డోనల్డ్ ట్రంప్: ‘అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ప్రశ్నలకు ఈజీగా సమాధానాలు రాసేశాను’

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందన్న ఆరోపణలపై ప్రశ్నలకు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమాధానాలు ఇచ్చారు.

ఆ ప్రశ్నలకు తాను స్వయంగా ‘చాలా ఈజీగా’ సమాధానాలు చెప్పానని ట్రంప్ విలేకరులకు చెప్పారు. అయితే, ఆ సమాధానాలను ఇంకా రాబర్ట్ ముల్లర్ బృందానికి సమర్పించాల్సి ఉందన్నారు.

ట్రంప్ ఎన్నికల ప్రచార బృందం 2016 ఎన్నికల్లో రష్యాతో కుమ్మక్కయిందనే ఆరోపణలపై ముల్లర్ 2017 నుంచి దర్యాప్తు చేస్తున్నారు.

ఎటువంటి కుమ్మక్కూ లేదని ట్రంప్ గట్టిగా తిరస్కరిస్తున్నారు. ఆ దర్యాప్తు అంతా ‘‘రాజకీయ వేధింపే’’నని అభివర్ణిస్తున్నారు.

ట్రంప్ గురువారం ఒక ట్వీట్‌లో, ముల్లర్ ’’గందరగోళంగా’’ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ దర్యాప్తు ‘‘అంతా పిచ్చితనం’’ అని, దీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ దర్యాప్తులో భాగస్వాములైన వారంతా ‘‘మన జాతికి తలవంపులు తెస్తున్నవారే’’ అని వ్యాఖ్యానించారు.

రాబర్ట్ ముల్లర్

ఫొటో సోర్స్, AFP

వారం రోజుల కిందట అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ చేత బలవంతంగా రాజీనామా చేయించిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. జెఫ్ సెషన్స్ స్థానంలో మాథ్యూ విటేకర్‌ను కొత్త అటార్నీ జనరల్‌గా ట్రంప్ నియమించారు.

ఇప్పుడు ముల్లర్‌ను తొలగించటానికి, దర్యాప్తునకు చరమగీతం పలకటానికి మాథ్యూ విటేకర్‌కు అధికారం ఉంది.

ఈ దర్యాప్తు వల్ల ‘‘కోట్లాది డాలర్లు’’ వృధా అయ్యాయని, అసలు ఈ దర్యాప్తు ‘‘ప్రారంభించి ఉండాల్సిందే కాద’’ని ట్రంప్ శుక్రవారం విలేకరులతో వ్యాఖ్యానించారు.

తాను సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలు రాసిన వారికి ‘‘దురుద్దేశాలు ఉండవచ్చు’’ అని కూడా ఆయన అన్నారు.

ఆ ప్రశ్నలకు తాను రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చానన్నారు.

‘‘నా లాయర్లు సమాధానాలు రాయరు. నేను సమాధానాలు రాస్తాను. నన్ను చాలా సీరియస్ ప్రశ్నలు అడిగారు. నేను చాలా ఈజీగా సమాధానాలు రాశాను’’ అని చెప్పారు.

అయితే.. ఆ ప్రశ్నలు ఏ అంశం మీద అన్నది ఖచ్చితంగా తెలియదు.

డొనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

రష్యా జోక్యంపై దర్యాప్తు వెనుక కథ ఏమిటి?

2016 అధ్యక్ష ఎన్నికలను డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా.. రష్యా ప్రభుత్వ అనుమతులతో సైబర్ దాడులు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచార కార్యక్రమాలు చేపట్టిందని అమెరికా నిఘా సంస్థలు అదే ఏడాది నిర్ధారించాయి.

ఆ ప్రయత్నంలో ట్రంప్ ప్రచార బృందంలోని వారెవరైనా కుమ్మక్కయ్యారా అనే అంశాన్ని ముల్లర్ సారథ్యంలోని బృందం దర్యాప్తు చేస్తోంది.

ట్రంప్ బృందంలోని సీనియర్ సభ్యులు రష్యా అధికారులను కలిశారని, ఇలాంటి కొన్ని సమావేశాల గురించి ముందుగా బయటపెట్టలేదని నిర్ధారణ అయింది.

ఎన్నికల ప్రచార సమయంలో అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్.. హిల్లరీ క్లింటన్‌‌ ‘ప్రతిష్టను దెబ్బతీసే సమాచారం’ ఉందని అంటున్న రష్యా లాయరు ఒకరిని కలిశారు.

అలాగే.. రష్యా మధ్యవర్తులతో సమావేశాల గురించి తాను ఎఫ్‌బీఐకి అబద్ధం చెప్పానని మాజీ సలహాదారుడు జార్జ్ పాపడోపోలస్ అంగీకరించారు.

ఎన్నికల ప్రచారంలోను, అధ్యక్షుడయిన తర్వాత.. ట్రంప్‌తో సంబంధాలున్న నలుగురు వ్యక్తుల మీద - ప్రచార సారధి పాల్ మానఫోర్ట్, సలహాదారులు రిక్ గేట్స్, జార్జ్ పాపాడోలస్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ - అభియోగాలు నమోదు చేశారు.

అయితే.. తను ఎలాంటి తప్పూ చేయలేదని.. తనను దోషిగా చెప్పటానికి బలమైన ఆధారాలేవీ లభించలేదని అమెరికా అధ్యక్షుడు ఉద్ఘాటిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)