జపాన్‌లో భూత్ బంగళాలు... నానాటికీ పెరుగుతున్న సమస్య

ప్రపంచంలోని చాలా దేశాలకు ఇప్పుడు జనాభా తగ్గుదల పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో ఇది మరింత ఆందోళనకరంగా పరిణమించింది.
20వ శతాబ్దం అంతా జనాభా నియంత్రణ ఫలాలు అందుకున్న జపాన్ ఇప్పుడు ఒక్కసారిగా జనాభా తగ్గగిపోతుండడంతో ఇబ్బంది పడుతోంది. జపాన్‌లో జననాలను నమోదు చేయడం ప్రారంభించిన తరువాత 2018లో తొలిసారి అత్యంత తక్కువ సంఖ్యలో జననాలు నమోదయ్యాయి. అదేసమయంలో మరణాలు పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జనాభా తగ్గుతుండడంతో ఇళ్ల అవసరం తగ్గుతూ గిరాకీ పడిపోతోంది. ఇప్పటికే జపాన్‌లో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో వృద్ధులు పెరుగుతున్నారు. వృద్ధాప్యంతో మరణాలు సంభవిస్తుండడంతో అనేక ఇళ్లు ఖాళీ అవుతున్నాయి.
వారసులెవరూ లేని గృహస్థులు మరణిస్తే ఖాళీగా మిగిలిపోయే ఈ ఇళ్లను 'అకియా' అని పిలుస్తారు. కొత్తగా అందులో ఎవరూ అద్దెకు కూడా దిగకపోవడంతో ఖాళీగా ఉంటాయి. జపాన్ అంతటా ఇలాంటి ఇళ్లు భారీ సంఖ్యలో ఉంటున్నాయి. 2018లో రికార్డు స్థాయిలో 13.6% ఆస్తులు అకియాగా నమోదయ్యాయి. అకియా సమస్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరణించినవారి ఇళ్లను బంధువులు కూడా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.. కారణం, జపాన్‌లో రెండో ఇల్లు కలిగి ఉంటే పన్ను చెల్లించాల్సి రావడమే. జపాన్ వ్యాప్తంగా ఇలాంటి అకియాలు పెద్దసంఖ్యలో ఉంటున్నాయి.

ముఖ్యంగా గ్రామీణ జపాన్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. యువత ఉపాధి రీత్యా గ్రామాలను వీడి నగరాలకు వస్తుండడంతో గ్రామాల్లోని ఇళ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. మామూలుగానే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండుకు తగ్గిన సమయంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు ఖాళీ అవుతుండడంతో అవి ఖాళీగా ఉంటున్నాయి.
ఇలాంటి ఖాళీ ఇళ్ల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నప్పటికీ వాటిలో చాలా గృహాలకు యజమానులు లేకపోవడంతో చట్టరీత్యా వాటిని పునర్నిర్మించడం, కూల్చడం వంటివి చేయలేకపోతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉండే జపాన్‌లో ఇలాంటి ఖాళీ ఇళ్లు పాతబడి తుపాన్లు, భూకంపాల సమయంలో కూలుతున్నాయి. ఇతర నిర్మాణాలపై పడి అవి నాశనమవుతున్నాయి.
టోక్యో నుంచి వాయువ్య దిశలో రెండు గంటలు ప్రయాణిస్తే ఆ ప్రాంతమంతా ఇలాంటి అకియాలతో నిండిపోయి కనిపిస్తుంది. నాలుగేళ్ల కిందట ఒకుటామా కౌన్సిల్ ఇలాంటి అకియాలను ఉపయోగించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ఎన్నో వెసులుబాట్ల కల్పించింది. ఇంతచేసినా వాటిలో ఏడు కుటుంబాలే ఇప్పుడు నివసిస్తున్నాయి.
టయోయో విశ్వవిద్యాలయంలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ నొజావా ''పెద్ద నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఈ సమస్య ముందుముందు మరింత పెరుగుతుంది'' అన్నారు. ప్రజలు ఇలాంటి అకియాలను తీసుకుని అందులో నివసించడాని కంటే శివారు ప్రాంతాల్లోని కొత్త ఇళ్లలో నివసించడానికే మొగ్గుచూపిస్తుండడంతో అకియా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
''వీటి పునరుపయోగానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదాన్ని బట్టి వీటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కొత్త తరాన్ని ఈ పాత భవనాల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టకపోతే జనాభా తగ్గుదల ప్రభావంతో భవనాలు కాదు ఏకంగా నగరాలే ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి'' అంటున్నారు నొజావా.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








