పాపకు జన్మనిచ్చిన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌

తమ పాపతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ దంపతులు

ఫొటో సోర్స్, jacindaardern/facebook

ఫొటో క్యాప్షన్, తమ పాపతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ దంపతులు

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ ఒక పాపకు జన్మనిచ్చారు. 3.31 కేజీల బరువున్న ఈ పాప జసిండాకు తొలి సంతానం.

ప్రపంచ ఆధునిక చరిత్రలో.. ఎన్నుకోబడిన నేతగా, అధికారంలో కొనసాగుతూ పసికందుకు జన్మనిచ్చిన రెండో నాయకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.

నిర్ణీత గడువు ముగిసిన నాలుగు రోజుల తర్వాత స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.45 గంటలకు ఆక్లాండ్‌లోని ఒక ఆస్పత్రిలో ఆర్డెర్న్ ప్రసవించారు.

న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా అక్టోబర్‌లో ఎన్నికైన 37 ఏళ్ల ఆర్డెర్న్ తన బాధ్యతలను ప్రస్తుతం ఉప ప్రధానమంత్రి విన్‌స్టన్ పీటర్స్‌కు బదిలీ చేశారు. అయితే, క్యాబినెట్‌కు సంబంధించిన పత్రాలను మాత్రం తాను సెలవులో ఉన్నప్పుడు కూడా పరిశీలిస్తానని తెలిపారు.

తాను గర్భం దాల్చానని భర్త క్లార్క్ గేఫోర్డ్‌తో కలసి గత జనవరిలో ఆమె ప్రకటించారు. తాను ఆరు వారాలు మాతృత్వ సెలవు తీసుకుంటానని ఆమె చెప్పారు.

తమ పాపతో న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ దంపతులు

ఫొటో సోర్స్, JACINDAARDERN

‘‘వ్యక్తిగత, వృత్తిగత పనులను సమన్వయం చేసుకునే మొదటి మహిళను నేను కాదు. పని చేస్తూనే తల్లినవుతున్న మొదటి మహిళను కూడా నేను కాదు. ఇలా చేసిన మహిళలు ఎంతో మంది ఉన్నారు’’ అని గతంలో రేడియో న్యూజిలాండ్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

1856వ సంవత్సరంలో బ్రిటన్‌ స్వాతంత్ర్యం పొంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యూజిలాండ్‌కు అత్యంత చిన్న వయస్సులో ప్రధాని అయిన వ్యక్తి జసిండా కావటం విశేషం.

1990లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న బేనజీర్ భుట్టో తన కుమార్తెకు జన్మనిచ్చారు. ప్రపంచంలో ఎన్నుకోబడిన నేతగా, అధికారంలో కొనసాగుతూ పసికందుకు జన్మనిచ్చిన మొదటి మహిళ ఆమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)