‘కొత్త రకం మోసం’: శిక్షణ అని చెప్పి ముక్కూమొహం తెలియని వ్యక్తితో పెళ్లి చేసేశారు

శిక్షణ పేరుతో పెళ్లి చేసేశారు

ఫొటో సోర్స్, iStock

ఓ 21 ఏళ్ల హాంకాంగ్‌ యువతిని వెడ్డింగ్ ప్లానర్ శిక్షణ పేరుతో మభ్యపెట్టి, ముక్కూ మొహం తెలియని ఓ చైనా వ్యక్తితో పెళ్లి జరిపించారు.

"నా వెడ్డింగ్ ప్లానర్‌ శిక్షణలో భాగంగా నన్ను పెళ్లి కుమార్తెలాగా నటించమని చెప్పారు" అని పేరు వెల్లడించని ఆ మహిళ తెలిపారు. కానీ చివర్లో నిజమైన అంగీకార పత్రంపై పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు సంతకాలు చేశారు.

హాంకాంగ్ వెళ్లిన తర్వాత గానీ ఆమెకు ఇది నిజమైన పెళ్లే అనే విషయం తెలియలేదు. దీంతో ఆమె న్యాయ సహాయం కోసం లాయర్లను ఆశ్రయించారు.

నేరం జరిగింది అని నిరూపించే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో ఆమె హాంకాంగ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్‌ (ఎఫ్‌టీయూ)ను ఆశ్రయించింది.

"పెళ్లిళ్ల పేరుతో ఇదో కొత్త రకం మోసం" అని ఎఫ్‌టీయూ డైరెక్టర్ టాంగ్ కామ్గియు బీబీసీతో అన్నారు.

"వినగానే చాలా అసహనానికి గురయ్యాను. ఎంతో అభివృద్ధి చెందిన హాంకాంగ్ లాంటి నగరాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే నమ్మలేకపోతున్నాను" అని టాంగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

శిక్షణ పేరుతో పెళ్లి చేసేశారు

మే నెలలో పేరు వెల్లండించని ఓ 21ఏళ్ల యువతి ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చూశారు... "మేకప్ ఆర్టిస్ట్ అప్రెంటీస్‌షిప్ అవకాశం ఉంది" అనేది దాని సారాంశం.

దానికి ఆమె దరఖాస్తు చేశారు. కానీ ఆ కంపెనీ ఆమెను వెడ్డింగ్ ప్లానర్ ఉద్యోగంలో చేరేలా ఒప్పించింది. ఓ వారం పాటు ఉచిత శిక్షణ ఇచ్చిన తర్వాత... శిక్షణలో భాగంగా ఓ మాక్-పెళ్లిలో పాల్గొనాల్సి ఉంటుందని సూచించింది. చైనాలోని ఫ్యుజియాన్‌లో ఈ పెళ్లి జరుగుతుందని, ఇది పూర్తైతే కోర్సు పూర్తయినట్లేనని ఆ సంస్థ యువతితో చెప్పింది.

దానికి అనుగుణంగా ఆ యువతి, జులైలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో వివాహ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పెళ్లికి విలువ లేదని శిక్షణ సంస్థ యువతితో చెప్పిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.

కానీ, ఇదో మోసమని హాంకాంగ్ తిరిగి వచ్చిన తర్వాత తన స్నేహితులు చెప్పేవరకూ ఆ యువతికి తెలియలేదు.

ఆమె ఇప్పుడు ఓ పెళ్లైన యువతి, కావాలనుకుంటే విడాకులకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో, అతను చైనా నుంచి హాంకాంగ్‌కు వచ్చాడా లేదా అనే విషయాలేవీ ఆమెకు తెలియవు.

"తన చుట్టూ ఏం జరుగుతోందో ఆమెకు తెలియకపోవడంతో అదే అదునుగా ఆమెను ఇలా మోసం చేశారు. ఆమెకు జరిగిన అతి పెద్ద నష్టం పెళ్లి, దీంతో ఆమె మానసికంగా చాలా ఇబ్బంది పడి ఉంటారు" అని టాంగ్ అభిప్రాయపడ్డారు.

హాంకాంగ్ బయట జరిగే ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించి ప్రతి సంవత్సరం దాదాపు 1000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడి వారిని పెళ్లిచేసుకుంటే చైనీయులకు హాంకాంగ్‌లో ఉండేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)