హాఫిజ్ సయీద్: భారత్ ఒత్తిడితోనే మాపై చర్యలు: హాఫిజ్ సయీద్

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల తమ పార్టీపై పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అమెరికా, భారత్‌ల ఒత్తిడి ఫలితమేనని జమాత్-ఉద్-దావా చీఫ్ హాఫిజ్ సయీద్ అన్నారు.
కొంతమంది రాజకీయ నాయకులు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని సయీద్ తెలిపారు.
అయితే హాఫిజ్ సయీద్‌పై చర్యలు 'ఆపరేషన్ రద్ద్-ఉల్-ఫసాద్'లో భాగంగా తీసుకున్నవేనని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగీర్ బీబీసీకి వివరించారు.
బీబీసీ ఉర్దూ ప్రతినిధి షఫీ నకీ జామై హఫీజ్ సయీద్‌ను టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ‘'‘ఆపరేషన్ రద్ద్-ఉల్-ఫసాద్' ఛాందసవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ కాబట్టి ప్రభుత్వం జమాత్-ఉద్-దావాను ఛాందసవాదసంస్థగా పరిగణించిందా?’' అని ఆయన ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా హాఫిజ్ - తనకు ఎలాంటి నోటీసూ రాలేదని, దానికి ఎలాంటి ఆధారం కూడా లేదని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
పాకిస్తాన్‌పై భారత్, అమెరికాల ఒత్తిడి
''ఇదంతా అమెరికా ఒత్తిడితోనే జరుగుతోందని నాకు స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాకుండా, భారత్ వైపు నుంచి కూడా జరుగుతున్న ప్రయత్నాల వల్లే రక్షణ మంత్రి ఈ విధంగా మాట్లాడతున్నారు'' అని హాఫిజ్ సయీద్ అన్నారు.
తాను అన్ని కేసుల నుంచి నిరపరాధిగా బయటపడ్డానని, కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఇతరుల అజెండా ప్రకారం వ్యవహరిస్తూ, తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని హాఫిజ్ అన్నారు.
''మా స్వభావం ఏమిటో ప్రపంచం అంతటికీ తెలుసు. పెషావర్‌లో పిల్లలపై దాడి జరిగినపుడు, సాయం చేయడానికి మొట్టమొదట రంగంలోకి దిగింది మేమే'' అని అన్నారు.
''అదే విధంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం సాహిత్యాన్ని ప్రచురిస్తున్నాం. దేశవ్యాప్తంగా దానిని పంచుతున్నాం. వీళ్లు ఎవరి అజెండా ప్రకారం పని చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, AFP
'అమెరికాతో ఘర్షణ లేదు'
అమెరికా డ్రోన్ దాడులతో ఆయనను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తోందని కొన్నాళ్ల క్రితం వచ్చిన వార్తల గురించి హాఫిజ్ సయీద్‌ను ప్రశ్నించినపుడు ఆయన వాటిని కొట్టిపారేశారు.
''మాకు అమెరికాతో ఎలాంటి వివాదమూ లేదు. మేం మాట్లాడేదంతా కశ్మీర్ గురించే. మాకు వ్యతిరేకత భారత్ వైపు నుంచే వస్తోంది. బహుశా భారత్ అమెరికాను రెచ్చగొడుతుందేమో'' అని అన్నారు.
జమాత్-ఉద్-దావాకు హక్కానీ నెట్‌వర్క్‌తో ఉన్న సంబంధాలపై మాట్లాడుతూ, రెండింటి మధ్య ఎలాంటి సంబంధమూ లేదని హఫీజ్ సయాద్ అన్నారు. అలాగే అఫ్గానిస్తాన్ పరిస్థితితో కూడా తమకు సంబంధం లేదని తెలిపారు. అయితే అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి ఖచ్చితంగా వెళ్లిపోవాల్సిందేనన్నారు.

