వాట్సాప్ హ్యాకింగ్: ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ ఏమంటోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హరేంద్ర మిశ్రా
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, ఇజ్రాయెల్ నుంచి
ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ తన స్పైవేర్ పెగాసస్ ద్వారా తమ యూజర్లు చాలామందిపై నిఘా పెట్టిందని ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ ఆరోపించింది.
స్పైవేర్ పెగాసస్ నిఘాకు బలైన వారిలో ప్రపంచ స్థాయి దౌత్యవేత్తలు, రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఇజ్రాయెల్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్‌పై వాట్సాప్ మంగళవారంనాడు కేసు వేసింది.
ఎంతోమంది భారత జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఈ నిఘాకు గురయ్యారు.
ఎన్ఎస్ఓ డెవలప్ చేసిన ఒక టెక్నిక్ ద్వారా సుమారు 1400 మంది ఫోన్లు హ్యాక్ చేసిన అజ్ఞాత సంస్థలు వారిపై నిఘా పెట్టాయని వాట్సాప్ చెబుతోంది. నాలుగు ఖండాల్లో యూజర్స్ ఈ నిఘాకు గురయ్యారని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాట్సాప్ ఏం చెప్పింది?
అయితే, ఎవరు చెప్పడం వల్ల జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లు హ్యాక్ చేశారు అనేది వాట్సాప్ ఇప్పటివరకూ స్పష్టం చేయలేదు.
మేలో తమకు ఒక సైబర్ దాడి గురించి తెలిసిందని, అందులో తమ వీడియో కాలింగ్ వ్యవస్థ ద్వారా యాప్ ఉపయోగించే వారి ఫోన్లలోకి మాల్‌వేర్ పంపించారని వాట్సాప్ కంపెనీ చెప్పింది.
దాదాపు 1400 మంది యూజర్లకు ప్రత్యేకంగా వాట్సాప్ సందేశం ద్వారా దాని గురించి సమాచారం ఇచ్చామని ఆ కంపెనీ తెలిపింది. అయితే భారత్‌లో ఈ స్పైవేర్ దాడికి ఎంతమంది ప్రభావితం అయ్యారో సంఖ్య చెప్పలేదు. కానీ, "నేను సంప్రదించినవారిలో భారత యూజర్స్ కూడా ఉన్నారు" అని ఆ కంపెనీ ప్రతినిధి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ను 150 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. భారత్‌లో సుమారు 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు.
మెసేజింగ్ యాప్‌లోని ఒక పెద్ద లోపాన్ని ఉపయోగించుకున్న హ్యాకర్లు... ఫోన్లు, మిగతా పరికరాలపై దూరం నుంచే నిఘా పెట్టగలిగేలా ఫోన్లలో సాఫ్ట్‌వేర్ వేశారు.
"ప్రభుత్వం వాట్సాప్‌లో పౌరుల గోప్యత ఉల్లంఘన గురించి ఆందోళనగా ఉంది, ప్రభుత్వం భారతీయులందరి గోప్యత భద్రతకు కట్టుబడి ఉంది" అని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్ఎస్ఓ సమాధానం ఏంటి?
దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్ఎస్ఓ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఈ ఆరోపణలపై గట్టిగా పోరాడతామని చెప్పింది.
ఎన్ఎస్ఓ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. "మేం ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. తీవ్రవాదంపై, తీవ్ర నేరాలపై పోరాడేలా సాయం చేసేందుకు లైసెన్స్‌డ్ ప్రభుత్వ నిఘా ఏజెన్సీలు, చట్టం అమలు చేసే సంస్థలకు టెక్నాలజీ అందించడమే మా ఏకైక ఉద్దేశం" అని ఎన్ఎస్ఓ చెప్పింది.
"మా టెక్నాలజీ మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి కాదు, దానికి అనుమతి కూడా లేదు. మా టెక్నాలజీ ఇటీవల వేలాది మంది ప్రాణాలు కాపాడ్డానికి సాయం చేసింది" అని తెలిపింది.
"నిజం ఏంటంటే, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారు, డ్రగ్ డీలర్లు, తీవ్రవాదులు తమ నేర కార్యకలాపాలను దాచడానికి తరచూ కఠినంగా ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తారు" అని ఎన్ఎస్ఓ చెప్పింది.
"మంచి టెక్నాలజీ కొరతతో ఉన్న చట్ట సంస్థలు మనకు భద్రత కల్పించడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్ఎస్ఓ టెక్నాలజీ వాటికి చట్టప్రకారం, తగిన పరిష్కారాన్ని అందిస్తుంది."
