ఆటోబయోగ్రఫీ రాసే ఆలోచన లేదన్న తబు

ఫొటో సోర్స్, UNIVERSAL PR
హిందీలో 'విజయ్‌పథ్'తో తన కెరీర్ ప్రారంభించిన తబు, రెండు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్నారు. అయినా ఆమె సినిమాల కోసం ఏనాడూ, ఎవరి వెంటా పడలేదు.
తన చిత్రరంగం విశేషాల గురించి బీబీసీకి వివరిస్తూ తబు, ఇప్పుడు సినిమాలలో నటించడంపై తనకు పెద్దగా ఆసక్తి లేదన్నారు.
కేవలం షూటింగ్‌లో సరదాగా ఉండే వారితోనే నటించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తబు తెలిపారు.
తన కెరీర్‌లో తబు 'మక్బూల్', 'ఫితూర్', 'అస్తిత్వ', 'చాందినీ బార్', హైదర్'లాంటి పలు సీరియస్ సినిమాలలో నటించారు.
అయితే ఒక కామెడీ సినిమాలో నటించాలనేది చాలా ఏళ్లుగా ఆమె కోరిక. రోహిత్ శెట్టి 'గోల్‌మాల్-4'తో ఆమె కోరిక తీరబోతోంది.
అయితే కామెడీ సినిమా అయినా ఇందులో తబు క్యారెక్టర్ మాత్రం సీరియస్సే.

ఫొటో సోర్స్, UNIVERSAL PR
తాను సీరియస్ పాత్రలు పోషించినపుడు ప్రేక్షకులు తనను కామెడీ పాత్రల్లో చూడాలనుకుంటారనని, అదే కామెడీ చిత్రంలో నటిస్తే తన నుంచి సీరియస్ పాత్రను ఆశిస్తారని తబు అభిప్రాయబడ్డారు.
అందువల్ల తన మనసుకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తున్నానని ఆమె తెలిపారు.
ఇటీవల తక్కువ సినిమాలు చేయడంపై జవాబిస్తూ, ''నేను కనీసం ఏడాదికి ఒకటైనా చేస్తున్నా. నా తరం వాళ్లు ఇంకా ఎవరు సినిమాలు చేస్తున్నారో చెప్పండి?'' అని ప్రశ్నించారు.
'గోల్‌మాల్-4'లో ఆమె తన దగ్గరి స్నేహితుడు అజయ్ దేవగన్‌తో జంటగా నటిస్తున్నారు.
తామిద్దరి మధ్య ఉన్న రిలేషన్ చాలా ప్రత్యేకమని టబు తెలిపారు. కెరీర్‌లోని ప్రతి దశలోనూ తామిద్దరం కలిసి పని చేసినట్లు తబు తెలిపారు.
అందువల్లే అతనితో కలిసి పని చేయడం చాలా హాయిగా ఉంటుందన్నారు.

ఫొటో సోర్స్, UNIVERSAL PR
ఆ ఆలోచన లేదు!
అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన 'చీనీ కమ్' చిత్రం తన కెరీర్‌లో మైలురాయని తబు పేర్కొన్నారు. దాని తర్వాత అదే పంథాలో అనేక చిత్రాలు వచ్చాయని గుర్తు చేశారు.
తన 20 ఏళ్ల కెరీర్‌లో టబు ఎన్నో ఎగుడు దిగుళ్లు చూశారు. అయితే ఆటోబయోగ్రఫీ రాసే ఆలోచన మాత్రం తనకు లేదని తబు స్పష్టం చేశారు.
రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 'గోల్‌మాల్-4'లో అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, పరిణీతి చోప్రా, తుషార్ కపూర్, కునాల్ ఖేమూ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కానుంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








