‘టపాసుల ప్యాకెట్లపై కూడా హెచ్చరిక గుర్తులు ముద్రించాలి’

ఫొటో సోర్స్, BAPRAS
టపాసుల ప్యాక్‌లపై ప్రమాద హెచ్చరిక గుర్తులు ముద్రించాలని ఇంగ్లండ్‌లోని సీనియర్ డాక్టర్లు కోరుతున్నారు.
టపాసులు కాలుస్తున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్ని ప్రచార కార్యక్రమాలు చేసినా, ప్రతి ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ప్లాస్టిక్ సర్జన్‌లు చెబుతున్నారు.
టపాసులు పేలుస్తున్నపుడు తీవ్రంగా కాలిన వ్యక్తి చేయి.. లాంటి ఫోటోలను ప్యాకేజ్‌లపై ముద్రిస్తే, వాటిని కొనేముందు ప్రజలు ఓసారి ఆలోచిస్తారన్నారు.
గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన టపాసుల ప్రమాదాల్లో బాధితులు అందరూ 18 సంవత్సరాల లోపువారే. వీరిలో 80% మంది మగపిల్లలే.
ఈవిషయంలో 'బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ అండ్ ఈస్తటిక్ సర్జన్స్' సంస్థ ప్రజల కోసం అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ..
''టపాసులను పేలుస్తున్నపుడు.. వారు పేలుడు పదార్థాలతో ఆటలాడుతున్నారని, అవి పేలితే చాలా పెద్ద సర్జరీలు చేయాల్సిరావొచ్చు అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు'' అన్నారు.
సిగరెట్ ప్యాక్‌లపై ముద్రించిన విధంగానే, టపాసుల ప్యాకెట్లపై కూడా గ్రాఫిక్ బొమ్మలను ముద్రించాలని, ఈవిధంగా చట్టం తీసుకురావాలని ఈ సంస్థ ప్రతినిధులు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గతేడాది ఇంగ్లండ్‌లో 4,500 మంది టపాసులు పేలుస్తున్నపుడు జరిగిన ప్రమాదాల్లో గాయపడ్డారని, 2009-10సం.తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అని ఇంగ్లండ్‌కు చెందిన ఎన్.హెచ్.ఎస్.డిజిటల్ సంస్థ తెలిపింది.
ఈ ప్రమాదాలన్నీ.. రాకెట్లు కాలుస్తున్నపుడు చేతుల్లో పేలడం లేకపోతే ఇతరులు కాలుస్తున్నపుడు అవి వచ్చి తగలడం వల్ల చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

ఫొటో సోర్స్, BAPRAS
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రదర్శిస్తున్న ఫోటోల్లో.. గాయపడ్డ ఓ వ్యక్తి చేయి ఫోటోను కూడా ఉంచారు. ఆ వ్యక్తి వయసు 25. తన పేరును వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన మాట్లాడుతూ..
''నా మిత్రుడు టపాసును నా కాళ్ల దగ్గరకు విసిరాడు. దాన్ని దూరంగా పడవేద్దామని చేతుల్లోకి తీసుకోగానే అది పేలింది. నా చేతికి 5 ఆపరేషన్లు చేశారు. ఇంకా మూడు ఆపరేషన్లు చేయాల్సి ఉంది. ఈ సంఘటన నా జీవితంపై చాలా ప్రభావం చూపింది. నేను సొంతంగా భోంచేయలేను, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డతో ఆడుకోనూలేను!. ఒకవేళ ఆ టపాసుల ప్యాకెట్‌పై హెచ్చరిక చిత్రాలు ఉండుంటే నేను, నా మిత్రుడు నిర్లక్ష్యంగా ఉండేవాళ్లం కాదు'' అన్నారు.
చాలా కంపెనీలు తమ టపాసులను పిల్లల బొమ్మల ప్యాకింగ్‌కు వాడే కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. వాటిపై ఎక్కడో చిన్న అక్షరాలతో హెచ్చరిక సూచనలు ముద్రిస్తున్నారు.

ఫొటో సోర్స్, DIANE LABOMBARBE
ఇంగ్లండ్‌లో టపాసులు కొనడానికి కనీస వయసు 18 ఉండాలి. కానీ డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం, నిరుడు ప్రమాదానికి గురైనవారిలో అందరూ 18సం.ల లోపువారే ఉన్నారు.
ఇంగ్లండ్ ఎంపీ జిమ్ ఫిట్జ్‌ప్యాట్రిక్ కూడా టపాసులపై హెచ్చరిక చిత్రాలు ముద్రించడానికి మద్దతిస్తున్నారు.
''టపాసుల ప్యాకెట్లపై హెచ్చరిక చిత్రాలు ముద్రించాల్సిన అవసరం చాలా ఉంది. ఆ చిత్రాలను చూసైనా, ప్రజలు కాస్త జాగ్రత్తపడతారు'' అన్నారు.
గత అక్టోబర్‌లో జరిగిన అభిప్రాయ సేకరణలో 62%మంది టపాసుల ప్యాకెట్లపై హెచ్చరిక చిత్రాలను ముద్రించడానికి మద్దతుగా ఓటు వేశారు.
ఈ ప్రచారానికి పలు వైద్య సంస్థలు కూడా మద్దతు తెలుపుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- Fake News -గుర్తించడం ఎలా-
- నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా?
- వృద్ధాప్యం ఎందుకొస్తుంది? ఇవిగో... 9 కారణాలు
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- ‘టెస్ట్ ట్యూబ్ చెట్లు’: చెట్లు అంతరించిపోకుండా ఉండడానికి ఇదే పరిష్కారమా?
- గిరిజన మహిళల ముఖాలపై సంప్రదాయపు గాట్లు
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








