అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యనీతి: స్నేహితుడా.. శత్రువా.. ఎవరైతే ‘నాకేంటి?’

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జేమ్స్ లాండేల్
- హోదా, దౌత్య ప్రతినిధి, బీబీసీ
అమెరికా అధ్యక్షుడిగా అయిష్టంగా ప్రయాణం ప్రారంభించారు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు ఆయనకు ఆ ప్రయాణం బాగా నచ్చినట్లు కనిపిస్తోంది. కెనడాలో జి7తో జగడాలు.. సింగపూర్‌లో కిమ్ జోంగ్-ఉన్‌తో సావాసం తర్వాత.. ట్రంప్ మరి కొన్ని వారాల్లో మరోసారి ప్రపంచ వేదిక మీదకు అడుగు పెట్టనున్నారు.
నాలుగేళ్లకోసారి జరిగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సదస్సులో పాల్గొనటానికి ఆయన విమానం ఎయిర్ ఫోర్స్ వన్ బ్రెసల్స్‌లో దిగుతుంది. ఇప్పటికే చాలా యూరప్ దేశాల ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన మొదలైంది.
వారి వారి రక్షణ రంగాలపై ఖర్చును పెంచాలని ట్రంప్ మరోసారి అడుగుతారని వారికి తెలుసు. కానీ వారిని ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం.. ట్రంప్ ఆగ్రహావేశాలకు గురయ్యే మరో అంతర్జాతీయ సంస్థ నాటో అవుతుందన్న భయం.
మిత్ర దేశాల మీద వాణిజ్య సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయం జి7 సదస్సులో ప్రధానాంశంగా మారింది. దాంతో ఆ సమావేశం చేదుగా ముగిసింది. ట్రంప్ తుది ప్రకటన మీద సంతకం చేసి మళ్లీ మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆతిథ్యమిచ్చిన కెనడా అధ్యక్షుడిని తూలనాడుతూ తన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచి ట్వీట్‌లు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
యూరప్ ఉమ్మడి రక్షణకు ట్రంప్ మద్దతు మీద సందేహం కలిగించేలా ఈ వాణిజ్య వివాదాన్ని ఉపయోగించుకునే అసాధారణ చర్యకు ఆయన పూనుకున్నారు. ‘‘యూరప్‌ను మేం చాలా ఆర్థిక నష్టంతో రక్షిస్తున్నాం. ఆపైన వాణిజ్యంలో మాకు అన్యాయం చేస్తున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘మార్పు రాబోతోంది’’ అనీ వ్యాఖ్యానించారు.
అంటే.. ఆ మార్పు ఏం కావచ్చు? కెనడాలో జి7, సింగపూర్‌లో ఉత్తర కొరియా - అమెరికా శిఖరాగ్ర సదస్సుల ద్వారా.. డొనాల్డ్ జె. ట్రంప్ దౌత్యం గురించి మనకు స్పష్టమైన అవగాహన లభిస్తోంది.
చాలా దౌత్య సమస్యల విషయంలో తను ఒక వాణిజ్య ఒప్పందంతో వ్యవహరించినట్లే ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ముందు గొడవ పడతారు. దానిని పెంచుతారు. అప్పుడు ఒప్పందం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఒకసారి బెదిరిస్తారు. మరోసారి బుజ్జగిస్తారు. ఈ క్రమాన్ని సాధ్యమైనంత దూరం.. ఇక తెగుతుందేమో అన్నంత వరకూ లాగుతారు.
సింగపూర్ శిఖరాగ్ర సదస్సు రద్దవుతుందని అకస్మాత్తు ప్రకటన.. మళ్లీ అంతే వేగంగా ఆ సదస్సు జరుగుతుందని నిర్ణయం.. ఈ క్రమంలోనివే. ఆయన దౌత్యంలో అధిక భాగం వ్యక్తిగత దాడులు ఉంటాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడిని ‘రాకెట్ మ్యాన్’ అని గేలి చేయటం వంటివి. ఇలా కావాలనే చేస్తానని ఆయన ‘ఫాక్స్ న్యూస్’తో చెప్పారు. ‘‘మాటల గారడీ లేకపోతే ఇక్కడి దాకా వచ్చేవాళ్లం కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ దౌత్యంలో అనూహ్యమైన క్షణాలు కూడా ఉంటాయి. ఆయన తన సొంత సిబ్బంది, స్నేహితులతో వ్యవహరించినట్లుగానే.. తనతో చర్చలు జరిపే వారిని కూడా ఆశ్చర్యపరచటానికి ఇష్టపడతారు. ఉత్తర కొరియాతో శిఖరాగ్ర సదస్సు ప్రతిపాదన అలా అకస్మాత్తుగా వచ్చిందే. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయం కూడా ఆ దేశానికి వార్తల ద్వారా తెలిసింది.

