చైనా రైతులు సరిహద్దు దాటి రష్యాలోకి ఎందుకు అడుగుపెడుతున్నారు?

- రచయిత, ఆండ్రీ జఖరోవ్, అనస్తాసియా నపల్కోవ
- హోదా, బీబీసీ రష్యన్ సర్వీస్
మక్సిమోవ్కలోని వ్యవసాయ క్షేత్రం చుట్టూ భారీ స్థాయిలో ఇనుప కంచెలు ఉన్నాయి. అందులో పనిచేసే చైనా వలస కార్మికులు కేవలం షాపింగ్ కోసమే ఈ పొలాన్ని వదిలివెళతారు. రష్యా తూర్పు ప్రాంతంలో, గ్రామం మధ్యలో ఉన్న ఒక పాడుబడిన భవనం.. దాని తలుపులకు తాళాల్లేవు. భవనం లోపల నేలపై 1980లు, 1990ల నాటి పాత పేపర్ల చిత్తు కాగితాలు పడిఉన్నాయి.
ఒకప్పుడు 400 మంది రష్యన్లకు పని కల్పించిన ఒక వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు ఎందుకు మనుగడ సాగించలేకపోతోందో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు.
గ్రామీణ రష్యాలోని చాలా వ్యవసాయ క్షేత్రాల్లాగే, మయాక్ పొలం కూడా పాత సోవియట్ యూనియన్ లాగే కుప్పకూలింది.
అప్పుడే చైనా కార్మికులు, తమ సరిహద్దులో ఉన్న ఐదు ప్రాంతాల్లో అడుగుపెట్టారు. అయితే, తమ పొరుగువారిని ఆహ్వానించేందుకు రష్యన్లు ప్రతిసారీ సంతోషంగా లేరు.
''రష్యాలో పని కూడా చైనాలోలాగే ఉంటుంది. పొద్దున్నే లేవాలి, పనికెళ్లాలి'' అని చోమ్ వాంపెన్ బీబీసీ రష్యన్ సర్వీస్‌తో అన్నారు.
రష్యాలోని జనాభా తక్కువగా ఉన్న ఈ సువిశాల ప్రాంతానికి 1990 తొలినాళ్లలో వచ్చిన వేలాది మంది చైనీయుల్లో అతను ఒకరు.

వీరిలో చాలామంది రష్యన్లు లేదా చైనీయుల ఆధీనంలోని పంట పొలాల్లో పనిచేస్తారు. లేదంటే, భూమిని లీజుకు తీసుకుని, సొంతంగా వ్యవసాయ పరిశ్రమలు అభివృద్ధి చేస్తారు.
పాశ్చాత్య ప్రపంచంతో రష్యా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని స్వాగతించారు.
మయాక్ ఛైర్మన్ యెవ్గెనీ ఫొకిన్ వేలాది హెక్టార్ల భూమిని చైనా పారిశ్రామికవేత్తలకు లీజుకిచ్చారు. ఈ భూములన్నీ చాలా విస్తారమైనవి, వీటి కౌలు చాలా తక్కువ.
''ఫొకిన్‌కు మేం షేర్లు ఇచ్చాం. భూమి ఉమ్మడిగా ఉంటేనే మంచిదని మేం భావించాం. కానీ, ఆయన మాత్రం ఈ భూములన్నింటినీ చైనీయులకు ఇచ్చి వెళ్లిపోయాడు, మేం మాత్రం అంతా కోల్పోయాం'' అని మక్సిమోవ్క గ్రామ వాసి తత్యన ఇవనోవ్న అన్నారు.
''అదేం లేదు. ఇలా చేయటంలో అసాధారణమైందేమీ లేదు'' అన్నారు ఫోకిన్.

చైనా కంపెనీలు ఎలా ఎదిగాయి?
2000 తొలినాళ్లలోనే రష్యా తూర్పు ప్రాంతంలో చైనా కంపెనీలు తొలిసారి అడుగుపెట్టాయి. అయితే, చైనా ప్రబుత్వానికి ఈ ప్రాంతంపై ఆసక్తి పెరిగింది మాత్రం 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాతే.
''అక్కడ భయాందోళనలున్నాయి. (చైనా కంపెనీలు) ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అని చూస్తున్నాయి'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని చైనీయుల ఆధీనంలోని ఒక వ్యవసాయ క్షేత్రం అధిపతి బీబీసీ రష్యన్ సర్వీస్‌తో చెప్పారు.
చైనీయుల పెట్టుబడులతో పాటే చైనా వసలదారుల ప్రవాహం కూడా ఉంటుంది.
''మాకున్న భూమి తక్కువ. ప్రజలు చాలా ఎక్కువ'' అని ఒక చైనా రైతు చెప్పారు.

