మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి

ఫొటో సోర్స్, Wathiq Khuzaie/getty images
- రచయిత, టిమ్ హార్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్, 50 థింగ్స్ దట్ మేడ్ ది మోడ్రన్ ఎకానమీ
ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు ఈ రోజుల్లో దాదాపు చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. మరి ఆ కార్డు ఎలా పుట్టిందో మన కొనుగోలు విధానాన్ని ఎలా మార్చిందో తెలుసుకుందామా?
ఊరికే ఓ మాట అనుకుందాం.
మీరు ఓ షాపు ఓనరు. మీ వద్దకు రోజూ ఎంతో మంది వినియోగదార్లు వస్తుంటారు.
వారిలో మీరు ఎవరిని నమ్ముతారు? ఎవరికి అరువుకు సరకులు ఇస్తారు?
మీకు వ్యక్తిగతంగా బాగా ఎవరు పరిచయం ఉంటే వారికే కదా !
కొద్ది మంది వినియోగదార్లు అయితే ఫర్వాలేదు. వారిలో చాలా మందితో మీకు పరిచయం ఉంటుంది.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/getty images
అదే మీ వినియోగదార్ల సంఖ్య వేలల్లో ఉంటే? ఎంతమందిని గుర్తు పెట్టుకోగలరు?
వారిలో నమ్మకమైన వారిని ఎలా గుర్తించగలరు?
పట్టణీకరణ పెరిగే కొద్దీ వ్యాపార రంగంలో ఇటువంటి సమస్యలు తలెత్తడం ప్రారంభించాయి.
పెద్దపెద్ద డిపార్టమెంటల్ స్టోర్లు ఇటువంటి ఇబ్బందినే ఎదుర్కొన్నాయి.
ఈ సమస్యను దూరం చేసేందుకు రిటైల్ షాపులు నమ్మకమైన వినియోగదార్లకు టోకెన్లు జారీ చేయడం ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, Alamy
క్రెడిట్ టోకెన్లు
ప్రత్యేకమైన నాణేలు, రింగులను టోకెన్లుగా ఇచ్చేవారు.
1928లో తొలిసారి ఛార్జా ప్లేట్స్ అనే టోకెన్లు జారీ చేశారు.
వినియోగదార్లు షాపునకు వెళ్లినప్పుడు ఈ టోకెన్లు చూపిస్తే చాలు. వచ్చిన వ్యక్తి ఎవరో ఉద్యోగికి తెలియకపోయినా ఆ టోకెన్ చూసి అరువుకు సరకులు ఇచ్చే వాడు.
ఆ రోజుల్లో అవి వ్యక్తుల హోదాకు ఒక చిహ్నంగా ఉండేవి.
ఏ షాపు అయితే టోకెన్లు ఇస్తుందో ఆ షాపులోనే వస్తువులు తీసుకోవడానికి ఆ టోకెన్లు ఉపయోగపడేవి.

ఫొటో సోర్స్, Alamy
ఏ షాపులోనైనా..
ఒకటి కంటే ఎక్కువ షాపుల్లో వినియోగించుకునే టోకెన్లను తొలిసారి 1947లో తీసుకొచ్చారు.
చార్జ్ ఇట్.. అనే పేరుతో జారీ చేసే ఈ టోకెన్ బ్రూక్లిన్ ప్రాంతంలోనే వినియోగంలో ఉండేది.

మార్కెటింగ్ ఉద్యోగుల కోసం
1949లో ప్రధానంగా మార్కెటింగ్ ఉద్యోగుల కోసం డైనర్స్ క్లబ్ కార్డ్ ఒక కొత్త కార్డు తీసుకొచ్చింది.
అమెరికాలో ఎక్కడైనా ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది.
తినడానికి, హోటళ్లలో దిగడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. పెట్రోలు/డీజిల్/గ్యాస్ కొనుక్కోవడానికి కూడా ఈ కార్డులు ఉపయోగపడేవి.
ఇందుకు కార్డు జారీ చేసిన సంస్థ కొన్ని రిటైల్ షాపులతో ఒప్పందం కుదుర్చుకునేది.

తొలి ఏడాది 35,000
డైనర్స్ క్లబ్ కార్డు జారీ చేసిన తొలి ఏడాదిలోనే దాదాపు 35,000 మంది తీసుకున్నారు.
దీంతో మరిన్ని హోటళ్లు, విమానయాన సంస్థలు, పెట్రోలు బంకులు, ట్రావెల్స్ సంస్థలతో కార్డు జారీ చేసిన కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంక్ అమెరికార్డ్
1950లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ కార్డు వచ్చింది. ఇదే ఏడాదిలో బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేయడం ప్రారంభించాయి.
'బ్యాంక్ అమెరికార్డ్' పేరిట బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. ఆ తరువాత బ్యాంక్ అమెరికార్డ్ వీసాగా మారింది.
వీసా పోటీదారైన మాస్టర్ ఛార్జ్ ఆ తరువాత మాస్టర్‌కార్డ్‌గా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
సమస్యలు ఇలా..
ఆ రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగానికి ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యాయి.
అయితే ఎక్కువ మంది వినియోగదార్ల వద్ద క్రెడిట్ కార్డులు ఉంటే కానీ రిటైల్ షాపులు అనుమతించేవి కావు.
ఎక్కువ షాపులు అనుమతిస్తే కానీ వినియోగదార్లు కార్డులు తీసుకునేవారు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్లాస్టిక్ కార్డులు
ఈ ఇబ్బందులు అధిగమించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక ప్రయోగం చేసింది.
1958లో వినియోగదార్లకు ప్లాస్టిక్ కార్డులను జారీ చేసింది.
కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో ప్రాంతంలో 60,000 మందికి ఈ కార్డులను అందించింది.
ప్రతి క్రెడిట్ కార్డుకు రుణ పరిమితిని 500 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం దీని విలువ 5,000 డాలర్లుగా ఉంటుంది. దీన్ని ఫ్రెస్నో డ్రాప్ అనేవారు.
నష్టాల పలకరింపు
క్రెడిట్ కార్డులు తీసుకున్న వారిలో కొందరు రుణాలు ఎగ్గొట్టారు.
మరి కొందరు ఇతరుల కార్డులను దొంగిలించి వాడుకున్నారు. ఇలా కార్డులు జారీ చేసిన బ్యాంక్‌ను నష్టాలు పలకరించాయి.

