అణు దాడి జరిగితే ట్రంప్ ఎక్కడ తలదాచుకుంటారు?

- రచయిత, తారా మిక్కెల్వే
- హోదా, బీబీసీ వైట్‌హౌజ్ ప్రతినిధి
అణు దాడి జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు సురక్షితమైన బంకర్‌లోకి వెళ్లి తలదాచుకుంటారు. ట్రుమెన్ దగ్గరి నుంచి ప్రస్తుత ట్రంప్ వరకు అమెరికా అధ్యక్షులందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
అణుదాడి జరిగిన వెంటనే ట్రంప్‌ను సురక్షిత ప్రదేశానికి తరలిస్తారు. సురక్షిత ప్రాంతానికి క్షణాల్లో చేరుకునేందుకు అధ్యక్షుడికి అనేక మార్గాలు సిద్ధంగా ఉంటాయి.
అందులో ఒక బంకర్ వైట్‌హౌజ్ కిందే ఉంటుంది. ఎలాంటి దాడినైనా తట్టుకునేలా దీన్ని 1950లో నిర్మించారు.
మరొకటి వర్జీనియాలోని బ్లూ రిడ్జ్ పర్వతాల్లో ఉంది. ఇక్కడికి వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Courtesy of Anthony Miller
ఫ్లోరిడాలోని మార్-లా-లగో ఎస్టేట్‌లో మరొక బంకర్ ఉంది.
ఇంకోటి వెస్ట్ పామ్ బీచ్‌లో అధ్యక్షుడి గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఉంది.
దీన్ని బాంబులు నిల్వ చేసేందుకు ఉపయోగించేవాళ్లు.
బాంబు షెల్టర్లను చూస్తే అణు భయాలు తలెత్తిన ప్రతీసారీ అధ్యక్షుడిని కాపాడుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో అర్ధం అవుతుంది.
అణు యుద్ధం అనేది కొందరికి ఊహకందని విషయం. మరికొందరు మాత్రం దాని గురించి ప్రణాళికలు రచిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, నేరుగా అణుదాడి చేస్తే ఏ ఒక్క బంకర్ కూడా దాన్ని నుంచి తప్పించుకోలేదు.
'అణు దాడి, దాని నుంచి వెలువడే వేడి నుంచి తట్టుకోగలిగిన రక్షణ ఈ బంకర్లకు లేదు' అని వన్ నేషన్ అండర్‌గ్రౌండ్: ద ఫాలౌట్ షెల్టర్ ఇన్ అమెరికన్ కల్చర్ రచయిత కెన్నీత్ రోస్ అన్నారు.
ఒకవేళ తొలిదాడి నుంచి అధ్యక్షుడు బతికి బయటపడితే, అప్పుడు అతడిని సురక్షితమైన బంకర్‌లోకి తరలిస్తారు.
ప్రపంచం మొత్తం తగలబడిపోతున్నా.. దేశాన్ని పాలించేందుకు అనువైన అన్ని వసతులు ఆ బంకర్‌లో ఉండాలి.
అందుకే అమెరికా అధికారులు సురక్షిత ప్రాంతంలో అధ్యక్షుడి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
బంకర్‌లోకి వెళ్లేందుకు అత్యున్నత అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని 9/11 దాడి సమయంలో వైట్‌హౌజ్ బంకర్‌లో పనిచేసిన రాబర్ట్ డార్లింగ్ చెప్పారు.
'బంకర్‌లోకి వెళ్లాలంటే చైన్ ఆఫ్ కమాండ్ ఉండాలి' అని ముస్సోరీలోని ట్రుమెన్ లైబ్రరీ ఆర్కైవిస్ట్ రాండీ సోవెల్ అన్నారు. లేదంటే పరిస్థితి అంతా గందరగోళంగా మారుతుందని అన్నారు.

