ప్రపంచంలోనే అత్యధికంగా మాంసం తినే దేశం ఏది?

ఫొటో సోర్స్, iStock
ఇటీవల కొన్ని రోజులుగా మీరు సోషల్ మీడియా సంభాషణల్లో జనాలు ఒక విషయం చెప్పడం మీరు గమనించే ఉంటారు. మాంసం తినడం తగ్గించాలని అనుకుంటున్నానని, లేదా పూర్తిగా మానేయబోతున్నానని ఎవరో ఒకరు అనే ఉంటారు.
ఆ సమయంలో వాళ్లు తమకు ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ నుంచి, పర్యావరణాన్ని, పశుపక్ష్యాదులను కాపాడాలని ఉందంటూ చాలా మాటలు మాట్లాడి ఉంటారు.
బ్రిటన్‌లో మూడింట ఒక వంతు బ్రిటన్ పౌరులు తాము మాంసం తినడం వదిలేశామని లేదా తగ్గించామని చెబుతున్నారు.
అమెరికాలో మూడింట రెండు వంతుల మంది తాము మొదటి నుంచే మాంసం తక్కువ తింటున్నామని అంటున్నారు.
ప్రజల ఆలోచనల్లో కనిపిస్తున్న ఈ మార్పులకు క్రెడిట్ ఎక్కువగా మాంసాహారానికి వ్యతిరేకంగా జరుగుతున్న 'మీట్-ఫ్రీ మండే', లేదా 'వీగనరీ' లాంటి ప్రచారాలకు ఇవ్వవచ్చు.
దీనితోపాటు చాలా డాక్యుమెంటరీలు, శాకాహారం వల్ల, మాంసాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అదే సమయంలో జనం ముందుకు వచ్చాయి.
కానీ ఇలాంటి వాటి వల్ల మాంసహారం వినియోగంపై ఏదైనా మార్పులు వచ్చాయా?
వినియోగం, ఉత్పత్తి రెండూ పెరిగాయి
ప్రపంచవ్యాప్తంగా మాంసాహారం వినియోగం గత 50 ఏళ్లలో వేగంగా పెరిగింది. దానితోపాటు 1960తో పోలిస్తే మాంసం ఉత్పత్తి కూడా ఐదు రెట్లు పెరిగింది.
1960లో మాంసం ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు ఉంటే, 2017లో అది 330 టన్నులు చేరింది. మాంసం వినియోగం పెరగడానికి ఒక పెద్ద కారణం జనాభా పెరుగుదలే.
ఆ సమయానికి ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువే అయ్యింది. 1960 ప్రారంభంలో ప్రపంచ జనాభా దాదాపు 3 బిలియన్లు ఉంటే, ఇప్పటి ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు.
అయితే మాంసం వినియోగం పెరగడానికి జనాభా పెరుగుదల మాత్రమే కారణం కాదు. మాంసం ఉత్పత్తి కూడా ఐదు రెట్లు పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
వేతనాలు పెరగడమూ కారణమే!
ప్రజల వేతనాలు పెరగడం కూడా దీనికి ఒక కారణం. ప్రపంచవ్యాప్తంగా జనం ఆర్థిక స్థోమత పెరుగుతోంది. కేవలం 50 ఏళ్లలో ప్రపంచ దేశాల ఆదాయం మూడు రెట్లు పెరిగింది.
మనం ప్రపంచంలోని వివిధ దేశాల్లో మాంసం వినియోగం గమనిస్తే, ఏయే దేశాల్లో ఎక్కువ సముద్రం ఉందో అక్కడే మాంసం వినియోగం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.
దీనికి అర్థం కేవలం జనాభా మాత్రమే కాదు, ప్రపంచంలో మాంసం తినడానికి ఖర్చు చేసేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు.
ప్రపంచంలో ఎవరెక్కువ మాంసం తింటున్నారు?
ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం లెక్కలు ఒకసారి చూస్తే సంపదకు, వినియోగానికి నేరుగా సంబంధం కనిపిస్తోంది. దాని గురించి ఇటీవల వెల్లడించిన గణాంకాలు 2013 నాటివి.
ఈ లెక్కల ప్రకారం అమెరికా, ఆస్ట్రేలియా వార్షిక మాంసం వినియోగంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇటు న్యూజీలాండ్, అర్జెంటీనాలో ప్రతి పౌరుడూ ఏడాదికి సగటున వంద కిలోగ్రాముల మాంసం వినియోగిస్తూ తమ దేశాలను ఈ పట్టికలో ముందువరుసలో నిలిపారు.
