మొదటి ప్రపంచ యుద్ధం: విదేశాల్లో యుద్ధానికి వెళ్లిన భారతీయ సైనికుల్లో 74 వేల మంది ఏమయ్యారు?

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు

ఫొటో సోర్స్, dea/biblioteca Ambrosiana/gettyimages

ఫొటో క్యాప్షన్, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత సైనికులు(1914 డిసెంబరు 6 నాటి చిత్రం)
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆ రాత్రి.. టైగ్రిస్ నది ఒడ్డును తాకుతూ నిండుగా ప్రవహిస్తోంది. కోత్లా ఆరాలో 6 భారతీయ డివిజన్లను శత్రువులు చుట్టుముట్టారు.

భారతీయ సైనికులు ప్రాణాలు నిలుపుకోవడానికి గుర్రాలను చంపి, గడ్డిని ఉడకబెట్టుకుని తింటున్న కష్ట కాలమది.

శత్రు వలయాన్ని ఛేదించే బాధ్యతను 53వ సిక్కు రెజిమెంట్‌కు ఇచ్చారు.

వారి ఎదురుగా ఉన్నదంతా మైదాన ప్రాంతమే.. రక్షణగా చెట్లన్నవి లేవు. అయినా ముందుకు సాగారు..

టర్కీల స్థావరాన్ని చేరడానికి ఇంకా 1200 గజాల దూరమే ఉంది... అప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ తూటా గాయంతో విలవిలలాడడం హవల్దార్ అర్జున్ సింగ్ చూశారు.

దీంతో ఆయన్ను భుజం మీదకు ఎత్తుకుని అతను తిరిగి వెనక్కి వెళ్లాడు. దానికి ప్రతిఫలంగా అర్జున్ సింగ్‌కు 'డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్' దక్కింది.

తన తాతయ్యను బ్రాందీయే రక్షించిందని ఆయన మనవడు స్క్వాడ్రన్ లీడర్ రాణా తేజ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.

బ్రాందీలాగా సైనికులను వెచ్చగా ఉంచుతాయి కాబట్టి సైనికులు ధరించే లాంగ్ కోటును 'బ్రాందీ' అనేవారు.

అర్జున్ సింగ్‌పై కాల్పులు జరిపినా, ఆయన బ్రాందీని మడతపెట్టి తన వెనకాల ధరించారు. దాంతో బుల్లెట్లు ఆయనకు తగల్లేదు.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

నెలకు పదిహేను రూపాయల జీతం

మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎప్పుడూ భారతీయ నేపథ్యం నుంచి వివరించలేదు. 1914 - 1919 మధ్యకాలంలో ఈ యుద్ధంలో పాల్గొనేందుకు భారతదేశం నుంచి 11 లక్షల మంది సైనికులు విదేశాలకు వెళ్లారు.

వారిలో 74 వేల మంది ఎన్నడూ తిరిగి రాలేదు. వాళ్లకు ఫ్రాన్స్, గ్రీస్, ఉత్తర ఆఫ్రికా, పాలస్తీనా, మెసపటోమియాలలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

తిరిగి వచ్చిన 70 వేల మంది యుద్ధంలో ఏదో ఒక శరీరావయవం కోల్పోయి వచ్చారు.

సుమారు 9,200 మందికి సాహస వీరుల పురస్కారాలు లభించాయి. వాటిలో 11 మందికి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే వారికి ఇచ్చే 'విక్టోరియా క్రాస్' లభించింది.

సైనికులే కాకుండా వాళ్లకు సేవలు అందించేందుకు భారతదేశం నుంచి వేల మంది కూలీలు వారి వెంట వెళ్లారు.

ఇదే కాకుండా భారతదేశం యుద్ధం కోసం ధన రూపేణా, ఇతర రూపేణా రూ.13 వేల కోట్లు బ్రిటన్‌కు అందించింది.

