కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది

ఫొటో సోర్స్, ESO / A. MÜLLER ET AL.
వాయువు, ధూళి నడుమ ఇంకా తయారవుతూ ఉన్న ఓ గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు మొట్టమొదటిసారిగా ఫొటో తీశారు.
ఒక శిశు గ్రహాన్ని వెదికిపట్టుకునేందుకు పరిశోధకులు చాలా కాలంగా గాలిస్తున్నారు. ఓ నక్షత్రం (సూర్యుడి వంటిది) చుట్టూ తిరుగుతూ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న అలాంటి పసి గ్రహాన్ని కనిపెట్టటం ఇదే తొలిసారి.
ఆ మరుగుజ్జు నక్షత్రాన్ని (డ్వార్ఫ్ స్టార్) పిడిఎస్ 70 గా పిలుస్తున్నారు. దీని వయసు కోటి సంవత్సరాల కన్నా తక్కువేనని చెప్తున్నారు. దీనితో పాటు ఉన్న శిశు గ్రహం వయసు కేవలం 50 నుంచి 60 లక్షల సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు.
పిడిఎస్ 70బి అని పిలుస్తున్న ఈ చిన్నారి గ్రహం.. బుధ గ్రహం కన్నా కొన్ని రెట్లు పెద్దగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీని మీద మేఘాలతో కూడిన వాతావరణం ఉండొచ్చు.

ఫొటో సోర్స్, ESO/G. BRAMMER
ఈ గ్రహానికి దాని నక్షత్రానికి మధ్య దూరం.. సూర్యుడికి వరుణగ్రహానికి (యురేనస్) మధ్య ఉన్నంత ఉందని.. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ పరిశోధకుల సారథ్యంలోని బృందం గుర్తించింది.
ఈ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ శిశు గ్రహం తిరగటానికి 118 సంవత్సరాలు పడుతుంది.
ఈ గ్రహం ఉపరితలం మీద ఉష్ణోగ్రత 1,000 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది మన సౌర వ్యవస్థలోని ఏ గ్రహం మీది ఉష్ణోగ్రత కన్నా చాలా చాలా అధికం.
ఆ నక్షత్రం వెలుతురిని కరోనాగ్రాఫ్ అనే పరికరం సాయంతో అడ్డుకుని.. చాలా చిన్నగా ఉన్న ఈ గ్రహాన్ని పరిశోధకులు చూడగలిగారు.

ఫొటో సోర్స్, Science Photo Library
గ్రహాలు ఎలా పుడతాయి?
ఒక నక్షత్రం ఏర్పడినపుడు మిగిలిపోయే పదార్థాల నుంచి గ్రహాలు పుడతాయనే సిద్ధాంతాన్ని విస్తృతంగా అంగీకరిస్తున్నారు.
అత్యధికంగా వాయువులు, ధూళితో కూడిన ఈ పదార్థం ఆ కొత్త నక్షత్రం చుట్టూ వెడల్పాటి పళ్లెం (డిస్క్) లా భ్రమిస్తూ ఉంటుంది.
కాలక్రమంలో ఆ ధూళి పదార్థాలు, శకలాలు ఒకదానితో ఒకటి కలిసి ముద్దలా ఏర్పడుతుంటాయి.
అది పెద్దగా అయ్యే కొద్దీ దాని గురుత్వాకర్షణ పెరుగుతుంది.. దాంతో మరింత ఎక్కువగా ధూళి శకలాలు, వాయు పదార్థాలు దానికి ఆకర్షితమై ఇంకా పెద్దగా మారుతుంటుంది. ఈ క్రమంలో ఇతర చిన్న గ్రహాలను కూడా తనవైపు ఆకర్షిస్తుంది.
అలా తనచుట్టూ పళ్లెంలా ఉన్న శకలాలన్నిటినీ పూర్తిగా ఇముడ్చుకున్న తర్వాత అది గ్రహం అవుతుంది.
ఈ సిద్ధాంతాన్ని రూపొందించటానికి మన సౌర వ్యవస్థ మాత్రమే పరిశోధకులకు అందుబాటులో ఉండింది. పిడిఎస్ 70బి వంటి తొలి దశలోని గ్రహాన్ని చూడగలగటం వల్ల ఈ ప్రక్రియ మీద ఖగోళ పరిశోధకుల అవగాహన ఇంకా పెరగటానికి మరింత అవకాశం లభిస్తుంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









