ఆఫ్రికా: 'ఏరియా ఆఫ్ ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు

పేరు మార్పును ప్రకటించిన కరాయే ఎమిర్
ఫొటో క్యాప్షన్, పేరు మార్పును ప్రకటించిన కరాయే ఎమిర్

ఆఫ్రికాలోని నైజీరియాలో ఓ గ్రామంలో అరుదైన వేడుక జరుగుతోంది. ఊరి పేరును మార్చుకున్నందుకు గ్రామస్థులు సంబరాలు జరుపుకొంటున్నారు.

'ఏరియా ఆఫ్ ఇడియట్స్' అనే ఈ ఊరి పేరును 'ఏరియా ఆఫ్ ప్లెంటీ' అని మార్చారు.

ఏళ్లుగా తమ ఊరి పేరు వల్ల తమను ఎగతాళి చేస్తున్నారని, ఊరి పేరు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎమిర్ (ఎమిర్ ఆఫ్ కరాయే) ఈ మార్పు చేశారు. ఆయన ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

గ్రామంలో సందడి

ఈ పేర్లు హౌసా భాషలో ఉంటాయి. బయట ఎక్కడైనా తాను ఉంగువర్ వవాయే (ఏరియా ఆఫ్ ఇడియట్స్) నుంచి వచ్చానని చెప్పాలంటే సిగ్గుచేటుగా ఉండేదని, ఇప్పుడైతే యాల్వర్ కడనా (ఏరియా ఆఫ్ ప్లెంటీ) నుంచి వచ్చానని సగర్వంగా చెబుతానని బలా సని అనే స్థానికుడు బీబీసీతో చెప్పారు.

నైజీరియా ఉత్తర ప్రాంతంలోని కనో రాష్ట్రంలో ఈ గ్రామం ఉంది.

'ఇడియటిక్ రివర్'గా పిలిచే నదికి దగ్గర్లో ప్రజలు స్థిరపడగా, దాదాపు 70 ఏళ్ల క్రితం ఈ ఊరికి 'ఏరియా ఆఫ్ ఇడియట్స్' అనే పేరొచ్చింది. నదికి ఈ పేరు ఎలా వచ్చిందో స్పష్టంగా తెలియదు.

గ్రామం పేరు మార్పుపై ఎమిర్‌కు ధన్యవాదాలు చెబుతున్నామని బలా సని తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)