జింబాబ్వే: అమ్మకానికి గున్న ఏనుగులు

ఫొటో సోర్స్, Reuters
దాదాపు 30 గున్న ఏనుగులను విదేశాలకు అమ్మడం ద్వారా, తరలించామని జింబాబ్వే వెల్లడించింది.
ఈ అమ్మకంపై జంతు సంరక్షణ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా జంతువులు ఆందోళనకు గురవుతాయని వారంటున్నారు.
కానీ, ఇప్పటికే కరవు కారణంగా 55 ఏనుగులు మరణించాయని, ఇతర జంతువులను కాపాడాలంటే నిధులు కావాలని, అందుకే ఇలా చేశామని జింబాబ్వే నేషనల్ పార్క్స్ సర్వీస్ చెబుతోంది.
ఏనుగు పిల్లలను ఇలా తరలించి దాదాపు సంవత్సరం గడుస్తోంది.
ఈ అమ్మకం ద్వారా వచ్చిన నిధులతో హాంగీ నేషనల్ పార్క్‌లో బావులు తవ్వి, ఇతర వన్యప్రాణులను కరవు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని జింబాబ్వే నేషనల్ పార్క్స్ ప్రతినిధి తెనాషి ఫరావో తెలిపారు.
ప్రజల్లో అనవసర ఆగ్రహాన్ని సృష్టించడానికి ఆందోళనకారులు దీన్నో ఉద్వేగపూరిత అంశంగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఈ నిర్ణయాన్ని అడ్వొకేట్స్4ఎర్త్ పర్యావరణ పరిరక్షణ గ్రూప్ డైరెక్టర్ లెనిన్ చిసైరా తప్పుబట్టారు.
"ఏనుగులను వేటాడటం, పట్టుకోవడంతో పాటు వాటికి అనువైన, అలవాటైన ప్రాంతం నుంచి అమ్మకాల పేరుతో విదేశాలకు తరలించడం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ చాలా కాలంగా మేం పోరాటం చేస్తున్నాం. సాధారణంగా వాటిని జూలకు తరలిస్తుంటారు. అక్కడ వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది" అని ఆమె బీబీసీతో అన్నారు.
నేషనల్ పార్క్ సమీపంలో విస్తృత స్థాయిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల కారణంగా ఇక్కడి నీటి వనరుల స్థాయి తీవ్రంగా ప్రభావితమైందని చిసైరా అన్నారు. దీనివల్ల జంతువులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి, నీటికోసం అక్కడున్న జంతువులతో పోరాడాల్సి వస్తోందని ఆమె తెలిపారు.
ఆఫ్రికాలోని ఏనుగులను ఖండం దాటించి ఇతర దేశాలకు అమ్మడాన్ని నిషేధించే ప్రతిపాదనను ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా సదస్సు ఆగస్టులో ఆమోదించింది.

కరవు కారణంగా 55 ఏనుగులు మృతి
జింబాబ్వేలోని హాంగీ నేషనల్ పార్క్‌లో గత రెండు నెలల్లో కనీసం 55 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులే దీనికి కారణం.
కరవు కారణంగా జింబాబ్వేలో వ్యవసాయ దిగబడులు దారుణంగా పడిపోయాయి.
దేశ జనాభాలో మూడో వంతు ఆహారం లేక ఇబ్బందుల్లో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం 20 లక్షల మంది ఆకలి చావుల అంచున ఉన్నారని వెల్లడైంది.
మరణించిన ఏనుగుల్లో కొన్ని నీటి గుంటలకు కేవలం 50 గజాల దూరంలో పడి ఉన్నాయి. అంటే, అవి చాలా దూరం ప్రయాణించి, అలసిపోయి, నీటిని చేరేలోపే మరణించాయి.
హాంగీ పార్కులో 15000 ఏనుగులకు సరిపడే సౌకర్యాలున్నాయి. కానీ ప్రస్తుతం 50000కు పైగా ఏనుగులు ఉండటంతో పంటపొలాలపై తీవ్ర ప్రభావం చూపింది. కేవలం వర్షాభావ పరిస్థితులొక్కటే దీనికి కారణం కాదు.. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఏనుగులు కూడా ఓ ప్రధాన కారణమే. ఆహారం కోసం అవి సమీప పంటపొలాల్లోకి ప్రవేశించేవి. ఈ క్రమంలో అవి 22మంది పౌరుల మృతికి కూడా కారణమయ్యాయి.
జింబాబ్వేలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కూడా వన్యప్రాణులకు సౌకర్యాల లేమికి ఓ ప్రధాన కారణం.
ఇవి కూడా చదవండి.
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా?
- జలపాతంలో గున్న ఏనుగును కాపాడే ప్రయత్నంలో చనిపోయిన ఏనుగులు ఆరు కాదు 11
- ధనత్రయోదశి: బంగారం కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనా
- నుస్రత్ జహాన్‌పై లైంగిక వేధింపులు, హత్యకేసులో 16మందికి మరణ శిక్ష
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- బీజేపీ విజయాలకు కారణం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లేకపోవడమేనా
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