ఫొటో సోర్స్, US National Archives
అధ్యక్షుడి కోసమో, లేదా సాధారణ పౌరుల కోసమో నిర్మించే బంకర్ల వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది.
అణుయుద్ధంపై అమెరికన్లలో ఇవి చైతన్యం తీసుకొస్తున్నాయి. వాటి గురించి మాట్లాడుకునేలా చేస్తాయి.
'నాగసాకి మీద అమెరికా అణు దాడి చేసినప్పుడు, అక్కడి ప్రజలను ఫాలౌట్ షెల్టర్లలోకి తరలించి ఉంటే 30శాతం మంది బతికి ఉండేవారని' అమెరికా వ్యూహాత్మక బాంబింగ్ సర్వేలో తేలిందని ఆర్కైవిస్ట్ రాండీ సోవెల్ అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రుమెన్ సివిల్ డిఫెన్స్ కార్యక్రమం లక్ష్యం కూడా ఇదేనని ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా షెల్టర్ వ్యవస్థ నెలకొల్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని షెల్టర్లు ప్రభుత్వ అధికారుల కోసం, ప్రజల కోసం నిర్మించారు.
1960లో కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో నిర్మించిన సామూహిక బంకర్లు ఇలాంటి కోవలోకే వస్తాయి.

కొందరు సొంతంగా కూడా బంకర్లు నిర్మించుకున్నారు. వేలాది మంది సొంత ఖర్చుతో వీటిని ఏర్పాటు చేసుకున్నారు.
'న్యూక్లియర్ వార్'పై పరిశోధన చేస్తూ లారా అనే ఒక హిస్టరీ ప్రొఫెసర్ ఈ విషయాన్ని గుర్తించారు. ప్రజల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది ఒక బాధ్యతగా మారిందని ఆమె చెప్పారు.
1950 తొలినాళ్లలో కొరియా యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ సమయంలో మార్జోరియా అనే మహిళ ఫ్లోరిడాలోని తన 'మార్-లా-లగో' ఎస్టేట్ కింద ఒక బంకర్ నిర్మించుకున్నారని అమెరికా చారిత్రక భవనాల సర్వేలో తేలింది.
1985లో బంకర్‌తో సహా ఈ ఎస్టేట్‌ను ట్రంప్ కొన్నారు.
బంకర్ ఎత్తు చాలా తక్కువగా ఉండేదని ప్రాజెక్ట్ మేనేజర్ వెస్ బ్లాక్‌మెన్ అన్నారు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉండే బ్లాక్‌మెన్.. ఈ బంకర్‌లో ట్రంప్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలో తల వంచుకోవాల్సి వచ్చేదని చెప్పారు.
ఆ సమయంలో తాము ఒక పురాతత్వ పరిశోధన చేస్తున్నామేమో అని అనిపించేదని బ్లాక్‌మెన్ చెప్పారు.

ఆ బంకర్ చాలా చీకటిగా, బూజుపట్టి ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
మడత మంచాలు గోడకి అనుకుని ఉండేవని, గాలి లోపలికి వచ్చే ఏర్పాట్లు ఉండేవని చెప్పారు. అంతేకాదు గది మధ్యలో ఒక టాయిలెట్ కూడా ఉందని వివరించారు.
వర్జీనియాలోని బ్లూమౌంట్ శిఖరం 'మౌంట్ వెదర్' అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ బంకర్‌గా మారిపోయింది.
అణు దాడి జరిగితే అధ్యక్షుడు, అతని సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు తలదాచుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
కాంగ్రెస్ సభ్యులను పశ్చిమ వర్జీనియాలోని గ్రీన్‌బ్రియర్ రిసార్ట్ సమీపంలోని బంకర్‌కు తరలిస్తారు.
ఈ బంకర్‌కు ప్రాజెక్ట్ గ్రీక్ ఐలాండ్ అని ఒక కోడ్ నేమ్ ఉంది. ఇది దశాబ్దాలుగా పనిచేస్తోంది.
అయితే, 1992లో ఈ సీక్రెట్ బంకర్ గురించి మీడియాలో రావడంతో దీన్ని ప్రస్తుతం ఉపయోగించడం లేదు.
'మౌంట్ వెదర్ బంకర్'ను ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ-ఫెమా నిర్వహిస్తోంది.
2001లో ఆల్‌ఖైదా దాడుల తర్వాత దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అదే ఏడాది ఈ విషయాన్ని ఫెమా డైరెక్టర్ అమెరికన్ కాంగ్రెస్‌లో అంగీకరించారు. కానీ పూర్తి వివరాలు మాత్రం ఇవ్వలేదు.

