18 సంవత్సరాల్లోపు యూజర్లకు ఇలాంటి పోస్టులు ఇక కనిపించవు - ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కఠిన చర్యలు

బరువు తగ్గడం

ఫొటో సోర్స్, Getty Images

బరువు తగ్గే ఉత్పత్తులు, శారీరక సౌందర్య శస్త్రచికిత్సల(కాస్మటిక్ సర్జరీల)కు సంబంధించిన పోస్టుల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే మరింత కఠినమైన చర్యలు తప్పవని ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను హెచ్చరించింది. ఈ చర్యలు ఫేస్‌బుక్‌లోనూ అమలవుతాయి.

18 సంవత్సరాల్లోపు యూజర్లకు ఇలాంటి పోస్టులు కనిపించకుండా 'హైడ్' చేస్తామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. బరువు తగ్గడంలో 'అద్భుత' ఫలితాలు ఇస్తాయనే ఉత్పత్తులకు అవాస్తవిక రీతిలో ప్రచారం కల్పించే పోస్టులను ఏకంగా తొలగిస్తామని చెప్పింది.

బరువుకు సంబంధించిన ఆహార ఉత్పత్తులకు కల్పించే ప్రచారం పిల్లలు, చిన్నవయసువారిపై చూపే ప్రభావం గురించి అంతటా ఆందోళన పెరుగుతోంది.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, PA Media

మనుషుల శరీరాకృతిని అవహేళన చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించే బ్రిటన్ నటి జమీలా జమిల్ ఇన్‌స్టాగ్రామ్ తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. బరువు తగ్గడానికి సంబంధించిన ఉత్పత్తుల గురించి వాస్తవ విరుద్ధమైన రీతిలో ప్రచారం చేసుకొనే పరిశ్రమపై ఇది పెద్ద విజయమని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ ఉత్పత్తులకు సంబంధించి సెలబ్రిటీలు ఇచ్చే సోషల్ మీడియా ప్రకటనలను నిషేధించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ ఇంగ్లండ్ మెడికల్ డైరెక్టర్ స్టీఫెన్ పోవిస్ ఫిబ్రవరిలో సూచించారు. ఇవి పిల్లలు, చిన్నవయసువారిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

'ఒత్తిడిని నివారించేందుకే'

'ఈ ఉత్పత్తులు వాడండి, మీ బరువును తక్షణం తగ్గించుకోండి' అంటూ అవాస్తవిక రీతిలో సాగించే ప్రచారాన్ని ఇన్‌స్టాగ్రామ్ అడ్డుకొంటుంది. డైటింగ్, కాస్మటిక్ సర్జరీకి సంబంధించిన ఉత్పత్తులను కొనేలా రాయితీలిచ్చే కొన్ని పోస్టులను పిల్లలు, చిన్నవయసువారికి కనిపించకుండా చేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ పబ్లిక్ పాలసీ మేనేజర్ ఎమ్మా కొలిన్స్ మాట్లాడుతూ- ఇన్‌స్టాగ్రామ్ ప్రతి యూజర్‌కూ ఒక సానుకూల వేదికగా ఉండాలన్నది తమ కోరికన్నారు.

సోషల్ మీడియా వల్ల కొంత మంది ఒత్తిడికి లోనవుతుంటారని, ఆ ఒత్తిడిని నివారించేందుకే తాజా మార్పులు తీసుకొచ్చామని ఆమె తెలిపారు. సోషల్ మీడియా విధానం నిపుణుల నుంచి సలహాలు తీసుకొన్నామని చెప్పారు.

జమీలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జమీలా

బరువు తగ్గించే ఉత్పత్తులను, అనారోగ్యకర జీవనశైలిని అలవర్చుకొనేలా చేసే ప్రచారానికి వ్యతిరేకంగా 'ఐ వెయ్' అనే ఉద్యమాన్ని జమీలా ప్రారంభించారు.

ఆన్‌లైన్లో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఒక వైఖరి తీసుకోవడం ప్రపంచానికి ముఖ్యమైన సందేశాన్ని పంపుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ అంశంలో ఆయా సంస్థలతో, అలాగే ఈ ప్రమాదకర ఉత్పత్తులపై అవగాహన కల్పించే నిపుణులతో కలసి పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)