ఫొటో సోర్స్, AFP
ఆయన దౌత్యం అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతుంది. తనకు ఎలా అనిపిస్తే అలా సాగుతుంది. ఆ రోజు మూడ్ ఎలా ఉంటుందో అలా నడుస్తుంది. కిమ్ ఒప్పందం కోరుకుంటున్నారా లేదా అన్నది మొదటి నిమిషంలోనే తనకు తెలిసిపోయిందని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ దౌత్యంలో ఆయన స్వీయ ప్రదర్శన కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫొటోలకు అవకాశాలు ఇవ్వటం, కరచాలనాలు, పార్కుల్లో నడక వంటివి. ఇక సింగపూర్ శిఖరాగ్ర సదస్సు మీద హాలీవుడ్ సినిమా ట్రైలర్ తరహాలో ఒక వీడియో ఫిల్మ్‌ను కూడా ట్రంప్ రూపొందించారు.
ఆయన తన స్క్రిప్ట్‌ను తానే రాసుకునే దౌత్యవేత్త. విడ్డూరంగా అతిశయోక్తిగా అనిపించేంతలా అంచనాలు పెంచుతారు. ఆపైన సొంతంగా హోంవర్క్ చేసుకుంటారు. సింగపూర్ శిఖరాగ్ర సదస్సు తర్వాత ట్రంప్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఉత్తర కొరియా నుంచి ఇక అణు ప్రమాదం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఆ మాట జపాన్, దక్షిణ కొరియాలకు కొత్తది.
ఆ ట్వీట్లు.. చిన్నవే. కానీ ఎల్లప్పుడూ తియ్యగా ఉండవు. ట్రంప్ మాట్లాడటానికి ఎక్కువగా వాడే సాధనం ట్విటర్. భాషా శైలి రూపకల్పనలో విదేశాంగ మంత్రులతో మంతనాలేవీ లేకుండా దీనిని ఆయన స్వయంగా నడుపుతుంటారు.

ఫొటో సోర్స్, Twitter
ట్రంప్ దౌత్యం సారాంశం కూడా ఆయన శైలిలాగే విలక్షణంగా ఉంటుంది. బహుముఖత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు కనిపిస్తుంది. జి7, ఐక్యరాజ్యసమితి వంటి బహుళ దేశ సంస్థల్లో అమెరికా ఇప్పుడిక తన శక్తిని చాటలేకపోతోందని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది.
జి7 సదస్సుకు ఆయన ఆలస్యంగా వచ్చారు. ముందుగానే వెళ్లిపోయారు. తన అసహనాన్ని దాచుకోవటానికి పెద్దగా ప్రయత్నించలేదు. దీనికన్నా కానీ సరళమైన ముఖాముఖి ఒప్పందాలను, భావసారూప్యమున్న నాయకులతో ద్వైపాక్షిక చర్చలు, జాతీయ ప్రయోజనాలు - అధికారం మధ్య సంతులనాలను ట్రంప్ ఇష్టపడతారు.
అయితే.. ట్రంప్ దౌత్యం కొందరు అనుకునేంతటి విశిష్టమైనది కాదు. నేటి ప్రపంచంలో జాతీయం కన్నా అంతర్జాతీయ స్థాయి స్వభావం ఉన్న నాయకుడు ఆయన ఒక్కరు మాత్రమే కాదు.
ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి వ్యక్తిగత కెమిస్ట్రీ మీద ఆధారపడ్డ అమెరికా అధ్యక్షుల్లో మొట్టమొదటి వాడూ కాదు. 1980ల్లో రీగన్, గోర్బచేవ్‌లను గుర్తుచేసుకోండి. 1970ల్లో నిక్సన్, మావోలను చూడండి.
ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేస్తానని, చైనా ఉక్కు మీద పన్నులు విధిస్తానని ఇచ్చిన ఎన్నికల ప్రచార హామీలను అమలు చేస్తూ.. నేరుగా తన దేశంలోని రాజకీయ భూమికను అలరించేలా విదేశాంగ విధానాన్ని అమలుచేస్తున్న మొట్టమొదటి నాయకుడు కూడా కాదు ట్రంప్.
