బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా?

- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి, బ్రాడ్‌ఫోర్డ్ (బ్రిటన్) నుంచి
ఉత్తర్ బ్రిటన్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ నగరంలో నలుగురు ఒక్క చోట చేరితే, వారి మధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాకుండా ఉండటం దాదాపు అసాధ్యం.
భారత్‌కు ఈ నగరం సుమారు 6,500 కి.మీ.ల దూరంలో ఉంది. అయినా, అక్కడ జరిగే ఎన్నికల ప్రచారంలో కశ్మీర్ ఓ అంశంగానే ఉంది.
గత ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామం బ్రాడ్‌ఫోర్ట్‌లో ఉండే భారత్, పాక్ సంతతి ప్రజలను విడదీసింది. రెండు వర్గాల మధ్య ఒక విద్వేషపు గోడ ఏర్పడేందుకు కారణమైంది.
భారత ప్రభుత్వం చర్యతో భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తే, పాకిస్తానీలు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు.
కశ్మీర్ అంశంపై బ్రిటన్‌లోని రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. కానీ, ఆచితూచే వ్యవహరించాయి.
ఎందుకంటే, బ్రిటన్‌లో 48 సీట్ల ఫలితాలను నిర్ణయించడంలో దక్షిణాసియాకు చెందిన ప్రజల ఓట్ల పాత్ర కీలకం.

డిసెంబర్ 12న బ్రిటన్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. బ్రాడ్‌ఫోర్డ్‌లో దాదాపు 43% జనాభా దక్షిణాసియా మూలాలున్నవారే.
పాకిస్తాన్‌లోని మీర్‌పుర్ నుంచి చాలా మంది వచ్చి బ్రాడ్‌ఫోర్డ్‌లో ఉంటున్నారు. ఆ వర్గానికి చెందిన వారు ఇద్దరు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు.
అయితే, ఇక్కడి ఎన్నికల్లో కశ్మీర్ ఓ అంశంగా ఎలా మారిందన్న విషయం తెలుసుకునేందుకు కొందరు స్థానికులతో మేం మాట్లాడాం.
''బ్రాడ్‌ఫోర్డ్‌లో దక్షిణాసియాకు చెందినవారు ఎక్కువ. వారిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కశ్మీర్ అంశం ప్రభావం ఉంటుంది. అందుకే అది ఎన్నికల అంశంగా మారింది'' అని భారతీయ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రశ్‌పాల్ సింగ్ అభిప్రాయపడ్డారు.
నిరుద్యోగం, పేదరికం, మహిళలపై వివక్ష అంశాలు కూడా ఓటింగ్‌పై ప్రభావం చూపుతాయని, వీటితోపాటు కశ్మీర్ అంశం కూడా ప్రధానమైనదేనని ఆయన అన్నారు.
పాకిస్తాన్ సంతతికి చెందిన మసూద్ సాదిఖ్ కుటుంబాన్ని కూడా మేం బ్రాడ్‌ఫోర్డ్‌లో కలిశాం. వారి పూర్వీకులు పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్పూర్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.
కొన్ని తరాల క్రితమే వలస వచ్చినప్పటికీ, ఇంకా వారికి కశ్మీర్ భావోద్వేగాలతో కూడుకున్న అంశంలానే ఉంది.

మసూద్ సాదిఖ్, ఆయన భార్య రుక్సానా, కూతురు హానా కశ్మీర్ విషయంలో భారత్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.
''ప్రస్తుతం ఇద్దరు కశ్మీరీ ఎంపీలు ఇక్కడున్నారు. చాలా మంది కశ్మీరీలు కూడా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఓటర్ల మనస్సును అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. కశ్మీర్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఓటర్లు కోరుకుంటున్నారు'' అని మసూద్ అన్నారు.
''భారత సంతతి వాళ్లు, మేం పరస్పరం సహనంతో ఉంటాం. మా మధ్య ఉన్న గోడను పగులగొట్టాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. విడిగానే ఉంటాం'' అని రుక్సానా అన్నారు.
హనా వయసు 16 ఏళ్లే. ఆమెకు ఇంకా ఓటు వేసేందుకు అర్హత రాలేదు.
''హిందువులు, ముస్లింల మధ్య వాదనలు జరుగుతూనే ఉంటాయి. భిన్నాభిప్రాయాలకు మతం ఒక్కటే కారణమని నేను అనను. కానీ, మతం పాత్ర మాత్రం ప్రధానం'' అని హనా అన్నారు.

