ఐఎస్‌పై పోరు: సెంట్రల్ హవిజా ఇరాక్ 'స్వాధీనం'

ఫొటో సోర్స్, AFP
ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోఉన్న హవిజా ప్రధాన పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ సైన్యం ప్రకటించింది. హవిజా ఐఎస్ నియంత్రణలో గల చివరి ప్రాంతం.
వేలాది మంది ప్రజలు నివసించే హవిజా పట్టణం 2014 నుండి ఐఎస్ ఆధీనంలో ఉంది.
ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఇరాక్ సైన్యం స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లయితే ఐఎస్ ఇక సిరియా సరిహద్దులోని చిన్న భూభాగానికి మాత్రమే పరిమితమవుతుంది.
ఐఎస్ తీవ్రవాదులు 196 మందిని కాల్చి చంపి, హవిజా చుట్టుపక్కల ఉన్న 98 గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ సైన్యం బుధవారం ప్రకటించింది.
‘‘పోలీసులు, భద్రతా దళాలు హవిజా ప్రాంతాన్ని ఐఎస్ చెర నుండి విముక్తి చేశాయి. ఇంకా ముందుకు కొనసాగుతున్నాయి’’ అని లెఫ్ట్‌నెంట్ జనరల్ అబ్దెల్ అమిర్ యరల్లా గురువారం ఉదయం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
నగరానికి దక్షిణాన ఉన్న రషాద్ ఎయిర్ బేస్‌ను ఇరాక్ సైన్యం మంగళవారం స్వాధీనం చేసుకుంది. ఈ ఎయిర్ బేస్‌ను ఐఎస్ తీవ్రవాదులు శిక్షణా శిబిరంగా ఉపయోగించేవారు.
హవిజాలో ఇంకా 78 వేల మంది స్థానికులు చిక్కుకుని ఉన్నారని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రకటించింది. ప్రజలు హవిజా ప్రాంతాన్ని వీడి వెళ్లకుండా ఐఎస్ తీవ్రవాదులు అడ్డుకుంటున్నారని, వారు పట్టణం చుట్టూ బాంబులు అమర్చి ఉండవచ్చునని ఇరాక్ సైన్యం చెప్తోంది.
ఐక్యరాజ్యసమితి చెప్పిన ప్రకారం, హవిజాలో రెండు వారాల కిందట సైనిక చర్యలు ప్రారంభమైనప్పటి నుండి 12,500 మంది ప్రజలు వలస పోయారు. అయితే, గత రెండు రోజుల్లో ఎంత మంది తప్పించుకోగలిగారన్నది తెలియరాలేదు.
అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాల వైమానిక దాడుల సహాయంతో ఇరాక్ సైన్యం, ప్రభుత్వ అనుకూల మిలీషియాలు ఐఎస్ ప్రకటించుకున్న ఖలీఫాపై వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాక్‌లో రెండో పెద్ద నగరమైన మోసుల్‌ను తొమ్మిది నెలల పోరాటం తర్వాత జూలైలో స్వాధీనం చేసుకున్నాయి.
సిరియాలోని కొన్ని ప్రాంతాలు ఇంకా ఐఎస్ ఆధీనంలోనే ఉన్నాయి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