ప్రభుత్వ భూముల రిజిస్టర్ విడుదల చేసిన సమాచారం ఆధారంగా.. రష్యా తూర్పు ప్రాంతంలో 350,000 హెక్టార్ల (3,500 చదరపు కిలోమీటర్లు) భూమిని చైనా జాతీయులు తమ సొంతం చేసుకున్నారు లేదంటే లీజుకు తీసుకున్నారు. 2018లో ఈ ప్రాంతంలో దాదాపు 22 లక్షల హెక్టార్ల రష్యా భూమిని వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించారు.
అయితే, వాస్తవ నిష్పత్తి ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చని బీబీసీకి తెలిసింది.
రష్యా తూర్పు ప్రాంతంలో చైనా రైతులు 40 శాతం ఉన్నారని బీబీసీ అథ్యయనంలో తేలింది. ఇది ప్రధానంగా బిరోబిద్జన్‌కు చెందిన యూదు స్వతంత్ర ప్రాంతం.
ఈ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ లెవింటల్ మాట్లాడుతూ.. చాలా కేసుల్లో రష్యన్లు అధికారికంగా లీజుకు ఇచ్చిన భూమి వాస్తవంగా చైనా జాతీయుల ఆధీనంలో ఉందని చెప్పారు.
''ఉమ్మడి సముదాయాలకు చెందిన దాదాపు అన్ని భూములూ చైనీయులకు అప్పగించారు'' అని యూదు స్వతంత్ర ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు అలెగ్జాండర్ లరిక్ చెప్పారు.

సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి?
చైనా వలసదారులు నడిపే వ్యవసాయ క్షేత్రాలన్నీ కోటలను తలపిస్తుంటాయి. చైనా సరిహద్దు నుంచి అరగంట ప్రయాణిస్తే వచ్చే బాబ్‌స్తొవొలో ఒక ఫ్రెండ్‌షిప్ పొలం చుట్టూ ఎత్తైన కంచె, ఎరుపు జెండా ఉన్నాయి.
అయితే, ఒపిట్నోయ్ పొల్యే గ్రామంలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ రష్యన్లు, చైనీయులు.. ఇరు దేశాల కార్మికులను జిన్ జీ పనిలో పెట్టుకున్నారు.
చాలామంది చైనీయుల్లాగే, ఆయన కూడా ఒక రష్యా పేరును పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చైనీస్ దిమాగా పేరొందారు.
1990ల్లో రష్యాకు వచ్చిన చైనీస్ దిమా 2500 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకుని సోయా పంటను వేశారు. స్థానిక నర్సరీ స్కూలు పిల్లలకు బహుమతులు కొనడం, శీతాకాలంలో శివారు గ్రామాల్లో పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తన ట్రాక్టర్లను పంపించడం వంటి పనులతో ఆయన స్థానికులతో బాగా కలిసిపోయారు.

ఇలా కొందరు చైనీయులు స్థానికులతో చాలా బాగా మమేకమైపోయారు.
అయితే, చైనీయులు, రష్యన్ల మధ్య సంఘర్షణలు తరచూ జరుగుతుంటాయి. 2015లో ముగ్గరు రష్యన్లు తూర్పు ఆముర్ ప్రాంతంలోని ఒక చైనా ఫ్యాక్టరీలోకి ప్రవేశించి, చైనీస్ గార్డును కర్రతో బెదిరించి, తమకు ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొన్ని రోజుల తర్వాత వీళ్లు ఒక ట్రాక్టర్ ఇంజిన్ దొంగిలించేందుకు తిరిగి రాగా, అదే చైనీస్ గార్డు ఒక గొడ్డలి పట్టుకుని వీరితో తలపడ్డాడు.
ఈ ముగ్గురికీ ఐదు నుంచి తొమ్మిదేళ్ల పాటు జైలుశిక్షలు పడ్డాయి.