ఈ యుద్ధంలోనే బ్రిటన్ మొదటిసారి భారతీయ సైనికులను యుద్ధ అవసరాలకు వాడుకుంది.

భారతదేశం దృష్టి నుంచి చూసినపుడు.. అది ఒక సాధారణ మానవుడు కేవలం రూ.15 రూపాయల కోసం విదేశాలకు వెళ్లి తనది కాని యుద్ధం చేయడం.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

భారత భూభాగంపైనే మొదటి మరణం

మొదటి ప్రపంచ యుద్ధంలో మొదటి భారతీయ సైనికుని మరణం పాశ్చాత్య యుద్ధభూమిలోనో లేదా మెసపటోమియా, ఆఫ్రికాల ఎడారుల్లో సంభవించలేదు.

యుద్ధానికి వెళ్లక ముందే అనేక మంది భారతీయులు జర్మనీ సైన్యం చేతిలో మన భూభాగం మీదే మరణించారు.

1914, సెప్టెంబర్ 22న జర్మనీ యుద్ధనౌక 'ఎస్‌ఎమ్‌ఎస్ ఆమ్డెన్' రహస్యంగా బంగాళాఖాతంలో ప్రవేశించి మద్రాస్ రేవు సమీపంలో లంగరు వేసింది.

ఆ సమయంలో మిత్రదేశాల నౌకలేవీ మద్రాస్ పోర్టును పహారా కాసేవి కావు.

ఆర్కే లోచ్‌నర్ తన 'ద లాస్ట్ జెంటిల్మెన్ ఆఫ్ ది వార్: ద రైడర్ ఎక్స్‌ప్లోజివ్స్ ఆఫ్ ద క్రూజర్ ఆమ్డెన్' అన్న పుస్తకంలో జర్మన్లు బర్మా ఆయిల్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిపారని వివరించారు.

''ఆ సమయంలో బర్మా ఆయిల్ కంపెనీ ట్యాంకులలో 5 వేల టన్నుల కిరోసిన్ ఉంది. ఆ రాత్రి ఆ పేలుళ్ల నుంచి ఎగసిపడిన మంటలను మద్రాస్ నగరవాసులంతా చూశారు. జర్మనీ కమాండెంట్ కార్ల్ ముల్లర్ ఆదేశాల మేరకు మొత్తం నగరం మీద బాంబుల వర్షం కురిపించారు. మద్రాస్ హైకోర్టు, పోర్ట్ ట్రస్ట్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నింటి మీదా బాంబులు వేశారు. హార్బర్‌లో లంగరు వేసిన నౌక ఒకటి బాంబుల ధాటికి మునిగిపోయింది. ''

''30 నిమిషాల పాటు కొనసాగిన ఆ దాడిలో ఐదుగురు సైనికులు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. ఆమ్డెన్ మొత్తం 130 ఫిరంగి గుళ్లు వేసింది. బ్రిటిష్ సైనికులు తేరుకుని ఎదురుదాడి చేసేసరికి ఆమ్డెన్ మద్రాస్‌కు దూరంగా వెళ్లిపోయింది.''

''ఈ దాడి ఎంత తీవ్ర ప్రభావం చూపిందంటే దానితో తమిళ డిక్షనరీలో 'ఆమ్డెన్' అనే పదం చేరింది. ఎప్పుడూ తన లక్ష్యాన్ని మర్చిపోని ధైర్యవంతుడు అని దీని అర్థం.'' అని లోచ్‌నర్ రాశారు.

మొదటిసారి యుద్ధనౌకను చూసిన భారతీయ సైనికులు

ట్రెంచీలు, ట్యాంకులు, మెషీన్ గన్లు.. నిజానికి భారతీయ సైనికులు ఎప్పుడూ ఇలాంటి పోరాటంలో పాల్గొనలేదు. ఇది వాళ్లకో కొత్త అనుభవం.

