IDOIA VILLANUEVA
అయితే, తాజా సమాచారం ప్రకారం, 66 మంది సభ్యులున్న యురోపియన్ కన్జర్వేటివ్స్, రిఫార్మిస్టుల పార్టీ (ఈసీఆర్) పార్లమెంటులో భారత్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ప్రతిపాదనలకు దూరంగా ఉంది. దాంతో, 751మంది సభ్యులున్న ఆ పార్లమెంటులో భారత వ్యతిరేక ప్రతిపాదనలకు మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య 560గా ఉంది. ఇంకెంతమంది ఎంపీలు ఆ ప్రతిపాదనలకు మద్దతివ్వకుండా ఉంటారన్నది ఈ దశలో చెప్పడం కష్టం.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యురోపియన్ యూనియన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, మరోపక్క బెల్జియంలోని భారత దౌత్యవత్త ఇసార్ కుమార్ కూడా ఈ ప్రతిపాదనలను తీసుకొచ్చిన ఎంపీలతో చర్చలు జరుపుతున్నారని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
యురోపియన్ యూనియన్‌లో ఈ ప్రతిపాదనలపై ఓటింగ్‌ను నివారించడానికి భారత వైపు నుంచి అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆయన అన్నారు.
మరోపక్క పాకిస్తాన్ చేసిన భారత వ్యతిరేక ప్రచారాన్ని కొందరు ఈయూ ఎంపీలు విశ్వసించారని, ఇది రెండు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచుతుందని కొందరు భారత దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
''భారత వ్యతిరేక ప్రచారాన్ని ఈయూ ఎంపీలు విశ్వసించారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాల్లో అక్రమంగా ఉన్నవారిని బయటకు పంపించలేదా? ఇంగ్లండ్‌లో అక్రమంగా ఉన్నవారిని జైల్లో పెట్టలేదా? భారత్‌ను ఏకాకి చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ఎంపీలు, పాకిస్తాన్ ప్రభావంతోనే ఆ పని చేస్తున్నారు'' అని భారత మాజీ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా తెలిపారు.
రానున్న మార్చిలో మోదీ బ్రసెల్స్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి భారత వ్యతిరేక ప్రతిపాదనల వల్ల దౌత్యపరమైన సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- కరోనావైరస్: చైనాలో 80 మంది మృతి... విదేశాలకు విస్తరిస్తున్న భయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








