చైనా యువతి కన్నీటి కథ: గుప్పెడు అన్నం, పిడికెడు మిరపకాయలు... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం

24 ఏళ్ల వయసులో హుయాన్ 20 కేజీలే బరువే ఉన్నారు

ఫొటో సోర్స్, Feng Video

తమ్ముడి వైద్యం, తన చదువు కోసం డబ్బులు దాచుకునేందుకు ఓ యువతి రోజూ కేవలం 22 రూపాయలతో బతికారు. రోజూ పిడికెడు మిరపకాయలు, కాస్త అన్నం మాత్రమే తింటూ అయిదేళ్లు నెట్టుకొచ్చారు. చివరికి అనారోగ్యంతో ఆస్పత్రి పాలవడంతో ఆమె కథ చైనాలో సంచలనంగా మారింది.

ఆమె దీన స్థితికి వేలాది చైనీయులు చలించారు. 80 లక్షల రూపాయలకు పైగా డబ్బును ఆమెకు విరాళంగా ఇచ్చారు.

అంతలా అందరినీ కదిలించిన ఆ యువతి పేరు వూ హుయాన్. వయసు 24 ఏళ్లు. చైనాలోని గుయాంగ్ నగరంలో ఉంటూ చదువుకుంటున్నారు.

అక్టోబర్‌ మొదటివారంలో ఆరోగ్యం పాడవడంతో హుయాన్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడికి వెళ్లే సమయానికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. పోషకాహార లోపంతో మరీ బక్కపల్చగా తయారయ్యారు. బరువు 20 కేజీలకు పడిపోయింది.

ఎత్తు కూడా 4.5 అడుగులే ఉండటంతో ఆమె వయసుతో పోలిస్తే చాలా బలహీనంగా కనిపించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమె కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న తన తమ్ముడికి వైద్యం చేయించడానికి, తాను చదువుకోవడానికి డబ్బులు అవసరమని.. అందుకే చాలా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటూ డబ్బులు పొదుపు చేస్తున్నానని ఆమె వైద్యులకు చెప్పారు. వైద్యులు ఆ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె కథ పత్రికల్లో హెడ్‌లైన్‌గా మారింది.

హుయాన్

ఫొటో సోర్స్, Weibo

హుయాన్‌కు నాలుగేళ్ల వయసప్పుడే తల్లి చనిపోయారు. ఆమె స్కూల్లో చేరాక తండ్రి కూడా మరణించారు. దాంతో తమ్ముడితో కలిసి హుయాన్ బంధువులపై ఆధారపడి జీవించడం మొదలుపెట్టారు. వాళ్లు నెలకు కేవలం 3 వేల రూపాయలు వీళ్లిద్దరి ఖర్చుల కోసం ఇచ్చేవారు.

ఆ డబ్బులో చాలావరకు మానసిక సమస్యతో బాధపడుతున్న హుయాన్ తమ్ముడి వైద్య ఖర్చుల కోసమే సరిపోయేవి. దాంతో హుయాన్ తనకోసం రోజుకు 22 రూపాయలకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకునే అవకాశం లేదు. అందుకే ఆమె కేవలం కాస్త అన్నం, మిరపకాయలు కలిపి తింటూ రోజులు గడిపారు.

తరువాత ఏం జరిగింది?

హుయాన్ కథ పత్రికల్లో వచ్చాక.. వాళ్లను పట్టించుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ సోషల్ మీడియాలో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చదివే కళాశాల కూడా ఆమెను పట్టించుకోకపోవడం దారుణం అంటూ విమర్శించారు.

'అఫ్ఘానిస్థాన్‌లో శరణార్థుల కంటే ఆమె పరిస్థితి దారుణంగా ఉంది' అని ఒకరంటే, 'చైనా 70ఏళ్ల సంబరాలకు పెట్టిన ఖర్చులో కొంత ఇలాంటి వారికోసం పెడితే బావుండేది' అని ఇంకొకరు అన్నారు.

ఓ పక్క చదువుకుంటూనే తమ్ముడి కోసం ఆమె చేసిన త్యాగాన్ని చాలామంది ప్రశంసించారు.

వాంగ్

ఫొటో సోర్స్, People's Daily

క్రౌడ్ ఫండింగ్ వేదికల్లో కొందరు హుయాన్ కోసం డబ్బులు సేకరించడం మొదలుపెట్టారు. దాంతో, ఆమె టీచర్లు, తోటి విద్యార్థులు కూడా ముందుకొచ్చి రూ.4లక్షల దాకా అందించారు. ఆమె ఉంటున్న ఊళ్లోని ప్రజలు రూ.3లక్షల దాకా ఇచ్చారు.

క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బు కూడా కలిపితే ఆమెకు మొత్తం రూ. 80లక్షల దాకా సాయం అందింది. ప్రభుత్వ అధికారులు కూడా ఆమెకు ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ కింద రూ. 2 లక్షల వరకూ ఇవ్వనున్నట్లు తెలిపారు.

హుయాన్ కథ... గత ఏడాది తలనిండా అట్టకట్టిన మంచుతో స్కూల్‌కి వచ్చిన 'వాంగ్' అనే పిల్లాడి కథను తలపిస్తోందని చాలామంది అంటున్నారు. చలి నుంచి కాపాడుకోవడానికి కనీస దుస్తులు కూడా లేని పరిస్థితుల్లో స్కూల్‌కి వచ్చిన అతడి కథ కూడా అప్పట్లో వైరల్‌గా మారింది.

ఓ పక్క గత కొన్ని దశాబ్దాలుగా చైనా ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నా, మరోపక్క పేదరికం, అసమానతలు ఏమాత్రం తగ్గలేదనడానికి ఇలాంటి ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)