'ద వీక్' ప్రతినిధి మందిరా నయ్యర్ ఈ అంశంపై ప్రత్యేక పరిశోధన చేశారు.

''అలాంటి ఆధునిక ఆయుధాలతో, సంఘటితంగా ఉండే సైన్యంతో భారతీయులు ఎన్నడూ యుద్ధం చేసి ఉండలేదు. మొదటిసారి రైఫిల్ పట్టినవాళ్లకు అది అలవాటు పడ్డానికి కేవలం మూడునాలుగు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. అంత మంది సైనికులు దేశం విడిచి వెళ్లడం అదే మొదటిసారి. అదే విధంగా సైనికులు యుద్ధనౌకను చూడడం కూడా అదే మొదటిసారి'' అని మందిర తెలిపారు.

''అంతే కాదు.. ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాన్ని తినడం కూడా వాళ్లకు అదే మొదటిసారి. రిస్టు వాచీలు ధరించడం, అంత మంది విదేశీ మహిళలను చూడడమూ మొదటిసారే. ఒక భారతీయ సైనికుడు ఫ్రెంచి మహిళను పెళ్లి చేసుకున్నపుడు అది వివాదాస్పదం కూడా అయింది.''

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఖుదాదాద్ ఖాన్‌కు విక్టోరియా క్రాస్

ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికాధికారులు భారతీయ సైనికులను కేవలం తమకు రక్షణగా ఉపయోగించుకోవాలని భావించారు. కానీ భారత సైనికులు మాత్రం చాలా సార్లు తమ ధైర్య సాహసాలను నిరూపించుకున్నారు.

మొత్తం 9,200 మంది తమ ధైర్యసాహసాలకు మెడల్స్ అందుకున్నారు. వాటిలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే విక్టోరియా క్రాస్ కూడా ఉంది.

సైనిక చరిత్రకారులు రాణా తేజ్ ప్రతాప్ సింగ్ చీనా, ''ఖుదాదాద్ బెల్జియంలోని హాల్బిక్ సమీపంలో మెషీన్ గన్ డిటాచ్మెంట్‌లో ఉండేవాడు. జర్మన్ల దాడిలో క్రమక్రమంగా ఒక్కక్కరూ మరణించడం ప్రారంభించారు. ''

''చివరకు ఖుదాదాద్ మాత్రం మిగిలారు. వాళ్లను నిలువరించడంలో అతను తీవ్రంగా గాయపడ్డారు. అతను చనిపోయాడనుకుని వాళ్లు వెళ్లిపోయారు. ''

అయితే ఎట్టకేలకు ఖుదాదాద్ ప్రాణాలతో బయటపడ్డారు.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

మైదానమంతా శవాలే

ఈ యుద్ధంలో మొదటిసారిగా జర్మనీ భారతీయ సైనికులపై విష వాయువును ప్రయోగించింది. ఆ సమయంలో మాస్కులు లేవు.

మందిర నయ్యర్... ''తన ఇంటికి రాసిన ఉత్తరంలో ఒక భారత సైనికుడు ఆ విషపూరిత వాయువును పీల్చినపుడు తనకు నరకం కనిపించిందని రాశారు. విషవాయువును ప్రయోగించినపుడు మొత్తం మైదానమంతా శవాలదిబ్బగా మారిందని ఆ జవాను తెలిపారు'' అని వివరించారు.

''విషవాయువు ప్రయోగించినపుడు ఒక సైనికుడు ఎనిమిది మంది సైనికులను తన భుజాన వేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అతనికి కూడా విక్టోరియన్ క్రాస్ లభించింది'' అని ఆమె తెలిపారు.

ఫ్లాండర్స్‌లోని ఫీల్డ్ మ్యూజియంలో గ్యాస్ ప్రభావంతో మరణించిన 47వ సిక్కు రెజిమెంట్‌కు చెందిన సైనికుల చిత్రాలు ఉన్నాయి.

