'తల్లి కాబోయే లక్షల మంది మహిళలకు ఇదో శుభవార్త'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్మితా ముందసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బాలింతల ప్రాణాలను కాపాడే సామర్థ్యమున్న అత్యద్భుత ఔషధాన్ని గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.
'హీట్- స్టేబుల్ కార్మెటోసిన్'గా వ్యవహరిస్తున్న ఈ ఔషధం తీవ్రమైన ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుందని, 1000 రోజుల వరకూ నిల్వ ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రసవానంతర రక్తస్రావం కారణంగా సంభవిస్తున్న లక్షల మరణాలను నివారించేందుకు ఇది సాయపడుతుందని చెబుతున్నారు.
నిజానికి, ఇప్పటికే అలాంటి ప్రసవానంతర మరణాల నివారణకు ఉపయోగపడే మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి ఉష్ణోగ్రత, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరైన ఫలితాలివ్వడం లేదు.
దాంతో మరణాల నివారణ ఆశించిన స్థాయిలో సాధ్యం కావడంలేదు.
ప్రస్తుతం ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70,000 మంది మహిళలు ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రభావం నెలలోపు పిల్లల మరణాలు పెరగడానికి కూడా కారణమవుతోంది.
ఇన్నాళ్లూ రక్తస్రావం వల్ల సంభవించే మరణాల నివారణ కోసం ప్రసవం (నార్మల్ డెలివరీ) జరిగిన వెంటనే ప్రతి తల్లికీ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తూ వచ్చింది.
అయితే, ఆక్సిటోసిన్‌ను ఉత్పత్తి చేసినప్పటి నుంచి బాలింతకు ఇచ్చేంత వరకు 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యలోనే నిల్వచేయాల్సి ఉంటుంది.
కానీ, సరైన శీతలీకరణ వసతులు, విద్యుత్ సదుపాయం సరిగా లేని దేశాల్లో అది సాధ్యం కావడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇదో శుభ వార్త'
పరీక్షల్లో భాగంగా.. 10 దేశాల్లో దాదాపు 30,000 మంది బాలింతల్లో కొందరికి 'హీట్-స్టేబుల్ కార్మెటోసిన్', మరికొందరికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చారు.
ఈ రెండు ఔషధాల ఫలితాలూ ఒకే విధంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
అయితే, నిల్వ ఉండే వాతావరణ పరిస్థితిలో మాత్రమే ఆ ఔషధాల మధ్య తేడా ఉందని తెలిపారు.
'హీట్- స్టేబుల్ కార్మెటోసిన్' మందు దాదాపు 90 దేశాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సరైన శీతలీకరణ వసతులు లేని ప్రాంతాల్లోని లక్షలాది మంది మహిళలకు ఇదో శుభ వార్త అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్ మెటిన్ గుల్మెజోగ్లు అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా.. ఈ మందుతో ఆర్థికంగా వెనకబడి ఉన్న దేశాల్లో బాలింతల మరణాలను గణనీయంగా తగ్గించే వీలుంటుందని ఆయన తెలిపారు.
తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడటంలో ఇది గొప్ప ముందడుగు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అఢనోమ్ అన్నారు.
ప్రస్తుతం ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కొన్ని దేశాల్లో ఈ మందును అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- #గ్రౌండ్‌రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్‌లో గాలి ఎందుకిలా మారింది?
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








