రష్యా: ‘65 ఏళ్లకు పింఛన్’ అంటున్న ప్రభుత్వం.. 'మేం అంత కాలం జీవించం' అంటున్న జనం

ఫొటో సోర్స్, Getty Images
పింఛను పొందే వయసు పెంచాలనే రష్యా ప్రభుత్వ ప్రతిపాదనలపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.
రాజధాని మాస్కోలో నిరసనలకు దిగిన ప్రదర్శనకారులు.. "మేం మా పింఛన్లపై జీవించాలని అనుకుంటున్నాం, పనిలో చనిపోవాలని అనుకోవడం లేదు" అనే బ్యానర్లు ప్రదర్శించారు.
మాస్కోలో వీధుల్లోకి వచ్చిన దాదాపు 12 వేల మంది ప్రభుత్వ వివాదాస్పద ప్రణాళికలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.
తూర్పు రష్యా, సైబీరియాలోని చాలా నగరాలు, పట్టణాల్లో కూడా జనం ర్యాలీలు నిర్వహించారు.
పింఛను పొందే వయసును పురుషులకు 60 నుంచి 65 ఏళ్లకు, మహిళలకు 55 నుంచి 63 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది.
ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం రష్యన్ల సగటు ఆయుర్ధాయం పురుషుల్లో 66 ఏళ్లు, మహిళల్లో 77 మాత్రమేనని చెబుతోంది.
రష్యా కమ్యునిస్ట్ పార్టీ(సీపీఆర్ఎఫ్) దేశంలో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. కార్మిక సంఘాలు, పౌరులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'మేం అంతకాలం జీవించం'
ఎర్ర జెండాలు, ఇతర వామపక్ష సంకేతాలతో యుద్ధ గీతాలు పాడుతూ జనం నిరసనల్లో పాల్గొన్నారు. 'మేం అంత కాలం జీవించం' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొంతమంది నిరసనకారులు చనిపోయినట్టు దుస్తులు వేసుకొస్తే, కొంతమంది అస్థిపంజరాలతో ఆందోళనలు చేశారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వం ప్రజలకు మరణ శిక్ష వేస్తోందని ఆరోపించారు.
మాస్కోలో 12 వేల మంది పాల్గొన్న దీనిని రష్యాలో ఇప్పటివరకూ పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఆందోళనగా భావిస్తున్నారు.
"ప్రభుత్వ పింఛను ప్రణాళిక దేశంలో ప్రతి పౌరుడికీ పెద్ద దెబ్బ" అని సీపీఆర్ఎఫ్ నేత గెన్నడీ జ్యూకనోవ్ అన్నారు.
ప్రభుత్వం ధనవంతుల నుంచి డబ్బు తీసుకోవాలని, తమలాంటి సామాన్యులను దోచుకోకూడదని ఆందోళనకారులు చెబుతున్నారు.
రష్యా ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న పింఛను సంస్కరణకు వ్యతిరేకంగా దాదాపు 30 లక్షల మంది సంతకాలు చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్ల పాలనలో.. దీనిని అత్యంత సమస్యాత్మకమైన, ప్రమాదకరమైన సంస్కరణగా వర్ణిస్తున్నారు.
ఎన్నికల ముందు పుతిన్ పింఛను సంస్కరణ గురించి చెప్పలేదు. దీంతో ఆయనపై మే నెలలో 80 శాతంగా ఉన్న ప్రజల విశ్వాసం ఇప్పుడు 64 శాతానికి పడిపోయినట్టు వీటీఎస్ఐఓఎమ్ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఎన్నికలు: ఉచిత భోజనం.. బంపర్ ఆఫర్లు
- రష్యా విప్లవ చరిత్రను కళ్లకు గట్టే పోస్టర్లు
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- నగదురహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న స్వీడన్
- రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా.. లోపలికెళితే ఒకేలా ఉంటాయిక్కడ
- అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా అయ్యారు?
- భారత్‌లోని చర్చిల్లో కన్ఫెషన్ ప్రక్రియకు తెరపడుతుందా?
- కరణ్ థాపర్‌పై నరేంద్ర మోదీ పాత ‘పగ’ తీర్చుకుంటున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