రాజమందిరంలో చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

రాజమందిరంలో చికిత్స

గాయపడిన భారతీయ సైనికులను బ్రిటన్‌లోని రాజమందిరంలో చికిత్స అందించారు.

బ్రిటన్ రాజు దాన్ని ఎన్నో ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లోని బ్రైటన్ కార్పొరేషన్‌కు విక్రయించాడు.

''బ్రైటన్‌లోని ఆ రాజమందిరంలో తొమ్మిది వంటగదులు ఉండేవి. అక్కడే ఒక గురుద్వారా, ఒక మసీదు, గుడిని కూడా ఏర్పాటు చేశారు. చికిత్స చేసే నర్సులకు భారతీయ సైనికులకు దగ్గరగా వెళ్లవద్దని సూచించినట్లు చెబుతారు'' అని మందిరా అయ్యర్ తెలిపారు.

ఆ రాజమందిరంలో దాదాపు 4వేలకు పైగా భారతీయ సైనికులకు చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూనే చాలా మంది సైనికులు మరణించారు. వారికి బ్రైటన్ వెలుపల అంత్యక్రియలు నిర్వహించారు.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

శవాల పక్కనే పడుకోవాల్సి వచ్చింది

యుద్ధ రంగం నుంచి భారతీయ సైనికులు రాసిన లేఖలను చదువుతుంటే మన చుట్టూ యుద్ధం జరుగుతున్నట్లే అనిపిస్తుంది.

రైఫిల్ మ్యాన్ అమర్ సింగ్ రావత్ ఫ్రాన్స్ నుంచి తన స్నేహితునికి రాసిన లేఖలో, ''ఇక్కడ నేల మొత్తం శవాలతో నిండిపోయి ఉంది. ముందుకు కదలాలంటే శవాల మధ్య దారి చేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఒకోసారి ఖాళీ స్థలం లేక వాటి పక్కనే పడుకోవాల్సి వస్తోంది'' అని రాశారు.

ఆఫ్రికా, యూరప్‌లలో తమకు అలవాటు లేని పరిస్థితుల మధ్య పోరాడుతూ భారతీయ సైనికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.

తన 'ఫర్ కింగ్ అండ్ అనదర్ కంట్రీ' అన్న పుస్తకంలో రచయిత్రి శ్రావని బసు ''ఈ సైనికులను హిందుస్థానీ భాష రాని అధికారి పర్యవేక్షణలో ఉంచేవారు. ఆ అధికారి యుద్ధభూమిలోని ట్రెంచీలకు ఇంగ్లీష్ వీధుల పేర్లు పెట్టేవాడు. అయితే అది భారతీయ సైనికులకు అర్థమయ్యేది కాదు. తర్వాత వాళ్ల కోసం హిందీ, పంజాబీ, ఉర్దూలో రాయడం ప్రారంభించారు '' అని తెలిపారు.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక పరిస్థితి

చాలా ఏళ్లపాటు విదేశాలలో పోరాడాక భారత సైనికులు అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతే వాళ్లు టీ తాగడం, ఫుట్ బాల్ ఆడడం, రిస్ట్ వాచి ధరించడం నేర్చుకున్నారు.

అదే కాకుండా, విదేశాలలో తిరగడం వల్ల వాళ్ల సామాజిక జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చాయి.

సైనికులు తమ ఇళ్లకు పంపే మనీ ఆర్డర్లతో స్థానిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.

హరియాణా అకాడమీ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్ డైరెక్టర్ కేసీ యాదవ్, ''అక్కడి నుంచి సైనికులు పంపిన సొమ్ముతో వాళ్ల కుటుంబాలు భూమిని కొనుక్కున్నారు. పాఠశాలలు నిర్మించారు. వాళ్ల భాష కూడా గణనీయమైన మార్పులకు లోనైంది.'' అని తెలిపారు.