కాబట్టి.. ట్రంప్ దౌత్యం విశిష్టమైనది కాదు. అలాగని అందులో ప్రమాదం లేదని కాదు. కొన్నిసార్లు.. తర్వాతి చర్యలు ఏమిటనే ప్రణాళిక లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తారు. ఒకరకంగా.. ఇది ఆయన దుందుడుకు ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. సిబ్బంది చాలా తక్కువగా ఉన్న విదేశాంగ విభాగాన్ని కూడా ప్రతిఫలిస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగినప్పుడు ఇది చాలా స్పష్టంగా కనిపించింది. అమెరికా తదుపరి చర్య ఏమిటి అని యూరప్ దేశాలు అధ్యక్ష భవనాన్ని అడిగాయి. దానికి ఏ జవాబూ రాలేదు. ఇరాన్‌తో కొత్త ఒప్పందం కోసం ప్రయత్నించటానికి ప్రత్యామ్నాయ ప్రణాళికేదీ లేదు. యూరప్‌లో ఆగ్రహం చాలా వాస్తవికమైనది.
ట్రంప్ తను అనుకున్నట్లుగా చేసుకునే ఒప్పందాలతో సమస్య ఏమింటే.. ఆయన అనుకున్నది ఎల్లవేళలా సరైనది కాకపోవచ్చు.
వ్యక్తిగతంగా లోతుగా ఉండే దౌత్యంలో ప్రమాదాలు ఉన్నాయి. దేశాల మధ్య సంబంధాల వ్యక్తీకరణ.. వాటి నాయకులు ఎంత సన్నిహితంగా మెసులుకుంటారనే దాని ద్వారా మాత్రమే జరగదు. వ్యక్తుల పదవీ కాలం దాటి దీర్ఘకాలం కొనసాగే ఇరు దేశాల మధ్య బంధాలు, సంస్థాగత సంబంధాలు, ఉమ్మడి విలువల మీద ఆధారపడి ఉంటాయి.
అమెరికా సంకుచిత ఆర్థిక, రక్షణ ప్రయోజనాలపై ట్రంప్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించటంలో.. అమెరికా ఆలోచనా సరళలో 19, 20వ శతాబ్దాల్లో ప్రబలంగా ఉన్న సంప్రదాయ ఒంటరివాదపు ప్రతిధ్వనులు ఉన్నాయి.
జర్మనీ విదేశాంగ మంత్రి హఈకో మాస్ కొద్ది రోజుల కిందట మాట్లాడుతూ.. ‘‘ట్రంప్ ఆధ్వర్యంలో అట్లాంటిక్ ఇంకా విస్తృతమైంది. ఆయన ఒంటివాద విధానం ప్రపంచమంతటా భారీ శూన్యాన్ని మిగిల్చింది’’ అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ దౌత్యంలో మిత్రులు, శత్రువుల మధ్య విభజనలు కనుమరుగవుతున్నట్లు కొందరు భావిస్తారు. ప్రపంచం చాలా దేశాలతో నిండివుందని.. వాటితో సంబంధాలు నెరపాలో వద్దో నిర్ణయించుకోవాలనేది ఆయన వైఖరిగా పరిగణిస్తారు. మానవ హక్కుల విషయంలో దారుణమైన చరిత్ర ఉన్న ఉత్తర కొరియా నియంత మీద ప్రశంసలు కురిపించటానికి.. కెనడా వంటి సంప్రదాయ మిత్రుడిని దూషించటానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టం.
కిమ్ చేసిన చెడ్డపనులన్నిటి గురించి ఫాక్స్ న్యూస్‌లో ప్రశ్నించినపుడు.. ‘‘అవును.. అలాగే ఇంకా చాలా మంది కూడా కొన్ని మహా చెడ్డ పనులు చేశారు’’ అంటూ ఆయన కొట్టిపారేశారు.
ట్రంప్ దౌత్యం ఇదీ. అమెరికా - ఉత్తర కొరియాలు పరస్పరం అణు యుద్ధం గురించి బెదిరించుకోవటం కాకుండా.. కూర్చుని మాట్లాడుకునేలా చేసిన దౌత్యమిది. సిరియా ప్రజలను దగాచేసిందని చాలా మంది భావించే ప్రపంచ అంతర్జాతీయతావాదాన్ని ప్రశ్నించే దౌత్యం. భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని ఆశ్చర్యపరచే దౌత్యం.
కానీ.. ఈ దౌత్యం సమైక్యం చేస్తున్నంతగానే విభజిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. 20వ శతాబ్దపు వినాశకర జాతీయవాదాన్ని నిరోధించింది కోట్లాది మంది ప్రజలకు శాంతినిచ్చిందని చాలా మంది నమ్మే.. ఒక నియమావళి ఆధారంగా నడిచే అంతర్జాతీయ క్రమాన్ని సవాల్ చేస్తుందీ దౌత్యం.
ఈ దౌత్యానికి మలి మజిలీ.. జూలైలో నాటో సదస్సు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