ఫొటో సోర్స్, EPA
'భారత్-అమెరికాలు కలగాపులగం చేస్తున్నాయి'
''అమెరికాకు హక్కానీ నెట్‌వర్క్‌తో సమస్య అయితే, భారత్‌కు మాతో సమస్య. ఇదే కారణమని నాకనిపిస్తోంది. భారత్, అమెరికాలు రెండూ కలిస్తే సమస్యల్ని కలగాపులగం చేస్తాయి" అని హాఫిజ్ సయీద్ అన్నారు.
తమ సంస్థ పేరును హక్కానీ నెట్‌వర్క్‌తో జోడించడంపై మాట్లాడుతూ ఆయన, ''హక్కానీకి తనవైన కారణాలున్నాయి. వారు అఫ్గానిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. కశ్మీర్‌లో పోరాడుతున్న వారిని కూడా మేం సమర్థిస్తాం'' అని అన్నారు.
''అమెరికా అఫ్గానిస్తాన్‌లో తిష్ట వేయగూడదు, హత్యాకాండల్ని ఆపెయ్యాలి, అమెరికా వెనక్కి వెళ్లిపోవాలని అని హక్కానీ అంటోంది. ఈ అంశాలపై మా సానుభూతి ఉంటుంది. కానీ మాకు వాళ్లతో ఎలాంటి సంబంధాలు లేవు'' అని హాఫిజ్ తెలిపారు.
పాకిస్తాన్‌కు సాయాన్ని నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలపై తన స్పందన తెలుపుతూ, కష్ట సమయాలలో పాకిస్తాన్ అమెరికాకు చాలా సాయం చేసినా, అమెరికా అఫ్గానిస్తాన్‌లో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే పాకిస్తాన్‌పై నెపం పెడుతోందని అన్నారు.

ఫొటో సోర్స్, ARIF ALI/AFP/GETTY IMAGES
'కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలి'
భారత్‌తో పాక్ సంబంధాలు మెరుగుపడాలని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు, నేటి కాలంలో యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని హాఫిజ్ సయీద్ అన్నారు.
"పాకిస్తాన్-భారత్ సంబంధాలు మెరుగుపడాలి. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలి. మేం కోరుకునేది ఇదే. అయితే నా ఈ మాటను సహించకపోవడం విచారకరం" అని హాఫిజ్ సయీద్ అన్నారు.
"నేటి కాలంలో యుద్ధం ద్వారా సమస్యలేవీ పరిష్కారం కావు. ఈ మాటే మేం అమెరికాతో అంటున్నాం. ఇదే మాటను భారత్‌తో కూడా అంటున్నాం."
"ప్రతి దేశంలోనూ సమస్యలున్నాయి. పరిస్థితులు దిగజారిపోవాలని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోం. పాకిస్తాన్‌పై నిషేధాలు, ఆంక్షలు విధించే పరిస్థితులు తలెత్తకూడదు. పాకిస్తాన్-భారత్ సంబంధాలు మెరుగుపడాలన్నదే మా అభిమతం."
అయితే పాకిస్తాన్‌లో జమాత్-ఉద్-దావాపై ఈ మధ్య చేపట్టిన చర్యలతో అమెరికాకు ఏ సంబంధం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగీర్ ఖాన్ బీబీసీ ప్రతినిధి ఫర్హత్ జావేద్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చర్యలు ఆపరేషన్ రద్ద్-ఉల్-ఫసాద్‌లో భాగమని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలపై నిషేధాలు విధిస్తున్నారనీ, అయితే పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ట్వీట్‌పై ఏమన్నారు?
పాకిస్తాన్ అమెరికాకు క్లిష్ట సమయాల్లో సహాయం అందించిందని హాఫిజ్ సయీద్ అన్నారు. కానీ అదిప్పుడు తన వైఫల్యానికి గాను పాకిస్తాన్‌ను నిందిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
"నాటో దేశాలు అఫ్గానిస్తాన్‌కు వచ్చాయి. అఫ్గాన్‌కే కాదు పాకిస్తాన్‌కు కూడా వచ్చాయి. వాటికి మేం స్థావరాలు కల్పించాం. కరాచీ నుంచి తుర్ఖమ్ దాకా ఉన్న రోడ్లన్నింటినీ అమెరికాకు అప్పజెప్పాం" అని హాఫిజ్ అన్నారు.
"ఎంతో పని చేశాం. అయితే ఎంత చేసినా పాకిస్తాన్‌లో ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి. వారంతా అఫ్గానిస్తాన్ నుంచి వస్తున్నారు. పాకిస్తాన్, పాకిస్తానీ ప్రజలు పోషించిన పాత్రకు గాను ఇప్పుడు మేం శిక్ష అనుభవిస్తున్నాం" అని హాఫిజ్ అన్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