"మా ఉత్పత్తిని తీవ్రమైన నేరాలు, తీవ్రవాదం మినహా వేరే వాటికి ఉపయోగిస్తే అది దుర్వినియోగం చేసినట్లే అని మేం భావిస్తున్నాం. అది మా ఒప్పందంలో ఉంది. ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేస్తూ పట్టుబడితే వారిపై మేం చర్యలు తీసుకుంటాం" అని ఎన్ఎస్ఓ చెప్పింది.
"ఈ సాంకేతికత మానవ హక్కుల సంరక్షణకు అంతర్లీనంగా కట్టుబడి ఉంటుంది. మేం ఐక్యరాజ్య సమితి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ ఇచ్చాం. కాబట్టి మా ఉత్పత్తులన్నీ ప్రాథమిక మానవ హక్కులను గౌరవించేలా చూసుకుంటున్నాం."

ఫొటో సోర్స్, Getty Images
సైబర్ ఆయుధాలపై ఇజ్రాయెల్ మినహాయింపు
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని దేశాల ప్రభుత్వాలు సైబర్ ఆయుధాల సాయంతో రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్న అసంతృప్తిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎన్నో మానవ హక్కుల సంఘాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి.
ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ సైబర్ ఆయుధాల ఎగుమతికి సంబంధించిన నిబంధనలను ఇజ్రాయెల్ సడలించింది.
ఆగస్టులో ప్రచురించిన ఒక స్థానిక మీడియా నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ తమ నిబంధనలను మార్చింది. దాని ప్రకారం, సైబర్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కంపెనీలు కొన్ని ప్రత్యేక దేశాల్లో ఉత్పత్తుల అమ్మకాలకు మార్కెటింగ్ లైసెన్స్ నుంచి మినహాయింపులు కూడా పొందచ్చు.
ఇజ్రాయెల్ కంపెనీల స్పైవేర్ వినియోగదారుల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఈ దేశాల మానవ హక్కుల రికార్డులను అంత మెరుగ్గా భావించరు.
నిబంధనలు సడలించడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ విషయంలో ఒక కఠిన ప్రక్రియ అమలుచేయాలని ఈ ఏడాది ప్రారంభంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణాలు తీసిన స్పైవేర్
కొన్ని దేశాల్లో నేతలు ఎన్ఎస్ఓ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించి తమ రాజకీయ ప్రత్యర్థుల ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నించారని స్థానిక మీడియాలో చాలాసార్లు చర్చ జరిగింది. రువాండా ప్రభుత్వం కూడా దీనిని ఎక్కువగా ఉపయోగించిందని 'ఫైనాన్షియల్ టైమ్స్' తన నివేదికలో చెప్పింది.
"మా కంపెనీ తయారు చేసే సాంకేతికతతో తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాల్లో అనుమానితుల డేటాను సేకరిస్తాం. దాని ద్వారా ప్రభుత్వ నిఘా ఏజెన్సీలకు సాయం లభిస్తుంది" అని ఎన్ఎస్ఓ సిబ్బంది ఒకరు పేరు బయటపెట్టకూడదనే షరతుపై చెప్పారు.
ఎన్ఎస్ఓపై మాటిమాటికీ హ్యాకింగ్ నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఎన్ఎస్ఓ కంపెనీని ఫిబ్రవరిలో యూరప్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ 'నోవాల్పినా కాపిటల్ ఎల్ఎల్‌పీ' వంద కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. అలా, ఎన్ఎస్ఓ ఇజ్రాయెల్‌లో ఉన్నప్పటికీ, దాని యాజమాన్యం మాత్రం ఒక యూరోపియన్ కంపెనీ.
హ్యాకింగ్ ఆరోపణలపై సమాధానం ఇచ్చిన నోవాల్పినా కాపిటల్ ఎల్ఎల్‌పీ.. "ఆ కంపెనీలో సిబ్బంది పనిచేసే విధానానికి కొత్త ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేస్తున్నట్లు" కొన్ని నెలల క్రితం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- వాట్సాప్ మెసేజెస్ మూలాలను తెలుసుకోవాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది...
- ‘అమరావతిపై మీ వైఖరేంటి...హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడం లేదు’
- పాకిస్తాన్లో ‘గాంధీ’ని కాపాడిన జిన్నా
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- సౌరవ్ గంగూలీ: 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
- వెంటనే చర్చలు ప్రారంభించండి - ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
- పశ్చిమ బెంగాల్: ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య కేసులో ఆర్ఎస్ఎస్ కోణం
- ‘కడుపు కాలే రోడ్ల మీదకు వచ్చాం... తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’
- టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...
- అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








