టైగర్ ట్రయంఫ్: విశాఖ, కాకినాడ తీరాల్లో మోహరించిన భారత, అమెరికా సేనలు... త్రివిధ దళాల విన్యాసాలు

అమెరికా సేనలు
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఓ వైపు యుద్ధ ట్యాంకులతో మోహరించిన త్రివిధ దళాల సేన‌ల‌ు, మరో వైపు సముద్ర జలాల నుంచి స్పీడ్‌ బోట్లలో దూసుకు వస్తున్న సైనికులు. అదే సమయంలో ఆకాశంలో హెలికాప్టర్ల నుంచి సైనికులు తాళ్ల సాయంతో కిందికి దిగుతున్న దృశ్యాలు... కాకినాడ సముద్ర తీరంలో ఈ విన్యాసాలు చూసిన వారికి అదంతా యుద్ధ సన్నాహంలా కనిపించింది. నిజానికి, అది భార‌త ద‌ళాల‌తో క‌లిసి అమెరికా సేన‌లు చేప‌ట్టిన సంయుక్త విన్యాసాల ప్రదర్శన.

భారత్, అమెరికాల త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తొలుత విశాఖలో మొదలైన ఈ విన్యాసాలు అక్కడి నుంచి కాకినాడకు చేరాయి.

బంగాళాఖాతంలో చేపట్టిన ఈ విన్యాసాలను భవిష్యత్తులో పసిఫిక్ సముద్ర తీరానికి విస్తరిస్తామని రెండు దేశాలు ప్రకటించాయి.

టైగ‌ర్ ట్ర‌యంఫ్ పేరుతో చేప‌ట్టిన ఈ సంయుక్త విన్యాసాలు న‌వంబ‌ర్ 13 నుంచి 21 వ‌ర‌కు సాగాయి.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఎందుకీ కసరత్తులు

భౌగోళిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఒక్కో దేశంలో ఒక్కో విధ‌మైన విప‌త్తులు సంభ‌విస్తుంటాయి. అందులో భాగంగా ఆయా దేశాల ర‌క్ష‌ణ ద‌ళాలు చేప‌ట్టే స‌హాయ‌ కార్య‌క్ర‌మ‌లాపై అవ‌గాహ‌న పెంచుకునేందుకు ఈ క‌స‌ర‌త్తులు చేసినట్లు భార‌త నావికాద‌ళ అధికారి రియ‌ర్ అడ్మిర‌ల్ సూర‌జ్ బేరి చెప్పారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ ''ప్ర‌కృతి వైప‌రీత్యాల ప్ర‌భావంతో తూర్పు తీరంలో అనేక సార్లు తీర‌ని న‌ష్టం కలుగుతోంది. అలాంటి సంద‌ర్భాల్లో నావికాద‌ళంతో పాటుగా త్రివిధ ద‌ళాలు చేప‌ట్ట‌ే స‌హాయ చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల్సి ఉంది. అనుభ‌వాలు పంచుకోవాల్సి ఉంది. అందుకే అమెరిక‌న్ ద‌ళాల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ''న్నారు.

కాకినాడలో విన్యాసాలు

ఏమేం చేశారు...

విప‌త్తుల స‌మ‌యంలోనే కాకుండా కదన రంగంలోనూ ఎలా క‌దులుతార‌న్న‌ది రెండు దేశాలు చ‌ర్చించాయి. తొలుత విశాఖ‌లో స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం కోసం న‌వంబ‌రు 13 నుంచి 16వ‌ర‌కూ విశాఖ‌లో స‌న్నాహాలు చేశారు. వివిధ క్రీడ‌లు నిర్వ‌హించి, ఇరు దేశాల బృందాల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాల పెంపొందించే ప్ర‌య‌త్నం సాగింది.

అనంత‌రం కాకినాడ‌కు తర‌లిన బృందాలు క‌స‌ర‌త్తులు చేప‌ట్టాయి. విప‌త్తుల స‌మ‌యంలో త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డం, యుద్ధ నౌక‌లు, ఇత‌ర సామాగ్రి కాపాడుకుంటూ స్థానికుల‌కు స‌హాయం అందించే విధానంలో నైపుణ్యం కోసం అనుభ‌వాలు పంచుకునే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

సంయుక్త విన్యాసాలు

ఆయుధ పాటవం

ఈ సంయుక్త విన్యాసాల్లో పాల్గొనేందుకు తూర్పునావికాదళం నుంచి ఐఎన్‌ఎస్ జలస్వ, ఐఎన్‌ఎస్ ఐరావత్‌, ఐఎన్‌ఎస్ సంథ్యాయక్ వంటి యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ నౌక జర్మన్‌టౌన్ కూడా కాకినాడ‌కు త‌ర‌లివ‌చ్చాయి. వాటితో పాటుగా ర్యాపిడ్ యాక్ష‌న్ మెడిక‌ల్ టీమ్స్ (రాంప్ట్స్) కూడా వ‌చ్చాయి.

