పాక్ జైలులో ఉన్న కుల్‌భూషణ్‌తో మాట్లాడిన భారత దౌత్యాధికారి.. ఆయన చాలా ఒత్తిడిలో ఉన్నారని వెల్లడి

కుల్‌భూషణ్ జాధవ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్ ప్రస్తుతం చాలా ఒత్తిడిలో ఉన్నారని భారత్ సోమవారం చెప్పింది.

కుల్‌భూషణ్ జాధవ్‌కు కాన్సులర్‌తో మాట్లాడే అవకాశం లభించడంతో ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా సోమవారం ఆయన్ను కలిశారు.

ఈ భేటీ వివరాలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మీడియాతో చెబుతూ.. "జాధవ్ తన గురించి వస్తున్న తప్పుడు వాదనలతో చాలా ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది" అన్నారు.

జాధవ్‌ను కలిసిన విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయన తల్లికి కూడా చెప్పింది.

కుల్‌భూషణ్ జాధవ్

ఫొటో సోర్స్, PAKISTAN FOREIGN OFFICE

సురక్షితంగా తీసుకొస్తాం-భారత్

"కుల్‌భూషణ్ జాధవ్‌కు న్యాయం అందించేందుకు, ఆయన్ను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా దీనిపై సోమవారం ఒక మీడియా ప్రకటన జారీ చేసింది.

అందులో "వియన్నా ఒప్పందం, అంతర్జాతీయ కోర్టు తీర్పు, పాకిస్తాన్ చట్టాల ప్రకారం కుల్‌భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇచ్చామని పాకిస్తాన్ తెలిపింది.

పాకిస్తాన్ అధికారుల సమక్షంలో భారత్ డిప్యూటీ హైకమిషనర్ కుల్‌భూషణ్ జాధవ్‌తో రెండు గంటలపాటు సమావేశమయ్యారని కూడా అందులో చెప్పారు.

కుల్‌భూషణ్ జాధవ్

ఫొటో సోర్స్, AFP

భారత గూఢచారి-పాక్

కుల్‌భూషణ్ జాధవ్ భారత గూఢచారి అని, అతడు భారత నౌకాదళం, నిఘా ఏజెన్సీ 'రా' కోసం పనిచేసేవాడని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

కుల్‌భూషణ్ సుధీర్ జాధవ్‌ను 2018 మార్చిలో పాకిస్తాన్ నైరుతి ప్రాంతం బలూచిస్తాన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెంచింది.

పాకిస్తాన్‌లోని ఒక సైనిక కోర్టు 2017లో జాధవ్‌కు గూఢచార ఆరోపణలపై ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత భారత్ దానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కోర్టు తలుపు తట్టింది.

పాకిస్తాన్ ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిని ప్రశ్నించింది. కోర్టు ఆ అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. ఇది భారత్ పక్షాన వెలువడిన తీర్పు. కోర్టు తన తీర్పులో "1963 వియన్నా కన్వెన్షన్ ప్రకారం రెండు దేశాల మధ్య వివాదాలను ఐసీజే తప్పనిసరి పరిస్థితుల్లో పరిష్కరించవచ్చని" తెలిపింది.

కుల్‌భూషణ్ జాధవ్‌కు ఇన్ని రోజులైనా న్యాయ సహాయం అందించకుండా పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందనే భారత్ వాదనను కోర్టు సమర్థించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)