నిజానికి పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా పశ్చిమ యూరప్‌లోని ఎక్కువ దేశాల్లో ఒక వ్యక్తి వార్షిక మాంసం వినియోగం 80 నుంచి 90 కిలోలు ఉంది.
ఇటు పేద దేశాల్లో మాత్రం మాంసం వినియోగం చాలా తక్కువ ఉంది. ఒక సగటు ఇథియోపియా పౌరుడు ఏడాదికి కేవలం 7 కిలోల మాంసమే తింటున్నాడు.
ఇక, రువాండా, నైజీరియాలో ఉండే ఒక వ్యక్తి సగటున 8 నుంచి 9 కిలోల మాంసం తింటున్నారు. ఏ యూరోపియన్ దేశంలోని వ్యక్తితో పోల్చినా, ఈ లెక్క పది రెట్లు తక్కువ.
తక్కువ ఆదాయం వచ్చే దేశాల్లో మాంసం తినడం అనేది ఇప్పటికీ లగ్జరీగానే భావిస్తున్నారు. ప్రతి వ్యక్తికి వారి స్థాయిని బట్టి ఎంత మాంసం అందుబాటులో ఉందో ఈ గణాంకాలు చెబుతాయి.
కానీ ఈ గణాంకాల్లో ఇళ్లలో, దుకాణాల్లో పాడైపోయే మాంసాన్ని జోడించలేదు.
కానీ, అసలు విషయం ఇంకొకటి ఉంది. ఇంతకంటే తక్కువ మాంసం తినేవారు కూడా ఉన్నారు. కానీ అవి అంత పక్కా లెక్కలు కావు.

ఫొటో సోర్స్, Getty Images
మధ్యతరగతి ఉన్న దేశాల్లో పెరుగుతున్న మాంసం వినియోగం
ప్రపంచంలోని సంపన్న దేశాలలో అత్యధికంగా మాంసం తింటున్నారని, ఆదాయం తక్కువగా ఉంటున్న దేశాల్లో ప్రజలు తక్కువగా తింటున్నారనేది దీనితో స్పష్టమైంది.
గత 50 ఏళ్లుగా అదే జరుగుతూ వచ్చింది. అలాంటప్పుడు మాంసం వినియోగం ఇప్పుడే ఎందుకు పెరుగుతోంది.
మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాలే దీనికి కారణంగా భావిస్తున్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా, బ్రెజిల్ ఇటీవలి ఏళ్లలోనే ఆర్థికాభివృద్ధి సాధించాయి. దానితోపాటు ఈ దేశాల్లో మాంసహారం వినియోగం కూడా పెరిగింది.
కెన్యాలో 1960 తర్వాత ఇప్పటివరకూ మాంసం వినియోగంలో ఎలాంటి తేడా కనిపించలేదు.
అదే చైనాలో సగటున ఒక వ్యక్తి 1960వ దశకంలో ఏటా 5 కిలోలకంటే తక్కువ మాంసం తినేవారు. కానీ 80వ దశకంలో అది 20 కిలోలకు చేరింది. అదే గత కొన్ని దశాబ్దాలుగా ఈ మాంసం వినియోగం 60 కిలోలకు పెరిగింది.
బ్రెజిల్ విషయానికి వస్తే అది కూడా ఇలాగే ఉంది. 1990లో అక్కడ సగటు వ్యక్తి మాంసం వినియోగం సుమారు రెండు రెట్లు అయ్యింది. అంటే ఈ విషయంలో బ్రెజిల్ చాలా పశ్చిమ దేశాలను మించిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే అత్యంత తక్కువ మాంసం తినే దేశాల్లో భారత్
అయితే, భారత్‌పై ఈ విషయంలో ఒక అపవాదు ఉంది. భారత్‌లో 1990 తర్వాత ఇప్పటివరకూ సగటు ఆదాయంలో మూడు రెట్లు వృద్ధి ఉంది. కానీ మాంసం వినియోగంలో పెరుగుదల లేదు.
భారత్ గురించి చాలా మందికి ఒక భ్రమ ఉంది. భారతీయులు చాలా మంది శాకాహారులే అనుకుంటారు. దేశవ్యాప్తంగా జరిగిన ఒక సర్వే ప్రకారం, భారత్‌లో మూడింట రెండు వంతుల మంది కనీసం ఏదో ఒక రకం మాంసం తింటున్నారు.