చాలామంది చైనీయులు కాలానుగుణంగా ఊడ్పులు, కోతల పనుల కోసం సరిహద్దు దాటుతుంటారు. ఆ పనులు ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళతారు.
అయితే, చైనీయుల ప్రవాహం పట్ల చాలామంది రష్యన్లు అసంతృప్తితో ఉన్నారు. చైనీయుల రష్యా విధానం విస్తరణలాగా ఉందని 2017లో రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నిర్వహించిన ఒక పోల్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు అభిప్రాయపడ్డారు.
రష్యా ప్రాదేశిక సమగ్రతకు చైనా ముప్పు తెస్తోందని దాదాపు సగం మంది చెప్పారు. తమ దేశ ఆర్థికాభివృద్ధి ప్రమాదంలో పడిందని మరో మూడో వంతు మంది అభిప్రాయపడ్డారు.
''వాళ్లు ఉదయం ఏడింటికి వెళతారు, చీకటి పడ్డాక వస్తారు. నేను వాళ్లను చూడను, వాళ్లు కూడా నన్ను చూడరు'' అని దిమిత్రొవొ గ్రామ వాసి ఇవనోవిచ్ తన చైనా పొరుగువారి గురించి చెప్పుకొచ్చారు.
అయితే, కొందరు రష్యన్లు మాత్రం చైనీయులతో స్నేహ సంబంధాలు పెంచుకున్నారు.
''వాళ్లు బీరు తీసుకొస్తారు. మేం తాగుతాం. నేను వారికి గుడ్లు, తేనె ఇస్తాను'' అని అలెగ్జాండర్ చెప్పారు.

రష్యా కార్మికులు ఎందుకు పోటీ పడలేకపోతున్నారు?
రష్యా తూర్పు ప్రాంతంలోని చైనా వ్యవసాయ కార్మికులు, ఆ ప్రాంతంలోని రష్యా వ్యవసాయ కార్మికులకంటే కొన్నిసార్లు బాగా పనిచేస్తారన్న పేరు తెచ్చుకున్నారు.
''చైనీయులు మద్యం సేవించరు. వాళ్లు ఎక్కడికీ పారిపోరు. వాళ్లు ఈ సీజన్ కోసమే వచ్చారు. మా వాళ్లు మాత్రం ఒక వారం పనిచేస్తారు, డబ్బుల కోసం అర్ధిస్తారు. తర్వాత మద్యం తాగేందుకు వెళ్లిపోతారు'' అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక రష్యా వ్యవసాయ క్షేత్రం అధిపతి తమ దేశ కార్మికులపై ఫిర్యాదు చేశారు.
చైనా వ్యవసాయ క్షేత్రాల యజమానులు సాధారణంగా చైనా వలసదారులనే పనికి పెట్టుకుంటారని, రష్యా జాతీయులకు మాత్రం తక్కువ నైపుణ్యం ఉండే పనులు ఇస్తుంటారని యూదు స్వతంత్ర ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు లరిక్ చెప్పారు.

రష్యా ఉద్యోగుల మద్యం అలవాట్లపై పేరు వెల్లడించడానికి ఇష్టపడని చైనా రైతు ఒకరు ఫిర్యాదు చేశారు.
''రష్యన్లంతా తాగుతారు. ఇవ్వాళ మీరు వారికి డబ్బులిస్తే, రేపు వాళ్లు కనిపించరు. క్రమశిక్షణ సమస్యలు ఉన్నాయి'' అని ఆయన వెల్లడించారు.
కార్మికుల హక్కులను రక్షించడంలో రష్యాకు మంచి రికార్డు లేదు, ప్రధానంగా వ్యవసాయ పరిశ్రమకు సంబంధించి. ఇందులో సాధారణంగా వేతనాలు తక్కువగా ఉంటాయి.
అయితే, స్థానిక కార్మికుల పట్ల అందరికీ చిన్నచూపేమీ లేదు.
''రష్యా, చైనా కార్మికుల మధ్య తేడా ఏంటి? చైనీయుల కంటే రష్యా కార్మికులు తెలివైనవాళ్లు'' అని చొమ్ వాంపెన్ చెప్పారు.
అన్ని ఫొటోలూ కాపీరైట్ చేయబడ్డాయి.
ఇవి కూడా చదవండి:
- ప్రకృతిని కాపాడేందుకు వేటను వదిలేసిన ఆదివాసీలు
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- రష్యా మంత్రి బంపర్ ప్రైజ్: సరైన సమాధానం చెబితే 2.5 ఎకరాల భూమి ఫ్రీ
- జోసెఫ్ స్టాలిన్: హిట్లర్నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, నియంత కూడా
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
- వాట్సాప్ మెసేజ్‌ల మీద నిఘా పెట్టాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది?
- అనుష్క శర్మకు మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్‌పై ఎందుకు కోపం వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











