ట్రంప్ ఫౌండేషన్: ఎందుకు మూత పడుతోంది?

డోనల్డ్, ఇవాంకా ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్, ఇవాంకా ట్రంప్‌లు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌నకు చెందిన చారిటబుల్ ఫౌండేషన్‌ను మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్, మరికొందరు ఆ ఫౌండేషన్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ బార్బరా అండర్‌వుడ్ ఈ మేరకు ప్రకటించారు. మూసివేత ప్రక్రియలో భాగంగా ఫౌండేషన్ వద్ద ఉన్న నిధుల వినియోగం, పంపిణీకి సంబంధించిన వ్యవహారాలు బార్బరాయే చూడనున్నారు.

ఫౌండేషన్‌ను మూసివేయాల్సిందేనని ప్రకటించిన బార్బరా.. ''ట్రంప్, ఆయన ముగ్గురు పిల్లలు ఈ ఫౌండేషన్ సొమ్మును సొంతానికి, రాజకీయ లబ్ధికి వాడుకున్నారు'' అని ఆరోపించారు.

అయితే, ఫౌండేషన్ లాయర్ కూడా బార్బరాపై ప్రత్యారోపణలు చేశారు. ఆమె ఈ విషయాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ట్రంప్, ఆయన కుటుంబసభ్యుల చుట్టూ ముసురుకున్న కేసు ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా రష్యా జోక్యం వంటివీ చాలాకాలంగా దర్యాప్తులో ఉన్నాయి.

ట్రంప్ సంతానం ఇవాంకా, ఎరిక్, డోనల్డ్ జూనియర్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ సంతానం ఇవాంకా, ఎరిక్, డోనల్డ్ ట్రంప్ జూనియర్

విచారణాధికారులు ఏమంటున్నారు?

ట్రంప్ చారిటబుల్ ఫౌండేషన్ మూసివేసిన తరువాత కూడా ట్రంప్, ఆయన సంతానం జూనియర్ డోనల్డ్, ఇవాంకా, ఎరిక్‌లపై కేసు కొనసాగుతుందని అటార్నీ జనరల్ బార్బరా తెలిపారు.

ట్రంప్ వ్యాపారాలు, రాజకీయాల నిర్వహణకు ఈ ఫౌండేషన్‌ను చెక్ బుక్‌లా వాడుకున్నారని ఆమె ఆరోపించారు.

ఫౌండేషన్ మూసివేత ప్రక్రియ న్యాయాధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని, న్యాయాధికారులు నిర్ణయించిన సంస్థలకు ఈ నిధులు పంపిణీ చేస్తారని చెప్పారు.

చట్టం ముందు అందరూ సమానులే అన్నది ఈ మూసివేత నిర్ణయంతో మరోసారి రుజువైందని.. న్యాయం సాధించిన విజయానికి ఇది ప్రతీక అని ఆమె అన్నారు.

ట్రంప్, ఆయన సంతానం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ట్రంప్, ఆయన సంతానం

ఫౌండేషన్ ప్రతినిధుల మాటేమిటి?

మరోవైపు ట్రంఫ్ ఫౌండేషన్ లాయర్, మూసివేత ఒప్పందంపై సంతకం చేసిన అలెన్ ఫ్యూటర్ఫాస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ''న్యూయార్క్ అటార్నీ జనరల్ బార్బరా తప్పుదోవ ప్రకటించే ప్రకటన చేశారు. ఫౌండేషన్‌ను రద్దు చేసి ఆస్తులు, నిధులంతా సరైన ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాలని మేం ఇప్పటికే అనుకున్నాం. కానీ న్యూయార్క్ అటార్నీ జనరల్ గత రెండేళ్లుగా ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు'' అన్నారు.

సంస్థకు చెందిన 1.7 మిలియన్ డాలర్లు ఆర్తులకు చేరకుండా అడ్డుకుంటున్నారనీ ఆయన ఆరోపించారు.

గత దశాబ్దకాలంలో ట్రంప్ సొంత డబ్బు 8.25 మిలియన్ డాలర్లు సహా మొత్తం 19 మిలియన్ డాలర్లను ఫౌండేషన్ 700 చారిటబుల్ సంస్థలకు పంపిణీ చేసిందని ఆయన చెప్పారు.

ఫౌండేషన్ వ్యవహారాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతోనే బార్బరా ఇలాంటి ప్రకటన చేశారని అలెన్ ఆరోపించారు.

అయితే.. జూన్ నెలలో ట్రంప్ చేసిన ట్వీట్ ఇందుకు భిన్నంగా ఉంది. ఫౌండేషన్ వ్యవహారాల్లో తప్పేమీ లేదని.. నిధుల సమీకరణ ద్వారా సమకూరిన ఆదాయం కంటే ఎక్కువ చారిటీ రూపంలో ఖర్చు చేశామని.. దీన్ని మూసివేయాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఎరిక్ ష్నీడరమన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎరిక్ ష్నీడరమన్

ఫౌండేషన్‌పై ఉన్న ఆరోపణలేమిటి?

ట్రంప్ అధ్యక్షుడు కావడానికి రెండేళ్ల ముందే ఈ ఫౌండేషన్‌పై కేసు దాఖలైంది. అప్పటి న్యూయార్క్ అటార్నీ జనలర్ ఎరిక్ ష్నీడరమన్ రెండేళ్ల పాటు దర్యాప్తు చేసిన అనంతరం 2016 అక్టోబరులో... సరైన రిజిస్ట్రేషన్ లేని ఈ ఫౌండేషన్ ఇకపై న్యూయార్క్‌లో నిధుల సమీకరణ చేయరాదని ఆదేశించారు.

దీనిపై ఈ ఏడాది జూన్‌లో న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయం అక్కడి సుప్రీంకోర్టులో 41 పేజీల డాక్యుమెంట్ ఫైల్ చేసింది. అందులో అనేక ఉల్లంఘలనకు సంబంధించిన అభియోగాలు నమోదు చేసింది.

''2008 నుంచి ట్రంప్ ఈ ఫౌండేషన్‌కు ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. అంతేకాదు.. ఫౌండేషన్ బ్యాంక్ ఖాతాలకు, డబ్బు వ్యవహారాలకు ఆయన ఒక్కరే సంతకం చేస్తారు.

ఈ ఫౌండేషన్ కోసం సేకరించిన నిధులను ట్రంప్ ఎన్నికల ప్రచారానికి వాడారు.

అంతేకాదు.. ఆయన రిసార్టులు, గోల్ఫ్ క్లబ్‌లపై ఉన్న వివాదాల పరిష్కారం కోసం ఫౌండేషన్‌కు చెందిన 2.68 లక్షల డాలర్ల సొమ్మును వాడుకున్నారు'' అని ఈ డాక్యుమెంట్‌లో అభియోగాలు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)