అయినప్పటికీ భారత్‌లో మాంసం సగటు వినియోగం చాలా తక్కువగానే ఉంది. భారత్‌లో ఏటా ఒక వ్యక్తి మాంసం వినియోగం సగటున 4 కిలోలు. అంటే ప్రపంచంలోనే అత్యంత తక్కువ.
ఇందుకు దేశంలోని సాంస్కృతిక అంశాలే కారణం అని భావిస్తున్నారు.
పశ్చిమ దేశాల్లో మాంసం వినియోగం తగ్గుతోందా?
యూరప్ నుంచి ఉత్తర అమెరికా వరకూ చాలా మంది తాము మాంసం తినడం తగ్గించామని చెబుతున్నారు. కానీ ఆ ప్రభావం అక్కడ ఉందా? కానీ గణాంకాల ప్రకారం అలా జరుగుతున్నట్టు కనిపించడం లేదు
అమెరికా, పారిశ్రామిక విభాగానికి సంబంధించిన ఇటీవలి గణాంకాలు గత కొన్నేళ్లలో సగటున ఒక వ్యక్తి మాంసం వినియోగం తగ్గడానికి బదులు పెరిగిందని చెబుతున్నాయి.
యూరోపియన్ యూనియన్‌లో కూడా సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అయితే, పశ్చిమ దేశాల్లో మాంసం వినియోగంలో చెప్పుకోదగిన ఎలాంటి మార్పులు రాలేదు.
కానీ మాంసం ఎంపికలో ఒక మార్పు కనిపిస్తోంది. అంటే జనం రెడ్ మీట్, బీఫ్, పోర్క్ బదులు పౌల్ట్రీ ఉత్పత్తుల వైపు వెళ్తున్నారు. ఇలాంటి మార్పు ఆరోగ్యకరం, పర్యావరణానికి శ్రేయస్కరం.
మాంసం ప్రభావం ఎలా ఉంటుంది?
కొన్ని సందర్భాల్లో మాంసం తినడం వల్ల లాభాలు లభించవచ్చు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో మాంసం, డెయిరీ ఉత్పత్తులు తినడం వల్ల ప్రజల పౌష్ఠికాహారం మెరుగుపడవచ్చు.
కానీ పోషకాల కోసం మాంసాహారం ఒక అవసరం అనే దాన్ని మించి చాలా దేశాల్లో అది ఇంకా దూరం వెళ్లిపోయింది. నిజానికి దానివల్ల ప్రజల ఆరోగ్యమే ప్రమాదంలో పడవచ్చు.
రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తినడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, కొన్ని రకాల క్యాన్సర్లు రావచ్చని కొన్ని అధ్యయనాలలో వెల్లడైంది.
బీఫ్ లేదా పోర్క్ బదులు చికెన్‌కు మారడం అనేది పాజిటివ్ స్టెప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే చికెన్‌తో పోలిస్తే పశువుల పెంపకానికి ఎక్కువ స్థలం, నీళ్లు కావాలి.
వాటి వల్ల విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల ప్రభావం కూడా మూడు నుంచి పది రెట్లు ఎక్కువ ఉంటుంది. పర్యావరణంపై పోర్క్ ప్రభావం రెండు రెట్లు ఉంటుంది.
అంటే దానికి అర్థం మనం మాంసం ఎంపిక నుంచి స్థాయి వరకూ అన్నిటినీ మార్చుకోవాలి. కానీ మాంసాహారాన్ని మరోసారి లగ్జరీకి చిహ్నంగా చూడకపోవటమే మంచిది.
ఇవి కూడా చదవండి:
- రెండు దేశాలు తప్ప ఏ దేశ జాతీయ జెండాలోనూ కనిపించని రంగు ఏంటి? అది ఎందుకు కనిపించదు?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్ళి చేసుకున్నారు
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- ‘ముస్లింలపై దాడులను అడ్డుకోవడంలో భారత్ విఫలం’
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- 'యూట్యూబ్' వంటకాల సంచలనం మస్తానమ్మ కన్నుమూత
- కోడిగుడ్డు: 2.6 కోట్ల మంది ఎందుకు దీన్ని లైక్ చేశారు?
- బియాన్సే: శాకాహారులకు జీవితాంతం ఉచిత టికెట్లు ఈమె ఎందుకు ఇస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