ఫొటో సోర్స్, Getty Images
లక్షల కార్డులు
ఆ తరువాత కొద్ది కాలంలోనే ఫ్రెస్నో డ్రాప్ విధానం విజయవంతమైంది. బ్యాంకు నష్టాలు తగ్గాయి.
1960 చివరి నాటికి బ్యాంక్ ఆఫ్ అమెరికా జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య లక్షలకు చేరింది.
వినియోగంలో ఇబ్బంది
క్రెడిట్ కార్డుల వినియోగానికి ఎదురైన మరో సమస్య చెల్లింపుల విధానం.
క్రెడిట్ కార్డుతో చెల్లింపులు జరపాలంటే షాపు వ్యక్తి బ్యాంక్‌కు ఫోను చేయాలి. బ్యాంకు నుంచి అనుమతి వచ్చాకే లావాదేవీ పూర్తి అవుతుంది. ఇందుకు ఎంతో సమయం పట్టేది.

ఫొటో సోర్స్, Alamy
ఫలించిన ఇస్త్రీ ప్రయోగం
ఆ తరువాత వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ చెల్లింపుల విధానాన్ని మరింత సులభతరం చేసింది.
వీటిలో అతి ముఖ్యమైనది మ్యాగ్నటిక్ స్ట్రిప్.
తొలుత దీన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) ఉద్యోగుల కోసం రూపొందించారు.
1960 తొలి నాళ్లలో ఐబీఎం ఇంజినీరు ఫారెస్ట్‌కు ఒక సమస్య ఎదురైంది.
ఒక మ్యాగ్నటిక్ టేపులో ఉద్యోగుల సమాచారం ఉంది. దాన్ని ఒక ప్లాస్టిక్ కార్డుకు అతికించాలి.
ఎలా అని ఆలోచిస్తూ వాటిని తీసుకొని ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న అతని భార్య డొరోతీయా ప్యారీ ఓ ఇస్త్రీ పెట్టే ఫారెస్ట్ చేతికి ఇచ్చి దానితో ప్రయత్నించమన్నారు.
ఇస్త్రీ పెట్టే వేడికి ఆ ఒత్తిడికి మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుకు చక్కగా అతక్కుంది.
అంతే మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డు అవతరించింది.
ఇది చెల్లింపుల విధానంలో సరికొత్త శకానికి తెర తీసింది.

ఫొటో సోర్స్, Joe Raedle/getty images
ఒక్క స్వైప్‌తో
ఉదాహరణకు వీసా కార్డుతో స్వైప్ చేసినప్పుడు షాప్ నుంచి బ్యాంక్‌కు సందేశం వెళ్తుంది. ఆ తరువాత బ్యాంకు నుంచి సమాచారం వీసా సంస్థకు పోతుంది. మళ్లీ వీసా నుంచి సందేశం బ్యాంక్‌కు వెళ్తుంది.
క్రెడిట్ కార్డులు సమాజంలో ఒక గణనీయమైన మార్పును తీసుకొచ్చాయి.
గతంలో అప్పు కావాలంటే బ్యాంకుల ముందు గంటల కొద్దీ వేచి ఉండాల్సివచ్చేది. మేనేజర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చేది.
క్రెడిట్ కార్డులు ఈ ఇబ్బందులను దూరం చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్రెడిట్ కార్డుకే ఓటు
క్రెడిట్ కార్డు వినియోగంపై ఆయా వ్యక్తుల వైఖరి ఎలా ఉందో తెలుసుకోవడానికి కొద్ది ఏళ్ల క్రితం ఇద్దరు పరిశోధకులు ప్రయత్నించారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డ్రాజెన్ ప్రీలెక్, డంకన్ సిమెస్టర్ ఒక పరిశోధన నిర్వహించారు.
కొందరు వ్యక్తులను రెండు సమూహాలుగా విభజించారు.
ఒక ప్రముఖ క్రీడకు సంబంధించిన టికెట్లు కొనుగోలు చేయమని చెప్పారు. ఇవి కాస్త రేటు ఎక్కువే.
ఒక సమూహాన్ని కేవలం నగదుతో, మరొక సమూహాన్ని క్రెడిట్ కార్డుతో మాత్రమే కొనాలని చెప్పారు.
ఫలితాలు చూస్తే క్రెడిట్ కార్డు వినియోగించిన వారే ఎక్కువ టికెట్లు కొన్నారు.
ఏది ఏమైనా క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వినియోగిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.
"50 థింగ్స్ దట్ మేడ్ ది మోడ్రన్ ఎకానమీ" పేరిట కథనాలను బీబీసీ వరల్డ్ సర్వీస్ అందిస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో అండర్‌కవర్ ఎకనామిస్ట్ పేరిట టిమ్ హార్‌ఫోర్డ్ వ్యాసాలు రాశారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