''హరియాణా భాషలో మీరు అనే పదం లేదు. ప్రతి ఒక్కరూ నీవు అనే సంబోధించేవారు. అయితే విదేశాల నుంచి తిరిగొచ్చాక మీరు అనే పదం చేరింది. అనేక ఫ్రెంచి పదాలు కూడా స్థానిక భాషలలో చేరాయి'' అని ఆయన వివరించారు.

ఆ యుద్ధం దూరాలను కూడా చెరిపేసింది. ఒక సైనికుడు 'ద జాట్ గెజిట్' అనే పత్రిక సంపాదకుడికి రాసిన లేఖలో, 'అన్ని సామాజిక అంతరాలు తొలగిపోయాయి. ఇక్కడ 25 వేల మంది సైనికులం ఒకే చోట కూర్చుని తింటున్నాం' అని లేఖ రాశారు.

తిరిగి వచ్చిన సైనికుల్లో కొందరు రాజకీయాల్లో కూడా చేరారు.

1920లో జరిగిన ఎన్నికల్లో ఒక మామూలు సైనికుడైన స్వరూప్ సింగ్.. చోటూ రామ్ అనే జాట్ నేతను ఓడించాడు. ఆ రోజుల్లో అది సంచలనం.

భారత సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

సిగరెట్ మూఢనమ్మకం

ఈ యుద్ధం జరిగిన నాటి నుంచి ఒకే అగ్గిపుల్లతో మూడు సిగరెట్లు అంటించుకోకూడదు అన్న మూఢనమ్మకం ప్రచారంలోకి వచ్చింది.

యుద్ధంలో వరుసగా మూడో సిగరెట్ వెలిగించేసరికి శత్రుదేశాల స్నైపర్లకు వాళ్ల ఆచూకీ తెలిసిపోయేది.

బ్రిటన్ తరపున యుద్ధంలో పాల్గొన్న ప్రముఖ రచయిత హెచ్ హెచ్ మన్రో, యుద్ధరంగంలో బులెట్ దెబ్బ తగిలినపుడు, ఆయన ఆఖరి మాటలు, ''పుట్ ఔట్ దట్ బ్లడీ సిగరెట్ '' అని చెబుతారు.

చరిత్ర విస్మరణ

తీన్‌మూర్తి భవనం ఎదుట ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కోసం మొదటి స్మారక చిహ్నం నిర్మించారు.

అక్కడ కనిపించే ముగ్గురు సైనికులు15వ ఇంపీరియల్ కేవల్రీ బ్రిగేడ్‌లో పని చేసిన హైదరాబాద్, మైసూరు, జోధ్‌పూర్‌కు చెందిన సైనికులవి.

తర్వాత వారి స్మరణార్థం ఇండియా గేట్‌ను నిర్మించి దానిపై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లను కూడా చెక్కారు.

ఆశ్చర్యకరంగా దేశం మొత్తం వీళ్ల త్యాగాలను చాలా సులభంగా మర్చిపోయింది.

వాళ్ల త్యాగాలు ఏ చరిత్ర పేజీల్లోకీ ఎక్కలేదు.

యుద్ధానంతరం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తామన్న హామీని బ్రిటన్ విస్మరించింది. దీంతో సైనికుల త్యాగాలన్నీ వృథా అయిపోయాయి.

ప్రముఖ ఇంగ్లిష్ కవి ఎడ్వర్డ్ హౌస్‌మెన్ ఇలా రాశాడు..

స్వర్గం కూలిపోతున్నప్పుడు

భూమి కదలిపోతున్నప్పుడు

వాళ్లు తమది కాని యుద్ధం చేయడానికి వచ్చారు

కూలిపోతున్న ఆకాశాన్ని తమ భుజానికెత్తుకున్నారు

దేవుడు కూడా వదిలేసినవారిని

ప్రాణాలను పణంగా పెట్టి

వారు రక్షించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)