సిద్ధాంతపరంగా అణుదాడి జరిగిన తర్వాత ట్రంప్‌కు ఇక్కడే షెల్టర్ ఏర్పాటు చేస్తారు.
'మౌంట్ వెదర్ బంకర్' గురించి తెలుసుకోవాలని స్థానికులు చాలా ఆసక్తి చూపిస్తారు.
డూమ్స్‌డే సిటీ అని కూడా పిలిచే 'మౌంట్ వెదర్ బంకర్'పై చాలా హెలిపాడ్లు ఉన్నాయని వారు చెబుతుంటారు.
1961లో మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కోసం ఫ్లొరిడాలో మరో బంకర్ నిర్మించారు. ఫ్లోరిడాలోని మార్-లా-లగో ఎస్టేట్‌కు సమీపంలోనే ఇది ఉంది.
కెన్నడీ తరచూ బస చేసే పామ్ బీచ్‌కు దగ్గర్లో పీనట్ ఐలాండ్‌లో ఈ బంకర్ నిర్మించారు.
పామ్ బీచ్ హౌజ్ నుంచి 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

ఈ బంకర్‌కు డిటాచ్‌మెంట్ హోటల్‌గా కూడా పేరుంది.
దీన్ని నిర్మించడానికి 97వేల డాలర్లు ఖర్చు అయ్యాయని 1973లో ఒక నివేదిక తెలిపింది.
ఈ బంకర్‌కు కెన్నడీ ఒకట్రెండుసార్లు వచ్చారు. ఆ తర్వాత దీన్ని ఒక మ్యూజియంగా మార్చారు.
అమెరికా అధ్యక్షుల బంకర్లు మౌంట్ వెదర్, పీనట్ ఐలాండ్, మార్-లా-లగోలను ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నిర్మించారు.
'మార్-లా-లగో' లోని బంకర్‌ను ట్రంప్ కోసం మరింత పటిష్టం చేయాల్సిన అవసరం లేదని బ్లాక్‌మెన్ అన్నారు.
ఒకవేళ అణుదాడి జరిగితే ట్రంప్ లేక్ హౌజ్‌కి వెళ్లి తలదాచుకుంటారని బ్లాక్‌మెన్ వివరించారు.
ప్రతీఒక్కరు బంకర్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

అమెరికా అధ్యక్షుడి బంకర్‌లోకి ఎవరిని అనుమతిస్తారు?
పీనట్ ఐలాండ్ : అధ్యక్షుడు, మరికొందరు అతని సహాయకులు, ఇంకొందరు కార్యదర్శులు. మొత్తం 30 మందికి ఇక్కడ చోటుంది.
వైట్‌హౌజ్ : 9/11 దాడుల సమయంలో ఉపాధ్యక్షుడు డిక్ చెనీ ఈ బంకర్ నుంచే పనిచేశారు. ఉపాధ్యక్షుడి భార్య, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి ఇక్కడ ఉన్నారు.
మౌంట్ వెదర్ : ఇక్కడ అధ్యక్షుడికి ప్రత్యేక గది లేదు. అధ్యక్షుడి సహాయకులు, వందలాది మందికి ఇక్కడ బస ఏర్పాటు చేయవచ్చు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా గది నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








