డోనల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ: అభియోగాలకు కీలక కమిటీ ఆమోదం.. ‘దేశానికి విచారకరం.. నాకు మాత్రం చాలా ప్రయోజనకరం’

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభిశంసనకు చేపట్టిన ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ట్రంప్‌పై మోపిన రెండు అభిశంసన అభియోగాలను ప్రతినిధుల సభ న్యాయ కమిటీ ఆమోదించింది. వీటిపై ప్రతినిధుల సభ ఓటింగ్ నిర్వహించనుంది.

రెండు ఆర్టికళ్ల కింద ఈ అభియోగాలు ఉన్నాయి. వీటిని డెమోక్రాట్లు సమర్థించగా, రిపబ్లికన్లు వ్యతిరేకించారు. డెమోక్రాట్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ, వీటిపై ఓటింగ్‌ను వచ్చే వారం నిర్వహిస్తుందని భావిస్తున్నారు.

ఒక ఆర్టికల్- ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, మరో ఆర్టికల్- ఆయన కాంగ్రెస్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నాయి. అభియోగాలకు సమర్థనగా 23 ఓట్లు, వ్యతిరేకంగా 17 ఓట్లు పడ్డాయి. ఈ ఓటింగ్ సహా అభిశంసన విచారణ శుక్రవారం పది నిమిషాల్లో ముగిసింది.

ఓటింగ్ గురువారమే జరుగుతుందని తొలుత అనుకున్నారు. తీవ్రస్థాయి వాదప్రతివాదాలతో చర్చ 14 గంటలకుపైగా కొనసాగడంతో ఓటింగ్ ఆలస్యమైంది. ఈ ఓటింగ్‌కు టీవీ కవరేజీ మరింతగా రావాలనే ఉద్దేశంతో డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ న్యాయకమిటీ చైర్మన్ జెరీ నాడ్లర్ దీనిని కావాలనే ఆలస్యం చేశారని రిపబ్లికన్లు ఆరోపించారు.

జెరీ నాడ్లర్(ఎడమ), డౌగ్ కోలిన్స్(కుడి)

ఫొటో సోర్స్, Andrew Harrer - Pool/Getty Images

ఫొటో క్యాప్షన్, ఓటింగ్‌ను న్యాయకమిటీ చైర్మన్ జెరీ నాడ్లర్ (ఎడమ) శుక్రవారానికి వాయిదా వేయడాన్ని రిపబ్లికన్ నేత డౌగ్ కోలిన్స్ తప్పుబట్టారు

అభియోగాలు ఇవీ

తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు అయిన జో బైడెన్‌ మీద అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్‌ను ఒత్తిడి చేసి, ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని కోరారని అధికార దుర్వినియోగమనే అభియోగంలో ఉంది. ప్రతినిధుల సభ విచారణకు ట్రంప్ సహకరించలేదని, తద్వారా కాంగ్రెస్‌ను ఆయన అడ్డుకున్నారని రెండో అభియోగంలో ఉంది.

ఈ రెండు అభిశంసన ఆర్టికళ్లను తొమ్మిది పేజీల్లో వివరంగా పొందుపరచినట్లు డెమొక్రటిక్ ముఖ్యనేతలు చెప్పారు. నీతిబాహ్యంగా వ్యవహరించి ట్రంప్ దేశానికి ద్రోహం చేశారని వారు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం ఓటింగ్ తర్వాత న్యాయకమిటీ చైర్మన్ జెరీ నాడ్లర్ మీడియాతో మాట్లాడుతూ- ఇదో విచారకరమైన రోజని వ్యాఖ్యానించారు. ఇక ప్రతినిధుల సభ సమయం త్వరితగతిన చర్యలు చేపడుతుందని చెప్పారు.

ఇది నాకు మేలు చేస్తుంది: ట్రంప్

అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ- అభిశంసన ప్రక్రియను మరోసారి కొట్టిపారేశారు. ఇది బూటకమని, కక్ష సాధింపు అని ఆయన ఆరోపించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడేటప్పుడు పరాగ్వే అధ్యక్షుడు ఆయన పక్కన ఉన్నారు.

డెమోక్రాట్లు అభిశంసననే అపహాస్యం చేస్తున్నారని, వాళ్లు తమను తాము అవివేకులమని చాటుకొంటున్నారని ట్రంప్ విమర్శించారు. "ఇది ఈ దేశానికి విచారకరమైన పరిణామం. కానీ నాకు మాత్రం రాజకీయంగా చాలా ప్రయోజనం కలిగిస్తుందనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

వైట్ హౌస్

ఫొటో సోర్స్, Getty Images

వచ్చే వారం ప్రతినిధుల సభలో అభిశంసన చర్చలో ఓటు ఎటు వేయాలో కొన్ని జిల్లాల్లోని కొంత మంది డెమోక్రాట్లు ఇంకా తేల్చుకోలేదు. అయితే ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల సంఖ్యాబలం ఎక్కువ. రిపబ్లికన్ల కన్నా వీరికి 36 స్థానాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల అభియోగాలకు ఈ సభ ఆమోదించే అవకాశం ఉంది.

అభిశంసనపై చరిత్రాత్మక ఓటింగ్‌లో వ్యక్తిగత స్వేచ్ఛతో ఓటు వేసేందుకు సభ్యులను అనుమతిస్తామని, విప్ జారీచేయబోమని డెమొక్రటిక్ నాయకురాలు నాన్సీ పెలోసీ గురువారం చెప్పారు.

ప్రతినిధుల సభలో డెమోక్రాట్లది ఆధిపత్యం కాగా, ఎగువసభ సెనేట్‌లో పైచేయి రిపబ్లికన్లది. ట్రంప్ మీద వచ్చిన అభియోగాలపై సెనేట్ వచ్చే నెల్లో విచారణ చేపట్టి, ట్రంప్‌ తప్పు చేయలేదని ప్రకటిస్తుందని భావిస్తున్నారు.

జో బైడెన్, ఆయన కుమారుడు హంటర్ లాంటి సాక్షులను సెనేట్‌కు పిలిపించాలని తాను కోరుకొంటున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. హంటర్ ఓ ఉక్రెయిన్ ఇంధన సంస్థలో పనిచేశారు. ఈ సంస్థపై ట్రంప్ దర్యాప్తు జరిపించాలనుకున్నారు.

సెనేట్ సభ్యులు ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసే అవకాశాలు శూన్యమని సెనేట్ మెజారిటీ నాయకుడు మిచ్ మెక్‌కోనెల్ గురువారం 'ఫాక్స్ న్యూస్'తో చెప్పారు.

అమెరికా చరిత్రలో అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటున్న నాలుగో అధ్యక్షుడు ట్రంప్. వీరిలో ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్ ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. సెనేట్ దోషులుగా తేల్చకపోవడంతో వీరు పదవీచ్యుతులు కాలేదు. రిచర్డ్ నిక్సన్ ప్రతినిధుల సభలో ఓటింగ్ జరగక ముందే 1974 ఆగస్టులో రాజీనామా చేసి వైదొలిగారు. అభిశంసన, పదవీచ్యుతుడయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)