బ్రాడ్‌ఫోర్ట్‌లో ఉంటున్న హిందువులు కూడా కశ్మీర్ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ నగరంలో ఒక పెద్ద ఆలయం ఉంది. ఇక్కడ హారతి పూజ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంటుంది. అక్కడికి వచ్చేవారిలో కాస్త వయసు పైబడ్డవారు ఎక్కువగా ఉంటారు.
ఆలయ కమిటీలో రాకేశ శర్మ ప్రధాన సభ్యుడు. ఆయన 1974లో దిల్లీ నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు.
తమ నగరంలో కశ్మీర్ కచ్చితంగా ఎన్నికల అంశమేనని ఆయన బీబీసీతో చెప్పారు.
''పాకిస్తాన్ సంతతికి చెందిన ఎంపీల్లో ఎక్కువ మంది లేబర్ పార్టీలో ఉన్నారు. ఆర్టికల్ 370 సవరణ చట్టవిరుద్ధమని వాళ్లు అంటున్నారు. లేబర్ పార్టీ ముస్లింల పక్షం వహిస్తోందని, తమకు సానుకూలంగా లేదని భారతీయులు అభిప్రాయపడుతున్నారు'' అని ఆయన చెప్పారు.
కశ్మీర్‌లో మానవహక్కులను పునరుద్ధరించాలంటూ లేబర్ పార్టీ ఓ తీర్మానం కూడా చేసినట్లు కథనాలు వచ్చాయి.
కశ్మీర్ విషయంలో 'మరింత జోక్యం చేసుకునే' విధానాన్ని పాటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ హామీ కూడా ఇచ్చింది.
దీంతో ఆ పార్టీకి చాలా మంది భారతీయ హిందువులు దూరమయ్యారు.
ఆర్టికల్ 370 సవరణను లేబర్ పార్టీ ఎంపీ జెరేమీ కోర్బిన్ వ్యతిరేకించారని, ఈ కారణంతో అధికార కన్సర్వేటివ్ పార్టీని భారతీయ సమాజం సమర్థించడం మొదలుపెట్టిందని ముకేశ్ చావ్లా అన్నారు.
''కశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, అందులో బ్రిటన్ జోక్యం చేసుకోకూడదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటులో అన్నారు. ఇది కూడా కన్సర్వేటివ్ పార్టీ వైపు భారతీయులు ఆకర్షితులయ్యేలా చేసింది'' అని చెప్పారు.
ముకేశ్ పంజాబ్ నుంచి బ్రిటన్‌కు వలస వచ్చి 52 ఏళ్లు గడుస్తోంది. కానీ, ఇప్పటికీ ఆయన భావోద్వేగపరంగా భారత్‌తో అనుసంధానమయ్యే ఉన్నారు.

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అసలు అంశమే కాకూడదని భారత సంతతి ప్రజలు కొందరు అంటున్నారు.
''కశ్మీర్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న అంశం. బ్రిటన్ ప్రభుత్వం, ప్రజలు అందులో జోక్యం చేసుకోకూడదు'' అని స్థానిక మహిళ పూర్వా ఖండేల్వాల్ అన్నారు.
ఎన్నికల సమయంలో కశ్మీర్ అంశం గురించి చర్చ జరుగుతున్నా, పోలింగ్ పూర్తయ్యాక ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవన్న అభిప్రాయమూ ఇక్కడివారిలో ఉంది.
''ఇక్కడి రాజకీయ పార్టీలు పెద్దగా చేయగలిగిందేమీ లేదు. భారత్ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ చాలా పెద్దవి. ఆ దేశంపై ఒత్తిడి తేవడం చాలా కష్టం'' అని మసూద్ సాదిఖ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మాస్టొడాన్: ట్విటర్‌ను వదిలి చాలా మంది ఈ యాప్‌కు ఎందుకు మారిపోతున్నారు...
- ‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు?
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- భారత్ విడుదల చేసిన కొత్త మ్యాపులు ఆమోదయోగ్యం కాదన్న పాకిస్తాన్
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- ఈయూ ఎంపీలను కశ్మీర్ పర్యటనకు తీసుకొచ్చిన మహిళ ఎవరు
- ప్రెస్ రివ్యూ: హైదరాబాద్ 'ఎన్కౌంటర్' మీద సీన్ రీకన్స్ట్రక్షన్.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్హెచ్ఆర్సీ దృష్టి
- కశ్మీర్‌లో ఆందోళన రేకెత్తిస్తున్న స్థానికేతరుల హత్యలు -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