ఇవి తీరం సమీపానికి రాగా అందులోంచి యుద్ధ ట్యాంకులు, ట్రక్కులు, త్రివిధ దళాల ట్రూపులు, స్పీడ్‌బోట్ల ద్వారా విన్యాసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో ఇండియా త‌రుపున త్రివిధ ద‌ళాల త‌రుపున 1200 మంది పాల్గొన‌గా, అమెరికాకు చెందిన 500 మంది ర‌క్ష‌ణ ద‌ళాల సిబ్బంది పాల్గొన‌ట్టు సూర‌జ్ భేరి వెల్ల‌డించారు.

అమెరికా జర్మన్‌టౌన్‌ యుద్ధ నౌక నుంచి విన్యాసాల కోసం ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ ఎయిర్‌ కుషన్‌ ఒడ్డుకు వచ్చింది. జల, భూ మార్గంలో పయనించే దీన్నుంచి అమెరికా దళాలు ఆయుధాలను చేతబట్టి విన్యాసాల్లో పాల్గొనడం హైలెట్‌గా నిలిచింది. తూర్పు నావికాదళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు రెండు, ఎంఐవీ-17 హెలికాప్లర్లు విపత్తులు, యుద్ధ సమయాల్లో గాయపడ్డ త్రివిధ దళాల సిబ్బందికి వైద్య చికిత్సలు అందించేందుకు అవసరమైన ఫస్ట్‌ ఎయిడ్‌ పరికరాలను సంచాయత్‌ నౌక ద్వారా ఒడ్డుకు తీసుకువచ్చి దళాలకు అందించాయి.

సైనికుడు

చాలా నేర్చుకున్నాం

సంయుక్త విన్యాసాల్లో అమెరికా ద‌ళాలకు అనేక విష‌యాల‌పై అవ‌గాహ‌న పెరిగింద‌ని లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ డానా డెమ‌ర్ బీబీసీకి తెలిపారు.

''అమెరికాలో టోర్న‌డోలు వంటివి వ‌చ్చిన‌ప్పుడు చేప‌ట్టే స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనుభవం మాకు ఉంది. ఇండియాలో సునామీలు, తుపాన్ల స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నార‌న్న‌ది తెలుసుకున్నాం. అలాంటి సంద‌ర్భాల్లో గాయ‌ప‌డిన ప్ర‌జ‌లు, సైనికుల‌కు అందించాల్సిన స‌హాయంపై అవ‌గాహ‌న పెంచుకున్నాం. ఇలాంటి సంయుక్త విన్యాసాలు మ‌రిన్ని జ‌ర‌గాలి. ఆసియా, ప‌సిఫిక్ ప్రాంతంలో వీటిని విస్త‌రించాల్సి ఉంది. భ‌విష్య‌త్తులో మ‌రింత అవ‌గాహ‌న‌తో ప్ర‌కృతి విప‌త్తుల‌ను అధిగ‌మించేందుకు ఇవి దోహ‌ద‌ప‌డ‌తాయ‌''ని పేర్కొన్నారు.

సముద్రం నీరు మంచినీరుగా

స‌ముద్ర జ‌లాల‌ను మంచినీరుగా మార్చి..!

టైగ‌ర్ ట్ర‌యంఫ్ కార్య‌క్ర‌మంలో భాగంగా స‌ముద్ర‌పు జ‌లాల‌ను మంచినీరుగా మార్చి అత్య‌వ‌స‌రాల్లో వినియోగించుకునే సాంకేతిక‌త‌ను రెండు దేశాలు వినియోగించుకున్నాయి.

మ‌రింత నాణ్య‌మైన శుద్ధ జ‌లాలుగా మార్చేందుకు అవ‌స‌ర‌మైన టెక్నాల‌జీని స‌మ‌కూర్చుకునే ప్ర‌యత్నంలో ఉన్న‌ట్టు రెండు దేశాల ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)